విశాఖపట్నం, జూలై 23: మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సొంతిల్లులేని నిరుపేదల కలను సాకారం చేసేక్రమంలో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు జివిఎంసి తీసుకున్న నిర్ణయం వివాదస్పదమవుతోంది. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం కింద నగర పరిధిలో 25వేల ఇళ్లను నిర్మించేందుకు వీలుగా తీసుకున్న నిర్ణయంలో పేదల పట్ల ప్రేమకన్నా, రియల్ ఎస్టేట్ సంస్థలకు మేలు చేకూర్చాలన్నదే ధ్యేయంగా కన్పిస్తోంది. విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న రైల్వే స్థలాలతో పాటు పెందుర్తి, కొమ్మాది, చినముషిడివాడ, నరవ, మధురవాడ తదితర ప్రాంతాల్లో జివిఎంసితో పాటు ప్రభుత్వ రెవెన్యూ విభాగం నుంచి సేకరించిన 147 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈపథకానికి రూపకల్పన చేస్తున్నట్టు వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, ఇందిరమ్మ పథకాల కింద నగరంలో 15వేలకు పైచిలుకు ఇళ్లను నిర్మించిన జివిఎంసి కేవలం 9000 మందికి మాత్రమే వాటిని కేటాయించింది. ఈపథకం కింద ఇళ్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేటాయించిన వాటిలో అర్హులకన్నా, అనర్హులకే పెద్ద పీటవేశారన్న విమర్శలున్నాయి. ఇటీవల జరిపిన విచారణలో సైతం 25 శాతం అనర్హులు, నకిలీలు ఉన్నాయని గుర్తించారు. వీరికి నోటీసులు జారీ చేసి ఇళ్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టినా ఇంతవరకూ ఆచరణలో సాధ్యం కాలేదు. ఇక రాజీవ్ ఆవాస్ యోజన (రే) పథకం కింద నగరంలో పెద్దసంఖ్యలో ఇళ్లను నిర్మించేందుకు గతంలో ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ పథకం కావడం వల్ల నిబంధనలు, ఇతరత్రా కారణాల రీత్యా పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయని, సత్వరమే నిరుపేదలైన అర్హులకు ఇళ్లను మంజూరు చేసేందుకు పిపిపి కింద ఇళ్లను నిర్మించడం మంచిదని జివిఎంసి యంత్రాంగం భావిస్తోంది. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి సేకరించిన 147 ఎకరాల భూమిమి ప్రైవేటు బిల్డర్లకు అప్పగించి వారు జి ప్లస్ త్రీ తీరులో నిర్మించే ఇళ్లను అర్హులకు కేటాయించాలన్నది ప్రతిపాదన. దీనిలో భాగంగా ప్రభుత్వానికి చెందిన కొంత భూమిని ఇదే లేఅవుట్‌లలో పథకం చేపట్టిన ప్రైవేటు నిర్మాణ సంస్థలకు అప్పగిస్తారు. ఈస్థలాల్లో వారు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది. విలువైన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఇంతకంటే మంచి మార్గం జివిఎంసికి లభించదు. అందుకే పిపిపి విధానంలో 147 ఎకరాల విలువైన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే వ్యూహ రచన సాగుతోంది. జిప్లస్‌త్రీ పద్ధతిలో 25 వేల ఇళ్లను నిర్మించేందుకు 147 ఎరకాలను కేటాయించాల్సిన అవసరం లేనప్పటికీ జివిఎంసి ఎందుకు ఈప్రతిపాదనను తెరపైకి తెచ్చిందన్నది మింగుడుపడట్లేదని వామపక్ష ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సిపిఎం నగర కమిటీ ప్రతినిధి విఎస్ పద్మనాభరాజు హెచ్చరించారు.
సహ దరఖాస్తులపై స్పందించండి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులపై సకాలంలో స్పందించాలని, దరఖాస్తుదారు అడిగిన సమాచారాన్ని విధిగా అందించాలని జివిఎంసి అదనపు కమిషనర్ కె రమేష్ స్పష్టం చేశారు. సహ దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అందుకు సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. జోనల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో మంగళవారం సమావేశమైన ఆయన సహ చట్టం అమలుపై చర్చించారు. సహ చట్టం కింద దరఖాస్తుదారుడు అడిగిన సమాచారాన్ని నిర్ణీత కాలవ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుందని ఆదేశించారు. సమాచార హక్కు చట్టం అమలును మెరుగుపరచాలని ఆయన అధికారులకు సూచించారు. జివిఎంసికి సంబంధించి పిఐఓగా వ్యవహరిస్తున్న కార్యదర్శి సన్యాసినాయుడు, అప్పిలేట్ అధికారిగా ఉన్న తనకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటి కప్పుడు సంబంధిత విభాగాలకు పంపుతున్నట్టు పేర్కొన్నారు. ఆయావిభాగాలకు చేరిన దరఖాస్తులపై విభాగాధిపతులు సకాలంలో స్పందించాలని సూచించారు. వీటిపై సహ కమిషనర్‌కు అందే ఫిర్యాదులకు సంబంధించి విభాగాధిపతులే హాజరుకావాల్సి ఉంటుందన్నారు. సహ చట్టం అమల్లో ఎదురయ్యే సందేహాలు, సమస్యలను నివృత్తి చేసుకునేందుకు తమను సంప్రదించాలని సూచించారు. దీనిపై పిఐఓ సన్యాసినాయుడు మాట్లాడుతూ సహ దరఖాస్తుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చట్టంలో నిర్ణయించిన విధంగా వచ్చిన దరఖాస్తులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో జోనల్ కమిషనర్లు విజయలక్ష్మి, శివాజీ, శ్రీనివాస్, సీనియర్ వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
2022 నాటికి అందరికీ అందుబాటులో సౌరశక్తి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: దేశ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా 2022 నాటికి సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఎపి ట్రాన్స్‌కో రిటైర్డ్ ఎస్‌ఇ సోమన్‌గణపతి అభిప్రాయపడ్డారు. 13వ పంచవర్ష ప్రణాళికా కాలంలో 20 వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. గీతం విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంధనం పొదుపుపై మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌరవిద్యుత్ ఉత్పిత్తిలో ప్రస్తుతం అవుతున్న వ్యయాన్ని నియంత్రించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. 2060 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సౌరవిద్యుత్ వినియోగం పెరిగి గ్రీన్‌హౌస్ వాయువులు నియంత్రణ సాధ్యమవుతుందని, తద్వారా పర్యావరణానికి మేలు చేకూరుతుందని అన్నారు. దేశంలో పెరుగుతున్న విద్యుత్ వాడకం వల్ల అదనపు ఉత్పత్తి అవసరం అవుతోందన్నారు. ఇంధన పొదుపు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేనిపక్షంలో భవిష్యత్‌లో ఎదురయ్యే విద్యుత్ అవసరాలను తీర్చడం కష్టతరమవుతుందన్నారు. ఇక ఆలయాలు, మత సంస్థల్లో విద్యుత్ వాడకం, ఆదాపై ప్రజల్లో చైతన్యం చేయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గీతం ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ కెఎస్ లింగమూర్తి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శిధిల భవనాలను తక్షణమే కూల్చండి
* జివిఎంసి కమిషనర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: జివిఎంసి పరిధిలో శిధిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను తక్షణమే కూల్చేయాలని కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మంగళవారం సమావేశమైన ఆయన నగర పరిధిలో 105 భవనాలు పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్నాయని, వీటిని తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. మున్సిపల్ చట్టం ప్రకారం ప్రమాదకర స్థితికి చేరుకున్న భవనాలను కూల్చేసే అధికారం కార్పొరేషన్‌కు ఉందని, ఇప్పటికే నగర పరిధిలో 516 భవనాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్న 105 భవనాలకు సంబంధించి యజమానులకు మరోసారి నోటీసులు జారీ చేయాలని, స్పందించని పక్షంలో వీటిని కూల్చివేసి, రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేసి, ఖర్చులను వారినుంచి వసూలు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం కారణంగా శిధిల భవనాల కారణంగా ఎటువంటి ప్రమాదాలు సంభవించికుండా చర్యలు తీసుకోవాలన్నారు. జోన్ 2 15 భవనాలు, జోన్ 3లో 36, జోన్ 4లో 20, జోన్ 5లో 17, జోన్ 6లో 16 భవనాలు పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్నట్టు గుర్తించడమైందన్నారు. కూల్చివేతకు ముందుకురాని భవనాలకు సంబంధించి కేసులను ఆర్డీఓ కోర్టులో దఖలు పరచాలని ఆదేశించారు. భవన యజమానులు తమకు చెందిన శిధిల భవనాలను కూల్చివేసి జివిఎంసికి సహకరించాలని కోరారు. మిగిలిన భవనాలను పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ జయరామిరెడ్డి, పట్టణ ముఖ్య ప్రణాళిక అధికారి బాలకృష్ణ, డిసిపి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు కౌంటర్లను ఏర్పాటు చేయండి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: జివిఎంసి పరిధిలోని ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలుగా తగినన్ని బ్యాంకు కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద ప్రస్తుతం ఐదు కౌంటర్లు మాత్రమే ఉన్నాయని, మరో 25 కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు బ్యాంకు అధికారులతో చర్చించాలని సూచించారు. జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని ఆడిటింగ్, ఐటి సెక్షన్లను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నాలుగు సౌకర్యం కేంద్రాలు, ఐదు బ్యాంకు కౌంటర్లతో పాటు ఇసేవ కేంద్రాల ద్వారా మాత్రమే పన్నులు వసూలు చేస్తున్నామని, పలు వర్గాల ప్రజలకు అనువైన రీతిలో సులభంగా పన్నులు చెల్లిచేందుకు మాద్యమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐటి కేంద్రాన్ని పరిశీలించిన ఆయన పన్నుల వసూళ్లు, జమలు పారదర్శకంగా జరుగుతున్నాయాలేదా అన్న అంశంపై దృష్టి సారించారు. వసూలు చేస్తున్న సొమ్ము ఆయావిభాగాలకు జమవుతున్న విధానాన్ని పరిశీలించారు. పౌరులు చెల్లిస్తున్న పన్నులు సక్రమంగా ఖాతాలకు జమచేయాలని, కార్పొరేషన్‌కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కమిషనర్ నాగేంద్ర కుమార్‌ను ఆదేశించారు. చెక్కుల రూపంలో చెల్లిస్తున్న మొత్తాలు సకాలంలో జివిఎంసికి జమవుతున్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా పన్నులు వసూళ్లను సమర్ధవంతంగా నిర్వహించడంతో పాటు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు పటిష్టవంతమైన ఏజెన్సీని టెండర్ల ద్వారా ఖరారు చేయాలన్నారు.
త్వరలోనే ఫ్లైఓవర్ అందుబాటులోకి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: నిత్యం ట్రాఫిక్‌తో కిటకిటలాడే ఆశీల్‌మెట్ట జంక్షన్‌లో రద్దీని నియంత్రించేందుకు నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. జివిఎంసి ఆధ్వర్యంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులు 90 కోట్లతో 1.8 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ఆశీల్‌మెట్ట జంక్షన్‌లో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజానీకం కష్టాలు త్వరలోనే తీరనున్నాయని అన్నారు. వేమన మందిరం నుంచి దొండపర్తికి మూడు నిముషాల్లో చేరుకునే వెసులుబాటు దక్కుతుందన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంలో కొంతమేర జాప్యం చోటుచేసుకున్నది వాస్తవమేనన్నారు. ఇక సింహాచలం, అడవివరం ప్రాంతాల్లో బిఆర్‌టిఎస్ పనుల్లో కూడా జాప్యం అనివార్యమైందని, స్వల్పసమస్యలు పరిష్కరించి త్వరలోనే బిఆర్‌టిఎస్ కారిడార్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు. జివిఎంసిలో భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనం ప్రక్రియ పూర్తయినట్టేనని పేర్కొన్నారు. రెండు మున్సిపాలిటీలు విలీనం కావడం ద్వారా విశాఖకు మెట్రో స్థాయిని సంతరించుకుంటుందని తద్వారా అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ఫ్లైఓవర్‌ను సందర్శించిన వారిలో గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, జివిఎంసి అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి పూర్తి స్థాయిలో ఇళ్ల నుంచి చెత్త సేకరణ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: జివిఎంసి పరిధిలోని జోన్ 4లో తలపెట్టిన ఇంటి నుంచి చెత్త సేకరణ కార్యక్రమాన్ని బుధవారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రారంభించనున్నట్టు కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. ఇళ్ల నుంచి తడి,పొడి వ్యర్థాలను సేకరించే ‘విశ్వం’ కార్యక్రమం ఈనెల 17 నుంచి లాంఛనంగా ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో వ్యర్ధాల సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. 19 వార్డుల్లో ఈకార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 285 రూట్లను గుర్తించి, అవసరమైన సామాగ్రిని సమకూర్చినట్టు ఆయన తెలిపారు. తడి,పొడి చెత్తలను వేరుగా ఇచ్చే గృహిణులను గుర్తించి వారికి ప్రోత్సాహకాలు అందించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌సిసి కేడెట్ల సహకారం తీసుకుంటున్నామని, వీరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
200 పడకలకే విమ్స్ పరిమితం
* సగానికి తగ్గిన నిధులు
* చెల్లుబాటు కాని ప్రజా ప్రతినిధుల మాట
ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నం
ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా, ఒడిశా, చత్తీస్‌గడ్ ప్రాంతాల్లోని వారికి ఉచిత వైద్య సహాయాన్ని అందించే కింగ్ జార్జ్ ఆసుపత్రికి ధీటుగా కార్పొరేట్ ఆసుపత్రిని నిర్మించి, అంతకు మించిన వైద్యాన్ని పేదలకు అందించాలన్న ఉద్దేశంతో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (విమ్స్)కు 2007 జనవరి ఎనిమిదవ తేదీన శంకుస్థాపన చేశారు. 110.24 ఎకరాల స్థలంలో 1130 పడకల ఆసుపత్రిగా నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే, 18.17 లక్షల చదరపు అడుగులలో 15 బ్లాకులతో విమ్స్ ఆసుపత్రి ఇప్పుడు మనకు దర్శనమిచ్చేది. ఇందులో 21 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి తేవాలని భావించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి విడత ఆసుపత్రి భవన నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. దీనికి సంబంధించిన ఫైలు ఆయన వద్దకు వెళ్లింది. ఆ ఫైలుపై సంతకం చేయడానికి కొద్దిసేపు ముందు ఆయన చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి బయల్దేరి వెళ్లి తిరిగి రాలేదు. అంతే ఆ ఫైలు ఏమైందో ఇప్పటికీ తెలియదు. దీంతో ఆసుపత్రి నిర్మాణం కుంటుపడింది.
రోశయ్య ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత ఈ ఆసుపత్రిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ కింద ఇచ్చేయాలని భావించారు. అయితే వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఎట్టకేలకు తొలి విడతలో 4.19 లక్షల చదరపు అడుగుల్లో ఆరు బ్లాకులలో 12 సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో జి ప్లస్ త్రీ భవనాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. ఇందుకోసం 50 కోట్ల రూపాయలకు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. జివిఎంసి ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని అంగీకరించింది. అందులో కొంత మొత్తం విడుదల కావడంతో పనులు ప్రారంభించారు. ఆ తరువాత ప్రభుత్వం మళ్లీ 115 కోట్ల రూపాయలకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. మొదట మంజూరు చేసిన 55 కోట్లూ ఇందులోనే కలిసి ఉన్నాయని చావు కబురు చల్లగా చెప్పింది. చివరకు 55 కోట్లను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకొంది. ఇంకా 60 కోట్ల కోసం ఆసుపత్రి వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఇందులో 30 కోట్లతో సివిల్ వర్క్స్ పూర్తి చేయాలని, 30 కోట్లతో ఆసుపత్రి ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కానీ చిల్లిగవ్వ కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఆసుపత్రి వర్గాలు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవలసి వచ్చింది. మరొక్క 50 కోట్ల రూపాయలు ఇస్తే, ఆసుపత్రిని పనిచేయిస్తామని అందరూ అర్థించినా ప్రభుత్వం చెలించలేదు.
ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో 1000 పడకల ఆసుపత్రిని 450 పడకలకు కుదించారు. ఈపాటి ఆసుపత్రి పనిచేయాలన్నా, కనీసం 70 కోట్లు కావాలని ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం కనె్నతె్తైనా చూడలేదు. 450 పడకల ఆసుపత్రి కనుక వచ్చి ఉంటే.. రోగులకు అందే వైద్యసేవలు ఇవి.
* న్యూరో మెడిసన్, న్యూరో సర్జరి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ట్రామా, ఆర్థోపెడిక్స్, యురాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఎమర్జన్సీ మెడికల్ డిపార్ట్‌మెంట్, బ్లడ్ బ్యాంక్, జనరల్ మెడిసన్, సర్జరీ విభాగాలు వస్తాయని ప్రతిపాదించారు. వీటికోసం 71 మంది డాక్టర్లు, 12 మంది ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 24 మంది సర్జన్స్ కావాలని ప్రతిపాదించారు. అలాగే 295 మంది నర్సులు, 52 మంది మినిస్టీరియల్ స్ట్ఫా, 364 మంది క్లాస్-4 టెక్నికల్ సిబ్బంది కావాలని ప్రతిపాదించారు.
దీనిపై ప్రభుత్వం తర్జన భర్జన పడింది. నిధులు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. ఎట్టకేలకు మరో తాజా నిర్ణయాన్ని తీసుకుంది. కేవలం 200 పడకలతో విమ్స్ ఆసుపత్రి పనిచేసేలా చూడాలని నిర్ణయించింది. ఇప్పటికే 50 కోట్లను కేటాయించిన ప్రభుత్వం మరికాస్త నిధులు విదిల్చి, ఆసుపత్రి ప్రారంభించామనిపించుకోవాలని చూస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ఈ పనిని ఏదోవిధంగా పూర్తి చేసి చేతులు దులుపుకోవాలని భావిస్తోంది. గతంలో ఇచ్చిన 55 కోట్లు కాకుండా 30 కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. దీనికి మరొక్క 15 కోట్లను జతచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 200 పడకల ఆసుపత్రే వస్తే రోగులకు అందే వైద్య సేవలు ఇవి.
* నెఫ్రాలజీ, యురాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గ్య్రాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్ గ్య్రాస్ట్రో ఎంట్రాలజీ, ట్రమటాలజీ, ఆరోగ్యశ్రీ, ఐసియు, పోస్ట్ ఆపరేటెడ్ విభాగం, క్యాజువాలిటీ మాత్రమే వస్తాయి. పైన ప్రతిపాదించిన సిబ్బంది సగానికి పైగా తగ్గిపోతారు. ఇప్పుడు నిర్మించిన ఆసుపత్రి భవనంలో కేవలం సగం మాత్రమే వినియోగించుకోవలసి ఉంటుంది. మిగిలిన భవనమంతా ఖాళీగా పడి ఉంటుంది. ఇదీ ప్రభుత్వ నిర్వాకం.
వాతావరణం చల్లబడింది....విద్యుత్ వాడకం తగ్గింది
* ఊపీరి పీల్చుకుంటున్న సంస్థ అధికారులు
విశాఖపట్నం, జూలై 23: వర్షాలు పడకపోయినా వాతావరణం చల్లబడటంతో విద్యుత్ వాడకం కాస్త తగ్గింది. దీంతో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఆపరేషన్ సర్కిల్ అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. వేసవి గట్టేక్కినా జిల్లాలో విద్యుత్ వాడకం తగ్గకపోవడం, పరిశ్రమలు, వ్యవసాయానికి తప్పనిసరిగా సరఫరా చేయాల్సిన పరిస్థితులు విద్యుత్ సంస్థకు పెద్ద పరీక్షనే మిగిల్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో గత నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడటం, రెండు రోజుల కిందట కురిసిన వర్షంతో రోజువారీ వాడకం కాస్త తగ్గిపోవడంతో సమస్యలు తప్పాయి. ఏసిల వాడకం మరీ పడిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పొదుపు పాటిస్తున్నారు. పగలు లైట్లు వేయడంలేదు. ఫ్యాన్లు మాత్రం తిరుగుతున్నాయి. విశాఖ జిల్లాకు దాదాపు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటాను కేటాయించగా, ఇంచుమించుగా దీనినే సద్వినియోగపర్చుకుంటున్నారు. వాస్తవానికి 16.90 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటుంది. అయితే అనేక రకాలుగా తీసుకుంటున్న పొదుపు చర్యలతో కేటాయించిన విద్యుత్‌తోనే సంస్థ సరిపెడుతోంది.
చందనం చెట్టు నరికివేత
సింహాచలం, జూలై 23: దేవస్థనం వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ఎదురుగా ఉన్న టివి టవర్ కాలనీ పై భాగంలో చందనం గుర్తు చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు నరికివేసారు. సమాచారం తెలుసుకున్న ఎఇఓ కృష్ణమాచార్యులు సిబ్బందితో పాటు సంఘటనా స్థలానికి వెళ్ళి పరిస్థితి పరిశీలించారు. నరికివేసిన చందనం చెట్టును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ చెట్టు అడివి చందనమని దీని వలన పెద్దగా ఉపయోగం లేదని అటవీశాఖ అధికారులు ధృవీకరించినట్లు ఎఇ తెలియజేశారు. ఎందుకంటే ఇలాంటి చందనం చెట్లు సింహగిరి చుట్టూ అనేకం ఉన్నాయని ఆయన చెప్పారు. ఏది ఏమైనా చెట్టు నరికివేతపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఆధ్యాత్మిక చైతన్యానికి నిదర్శనం సింహగిరి ప్రదక్షిణం
* సింహాచలం ఇఓ రామచంద్రమోహన్
సింహాచలం, జూలై 23: సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్న ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా సింహగిరి ప్రదక్షిణ నిలిచిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రామచంద్రమోహన్ అభివర్ణించారు. ఆషాడ పౌర్ణమి వేడుక విజయవంతమైన సందర్భంగా ఇందుకు సహకరించిన ప్రభుత్వశాఖల అధికారులకు, ఉద్యోగులకు, భక్తులకు సేవా సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేవస్థానం చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో సుమారు 2 లక్షల మంది సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేయడం అద్భుత సన్నివేశమని ఆయన అన్నారు. భారతదేవంలో సింహగిరి ప్రదక్షిణ అరుదైన ఆధ్యాత్మిక వేడుకని ఆయన పేర్కొన్నారు. భారతీయ సనాతన సంస్కృతి, సంప్రదాయాల్లోని లోతులను ఈ ప్రదక్షిణ రుజువు చేస్తుందని ఇఓ తెలిపారు. సుమారు 36 కిమీ నియమనిష్ఠలతో నృసింహుడి ధ్యానంతో ప్రదక్షిణ చేసిన భక్తులు ధన్యులని ఆయన అన్నారు. భగవంతుడిపై భారతీయులకు ఉన్న భక్తి విశ్వాసాలకు ఈ ప్రదక్షిణ సాక్షీభూతంగా నిలుస్తుందని ఆయన అన్నారు. భక్తిపారవశ్యంతో ప్రదక్షిణ చేసే భక్తులకు సేవా భావంతో దారిపొడవునా సౌకర్యాలు కల్పించిన స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఉత్సవం వైభవోపేతంగా జరగడానికి సహకరించిన పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, జివిఎంసి, ట్రాన్స్‌కో, ఫైర్‌సర్వీస్, ఆర్టీసీ సంస్థలకు దేవస్థానం తరఫున ఇఓ కృతజ్ఞతలు తెలిపారు.