శ్రీకాకుళం, జూలై 23: ఏడేళ్ల విరామం తరువాత నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. జిల్లాలోని శ్రీకాకుళం డివిజన్ పరిధిలో మంగళవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులనే అధిక శాతం మంది ఓటర్లు సర్పంచ్‌లుగా ఎన్నుకున్నారు. సర్వసాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగా స్థానిక ఎన్నికల ఫలితాలు రావడం పరిపాటి. అయితే ఈ ఎన్నికల్లో భిన్నమైన తీర్పును ఓటర్లు ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది. మంత్రులు, మాజీ మంత్రులు నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం ప్రభంజనం సుస్పష్టమైంది. మరో పది నెలల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పంచాయతీ ఫలితాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వరుస అపజయాలతో అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎర్రన్న హఠాన్మరణం తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇటువంటి సంకట స్థితిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో టిడిపి మద్దతుదారులకు పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు అండగా నిలిచి అధికార పార్టీని హెచ్చరించారు. ప్రత్యేక పాలనలో పంచాయతీల్లో నివాసముంటున్న పౌరులు ప్రాథమిక అవసరాలు కూడా తీరకపోవడమే కాకుండా అధిక ధరలు, విద్యుత్ చార్జీల పెంపు, పెట్రోల్, డీజిల్ వడ్డనల కారణంగా ప్రజలపై మోపిన భారాలను నిట్టూరుస్తూ భరించిన ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడేలా తీర్పునిచ్చారు. శ్రీకాకుళం డివిజన్ పరిధిలో మంగళవారం తొలివిడతగా 304 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. రాత్రి పది గంటల సమయానికి అందిన సమాచారం మేరకు అధికార కాంగ్రెస్ పార్టీకి 117 సర్పంచ్ పదవులు లభించగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 143 మంది సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 62 స్థానాలకే పరిమితమైంది. మరో 28 స్థానాలను ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. ఆమదాలవలస మండలంలోఆరు కాంగ్రెస్, 17 తెలుగుదేశంపార్టీ, మూడు వైఎస్సార్‌సీపీ, రెండు ఇండిపెండెంట్లుగా ఎన్నికయ్యారు. బూర్జలో 12 కాంగ్రెస్, 11 టిడిపి, నాలుగు వైకాపాకు దక్కాయి. ఎచ్చెర్లలో ఆరు కాంగ్రెస్, 19 టిడిపి, మూడు ఇండిపెండెంట్లు, ఎల్.ఎన్.పేటలో ఏడు కాంగ్రెస్, నాలుగు టిడిపి, నాలుగు వైకాపా, నాలుగు ఇతరులు, లావేరులో తొమ్మిది కాంగ్రెస్, 13 టిడిపి, రెండు ఇండిపెండెంట్లు , నరసన్నపేటలో తొమ్మిది కాంగ్రెస్, తొమ్మిది టిడిపి, 16 వైకాపా, పోలాకిలో 12 కాంగ్రెస్, 11 టిడిపి, ఎనిమిది వైకాపా దక్కించుకున్నాయి. అదేవిధంగా పొందూరులో పది కాంగ్రెస్, 15 టిడిపి, మూడు ఇతరులు, సరుబుజ్జిలిలో ఏడు కాంగ్రెస్, ఆరు టిడిపి, ఆరు వైకాపా, రెండు స్థానాల్లో ఇతరులు కైవసం చేసుకున్నారు. శ్రీకాకుళంలో 14 కాంగ్రెస్, తొమ్మిది టిడిపి, రెండు ఇతరులు, గారలో ఎనిమిది కాంగ్రెస్, టిడిపి 11, రెండు వైకాపా, మూడు ఇతరులు, జి.సిగడాంలో 12 కాంగ్రెస్, పది టిడిపి , రెండు వైకాపా, ఏడు ఇతరులు, రణస్థలంలో ఐదు కాంగ్రెస్, ఎనిమిది టిడిపి, 17 స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. జనం ఇమేజ్ అధికంగా ఉందని భ్రమలలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలకు కూడా ఈ ఫలితాలు ప్రతికూలంగా నిలిచాయి. నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌లు పంచాయతీపోరులో సత్తా చాటుకున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో మూడు స్థానాలకు పరిమితం కాగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక్క సర్పంచ్ పదవి కూడా ఆ పార్టీకి దక్కకపోవడం ఇద్దరు సమన్వయకర్తల పనితనం ఏపాటిదో ఇట్టే అర్ధమవుతోంది. ఇలా పంచాయతీ ఫలితాలు రాజకీయ పార్టీలను, విశే్లషకులను హెచ్చరించినట్లయింది.
పంచాయతీ పోలింగ్ ప్రశాంతం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూలై 23: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. శ్రీకాకుళం డివిజన్‌లో జరిగిన 13 మండలాల్లో 5.15 లక్షల మంది ఓటర్లుండగా 4.39 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 89.29 శాతం పోలింగ్ నమోదైంది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగగా సాయంత్రానికి ఫలితాలు వెలువడ్డాయి. 304 పంచాయతీలకు గాను 741 సర్పంచ్‌లు, 2,153 వార్డుమెంబర్లకు గాను 4,751 మంది అభ్యర్థులు బరిలో దిగి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రతీ రెండు గంటల సమయానికి ఒకసారి డివిజన్‌లో ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రకటించారు. ఉదయం తొమ్మిది గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదు కాగా 11 గంటలకు 62 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 89.29 శాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ ముగిసే సమయానికి జి.సిగడాంలో 88.49 శాతం, పొందూరులో 91, లావేరులో 92, రణస్థలంలో 93.6, ఎచ్చెర్లలో 90.43, శ్రీకాకుళంలో 90, పోలాకిలో 86.84, ఎల్.ఎన్.పేటలో 87.85, సరుబుజ్జిలిలో 90.1, బూర్జ 89.59, ఆమదాలవలసలో 88.85, గారలో 87.86, నరసన్నపేటలో 81 శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తొలివిడత జరిగిన శ్రీకాకుళం డివిజన్‌కు గాను పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక శ్రద్ధను కనబరిచారు. రణస్థలం మండలంలో 93.6 శాతం పోలింగ్ అత్యధికంగా నమోదు కాగా 81.25 శాతంతో నరసన్నపేట అత్యల్ప పోలింగ్ జరిగింది. జి.సిగడాం మండలంలో 39,688 మంది ఓటర్లు ఉండగా 35,120 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే పొందూరులో 73,890 మందికి గాను 47,371 ఓట్లు పోలవ్వగా లావేరు మండలంలో 45,032 మంది ఓటర్లకు గాను 41,407 ఓట్లు, రణస్థలంలో 51,289 మంది ఓటర్లకు గాను 48,020 ఓట్లు పోలయ్యాయి. ఎచ్చెర్ల మండలంలో 53,824 ఓట్లకు గాను 48,678 ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళం మండలానికి సంబంధించి 39,820 ఓట్లకు గాను 35,879 ఓట్లు పోలవ్వగా గార మండలంలో 40,456 ఓట్లకు 35,555 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలాకి మండలంలో 37,055 మంది ఓటర్లు ఉండగా 32,178 ఓట్లు, నరసన్నపేట మండలంలో 48,868 మంది ఓటర్లు ఉండగా 39,709 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎల్.ఎన్.పేటకు సంబంధించి 14,808 మందికి గాను 13,009 ఓటర్లు, సరుబుజ్జిలి మండలంలో 19,899 మందికి గాను 17,903 మంది, బూర్జ మండలంలో 19,759 మందికి గాను 17,700 మంది, ఆమదాలవలసలో 30,825 ఓటర్లు ఉండగా 27,248 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. డివిజన్‌లో జరిగిన తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్పష్టంచేశారు.
ఇబ్రహీమ్‌బాద్‌లో
ఉద్రిక్తత
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జూలై 23: జిల్లాలోని పంచాయతీ తొలివిడత పోరులో భాగంగా అక్కడక్కడ ఉద్రిక్తత పరిస్థితులు దారితీసాయి. అయితే కౌంటింగ్‌అనంతరం ఎచ్చెర్ల మండలం ఇబ్రహీమ్‌బాద్ గ్రామంలో మాజీ జెడ్పిటిసి సనపల నారాయణరావు (కాంగ్రెస్)కు చెందిన కొంతమంది తెలుగుదేశం పార్టీ వర్గీయులను దారికాసి దాడి చేశారు. ఈ దాడిలో సీపాన శంకరరావు, సీపాన సత్తిరాజులకు బలమైన గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరూ రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. టిడిపి వర్గీయులు పోలింగ్ స్టేషన్ ఎదుట బైఠాయించి రీ-పోలింగ్ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మహిళలంతా పోలింగ్ తీరు అధికారులను తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎన్నికల ప్రత్యేకాధికారి రెడ్డి గున్నయ్య, తహశీల్దార్ బి.వెంకటరావు, ఎస్సై పి.వి. ఎస్. ఉదయ్‌కుమార్‌లు గ్రామానికి చేరుకుని స్థానికులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారంతా వినకుండా పోలింగ్ అధికారులను అటకాయించే మాదిరిగా వాహనాలకు ఎదురుగా నిరసనలకు దిగారు. ఇక్కడి పరిస్థితిని ఎస్సై పోలీసు ఉన్నతాధికారులకు చేరవేయగా హుటాహుటిన ఎన్నికల డి ఎస్పీ శ్రీనివాసరావు ఆందోళనకారుల వద్దకు చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారునిగా బరిలో నిలిచిన సీపాన విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ వావిలపల్లి రామస్వామి, మాజీ ఎం.పి.టి.సి చింతాడ రామారావులతో చర్చించారు. ఈ వివాదానికి కారణమైన మాజీ జడ్పిటిసితోపాటు ఎక్సైజ్ కానిస్టేబుల్‌పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై డి ఎస్పీ స్పందించి ఎక్సైజ్ కానిస్టేబుల్‌తోపాటు బాధ్యులుపై చర్యలు తీసుకుంటామని, శాంతి భద్రతల దృష్ట్యా పికెటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు.
రిమ్స్‌లో క్షతగాత్రులు
కాంగ్రెస్ వర్గీయుల దాడిలో గాయాల పాలైన క్షతగాత్రులు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన శంకరరావు, సత్తిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవుట్‌పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసి ఎచ్చెర్ల పోలీసులకు బదలాయించారు.