రాజమండ్రి/్భద్రాచలం, జూలై 26: గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్డడంతో ధవళేశ్వరం వద్ద శుక్రవారం రాత్రి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో చెదురుమదురుగా మాత్రమే వర్షపాతం నమోదవటం, భద్రాచలం వద్ద గోదావరీ నీటిమట్టం గంటకు రెండు నుండి మూడు పాయింట్లు చొప్పున వేగంగా తగ్గుతుండటంతో ధవళేశ్వరం వద్ద కూడా ఉదయం 10గంటల నుండి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. అర్ధరాత్రి నుండి ఉదయం 9గంటల వరకు 17.20 అడుగుల వద్ద నిలకడగా ఉన్న నీటిమట్టం 10గంటల నుండి గంటకు పాయింటు చొప్పున తగ్గటం మొదలయింది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద సాయంత్రం 6గంటలకు 16.40 అడుగులకు చేరుకున్న నీటిమట్టం, రాత్రి 8గంటలకు 16.2 అడుగులకు చేరుకుంది. ఆ సమయంలో వరద ప్రవాహం కూడా 17 లక్షల క్యూసెక్కుల కన్నా దిగువకు చేరటంతో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. రానున్న 48 గంటల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోగానీ, ప్రధాన ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, పెన్‌గంగ తదితర నదులపై గానీ అధిక వర్షపాతం నమోదుకాకపోతే, వరద ఉద్ధృతి 48గంటల్లో మరింత వేగంగా తగ్గి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలంలోని గ్రామాలు కూడా ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నప్పటికీ, శనివారం రాత్రికి ఆ గ్రామాలకు రాకపోకలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ముంపులో ఉన్న లంక గ్రామాలకు రోజులు గడుస్తున్న కొద్దీ నష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే లంక గ్రామాల్లో కూరగాయలు, అరటి వంటి ఉద్యానపంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 8 రోజులుగా నీటిలోనే నానుతున్న ఇళ్లలో చాలా వరకు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయని లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి శాంతించింది. గురువారం 56.6 అడుగులకు చేరుకున్న నీటి మట్టం శుక్రవారం 47.4 అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు భద్రాచలం వద్ద రెండు, మూడో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 47.4 అడుగులకు చేరుకున్నప్పటికీ శుక్రవారం సైతం రవాణా పునః ప్రారంభం కాలేదు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని 150 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం డిపోకు చెందిన 40 గ్రామీణ సర్వీసులు గత 9 రోజులుగా నిలిచిపోవడంతో సుమారు రూ.70 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఆర్టీసీ అంచనా వేసింది. కాగా, ఆర్టీసీ బస్సులు శనివారం నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అంతేకాక విద్యుత్, టెలిఫోను, నెట్ సౌకర్యాలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. గ్రామాల్లోని ప్రజలు అంధకారంలోనే మగ్గుతూ మంచినీరు, కిరోసిన్, పాలపొడి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వరుసగా రెండుసార్లు గోదావరి వరద రావడంతో వేల హెక్టార్లలో పత్తి, పునాస, వరి పైర్లు వరద నీటిలో మునిగిపోయాయి. 45 పునరావాస కేంద్రాలలో సుమారు 10 వేల మంది ఉన్నారు. శుక్రవారం సాయంత్రం భద్రాచలంకు ఎగువన గల ఏటూరునాగారం వద్ద వరద పెరుగుతున్నట్లు సబ్ కలెక్టర్ గుప్తా తెలిపారు.
రాజమండ్రిలో గోదావరి ప్రవాహం