విశాఖపట్నం, జూలై 23: జిల్లాలో తొలివిడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలపరచిన చాలా మంది అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అందరూ ఊహించిన విధంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన మెజార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. ఒకప్పుడు ఏజెన్సీలో పట్టున్న టిడిపి ఈ ఎన్నికల్లో అక్కడక్కడ మాత్రమే రెపరెపలాడింది. మంత్రి బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న పాడేరు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయడం గమనార్హం. ఒక్క కొయ్యూరు మండలంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకుంది. కొన్ని మండలాల్లో కాంగ్రెస్ ఆచూకీ కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలో మెజార్టీ పంచాయతీలను అధికార కాంగ్రెస్ పార్టీ చేజారిపోవడం పట్ల భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెన్సీలో పెద్దగా క్యాడర్ లేకపోయినా, మెజార్టీ పంచాయతీలను దక్కించుకుంది. ముఖ్యంగా అరకు మండలంలో ఎక్కువ పంచాయతీలను వైకాపా చేజిక్కించుకుంది. పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా ఆధిక్యతను సంపాదించుకోవడంతో ప్రత్యర్థులకు పాలుపోవడం లేదు. కాంగ్రెస్ పార్టీకి బలమైన పోటీ టిడిపి ఇస్తుందని అంతా భావించారు. కానీ పరిస్థితి తారుమారైంది. టిడిపి బలం కూడా అంతగా కనిపించలేదు. ఏ మండలంలోనూ టిడిపి మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకోలేకపోయిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏజెన్సీలో బాక్సైట్ ఉద్యమాన్ని నిర్వహించిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలూ కొద్దిపాటి సీట్లను దక్కించుకున్నాయి. బాక్సైట్ ఉద్యమ ప్రభావం ఈ పార్టీలపై పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. ఏజెన్సీలో బిఎస్పీ కూడా కొన్ని స్థానాలను దక్కించుకుంది. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఆయా పార్టీల బలా బలాలు ఈవిధంగా ఉన్నాయి.
ఏజెన్సీలోని 11 మండలాల్లోని 244 పంచాయతీలకుగాను 23 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. మూడు పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. మిగిలిన 218 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్ జరిగింది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. నక్సల్స్ హెచ్చరికలను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనడం గమనార్హం. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ కృష్ణ భాస్కర్ తదితరులు పరిశీలించారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతుంది.
మంత్రి గంటా శ్రీనివాసరావు
యలమంచిలి, జూలై 23: రాష్ట్రంలో తోవిడతగా జరుగుతున్న పంచాయితీల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని, రానున్న ఎన్నికల్లో కూడ పార్టీ జైత్రయాత్ర కొనసాగిస్తుందని రాష్ట్ర ఓడరేవుల వౌళికవసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు నివాసంలో టీవి వీక్షీంచి ఫలితాలను తెలుసుకున్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలు అమ్మహస్తం నీరు పేదలకు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చరిత్రాత్మకమన్నారు. మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు పట్టంకడతారన్నారు. జిల్లాలోని 920 పంచాయితీల్లో 70 పంచాయితీలు ఏకగ్రీవం కాగా ఎన్నికయ్యాయన్నారు. ఎన్నికల జరిగిన వాటిలో అత్యంధిక స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధిస్తారన్నారు. చాల చోట్ల దేశం, వైఎస్‌ఆర్ సిపిలు తమ అభ్యర్ధులను పోటీకి దింపలేకపోయాయని ఆయన చెప్పారు.
నర్సీపట్నం డివిజన్‌లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
*ఆర్డీవో వసంతరాయుడు
నర్సీపట్నం,జూలై 23: డివిజన్‌లో ఈనెల 27వ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నర్సీపట్నం ఆర్డీవో , జిల్లా ఉప ఎన్నికల అధికారి ఎన్. ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. మంగళవారం ఆయన డివిజన్‌లోని పలు మండలాలను సందర్శించి ఏర్పాట్లును పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రవాణా, భోజన వతసి తదితర అంశాలపై తహశీలార్లు, ఎం.పి.డి. ఓ.లకు సూచనలు చేసారు. తనను కలిసిన విలేఖఱులతో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పత్రాలు అన్ని మండలాలకు చేరాయన్నారు. 27వ తేదీన డివిజన్‌లోని 10 మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. 238 పంచాయతీల్లో 21 పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా, 217 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 121 వార్డులు ఏకగ్రీవం కాగా 2,224 వార్డులకు మెంబర్లను ఎన్నుకుంటారన్నారు. 4,30,297 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు పోలింగ్ నిర్వహనకు 248 ఎలక్షన్ అధికార్లు 5,335 మంది పోలింగ్ అధికార్లును వినియోగిస్తున్నాయని, తహశీల్దార్లు, ఎం.పి.డి. ఓ.లు పర్యవేక్షిస్తారని, వీరు కాకుండా జోనల్ అధికారులు, రూట్ అధికారులు ఇతర ప్రత్యేక విధులకు సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. 110 ఆర్టీసి బస్సులు, 76 జీపులు, 35 కార్లు వినియోగిస్తున్నామన్నారు. 25వ తేదీన సాయంత్రం ఐదు గంటల నుండి ప్రచారం నిర్వహించరాదన్నారు. గుర్తించిన 49 తీవ్ర సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, 79 సమస్యాత్మక కేంద్రాల్లో సూక్ష్మపరిశీలకులు, వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.