హైదరాబాద్, జూలై 26: తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం వెనక్కి తగ్గితే గంటలో సమ్మెకు దిగుతామని తెలంగాణ నాన్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం సంయుక్తంగా హెచ్చరించాయి. టిఎన్‌జివో భవన్‌లో శుక్రవారం టిఎన్‌జివో అధ్యక్షుడు దేవిప్రసాద్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్, రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఎపి ఎన్జీవోల సంఘం సమైక్య సభ నిర్వహిస్తే, అదే రోజు చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈసారి నిర్వహించే సకల జన సమ్మెలో అత్యవసర వైద్యసేవలు మినహా అన్ని విభాగాలు సమ్మెకు దిగుతాయని పేర్కొన్నారు. విభజనకు ఎపిఎన్జీవోల సంఘం సహకరించాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల ఇక్కడ స్థిరపడిన ప్రజలకు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు స్పష్టం చేసారు. సీమాంధ్ర ఉద్యోగులకు మనోధైర్యం కల్పించేందుకు జూలై 29 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు సద్భావన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు టిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగులకు వ్యక్తిగతంగా కలిసి, రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరుతామని ఆయన తెలిపారు.
టిఎన్‌జివో భవన్‌లో శుక్రవారం సమావేశమైన అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న నేతలు
ముఖ్యమంత్రి రాజకీయ
కార్యదర్శితో డిజిపి భేటీ
రాష్ట్ర పరిస్థితులపై చర్చలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయ కార్యదర్శి శంకర్‌తో డిజిపి దినేష్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులపైనా, అలాగే రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ అధికారులతో రాష్ట్ర పరిస్థితులపై చర్చించిన దినేష్‌రెడ్డి.. శుక్రవారం హైదరాబాద్ చేరుకోగానే నేరుగా సచివాలయం వెళ్లి శంకర్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర విభజనపై వస్తున్న అంశాల గురించి చర్చించి ఉంటారని సమాచారం. అయితే రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో శాంతి భద్రతలపైనా చర్చలు జరిగాయని అధికారులు వెల్లడించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో చెదురుమదురుగా జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని రెండవ విడత ఎన్నికలకు బలగాలను సమాయత్తం చేస్తున్నారు. మావోల ప్రాబల్యం ఉన్న విశాఖ, అనంతపురంలోని గిరిజన ఏజెన్సీల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన బలగాలను పంపుతున్నారు. జంట నగరాల్లో బోనాలు, రంజాన్ పండుగల నేపథ్యంలో ప్రత్యేకంగా పోలీసు బలగాలను రంగంలోకి దింపుతున్నారు. అదీగాక రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడులు జరగవచ్చునని కేంద్ర ఇంటెలిజన్స్ బ్యూరో హెచ్చరించడంతో జంట నగరాల్లోని ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాలను వేగవంతంగా ఏర్పాటు చేస్తున్నారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఆక్టోపస్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
నాడు చంద్రబాబు, రోశయ్య.. నేడు కిరణ్, జగన్
ప్రత్యేక తెలంగాణను అడ్డుకుంటున్నారు
మండిపడ్డ టిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును నాడు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అడ్డుకుంటే, నేడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని టిఆర్‌ఎస్ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకుడు టి హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆంధ్రా పార్టీలైనా కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలు అడ్డుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. తమ పార్టీ ఎప్పటినుంచో ఈ మూడు పార్టీలు ఆంధ్రా పార్టీలనీ చెప్పిందని, మరోసారి అది రుజువైందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మళ్లీ రాజీనామాల డ్రామాలకు తెరతీశారన్నారు. తనకు ఏమి తెలియదన్నట్టుగా సచివాలయంలో ఒకవైపు అమ్మహస్తం పథకాన్ని సమీక్షిస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కమలాపూర్ ఎమ్మెల్యే వీరశివా రెడ్డితో, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలతో రాజీనామాలు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో సోనియాగాంధీకి లేఖ డ్రామాలను కిరణ్ ఆడించారని హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఈ ప్రాంతంలో ఆక్రమించుకున్న తన భూములు ఎక్కడ పోతాయోనన్న భయంతో ఆడాల ప్రభాకర్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తోన్నట్టు హడావుడి చేసారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆడాల ప్రభాకర్ రెడ్డిలాంటి నేతలు కబ్జా చేసిన తన భూములు పోతాయని భయపడుతున్నారు తప్పితే, సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయం లేదని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని, ఇందులో భాగంగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణపై వైఎస్‌ఆర్‌సిపి వైఖరి ఏమిటో విజయమ్మను ఆ పార్టీలోని ఈ ప్రాంత నేతలు నిలదీయాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలకుగానీ, ఆ ప్రాంతానికి చెందిన ఉద్యోగస్తులకుగానీ ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. తెలంగాణను వ్యతిరేకించే శక్తులు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతూ, వారిలో లేని భయాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నీటి జలాల పంపిణికి ట్రిబ్యునళ్లు ఉన్నాయని, ఇక్కడ స్థిరపడిన ప్రజలకుగానీ, ఉద్యోగస్తులకుగానీ రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులు ఉంటాయనీ, వీటికి ఎవరు భయపడనవసరం లేదని ఆయన స్పష్టం చేసారు. తెలంగాణపై నిర్ణయాన్ని వెల్లడించే సమయంలో రాజీనామాలు చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుంటే, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు నోరు మెదపడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు.