వరంగల్, జూలై 26: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడో.. అప్పుడో తెలంగాణ వస్తుందనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఏర్పడుతున్న పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయడం తెలంగాణలో పార్టీ పరిస్థితి దిగజారేందుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై, తెలంగాణ అంశంపై పార్టీ అధినేత్రి వైఎస్.విజయమ్మ రెండు రోజుల్లో వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ తొలి ప్లీనరీ సమావేశంలో, పరకాల ఉపఎన్నిక సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని విజయమ్మ ప్రకటించారని గుర్తుచేశారు. వైఎస్ కుటుంబం కోసం తన మంత్రి పదవిని, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని, వైఎస్సార్‌సిపిలో ఉన్నందుకు తన భర్త ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నామని చెప్పారు. ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాన్ని, బహిరంగ సభల్లో పార్టీ గౌరవ అధ్యక్షురాలు చేసిన ప్రకటనలను సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. సీమాంధ్ర వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు వ్యక్తిగతమని ప్రకటిస్తే వేరే విషయమని, కానీ రాజీనామాల విషయంలో అధిష్ఠానం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెలంగాణలోని వైఎస్సార్‌సిపి శ్రేణుల్లో, ప్రజల్లో అయోమయం, అనుమానం నెలకొందని చెప్పారు. రాజీనామాలు చేసిన వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు తమ ప్రాంత ప్రజల మనోభావాలను గమనించడం లేదని అంటున్నారని, కానీ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను మరిచారా? అని ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల కోసం తాము దేనికైనా సిద్ధపడక తప్పదని అన్నారు. వైఎస్సార్‌సిపి సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాలతో పార్టీ సీమాంధ్రకు అనుకూలమనే సంకేతాలు ప్రజల్లో వెళ్లాయని, దీనివల్ల పార్టీ సంక్షోభంలో పడే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. సీమాంధ్ర వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేల రాజీనామాలపై అధిష్ఠానం నుంచి స్పందన రాకుంటే భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటామని సమా ధానం ఇచ్చారు.
ప్రశ్నార్థకంగా మారిన
ఖరీఫ్ సాగు
సాగర్ నుంచి చుక్కనీరు లేదు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 26: వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కల్గిన కృష్ణాడెల్టాలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ వరిసాగు జరుగుతుండటం ఆనవాయితీగా వస్తుంటే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కే సాగునీరందని దుస్థితి నెలకొంది. తెలుగుదేశం తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి కొరత వలన వరసగా నాలుగేళ్లపాటు, డెల్టా ఆధునికీకరణ పేరిట గత మూడేళ్లుగా రబీలో వరిసాగు లేకుండా పోయింది. తెలంగాణవాదుల హెచ్చరికలు, అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల కారణంగా గత ఖరీఫ్‌లో వరుణుడి సహకారంతో ఏదో రీతిలో వరిసాగు గట్టెక్కింది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 864 అడుగులు కాగా 834 అడుగులు మించాలని, సాగర్ జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా 510.5 అడుగులకు మించాలని అప్పుడే దిగువకు నీటిని వదలాలంటూ తీర్పులు వెలువడటంతో ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల గగనమైంది. గత ఖరీఫ్‌లో కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు 72.51 టిఎంసిల నీటి వినియోగం జరిగితే ఆ 90 రోజుల సీజన్‌లో నాగార్జునసాగర్ జలాశయం నుంచి కేవలం వారం పదిరోజులపాటు అదీ కేవలం 29.14 టిఎంసిల నీరు విడుదలైంది. ఆ సీజన్‌లో వర్షాల వల్ల రికార్డుస్థాయిలో 90 టిఎంసిలకు పైనే వరదనీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోగా పలు దఫాలు గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని వదలాల్సి వచ్చింది. మొత్తంపై పూర్తిస్థాయి విస్తీర్ణంతో వరిసాగు జరిగింది. ఇక ప్రస్తుత సీజన్‌లో ఈ నెల 10న డెల్టా కాలువలకు నీటిని విడుదల చేసారు. అదీ రైతాంగం ఆందోళన చేసిన మీదట తొలిరోజుల్లో నామమాత్రంగా 200 క్యూసెక్కుల నీటి సరఫరా జరిగింది. క్రమేణా పెంచుతూ వారం రోజుల క్రితం ఏడు వేల 500 క్యూసెక్కుల వరకు నీరు సరఫరా చేసారు. ఇదే సమయంలో విస్తారంగా వర్షాలు కురవడంతో సమృద్ధిగా నారుమళ్లు పూర్తయి క్రమేణా వరినాట్లు ప్రారంభించారు. ఇదే సమయంలో వర్షాలు లేక ప్రకాశం బ్యారేజీకి వరదనీటి ప్రవాహం తగ్గింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నిలువనున్న నీటిని కొద్ది కొద్దిగా కాలువలకు సరఫరా చేయాల్సి వస్తున్నది. ఏడాది పొడవునా ప్రకాశం బ్యారేజి వద్ద కనీస నీటిమట్టం 12 అడుగులు ఉండాల్సి రాగా ఓ దశలో 11.4 అడుగులకు తగ్గిపోయింది. దీంతో కాలువలకు నీటి సరఫరాను తగ్గిస్తూ వచ్చి నీటి మట్టాన్ని క్రమేణా పెంచుతూ వస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 11.8 అడుగులకు చేరగా కాలువలకు 5వేల 163 క్యూసెక్కుల నీటి సరఫరా మాత్రమే జరుగుతున్నది. ప్రస్తుతం పెద్దఎత్తున వరినాట్లు జరుగుతుండగా నీటి అవసరం బాగా కన్పిస్తోంది. ముఖ్యంగా ఆయకట్టు చివరి భూములకు కాలువల నుంచి చుక్కనీరు అందని పరిస్థితి నెలకొంది. మరోవైపు సాగర్ జలాశయం నుంచి ఇప్పట్లో నీరు విడుదలయ్యే సూచనలు కన్పించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు ప్రశ్నార్థకమే.