న్యూఢిల్లీ, జూలై 24: వివిధ రకాలుగా క్రికెట్ పరువు తీస్తున్న ఆటగాళ్లను కఠినంగా శిక్షించాలని భారత మాజీ కెప్టెన్, 1983 వరల్డ్ కప్ విజేత జట్టుకు సారథ్యం వహించిన కపిల్ దేవ్ డిమాండ్ చేశాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్న వారిని ఉపేక్షిస్తే క్రికెట్ ప్రతిష్ఠ బజారున పడుతుందని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ హెచ్చరించాడు. ఆరో ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌సహా మొత్తం 29 మందిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేసిన ఉదంతాన్ని అతను ప్రస్తావిస్తూ, ఇలాంటి సంఘటనలు క్రికెట్ అభివృద్ధికి, క్రీడాస్ఫూర్తికి గొడ్డలి పెట్టని అన్నాడు. పాక్ క్రికెటర్లు సల్మాన్ బట్, మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అమీర్ బ్రిటన్‌లో జైలు శిక్ష అనుభవించారని, ఈ విషయాన్ని గుర్తించి క్రికెటర్లు అక్రమ మార్గాలకు దూరంగా ఉండాలని హితవు పలికాడు. ఫిక్సింగ్ నేరాలకు పాల్పడడం క్షమార్హం కాదని అన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఢిల్లీ పేసర్ ప్రదీప్ సంగ్వాన్ డోప్ పరీక్షలో విఫలమైన విషయాన్ని కూడా కపిల్ ప్రస్తావించాడు. ఇలాంటి విషయాల్లో యువ క్రికెటర్లను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నాడు. క్రికెట్‌లో పోటీ పెరిగిందని, దీనిని తట్టుకోవడానికి మరింత కసితో శ్రమించాలే తప్ప ఉత్ప్రేరకాలను వాడడం వంటి వక్ర మార్గాలను అనుసరించడం తగదని పేర్కొన్నాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ తెండూల్కర్, అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్ వంటి మేటి క్రికెటర్లు అత్యున్నత శిఖరాలను అధిరోహించడం వెనుక వారి కృషి, అంకిత భావం కీలక పాత్ర పోషించిందని అన్నాడు. వారిని మార్గదర్శకంగా తీసుకోవాలని యువ ఆటగాళ్లకు అతను సూచించాడు. విజయాలకు దగ్గరి మా ర్గం ఉండదని వ్యాఖ్యానించాడు. కొన్ని సంఘ టనలను పాఠాలుగా స్వీకరించి, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించాడు. ఇలావుంటే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కూడా సమాచార చట్టం పరిధిలోకి రావాలని ఇటీవల వస్తున్న వాదనపై అడిగిన ప్రశ్నకు కపిల్ ఆచితూచి స్పందించాడు. క్రికెట్‌కు బోర్డు విశిష్ట సేవలు అందిస్తున్నదని కొనియాడాడు. అయితే, పాలనా వ్యవహారాలు మరింత పారదర్శకంగా ఉండేలా బోర్డు చర్యలు తీసుకోవాలని అన్నాడు. బోర్డు ఒక పార్లమెంటు లాంటిదని, మంచి వ్యక్తులు ఎన్నికైతే మంచి పాలన ఉంటుందన్నాడు. బోర్డులో పారదర్శకమైన విధానాలను అందరూ కోరుకుంటారని కపిల్ పేర్కొన్నాడు.
క్రికెట్ అధికారులకు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ డిమాండ్
english title:
k
Date:
Thursday, July 25, 2013