న్యూఢిల్లీ, జూలై 24: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) వేలంలో ఎదురైన చేదు అనుభవం థాయిలాండ్ స్టార్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత మథియాస్ బొయేను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. వచ్చే ఏడాది జరిగే థామస్ కప్ పోటీలను మినహాయించి తాను భారత్‌లో అడుగుపెట్టబోనని అతను స్పష్టం చేశాడు. డబుల్స్ భాగస్వామి కార్‌స్టెన్ మోగెనె్సన్‌తో కలిసి 2011 ఆల్ ఇంగ్లాండ్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించిన బొయేకు ఐబిఎల్ నిర్వాహకులు బేస్ ప్రైస్‌ను 50,000 డాలర్లుగా నిర్ణయించారు. కానీ, 33 ఏళ్ల ఈ ఆటగాడిని తీసుకోవడానికి ఫ్రాంచైజీలేవీ ముందుకు రాలేదు. తనకు గొప్ప ధర పలుకుతుందని ఆశించిన బొయే ఈ పరిణామంతో నిరాశ చెందాడు. ఐబిఎల్‌కు మొదటి నుంచి మద్దతు పలుకుతున్న తనకు అందులో ఆడే అవకాశం రాకపోవడం దురదృష్టకరమని అతను ట్విటర్‌లో వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే థామస్ కప్‌లో ఆడతానని తెలిపాడు. ఆ తర్వాత తాను మళ్లీ భారత్‌లో అడుగుపెట్టనని శపథం చేశాడు. ఇలావుంటే, బొయే పార్ట్‌నర్ మోగెనె్సన్‌ను బంగా బీట్స్ (బెంగళూరు) ఫ్రాంచైజీ 50,000 డాలర్లకు కొనడం గమనార్హం. వాస్తవానికి అతని కంటే బొయేకే ఎక్కువ ధర పలకాలి. కానీ ఈ థాయిలాండ్ స్టార్ పట్ల ఎవరూ ఆసక్తి ప్రదర్శించలేదు. అతనితోపాటు థాయిలాండ్‌కే చెందిన బూన్సాక్ పొన్సానా, జపాన్ ఆటగాడు కెనెచి టాగో, ఇండోనేషియా స్టార్లు టామీ సుగియార్తో, సొనీ ద్వి కున్కొరో ప్రపంచ టాప్ ర్యాంకర్లను కూడా ఎవరూ కొనలేదు.
స్పాట్ ఫిక్సింగ్ కేసు
సిబిఐ విచారణకు
సుప్రీంకోర్టు తిరస్కృతి
న్యూఢిల్లీ, జూలై 24: ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు తలెత్తడంతో, ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. హై కోర్టుకే వెళ్లాలని పిటిషన్‌దారు షర్మిల గుహేకు న్యాయమూర్తులు బిఎస్ చౌహాన్, ఎస్‌ఎ బొబ్డేలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ సూచించింది. కోట్లాది మంది అభిమానుల విశ్వాసాన్ని ఐపిఎల్ దారుణంగా దెబ్బతీసిందని ముంబయికి చెందిన షర్మిల సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. క్రికెటర్లతోపాటు, సమాజంలో పేరుప్రతిష్టలున్న ఎంతో మందికి ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయాన్ని ఆమె ప్రస్తావించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో సంబంధిత అధికారులు ఒత్తిళ్లకు లొంగకుండా ఉండాలంటే, సిబిఐ విచారణ అవసరమని పేర్కొంది. పలు రాష్ట్రాల పోలీసు శాఖలు వేరువేరుగా చార్జిషీట్లను దాఖలు చేస్తున్నాయని ఆమె తెలిపింది. అదే విధంగా విచారణ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కొనసాగుతున్నదని పేర్కొంది. ఈ మొత్తం కేసును ఏక మొత్తంగా విచారించడానికి సిబిఐ విచారణ అవసరమని అభిప్రాయపడింది. పిటిషనర్ వాదనను పరిశీలించిన సుప్రీం కోర్టు బెంచ్ ఇది తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ముంబయి హైకోర్టును సంప్రదించాలని షర్మిలకు సూచించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కేసును ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు విచారిస్తుండగా, బిసిసిఐ సొంతంగా మరో విచారణకు ఆదేశించింది. ఇద్దరు మాజీ న్యాయమూర్తులు సుబ్రమణియన్, జయరామ్ చౌతాలతో కూడిన ప్యానెల్ బెట్టింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సిఇవో గురునాథ్ మెయ్యప్పన్ వ్యవహారంతోపాటు రాజస్థాన్ రాయల్స్‌లో చోటు చేసుకున్న పరిణామాలను కూడా విచారించనుంది. మరోవైపు బిసిసిఐ ఎసిఎస్‌యు కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి అరెస్టయ, ప్రస్తుతం బెయల్‌పై విడుదలైన పలువురు నిందితులు నిర్దోషులుగా బయటపడడం అసాధ్యం కనిపిస్తున్నది. అయతే, విచారణ ఎంత వరకూ పారదర్శకంగా సాగుతుందన్న అనుమానాలు లేకపోలేదు. అందుకే, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. షర్మిలకు ముంబయ హైకోర్టులో ఊరట లభిస్తే, కోట్లాది మందిని వేధిస్తున్న స్పాట్ ఫిక్సింగ్‌లో అసలు దోషులెవరో తేలడం ఖాయం. కేసును త్వరగా తేల్చాలన్నది అందరి అభిప్రాయం.