విశాఖపట్నం, జూలై 26: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేక్రమంలో భాగంగా డిసెంబర్ 23న చేసిన ప్రకటనకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉండాలని సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి డిమాండ్ చేసింది. సమైక్యాంధ్ర సాధనలో భాగంగా విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో విశాఖలోని ఆంధ్రాయూనివర్శిటీలో శుక్రవారం ఒకరోజు రిలేనిరాహార దీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ, వర్కింగ్ కమిటీ సమావేశాల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని జెఎసి ప్రతినిధులు ఆరేటి మహేష్, లగుడు గోవిందరావు తదితరులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి కన్వీనర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీసే ఎటువంటి నిర్ణయాన్ని తాము స్వాగతించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు తమ అధిష్ఠానాన్ని ఒప్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు 24 గంటల డెడ్‌లైన్ విధించారు. దీనిలో భాగంగా శనివారం విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంటిని ముట్టడించనున్నట్టు వారు వెల్లడించారు. సిపిఐ నారాయణ పిచ్చిప్రేలాపన కట్టిపెట్టాలని, లేని పక్షంలో సీమాంధ్రలో తిరగనిచ్చేది లేదని హెచ్చరించారు. నారాయణ తన నోటిని అదుపులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పదవులకు రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపింది. అంతకు ముందు విద్యార్థి జెఎసి ఎయులోని గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ జరిపారు. కార్యక్రమంలో యువజన జెఎసి కన్వీనర్ కోటి రవికుమార్, సమైక్యాంధ్ర పోరాట సమితి జిఎ నారాయణ రావు, ఎపి ఎన్జీఓ ప్రతినిధులు కె కోటేశ్వరరావు, నాగేశ్వరరెడ్డి, ఎయు ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులు బి రామచందర్, ఎయు ప్రొఫెసర్లు వేణు, బాబూరావు, ప్రేమానంద్ తదితరులు పాల్గొన్నారు.
రగులుతున్న ఉద్యమం
అనంతపురం: అనంతపురం జిల్లాలో సమైక్య సెగ రగులుకుంది. కోర్‌కమిటీ సమావేశం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటన నేపధ్యంలో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలో ఆటోను ధ్వంసం చేశారు. పలు వాహనాలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజాప్రతినిధులు పిరికివారని ఆరోపించారు. నేతలను జిల్లాలో అడుగుపెట్టనీయమన్నారు.ర్యాలీ, రాస్తోరోకో నిర్వహించారు.
ఎమ్మెల్యేల రాజీనామాలు
నెల్లూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు జిల్లాలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డికి చెందిన స్థానిక అతిథిగృహంలో వారు విలేఖరుల సమక్షంలో తమ రాజీనామా పత్రాలపై సంతకాలు పెట్టారు. నెల్లూరు నగర శాసనసభ్యులు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి కూడా హాజరై ఆదాల బాటలోనే తాను కూడా అంటూ రాజీనామా పత్రంపై సంతకం చేశారు. ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపుతున్నట్లు వెల్లడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 27న విద్యాసంస్థల బంద్ చేపడుతున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వెల్లడించారు.
సోనియాకు పోస్టు కార్డులు
కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తొందరపడి ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి హెచ్చరించింది. శుక్రవారం శాప్స్ ఆధ్వర్యంలో తిరుపతిలో నగరంలోని ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులతో పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రాంతీయ తపాల కార్యాలయం ఎదుట నిర్వహించారు. శాప్స్ ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తొలిరోజున 1200 మంది పోస్టుకార్డులను సోనియాగాంధీకి పంపారని, లక్ష కార్డులను తిరుపతి నుండే పంపనున్నట్లు తెలిపారు.
మంత్రి అహ్మదుల్లా ఇల్లు ముట్టడి
కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో మైనార్టీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ శాఖ మంత్రి హాజీ ఎస్‌ఎండి అహ్మదుల్లా ఇంటిని ముట్టడించారు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి నేతలు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూల ప్రకటనలు వస్తున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజీనామా చేసి ఉద్యమంలోకి రాకుండా ఢిల్లీకి వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు.
నేడు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి * నిరాహార దీక్షలో విద్యార్థి జెఎసి
english title:
s
Date:
Saturday, July 27, 2013