ఇబ్రహీంపట్నం, జూలై 25: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక గెలుపొందిన వర్గీయులపై దాడి చేసి, యువకులపై హత్యాయత్నం చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ సమీపంలో పోలీసుల సాక్షిగా గురువారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని దండుమైలారం గ్రామానికి చెందిన సహకార సంఘం చైర్మన్ ఈదులకంటి రాకేష్‌గౌడ్ తన అనుచరులతో కలిసి అదే గ్రామానికి చెందిన యువకులపై పోలీస్‌స్టేషన్ సమీపంలో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న ఏసిపి సురేందర్‌రెడ్డి, సిబ్బందితో స్వల్ప లాఠీఛార్జి జరిపి దాడిచేసిన రాకేష్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసిపి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలో మేజర్ గ్రామపంచాయతీ దండుమైలారంలో మంగళవారం సాయంత్రం జరిగిన కౌంటింగ్‌లో టిడిపి బలపరిచిన వార్డు సభ్యులు, సర్పంచ్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. ఓటమిని జీర్ణించుకోలేక, దండుమైలారం సహకార సంఘం చైర్మన్ ఈదులకంటి రాకేష్‌గౌడ్, తన సోదరుడు ఈదులకంటి నరేష్ అలియాస్ లచ్చిలు కొందరు యువకులపై దాడికి దిగారు. అక్కడే భారీగా మోహరించిన పోలీసులు లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. తెలుగుదేశం వర్గానికి చెందిన యువకులు దయానంద్, ఆంజనేయులు, నిట్టు రవివర్మ, ప్రకాశ్, జిలమోని వెంకటేశ్‌లను ఫోన్‌ద్వారా బెదిరించి రెండుమూడు రోజుల్లో మిమ్మల్ని చంపుతాం, మీరే ఎన్నికల్లో కీలక పాత్ర వహించారు. మీరు ఎక్కడ దొరికినా చంపేస్తామంటూ ఫోన్‌లు చేసి బెదిరించారు. ఫోన్‌కాల్స్‌కు భయపడ్డ పలెమోని దయానంద్, ఆంజనేయులు, రవివర్మ, ప్రకాశ్‌లు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గురువారం వచ్చారు. కాగా గ్రామంలో రెండవవార్డులో గెలుపొందిన జిలమోని యాదగిరి తమ్ముడు వెంకటేశ్ గున్‌గల్ తిరుమల డైరీలోడ్రైవర్‌గా పనిచేస్తూ డ్యూటీ పనిమీద ఇబ్రహీంపట్నంవచ్చి పోలీసుస్టేషన్ సమీపంలోని పంక్చర్ షాప్ వద్ద నిల్చొని ఉన్నాడు. అదే సమయంలో సహకారసంఘం చైర్మన్ రాకేష్‌గౌడ్, తన తమ్ముడు లచ్చి, అనుచరుడు చిన్నా, పరమేష్, రాజశేఖర్ తదితరులతో కలిసి కర్రలతో, రాళ్లతో వెంకటేశ్‌పై దాడికి దిగారు. వెంకటేశ్‌పై రాయి ఎత్తివేయగా తప్పించుకోగా నడుముకు తగిలింది. కర్రలతో కొట్టారు. పోలీసుస్టేషన్ దగ్గర నిలుచున్న ఆంజనేయులు, రవివర్మలను కర్రలతో కొట్టారు. పోలీసుస్టేషన్ సమీపంలో పెద్ద సంఖ్యలో గుమిగూడిన యువకులు దాడి చేస్తున్న లాఠీచార్జి జరిపి, దాడిని అడ్డుకున్నారు. రాకేష్‌గౌడ్, లచ్చి, చిన్న, పరమేశ్, రాజశేఖర్ తదితరులపై గాయపడ్డ యువకుల ఫిర్యాదుమేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు, స్పెషల్ బిఎస్‌ఎఫ్ ఫోర్స్‌ను మోహరించి స్టేషన్‌ముందు యువకులు గుమిగూడకుండా చెదరగొట్టారు. విలేఖరుల సమావేశంలో ఏసిపితోపాటు, సిఐ రాంకుమార్ పాల్గొన్నారు. ఆగస్టు 3వరకు గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు జరుపుకోవద్దని వారు హెచ్చరించారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేక
english title:
dandu mailaram
Date:
Friday, July 26, 2013