శ్రీకాకుళం(రూరల్), జూలై 23: పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులుగా పెరుమళ్ల నాగన్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అదనపు బాధ్యతలు నిర్వహించిన మెట్ట వెంకటేశ్వర్లు నాగన్నకు బాధ్యతలు అప్పగిస్తూ అభినందనలు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ఉపసంచాలకులుగా పనిచేస్తూ పదోన్నతిపై నాగన్న జిల్లాకు వచ్చారు. గతంలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈయన సేవలందించారు. కరవు ప్రభావితమైన జిల్లాల్లో క్యాటిల్ క్యాంపు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించి పశుమరణాలను నివారించారు. ఆత్మ, ఇతర సంస్థల ద్వారా అందుబాటులో ఉన్న వనరులను సమర్ధవంతంగా వినియోగించుకుని రాష్ట్రంలో ఉన్న పాడి అభివృద్ధి సంస్థలకు, రైతులకు పరిచయం చేసి అవగాహన కల్పించారు.
దొడ్డిదారిన మద్యం అమ్మకాలు
* నివారించలేని ఆబ్కారీ శాఖ
శ్రీకాకుళం (టౌన్), జూలై 23: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ నిర్లిప్తత కారణంగా పట్టణంలో మద్యం దొడ్డిదారి అమ్మకాలు యదావిధిగా సాగాయి. మంగళవారం నిర్వహించనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలననుసరించి, ఆదివారం సాయంత్రం నుండే అన్ని మద్యం దుకాణాలకు ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారులు తాళాలు వేసి సీలుచేశారు. దీనిని ముందుగానే గ్రహించిన కొంతమంది బారు షాపు యజమానులు, వైన్ షాపు యజమానులు సరుకును పక్కదోవ పట్టించి షాపులకు వేసిన తాళాలు వేసినట్లే ఉండగా దొడ్డిదారిన యదావిధిగా అమ్మకాలు చేయడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలను నియంత్రించామని గత రెండు రోజులుగా సంబంధిత శాఖ పర్యవేక్షకాధికారులు ప్రకటనలు గుప్పిస్తుండగా ఆయా కార్యాలయానికి కూతవేటు దూరంలో పట్టణం నడిబొడ్డున సాగుతున్న అమ్మకాలను నియంత్రించలేని వారి పనితీరును పట్టణ పౌరులంతా హవ్వ అంటూ ముక్కున వేలేసుకున్నారు.
108 సమ్మె చట్టవిరుద్ధం
* జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శ్రీ్ధర్
శ్రీకాకుళం (టౌన్), జూలై 23: గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న 108 వాహన సిబ్బంది సమ్మె చట్టవిరుద్ధమని, వారి డిమాండ్లు అసమంజసమని 108 సేవల జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఎం.శ్రీ్ధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు తక్షణమే విధుల్లో చేరాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 108 సేవలకు విఘాతం కలిగిస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, తాజా నియామకాలు చేపట్టి కార్యకలాపాలను విస్తృత పరుస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే సేవలకు విఘాతం కలుగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని, మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి సేవలు అందిస్తామని అన్నారు.
* పారా మెడికల్, పైలట్ల నియామకాలు
108 అంబులెన్సు సేవల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్ధులకు పారామెడికల్, పైలట్ల నియామకాలు చేపడుతున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఎం.శ్రీ్ధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పైలట్లకు 12 గంటల పనిదినానికి 800 రూపాయలు చొప్పున చెల్లించనున్నామని అన్నారు. అర్హత కలిగిన వారు వెంటనే జివికె, ఈఎంఆర్‌ఐ జిల్లా, కేంద్ర కార్యాలయాలను సంప్రదించాలని కోరారు.
ఓటర్లకు తప్పని తిప్పలు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూలై 23: స్థానిక సంస్థల ఎన్నికల తొలి ఘట్టం ముగిసింది. శ్రీకాకుళం డివిజన్ 13 మండలాల్లో మంగళవారం జరిగిన ఎన్నికలు ఓటర్లకు తీపి గుర్తులను మిగిల్చిందనే చెప్పాలి. ఉదయం ఏడు గంటలకే ఓటు వేసేందుకు వృద్ధులు, వికలాంగులు బారులు తీరడం కనిపించింది. నిన్నటి వరకు కాస్తా వర్షాలు పడినప్పటికి, మంగళవారం ఉదయం నుంచే ఎండ వేడిమి అధికంగా కాసింది. పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లుకు కనీసం ఎండ నుంచి టార్పానాలు కూడా లేకపోవడంతో ఒకింత అసహనానికి గురైయ్యారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బరిలో ఉన్న అభ్యర్థి వర్గాలు ఒకరిపై ఒకరు వాదులాటకు దిగారు. పొలీసుల జోక్యంతో సద్దుమణిగింది. ఈ దఫా ఎన్నికల్లో ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపించకపోవడం కొసమెరుపు. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు బరిలో ఉన్న అభ్యర్ధులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఓటర్ల ఇంటివద్దకు ఆటోలను తీసుకువెళ్లి పోలింగ్ కేంద్రాలకు రప్పించారు. మరికొన్ని కేందాల్లో ఉదయం సమయంలో ఓటర్లుకు పులిహోర, ఇడ్లీ వంటి అల్పాహారాన్ని ఏర్పాటు చేసారు. ఆమదాలవలస రాగోలు జెడ్పీ ఉన్నత పాఠశాల దరి ఓ వర్గం ఓటర్లకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. దూసి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, మహిళలు ఎండ వేడిమి భరించలేక ఇబ్బంది పడ్డారు. తొగరాం జెడ్పీ ఉన్నత పాఠశాల దరి పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలీసులు ఎక్కువగా విధులు నిర్వహించగా, ఓటర్ల మాత్రం తక్కువ సంఖ్యలో హాజరైయ్యారు. గార మండలం ఆరంగిపేటకు చెందిన పొట్నూరు మాణిక్యమ్మ(98) వృద్ధురాలు ఎంతో ఉత్సాహంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నీలాపుపేటకు చెందిన చిదపాన బోడెమ్మ ఎండవేడిమికి సొమ్మసిల్లిపడిపోయింది. అలాగే బోరవానిపేటకు చెందిన సబ్బి సూరమ్మ86), పట్నాన కన్నమ్మ(80)లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి హాజరైయ్యారు. ఇక మేజర్ పంచాయతీల పోలింగ్‌లో మాత్రం జాప్యం చోటుచేసుకుంది. పొందూరు, నరసన్నపేట, శ్రీకూర్మంలు మేజర్ పంచాయతీలో ఉండగా ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు బారులు తీరారు. సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.
ఇదిలా ఉండగా పొందూరు మండలం నందివాడలో అధికార పార్టీకి చెందిన వారు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ప్రత్యర్థులు వాదులాటకు దిగారు. పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది.