* రోడ్లు,భవనాలకు చెందిన
రోడ్లు 189.48కి.మీలు
* జాతీయ రహదారులకు
చెందినవి 98.70 కి.మీలు
* రోడ్లపై బల్దియా వివరణ
హైదరాబాద్, జూలై 25: మహానగరంలో గత కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం కారణంగా పూర్తిగా గుంతలమయం కావటంతో పాటు రోడ్డుపై దుమ్ము, దూళి ఎగుస్తూ వాహనదారులను ప్రమాదాల బారిన పడేస్తున్న సంగతి తెల్సిందే! రోడ్లు బాగా లేని కారణంగా సికింద్రాబాద్‌లో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం, ఈ విషయంపై పలువురు మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేయటం వంటి పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఏ రోడ్డు ఏ విభాగానికి చెందిందో బల్దియా అధికారులు గురువారం స్పష్టమైన వివరాల్ని వెల్లడించారు.
ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందిన రోడ్డు తమ పరిధిలోకి రాదని, ఆ రోడ్డు రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి వస్తుందని కూడా అధికారులు వివరణ ఇచ్చుకోవల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ గ్రేటర్ పరిధిలో జాతీయ రహదార్లు, రోడ్లు, భవనాల శాఖకు చెందిన రహదార్లున్నా, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల తాకిడికి పలు రోడ్లకు బల్దియానే స్వల్ప మరమ్మతులు చేపట్టేది.
నగరంలో ప్రస్తుతమున్న రోడ్ల పరిస్థితి తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఇప్పటికైనా ఏ రోడ్డు ఎవరి పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని వెల్లడించేందుకు అధికారులు సిద్దమయ్యారు. గతంలో ఎవరడిగినా, వివరాలు చెప్పేందుకు తడబడే అధికారులు ఇపుడు స్వచ్చంథంగా ఆయా విభాగాలకు చెందిన రోడ్ల పూర్తి వివరాల్ని విడుదల చేయటం విశేషం.
ఈ అయితే గ్రేటర్ పరిధిలోని బిటి, సిసి రోడ్లన్నీ కూడా సుమారు 7వేల చదరపు కిలోమీటర్ల పొడువున ఉండవచ్చునని గతంలో వెల్లడించిన అధికారులు ప్రస్తుతమిచ్చిన వివరాల ప్రకారం రోడ్లు, భవనాల శాఖ, జాతీయ రహదారుల శాఖలకు సంబంధించి రోడ్లు కనీసం 300 చ.కి.మీలు కూడా లేవు. అంటే రోడ్లలో ఎక్కువ భాగంగా బల్దియా పరిధిలోకి వస్తుందని అర్థం. కానీ ఈ వివరాల్ని అధికారులు వెల్లడించకపోవటం గమనార్హం.
రోడ్లు, భవనాల శాఖ రహదార్లు ఇవే!
నగరంలో మొత్తం 189.48పొడువున రోడ్లు, భవనాల శాఖకు చెందిన రోడ్లున్నట్లు అధికారులు తెలిపారు. సరోజినీదేవి ఆస్పత్రి సమీపంలోని పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెవ్ హైవే, సరోజినీదేవి ఆస్పత్రి రోడ్డు, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెం. 1,2,3,జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36, మాదాపూర్ మెయిన్ రోడ్డు, హెచ్‌ఐసిసి వరకు మొత్తం 15 కి.మీల పొడువున రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు చెందిన రోడ్లున్నట్లు వెల్లడించారు. అలాగే మెహిదీపట్నం నుంచి టోలీచౌకీ, గచ్చిబౌలీ ఫ్లైవోవర్, కొండాపూర్‌ల మీదుగా హెచ్‌ఐసిసి వరకు సుమారు 9.60 కి.మీల పొడవున్న రోడ్డు, దీంతో పాటు ఎన్‌ఎఫ్‌సిఎల్ జంక్షన్, పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, ఎస్పీ రోడ్డు, సంగీత్ జంక్షన్, తార్నాక, మెట్టుగూడ, ఉప్పల్ వరకు సుమారు 15.60 కి.మీల పొడువున్న రోడ్డు రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్ నుంచి మెదక్‌కు వెళ్లే దారిలో బాలానగర్, హెచ్‌ఎంటి, జీడిమెట్ల, బహద్దూర్‌పల్లి, గండిమైసమ్మ జంక్షన్ వరకు సుమారు 13కి.మీల రోడ్డు రోడ్లు, భవనాల శాఖ పరిధిలోకి వస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్లే దారిలో మలక్‌పేట, సైదాబాద్, సంతోష్‌నగర్, బైరామల్‌గూడ, బిఎన్‌రెడ్డినగర్ 7.40 కి.మీల రోడ్డు కూడా అదే శాఖ పరిధిలో ఉన్నట్లు వెల్లడించారు. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్, కాటేదాన్ నుంచి శివరాంపల్లి, అత్తాపూర్ నుంచి రేతీబౌలీ వరకు, మెహిదీపట్నం నుంచి మాసాబ్‌ట్యాంక్, కృష్ణాపురంల వరకు 36.40కి.మీల పొడువున్న ఇన్నర్ రింగురోడ్డులు, అలాగే కొండాపూర్ నుంచి హాఫీజ్‌పేట వరకు అంతర్గతంగా ఉన్న 20.20 కి.మీల రోడ్డు, మియాపూర్ నుంచి బాచిపల్లి మీదుగా దుండిగల్ వరకు సుమారు 9.50 కి.మీల అంతర్గత రోడ్లు, బహద్దూర్‌పల్లి, కొంపెల్లి వరకు 7 కి.మీలు, తిరుమల్‌గిరి నుంచి ఆర్‌కె పురం మీదుగా వౌలాలీ, కుషాయిగూడ జంక్షన్ వరకు 7.40 కి.మీలు, ఐడిఎ నాచారం నుంచి ఆర్‌ఆర్‌ల్యాబ్స్, మల్లాపూర్ రోడోవర్ బ్రిడ్జి వరకు 7.60కి.మీల రోడ్డు, హైదరాబాద్ నుంచి వౌలాలీ రోడ్డులోని ఇంజనీరింగ్ కాలేజీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, తార్నాక, లాలాపేట, ఐడిఏ వౌలాలీ ఆర్వోబి, ఇసిఐఎల్ క్రాస్‌రోడ్డు వరకు 3.9కి.మీల రోడ్డుతో పాటు ఉప్పల్ స్టేడియం ఇంటర్ రోడ్డు 1.80కి.మీలు కూడా ఆ శాఖ పరిధిలోకే వస్తాయని అధికారులు తెలిపారు. 3.40 కి.మీల ఓల్డ్ ఎయిర్‌పోర్టు, 1.80.కి.మీల బాలానగర్ నుంచి ఫతేనగర్ రోడ్డు, 0.60కి.మీల ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాంప్లెక్సు రోడ్డు, 4 కి.మీల పాత కర్నూలు రోడ్డు, మూడు కి.మీల మిథానీ రోడ్డు, ఓ కిలోమీటరు మల్కాజ్‌గిరి రోడ్డు, ఓ కి.మీ పొడువున్న సనత్‌నగర్ గూడ్స్‌షెడ్ నుంచి మూసాపేట జంక్షన్ వరకు, 2.70కి.మీల ఉత్తమ్‌నగర్ జెడ్‌టిఎస్ క్రాస్‌రోడ్డు నుంచి మల్కాజ్‌గిరి వరకు, 5.30 కి.మీల మిరియాల్‌గూడ ఉంచి నెరెడ్‌మెట్ క్రాస్‌రోడ్డు, 5.30 కి.మీల కెబిఆర్ పార్కు చుట్టున్న రోడ్డు, అలాగే 0.60 కి.మీల చాదర్‌ఘాట్‌లోని లోతట్టు ప్రాంతంలోని రోడ్డు, 0.98కి.మీల ఐఆర్‌ఆర్ నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం, రామంతాపూర్, హబ్సిగూడ రోడ్డు కూడా రోడ్లు, భవనాల శాఖకు చెందినదిగా అధికారులు తెలిపారు.
ఇవి జాతీయ రహదార్ల రోడ్లు
నగరం నుంచి భూపాలపట్నంకు వెళ్లే జాతీయ రహదారి నెం. 202లోని చాదర్‌ఘాట్ బ్రిడ్జి, అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్, నల్లచెరువు వరకు దాదాపు 10.10కి.మీల రోడ్డు జాతీయ రహదార్ల శాఖకు చెందినదిగా తెలిపారు. అలాగే పూణె విజయవాడల జాతీయ రహదారి-9లోని ముత్తంగి, పటాన్‌చెరువు, కూకట్‌పల్లి, అమీర్‌పేట, అసెంబ్లీ, ఎం.జె.మార్కెట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్ వరకు సుమారు 54కి.మీల రోడ్డు, అలాగే నాగ్‌పూర్, హైదరాబాద్ కర్నూలు జాతీయ రహదారి నెం. 7లోని కొంపల్లి, బోయిన్‌పల్లి,(ప్యారడైజ్ జంక్షన్), ట్యాంక్‌బండ్, అసెంబ్లీ, ఎం.జె.మార్కెట్, హైకోర్టు, జూపార్కు, ఆరంఘర్ వరకు 25.70కి.మీల రోడ్డుతో పాటు జాతీయ రహదారి 65లోని కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని బాలానగర్, బోయిన్‌పల్లి, ప్యారడైజ్ వరకు దాదాపు 8.90 కి.మీల రోడ్డును కలుపుకుని నగరంలో మొత్తం 98.70కి.మీల పొడువున జాతీయ రహదారుల శాఖ రోడ్లున్నట్లు అధికారులు తెలిపారు.