హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు జల కళతో కొత్తదనం సంతరించుకున్నాయి. చాలాకాలం తరువాత వర్షాకాలం ప్రారంభమైన తొలిదశలోనే అనేక రిజర్వాయర్లు నీటితో కళకళలాడిపోతున్నాయి. కృష్ణా నదిపై ప్రాజెక్టులే కాకుండా గోదావరి నదిపైనున్న ప్రాజెక్టులు కూడా జల కళ సంతరించుకున్నాయి. అయితే పెన్నా బేసిన్‌లోని ప్రాజెక్టులు మాత్రం కొంత వెనుకబడి కనిపిస్తున్నాయి. నిర్మాణం జరిగి నేటితో ఏభై ఏళ్లు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా దర్శనమిస్తోంది. ఈ ప్రాజెక్టులు వాస్తవ సామర్ధ్యం 90.31 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 86 టిఎంసిలకు నీటి నిల్వ చేరుకుంది. ఇంకా 1.30 లక్షల క్యూసెక్కుల నీరు తరలివస్తుండగా, 1.10 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఏభై ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో నీటిగలగలల అపూర్వ దృశ్యాన్ని తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు బారులు తీరుతున్నారు. కృష్ణా నదిపై ప్రధాన శ్రీశైలం ప్రాజెక్టులో గత ఏడాది కంటే ఈసారి భారీగా నీరు దర్శనమిస్తోంది. గత ఏడాది 26.52 టిఎంసిల నీరు మాత్రమే ఉండగా, ఇప్పుడు 80 టిఎంసిల వరకు నిల్వ చేరుకుంది. ఈ ప్రాజెక్టులోకి పైనుంచి వస్తున్న ఇన్‌ఫ్లో రోజురోజుకూ పెరుగుతుండడం విశేషం. గురువారం ఉదయానికి 1.76 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, శుక్రవారం ఇది 2.50 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. గోదావరిపైనున్న ప్రాజెక్టుకు సంబంధించి కడ్డెం, దిగువ మానేరు, నిజాం సాగర్, సింగూరు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోకి గత ఏడాది కంటే అధికంగా నీరు చేరుకుంది. కడ్డెం ప్రాజెక్టు దాదాపు నిండిపోగా, దిగువమానేరు సగం నిండి కనిపిస్తోంది. నిజాం సాగర్‌లో గత ఏడాది కేవలం 2 టిఎంసిల నీరు ఉండగా ఇప్పుడు ఎనిమిది టిఎంసిలతో కళకళలాడుతోంది. ఇక శ్రీరాంసాగర్‌లో గత ఏడాది ఇదే రోజుకు కేవలం తొమ్మిది టిఎంసిలు మాత్రమే దర్శనమివ్వగా, ఇప్పుడు ఏకంగా 85 టిఎంసిల నీటినిల్వ కనిపించడం విశేషం. గోదావరి నదిలోకి తరలివస్తున్న వరద నీరు కారణంగా ఏకంగా 1764 టిఎంసిల నీటిని సముద్రంలోకి వృధాగా విడిచిపెట్టాల్సి వచ్చింది. తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మూడు రోజుల నుంచి డ్యాం 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు డ్యాంలోకి వస్తోంది.
శుక్రవారం జలాశయం నీటిమట్టం 1,631.87 అడుగులకు చేరింది.
వైకాపా ద్వంద్వ వైఖరి
మల్లు రవి విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: రాష్ట్ర విభజన విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి మల్లు రవి విమర్శించారు. రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ఆ పార్టీ స్పష్టంగా చెప్పిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనివార్యమైతే తాము పరిస్థితుల దృష్ట్యా తెలంగాణతోనే కొనసాగడానికి ఇష్టపడతామని అన్నారు. అయితే తాను సమైక్యవాదినని, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పారు.
విభజనకు అవకాశాలు కనిపించడం లేదని ఆయన తెలిపారు.