వెంటనే రామదేవుడు ఒక దొనలోని శరాలు మరొక దొనలో దూరిన భంగి అతడి నోటి నిండుగా నిష్ఠుర నారాచాలు నింపివేశాడు. దానవుడు సింహనాదులు చేయ వీలు చిక్కక వికృత స్వరాలు, జంకెన చూపులు చూపుతూ దగ్గరగా వచ్చినాడు. అపుడు రాముడు ఆ కుంభకర్ణుడిని ఇంద్రాస్త్రంతో కొట్టాడు. రఘుపతి తీవ్ర విశిఖం వేయగా ఆది మధ్యాహ్న భాస్కరుడి చందంగా బ్రహ్మదండం మాదిరిగా- వేగంగా మంటలు క్రక్కే వాయువు రీతిగా ఎర్రని మంటలు చిమ్ముతూ వచ్చి దిక్కులు ప్రతిధ్వనించే పగిది కుంభకర్ణుడి రొమ్మును దూసుకొనిపోయి అవనిలో దూరింది.
అంతలోనే రామ ధరణీశ్వరుడు అంతకాస్త్రం సంధించి వదలాడు. అప్పుడు అఖిల దిక్కులు మారుమ్రోగ, బ్రహ్మాండాలు అవిసిపోగా, స్ఫుటంగా భూమి పటపట పగుల, సకల ప్రాణులు చైతన్యం కోల్పోవ నూరుకోట్ల కాల చక్రాలు ఒక్కటై రివ్వున వచ్చు రీతిగా, బడబాగ్ని వడివడిగా వ్యాపించే కరణి చౌలకూటం మృత్యురూపం గైకొన్న మాదిరి విచ్చలవిడిగా పరుగెత్తి వేగంగా వచ్చి ఆ ఘోర శరము గొప్పదైన నల్లని కొండ వైఖరి వున్న ఆ కుటిల రాక్షస వీరుడి శిరాన్ని త్రుంచివేసింది. ఆ విధంగా తెగిపోయిన అతడి తల బెడిదంగా సవ్వడులు చేస్తూ లంకలోపల పడింది.
అప్పుడు లంకలోని ఉన్నత గోపురాలు, హర్మ్యాలు పొడిపొడి అయి రాలి ధూళిలో కలిసిపోయాయి. ఆ దేహం పాటుకి పదివేల వానరులు మడిశారు. సముద్రంలోని జలచరయూధాలు బెదరిపోయాయి. ఆ కుంభకర్ణుడి కళేబరం సగం పృథివిపైన సగం జలధిలోను కూలి పడింది. ఆ భయంకర శబ్దానికి సముద్రాలు కల్లోలం అయాయి.
ధరణి కంపించింది. దిక్తటాలు పగిలాయి. లంకేశ్వరుడి ఉల్లం వ్రయ్యలు అయింది. లంకలో రాక్షసుల కోలాహలం అగ్గలం అయింది. లోకాలు సంతసించాయి. వానరాధిపులు సంతోష సాగరంలో ఓలలాడారు. జగద్విఖ్యాత వీరుడు రాముడు కుంభకర్ణుడిని చూసి తనలో తాను చిరునగవు తళుకొత్త ఈ పుడిమిని కూలిన కుంభకర్ణుడు దేవలకన్న, దిక్పతులకన్నా మించిన వీరుడు. ఇంక లోకాలకు ఎన్నడూ భీతి వుండదని ఆనందించాడు. విజయ లక్ష్మిని చేపట్టి రామభద్రుడు తేజరిల్లాడు. ఉగ్రరాహువు కబళించి విడిచిపెట్టగా ప్రకాశించే విమలార్కుడిలా వెలుగొందాడు.
అనంతరం దనుజులు మదులతో దుఃఖం మల్లడికొన, విన్నబోయి, వదనాలు వెలవెలపోయి, రావణాసురుడికి కుంభకర్ణుడి మరణ వర్తమానం విన్నవించడానికి పరుగులు పెట్టారు. రాక్షసులు హతశేషులు లంకశ్వరుడితో ‘‘దేవా! నీ అనుజుడు దేవతలను జయించినవాడు, దిశలు తానే అవుతూ అసమాన సాహహంతో ఆ హవ కేళి సల్పి పాల కడలిని మందరాత్రి కలచి తిరుగాడే క్రియ వానర సేనాజలధిని ఇటు అటు చేసి, ఇంద్రాది దేవతలు వెక్కసము పడిగా యుద్ధం కావించి తుదకు శ్రీరామ బాణాగ్నికి వివశుడై, దగ్ధుడయి ఉసురులు బాశాడు’’ అని విన్నపం చేశారు.
అంత రాక్షసేశ్వరుడు రామవిభుడి చేతిలో తన మరణం తథ్యం అన్నవిధంగా మూర్ఛిల్లి ధారణిమీద పడిపోయాడు. అతికాయుడు అధిక శోకతప్తుడు అయిపోయాడు. దేవాంతకుడు ధైర్యం కోల్పోయి శోకించాడు. త్రిశిరుడు దిక్కు చాలని మాడ్కి నివ్వెరపోయాడు. దనుజ వీరవరులు మహోదర మహాపార్శ్వులు చేష్టలుడిగి కొయ్యబొమ్మలు అయిపోయారు.
రావణుడు కుంభకర్ణడి
మరణమునకు శోకించుట
కొలది సమయానికి రావణుడు మూర్ఛతేరుకొని పలు పర్యాయాలు కుంభకర్ణుణ్ణి తలపోసికొంటూ దుర్వారుడై దుఃఖించాడు. దుర్భర శోకంతో కుమిలిపోయాడు. ఇంక నేను రాఘవ వైరాంబునిధిని ఏ తెప్పతో దాటుతాను? రామలక్ష్మణులను ఏ గతినైనా ఆజిలో హతామార్చి వేస్తానని నేను తలచుతూ వుండగా ఓ ఏకాంగవీరా! రాఘవుడి చటుల మహాశరవహ్ని జ్వాలలకు ఈ రీతిగా ఆహుతి కాగలవని కలనైనా తలపనయాను. ఓ నిర్ణిద్ర పరాక్రమా! నిద్రారతుడివి. నేడీ భంగి సుదీర్ఘ నిద్ర పాలపడి పోయావా?
-ఇంకాఉంది