హరారే, జూలై 24: ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించి బోణీ చేసింది. మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో, అతని స్థానంలో జట్టుకు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ సెంచరీతో కదంతొక్కగా, కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన తెలుగు తేజం అంబటి రాయుడు అజేయంగా 63 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఇన్నాళ్లూ తనకు జాతీయ జట్టులో అవకాశం ఇవ్వకపోవడం సెలక్టర్ల పొరపాటని పరోక్షంగా చెప్పాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న భారత్ ఈ సిరీస్‌లో హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగింది. చివరిదైన పదో స్థానంలో నిలిచిన జింబాబ్వే కనీసం పోరాటాన్ని కూడా ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, బ్రెండన్ టేలర్ నాయకత్వంలోని ఆ జట్టు కూడా సర్వశక్తులు ఒడ్డి ఆడడంతో తొలి వనే్డ ప్రేక్షకులను అలరించింది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 228 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉసి సిబాండ, సికందర్ రజా తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించారు. 72 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేసిన సిబాండను అమిత్ మిశ్రా ఎల్‌బి చేయడంతో జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. సుమారు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ వనే్డ ఆడిన మిశ్రాకు మొదటి వికెట్ లభించడం విశేషం. రజా క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్నప్పటికీ, సిన్ విలియమ్స్ (15), హామిల్టన్ మసకజా (11), కెప్టెన్ బ్రెండన్ టేలర్ (12), మాల్కం వాలర్ (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. రజా 112 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 82 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. చివరిలో ఎల్టన్ చిగుంబురా అజేయంగా 43 పరుగులు చేయగా, టిటెండ ముతొంబొజి ఎనిమిది పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రాస్పర్ ఉత్సేయ ఎనిమిది పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత బౌలర్లలో మిశ్రా అద్భుతంగా రాణించి మూడు వికెట్లు పడగొట్టాడు. అంబటి రాయుడుతో పాటు కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన జయదేవ్ ఉనాద్కత్ 10 ఓవర్లలో 39 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. జింబాబ్వే నిర్దేశించిన 229 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 44.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శిఖర్ ధావన్ 17 పరుగులు చేసి కేల్ జార్విస్ బౌలింగ్‌లో వాలర్‌కు దొరికిపోయాడు. రోహిత్ శర్మ 20 పరుగులు సాధించి చిగుంబురా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ బ్రెండన్ టేలర్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు భారత్‌కు అండగా నిలిచారు. మైదానం నలువైపులా షాట్లతో అలరించిన కోహ్లీ 108 బంతులు ఎదుర్కొని 115 పరుగులు సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. సిబాండ క్యాచ్ అందుకోగా కోహ్లీని అవుట్ చేసిన ఉత్సేయ అదే ఓవర్‌లో సురేష్ రైనా (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. సికిందర్ రజా అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రైనా తన ఖాతాను తెరవకుండానే అయితే, అప్పటికే 216 పరుగులు చేసిన భారత్‌కు రాయుడు (నాటౌట్ 63), దినేష్ కార్తీక్ (నాటౌట్ 8) మరో వికెట్ నష్టం లేకుండా విజయాన్ని అందించారు. మరో 31 బంతులు మిగిలి ఉండగానే భారత్ గెలుపొంది, సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ముతొంబొజి వేసిన బంతిని బౌండరీకి తరలించి రాయుడు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కాగా, ఉత్సేయకు రెండు వికెట్లు లభించాయి. సెంచరీ హీరో కోహ్లీ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్తంగా స్కోర్లు
జింబాబ్వే ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 228 (సికందర్ రజా 82, సిబాండ 34, చిగుంబురా నాటౌట్ 43, అమిత్ మిశ్రా 3/43).
భారత్ ఇన్నింగ్స్: 44.5 ఓవర్లలో 4 వికెట్లకు 230 (కోహ్లీ 115, రాయుడు నాటౌట్ 63, ఉత్సేయ 2/34).
జింబాబ్వే టూర్‌లో రాణించిన తెలుగుతేజం రాయుడు
english title:
s
Date:
Thursday, July 25, 2013