ఒంగోలు, ఫిబ్రవరి 29: ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 2 నుండి 16వ తేది వరకు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు ఇంటర్‌మీడియట్ బోర్డు ఆర్‌ఐఓ ఎస్ అరుణకుమారి తెలిపారు. బుధవారం స్థానిక ఆర్‌ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆర్‌ఐఓ అరుణకుమారి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 50 వేల 240 మంది విద్యార్థులు ఇంటర్‌మీడియట్ పరీక్షలను రాస్తున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరం ఇంటర్‌మీడియట్ పరీక్షలను రాస్తున్న వారిలో సాధారణ విద్యార్థులు 22 వేల 896 మంది ఉండగా రెండవ సంవత్సరం రాస్తున్న సాధారణ విద్యార్థులు వేల 867 మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు. రెండవ సంవత్సరం ప్రైవేటు విద్యార్థులు 5 వేల 388 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలియజేశారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు 1751 మంది, రెండవ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు 1153 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. రెండవ సంవత్సరం ఒకేషనల్ ప్రైవేటు విద్యార్థులు 193 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందుకు గాను మొత్తం 81 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఆయా కేంద్రాలలో మొత్తం 15 సమస్యాత్మక సెంటర్లు ఉండగా సెల్ఫ్ సెంటర్‌లు ఆరు ఉన్నట్లు తెలిపారు. అందుకు గాను మొత్తం నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్స్‌ను, 8 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు గాను పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రంలో తాగు నీరు, వెలుతురు, వైద్యం, రవాణా సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. సమస్యాత్మకంగా, సున్నితమైన కేంద్రాల వివరాలను తెలియజేశారు. పెద్దదోర్నాలలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి, మార్కాపురంలోని ఎస్‌వికెపి, కంభంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, అర్థవీడులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గిద్దలూరులోని ఆదర్శ జూనియర్ కాలేజి, తురిమెళ్ళలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కనిగిరిలోని ఎంఎన్‌ఎం జూనియర్ కాలేజీ, మద్దిపాడులోని ప్రభుత్వ జూనియర్ కాలేజి, యర్రగొండపాలెంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, త్రిపురాంతకంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కాలేజి, పామూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, వేటపాలెంలోని బిబిహెచ్ జూనియర్ కాలేజీ, కొండపిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి, పొదిలిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నట్లు తెలిపారు. సెల్ఫ్‌సెంటర్ వివరాలను ఆమె తెలియజేస్తూ పెద్దదోర్నాలలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, తురిమిళ్ళలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, పొన్నలూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, టంగుటూరులోని ఎస్‌పిసిఎం ప్రభుత్వ జూనియర్ కాలేజి, సంతమాగులూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజి, వేటపాలెంలోని బివిహెచ్ జూనియర్ కాలేజీలు ఉన్నట్లు ఆమె తెలిపారు. పరీక్షా సెంటర్లలో ఇన్విజిలేటర్లు ఎవరైన ట్యాంపరింగ్‌కు పాల్పడితే అటువంటి వారిని వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. విధులకు సక్రమంగా హాజరుకాని వారిపై కూడా రూల్ 10 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రార్లో కాపీయింగ్ జరిగితే ఒక్క పిల్లల్నే తప్పుపట్టకుండా ఇన్విజిలేటర్లు కూడా బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు చెందవల్సిన అవసరం లేదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. ఇంటర్‌మీడియడ్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై 11 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. హాల్‌టికెట్లు ఎవరికైన రాకపోయిన, ఏదైన సమస్య ఉంటే తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. విలేఖర్ల సమావేశంలో జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు రామకృష్ణ పరమహంస, జక్రయ్య, రామ్‌బ్రహ్మం, హైవపర్ కమిటీ సభ్యులు పరందామయ్య, డిస్ట్రిక్ట్ బల్క్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఐఓ అరుణకుమారి వెల్లడి
english title:
inter exams from 2nd
Date:
Thursday, March 1, 2012