Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సద్గురు సన్నిధి - శిష్యునికి పెన్నిధి!

$
0
0

‘దేవుడు ఉన్నాడా? ఉన్నచో అతనిని మనము చూడగలమా?’ అని మనసులో నాటుకున్న దృఢమైన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికై పరితపించుచున్న వివేకానందస్వామి (అసలుపేరు నరేంద్రనాథ్ దత్తా)కి రామకృష్ణ పరమహంస యొక్క దివ్య స్పర్శతో దేవుని ఉనికికి సంబంధించిన సమస్త సందేహాలూ పటాపంచలై భగవత్సాక్షాత్కారం లభించిన విశేషం ప్రతి భారతీయునికే కాక యావజ్జగత్తుకే సుపరిచితం. రామకృష్ణ పరమహంస వంటి సద్గురువు లభించుట వివేకానందుని పూర్వజన్మ సుకృతము. ఆధ్యాత్మిక మార్గానికి, దైవ సంబంధిత విశేషాలకు, దేవుని రూప గుణాది లక్షణాలకు, దైవలీలను చక్కగా కళ్ళకు కట్టినట్లుగా వివరించే పురాణేతిహాసాలకు... వీటన్నింటికీ సంబంధించిన లెక్కకు మిక్కిలి సందేహాలను శిష్యుల మనోఫలకములనుండి సంపూర్ణంగా తొలగించి వారి హృదయాలను భగవన్నిలయాలుగా తీర్చిదిద్దే మానవ రూప దైవమునకు పేరే సద్గురువు.
సద్గురువును సేవిస్తే సాక్షాత్తూ పరమేశ్వరుని సేవించినట్లే. సద్గురువు యొక్క పాద పద్మములు స్పర్శతో పాపాగ్ని పూర్తిగా ఆర్పివేయబడి దుర్లభమైన ముక్తిమార్గం సులభతరంగా లభించునని ఎందరి జీవితాలకో సంబంధించిన ఎన్నో యదార్థ సంఘటనలు సుస్పష్టం చేసాయి. వివేకానందునికి రామకృష్ణ పరమహంస యొక్క దర్శన భాగ్యం లభించకపోయినట్లైతే వివేకానందునిలో ఆవిర్భవించిన ‘దేవుడు ఉన్నాడా?.. ఉన్నచో అతనిని మనము చూడగలమా?’ అన్న అనుమానం సంవత్సరముల తరబడి అలాగే ఉండిపోయి వివేకానందుని ఆధ్యాత్మిక మార్గం ప్రారంభం కాకముందే అంతమై వుండెడిది. తత్ఫలితంగా వివేకానందుని అమూల్యమైన, అమృతతుల్యములైన బోధలు ప్రపంచానికి అందివుండెడివి కావు. ప్రపంచంలోని కోటానుకోట్ల యువకులను సన్మార్గంలో నడిపించి మహోన్నత శిఖరాలను అధిరోహించే రీతిలో దోహదపడే మహిమాన్వితమైన గ్రంథములు జీవం పోసుకొని అవనిజనులకు అందుబటులో ఉండెడివి కావు. భరతమాత తనువుకు అణువణువూ సహజసిద్ధంగా అలముకున్న ఆధ్యాత్మిక పరిమళములు ప్రపంచ దేశాలకు వెదజల్లబడి యుండెడివి కావు. భారతీయులలో సహజసిద్ధంగా నిక్షిప్తమైవున్న నీతి, నిజాయితీ, క్షమాగుణం, అతిథి సత్కాం, శరణాగత రక్షణ, ప్రత్యుపకారమే కాక అపకారికి సైతం ఉపకారం, ప్రతి జీవినీ దైవంగా పరిగణించి సేవించడం.. ఇత్యాది పరమ సాత్త్విక గుణాలు బాహ్య ప్రపంచానికి వెల్లడయ్యేవి కావు. భరతమాత కీర్తి పతాక విశ్వవినువీధులలో ఎగురవేయబడి సగటు భారతీయుని హృదయ సంద్రం నుండి ఆనందకెరటాలు ఉవ్వెత్తున ఎగసే అవకాశం లభించెడిది కాదు. ఇంతవరకూ మనం ఒక కోణంలో ఆలోచించాం.. ఇందుకు భిన్నమైన కోణం మరొకటి వుంది. అదేమిటంటే.. సద్గురువు లభించినంత మాత్రముననే శిష్యుని జీవితం ఆనందదాయకమవుతుందని, ఆ శిష్యుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించి పునీతుడవుతాడని, ఆదర్శప్రాయుడై భావితరాలచే స్మరించబడేటంత ఉన్నత స్థాయికి ఎదుగుతాడని భావించడం సబబు కాదు. ఏ వ్యక్తికైతే సద్గురు సన్నిధి లభించినదో ఆ వ్యక్తి మనసులో దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి, తల్లిదండ్రుల పట్ల భయభక్తులు.. ఇవన్నీ ఉండడంతో పాటు ఏదో సాధించాలి- ప్రపంచానికి నావలన కొంతైనా మేలు జరగాలి- నా భరతమాత నా ప్రవర్తనను చూసి సంతృప్తి చెందాలి అనే తపన ఉన్నప్పుడే శిష్యునికి లభించిన సద్గురు సన్నిధి పవిత్రతను సంతరించుకుంటుంది. మహత్తరమైన ఈ మానవ జన్మ భగవన్నామ స్మరణతో పులకించిపోతూ ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తువులోనూ దైవం యొక్క ప్రతిరూపాన్ని కనులారా తిలకించి తరించిపోతూ అర్థ, కామములను ధర్మబద్ధంగా స్వీకరించి మోక్షం పొందుటకు నిర్దేశింపబడిన ఉత్తమ మార్గమైన ఆధ్యాత్మిక మార్గంలో పయనించి అనిర్వచనీయమైన ఆనందానుభూతిని సొంతం చేసుకోవడానికై పరితపిస్తూ చివరికి దైవంలో ఐక్యం అయ్యే మహద్భాగ్యాన్ని సొంతం చేసుకోవడానికై ఉద్దేశింపబడి ప్రసాదింపబడినది. ఎందరో సద్గురువులకు, మరెందరో ఆణిముత్యాలైన శిష్యగణానికి నిలయం ఈ భారతావని. అటువంటి భరతమాతకు బిడ్డలై జన్మించుట పూర్వజన్మ సుకృతం.

మంచిమాట
english title: 
s
author: 
-అల్లాడి వేణుగోపాల్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>