నెల్లూరు, మార్చి 1: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తే ముఖ్యమంత్రి పదవిని పొందవచ్చనే ఆశతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ విజయమ్మను తీవ్రస్థాయిలో విమర్శించారని, ఇలాంటి విమర్శలు తగవని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్థన్ రెడ్డి హెచ్చరించారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. వైఎస్‌ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చిన తన కుమారుడు జగన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ సాక్షిగా వెళ్లబోసుకున్న విజయమ్మపై మంత్రి ఆనం కేవలం సిఎం కావాలన్న దుర్భుద్ధితో విమర్శించడం దారుణమన్నారు. జగన్ వల్లే వైఎస్‌ఆర్‌కు చెడ్డపేరు వచ్చిందనే వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. వైఎస్‌ఆర్ రాజకీయ బిక్షతో ఎదిగిన ఆనం ఆ కుటుంబంపైనే విమర్శలు చేయడం తగదన్నారు. కేవలం వెన్నుపోటు రాజకీయాలతో రాజకీయంగా ఎదిగిన ఆనం సోదరుల రాజకీయ భవిష్యత్తు త్వరలోనే పతనం కావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో రెండు పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్‌ఆర్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి ఆనం వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో అధికారదాహం పట్టుకున్న ఆనం సోదరులకు జిల్లా ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కుమారుడ్ని పెట్టే వేధింపులపై ఆక్రోశం వెళ్లబోసుకున్న విజయమ్మను నిండు సభలో మంత్రి ఆనం తీవ్రస్థాయిలో విమర్శించడం ఘోరమన్నారు. పుత్రవాత్సల్యం అంటే మానవత్వం లేని మంత్రి ఆనంకు ఎలా తెలుస్తుందని ఆయన విమర్శించారు. వైఎస్‌ఆర్ కుటుంబంపై విమర్శలు చేసే ఆనం సోదరులకు దమ్ముంటే వైఎస్‌ఆర్ కుటుంబానికి మద్ధతుగా రాజీనామా చేసి ఆమోదింపచేసుకున్న ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై పోటీ చేసి గెలుపొందాలని చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. సోమశిలకు హై లెవల్ కెనాల్‌ను తీసుకువస్తానని ప్రగల్భాలు పలికిన మంత్రి ఆనం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం ఒక రూపాయిని కూడా కేటాయించకపోవడం సిగ్గు చేటన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో పదవుల కోసం ఆయన పాదాలు నొక్కిన ఆనం సోదరులు వైఎస్ మరణానంతరం కొంతకాలం రోశయ్య, ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ కాళ్లను నొక్కుతున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీ్ధర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కుటుంబంపై విమర్శలు చేసే మందు ఆనం సోదరులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ ఛైర్మన్ బాలచెన్నయ్య, పాపకన్ను రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్, స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.
ఏడు ద్విచక్ర వాహనాలు దగ్ధం
నెల్లూరుఅర్బన్, మార్చి 1: నెల్లూరు నగరంలోని నవాబుపేట వద్ద ఉన్న లక్ష్మీసాయినగర్‌లో పార్కింగ్‌చేసి ఉంచిన ఏడు మోటార్‌సైకిళ్లను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక లక్ష్మీసాయినగర్‌లోని నాతా బిల్డింగ్‌లో గోపిమాధవన్, సాయికుమార్, మురళికృష్ణ, నరేష్‌బాబు, నరసింహారావు, శ్రీనివాసరావు, అప్పయ్యనాయుడు అనే వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వీరికి సంబంధించిన మోటార్‌సైకిళ్లను బిల్డింగ్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్‌లో ప్రతిరోజు ఉంచుతారు. అదే విధంగా బుధవారం రాత్రి షెడ్డులో నిలిపి ఉంచిన రెండు హీరోహౌండా స్ప్లెండర్ ప్లస్ బైక్‌లు, రెండు ప్యాషన్ ప్లస్ బైకులు, ఒక పల్సర్, ఒక బుల్లెట్, ఒక హీరోహౌండా ప్యాషన్ ప్రో బైక్‌తో పాటు, క చేతక్ స్కూటర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. గురువారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు, బాధితులు రెండవ నగర పోలీసులకు సమాచారం అందించారు. తూర్పు ప్రాంత సర్కిల్ సిఐ కోటారెడ్డి, ఎస్సై కిషోర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌సైకిళ్లకు నిప్పంటించి దగ్ధం చేసి ఉంటారని, వీరిపై నిఘా ఉంచి త్వరలో పట్టుకుంటామని సిఐ తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తుంటే తక్షణం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఏడు మోటార్‌సైకిళ్ల విలువ సుమారు మూడు లక్షల రూపాయల వరకు ఉండవచ్చనని, ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నీతికి, అవినీతికి మధ్యనే ఎన్నికలు
విడవలూరు, మార్చి 1: నీతికీ అవినీతికీ మధ్యనే కోవూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలుజరగనున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దంపూరు, చౌకచర్ల, వావిళ్ళ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నాలుగు విడతలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గ్భావృద్ధికి చేసిందేమిటో చెప్పేందుకు బహిరంగ చర్చకురావాలని సవాల్ విసిరారు. ఆయన గెలిచిన పార్టీలో క్రమశిక్షణతో వుంటాడని కోవూరు ప్రజలకు ఎలాంటి నమ్మకం లేదన్నారు. జరగనున్న ఎన్నికల్లోప్రసన్నకు సరైన గుణపాఠం చెప్పేందుకు వారంతా ఎదురు చూస్తున్నారన్నారు. వ్యక్తి గత స్వార్ధం కోసమే ఈ ఉప ఎన్నికలు జరుగుతుండగా ఆయన హయాంలో ఒక్క పనికూడా సక్రమంగా జరగలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా పని చేసిన ఐదేళ్ల కాలంలో గత 30 ఏళ్ళలో లేని అభివృద్ధిని సాధించగలిగానన్నారు. ఉప ఎన్నిక రాష్ట్ర దిశాదశలను మార్చేది కాగా మంచికి ఓటేసి తనను గెలిపించాలని కోరారు. రోజుకో పార్టీ మారుతూ హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పదవిని తాకట్టు పెట్టిన ప్రసన్న లాంటి వారిని తరిమికొట్టాలని, తెలుగుదేశం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనితీరు నచ్చక సర్వేపల్లి నియోజకవర్గ ఓటర్లు ఆయనను తిరస్కరించారని చెప్పారు. తనపై కాంగ్రెస్ అధిష్టానం వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పార్టీ ప్రతిష్ట కాపాడే విధంగా గెలిచి చూపిస్తానన్నారు. మండల కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జ్ పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులంతా కలిసికట్టుగా కృషి చేసి అభివృద్ధి సాధకుడైన పోలంరెడ్డిని గెలిపించాలన్నారు. వీరితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు పూండ్ల అచ్యుతరెడ్డి, రామిరెడ్డి విజయభాను రెడ్డి, పార్థసారధి, సమాధి శ్రీనివాసులు, ఏటూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌టిఆర్ అభిమానుల ప్రదర్శన
విడవలూరు, మార్చి 1: తెలుగుదేశం అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్‌టిఆర్ అభిమానులు గురువారం మండల కేంద్రం విడవలూరులో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక అంకమ్మ దేవాలయంలో పూజల అనంతరం ఇక్కడలగ దేశం పార్టీ కార్యాలయం నుంచి హైస్కూల్ రోడ్, ప్రభుత్వాస్పత్రి, ఊటుకూరు రోడ్డుమీదుగా ర్యాలీ జరిపారు. జిల్లా ఎన్‌టిఆర్ సేవాసమితి అధ్యక్షుడు సింగంశెట్టి రవిచంద్ర, బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు కరణం రమేష్‌బాబు, జిల్లా టిడిపి సాంస్కృతిక విభాగం నుంచి సింగంశెట్టి మురళీమోహన్, ఆనంద్, విడవలూరు మండల కమిటీ అధ్యక్షుడు వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోవూరు పోరులో
జనం సానుభూతి ఎవరికి ?
నెల్లూరు టౌన్, మార్చి 1: కోవూరు ఉప ఎన్నిక బరిలో నిలిచిన ముగ్గురు ప్రధాన అభ్యర్థులు ఓటర్లలో సానుభూతి పొందేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సి అభ్యర్థులుగా పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పోటీ చేస్తున్నారు. పోటీ వీరి ముగ్గురి నడుమే కేంద్రీకృతమై ఉండటం గమనార్హం. అయితే ఎవరికి వారు ఓటర్లలో సానుభూతి పొందేలా ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఓటమి చెందిన దృష్ట్యా ఆ సానుభూతితో ఈదఫానైనా తనకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విన్నవించుకుంటున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండేది తమ పార్టీ అయినందున తాను ఎమ్మెల్యే అయితేనే జనానికి ప్రయోజనమనే సంగతి కూడా పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిది మరో రకం ప్రచారం. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యా...నా నియోజకవర్గంలో ఉండే ఇందుకూరుపేట మండలం ఇప్పుడు పునర్విభజనతో కోవూరులోనే కలిసింది. ఇప్పుడైనా గెలిపించి ఆదుకోవాలంటూ సోమిరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో, విపక్ష తెలుగుదేశం నాయకునిగా వాగ్ధాటి చూపుతున్నా సరైన వేదిక లేకపోవడం బాధాకరమంటున్నారు. ఇందుకోసం తనను మరో పర్యాయం శాసనసభకు పంపిస్తే అక్కడ ప్రజా సమస్యలపై తన వాణి వినిపిస్తానని స్పష్టం చేశారు. గడచిన 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ అయ్యేందుకు జడ్పీటిసిగా కూడా ఎన్నికయ్యాయని, అయితే జిల్లావ్యాప్తంగా తమకు అనుకూల ఫలితాలు రాకపోవటంతో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోయామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడైనా కోవూరు ప్రజలు కరుణించి తనను ఎమ్మెల్యే అయ్యేందుకు తోడ్పడాలని కోరుతున్నారు. అసలు ఈ ఉప ఎన్నిక రావడానికే కారణం తానని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పట్ల, తమ అధినేత జగన్ కుటుంబంపై ఉండే సానుభూతిని తనపై చూపాలంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర శాసనసభలో తమ వైఎస్‌ఆర్‌సి తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి ఉండగా, కోవూరు ప్రజలు ఓట్లేస్తే మరో ఎమ్మెల్యేగా తాను కూడా పార్టీ తరపున ఎన్నికై ఆ తల్లికి బిడ్డగా శాసనసభలో అడుగిడుతానంటూ సెలవిస్తున్నారు. ఇలా ప్రధాన అభ్యర్థులు సాగిస్తున్న ప్రచార సరళికి ప్రజానిర్ణయం ఎలా ఉంటుందో వెల్లడి కావాలంటే మరో ఇరవై రోజులు ఓపిక పట్టాల్సిందే.
ఒకేరోజు బాబు, జగన్ ప్రచారం
నెల్లూరు టౌన్, మార్చి 1: కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార పర్వం వేడెక్కుతోంది. ఒకే రోజు రెండు పార్టీల అగ్రనేతలు రానున్నారు. ఈ నెల 4వ తేదీన ఒకే రోజున మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహనరెడ్డి జిల్లాకు తరలివస్తున్నారు. చంద్రబాబు ప్రచారం బుచ్చిరెడ్డిపాళెం, కోవూరుల్లో తొలి రోజు పర్యటన సాగుతుందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జడ్ శివప్రసాద్ తెలిపారు. తరువాత తొమ్మిది, పది తేదీల్లో ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు మండలాల్లో పర్యటిస్తారని వివరించారు. 4వ తేదీన విడవలూరు మండలం చౌకచర్ల నుంచి జగన్ పర్యటన ప్రారంభం కానున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. ఒక నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం మూడురోజులపాటు చంద్రబాబు ప్రచారానికి రావడం అరుదైన వ్యవహారమని పరిశీలకులు అంటున్నారు. ఇదిలాఉంటే జగన్ అంతకంటే విస్తృతంగా పర్యటించేలా కార్యక్రమం రూపొందించటంతో దానికి దీటుగానే చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలుండగా జగన్ ఐదురోజుల పర్యటన ఖరారు చేశారు. అలాగే సినీ నటి రోజా కూడా రెండురోజుల పర్యటన నిమిత్తం రానున్నారు. కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించే ముఖ్యమంత్రి, తదితర నేతల పర్యటన తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇలాఉంటే నామినేషన్ల పరిశీలనలో గురువారం తొమ్మిదింటిని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో బరిలో 17 మంది మిగిలారు. శనివారంతో ఉపసంహరణల గడువు ముగిసిన తరువాత పోటీలో ఎందరు ఉంటారనేది స్పష్టమవుతుంది.
నేటి నుండి ఇంటర్ పరీక్షలు
నెల్లూరు, మార్చి 1: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరగనున్న పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 25704 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 28167 మంది హాజరు కానున్నారు. ఒకేషనల్ ప్రథమ సంవత్సరం 1193 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ 1172 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మొత్తం మీద 56,235 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, హైపవర్ కమిటీ, 5 ఫ్లయింగ్ స్వాడ్లను, 12 సిట్టింగ్ స్వాడ్లను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు కనీసం అరగంట ముందు చేరుకోవాలని అధికారులు సూచించారు. 8.15 నిమిషాలు దాటి వచ్చే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు తెలిపారు.
నేటినుండి తిరిగి పొగాకు వేలం
నెల్లూరు టౌన్, మార్చి 1: జిల్లాలోని డిసి పల్లి, కలిగిరి కేంద్రాల్లో శుక్రవారం నుండి పొగాకు వేలం తిరిగి ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ కారణంగా చూపిస్తూ అధికారులు మంగళవారం నుండి ఈకేంద్రాల్లో పొగాకు వేలం నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనిపై రైతుల నుండి తీవ్రస్థాయలో నిరసన వ్యక్తమయంది. అదే సమయంలో పొగాకు బోర్డు చైర్మన్ కమలవర్థన్‌రావు, జిల్లాకు చెందిన బిజెపి జాతీయ నేత వెంకయ్యనాయుడు ఈ విషయాన్ని ఢిల్లీలోని కేంఅద ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లటంతో సానుకూల స్పందన వచ్చింది. శుక్రవారం నుండి వేలం పునరుద్ధరణకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది.
నచ్చిన పాటలే పాడుతున్నా: బాలు
వెంకటగిరి, మార్చి 1: కని పెంచేది తల్లిదండ్రులైనా, తన గానాన్ని విని గాయకుల్లో ఇంతటి అత్యున్నతస్థానానికి చేరేలా తనను పెంచి పోషించిన ప్రేక్షక దేవుళ్లకు శతకోటి వందనాలని ప్రముఖ నేపథ్యగాయలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో వెంకటగిరి సాంస్కృతి ఐక్యవేదిక అధ్వర్యంలో పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాలు మాట్లాడుతూ పాట తన ఒక్కరి సొంతం కాదన్నారు. పదిమంది కలిసి చేస్తేనే ఒక పాట తయారౌవుతుందన్నారు. ఆలాంటి పాటను పాడే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడన్నారు. అంత మాత్రన ఆ పాట తనకే చెల్లుతుందనడం మంచిదికాదన్నారు. ఆత్రేయలాంటి మహానుభావులు జన్మించిన ఈ ప్రాంతంలో తనకు ఇలాంటి ఘన సన్మానం చేయడం చాలా అదవృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తనకు పాటలు తగ్గాయని, ఇవ్వడం లేదని, తాను పాడడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తనకు నచ్చిన కొన్ని పాటల్ని మాత్రమే తాను పాడుతున్నానే తప్ప అవకాశాలు రాకకాదని చెప్పారు. 300 సంవత్సరాలు వెంకటగిరిని పాలించిన రాజులు, సరస్వతీ పుత్రులు సాయికృష్ణ యాచేంద్రులవారు తన ముందు వినయంగా నిలబడి మాట్లాడం తాను చేసుకున్న అదృష్టంగా బావిస్తున్నాని చెప్పారు. భరించేది భర్త అంటారు కాని కళాకారుడ్ని భరించేది భార్యేనన్నారు. అనంతరం బాలు దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యాక్రమంలో సాయికృష్ణయాచేంద్ర, గంగోటి నాగేశ్వరరావు, ఘంటసాల కళాక్షేత్రం అధ్యక్షులు బొడిచర్ల సుబ్బయ్య, సభ్యులు సుంకర రవి, వీరాస్వామి, చిరంజీవి, బి కె ప్రసాద్ తదితరలు పాల్గొన్నారు.