గద్వాల, జూలై 26: గత వారం రోజులుగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదనీటి ఉధృతి శుక్రవారం మరింత పెరిగింది. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి 2లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని విడుదల చేస్తుండడంతో జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. వరద నీటి చేరికతో జూరాల ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. శుక్రవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 317.70 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 2,21,680 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై దిగువ ప్రాంతానికి ప్రాజెక్టు 26 గేట్లను రెండు మీటర్ల ఎత్తుకు, నాలుగు గేట్లను ఒక మీటర్ ఎత్తుకు మొత్తం 30 గేట్లు తెరచి శ్రీశైలం జలాశయం వైపు 2,72,276 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ ఇన్‌చార్జి అధికారి కృష్ణయ్య తెలిపారు. అదే విధంగా ఆల్మట్టి జలాశయంలో 517.15 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంచుకొని, ఎగువ ప్రాంతం నుంచి 1,94,816 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 26 గేట్లను తెరచి దిగువకు 2,48,961 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలో 490.048 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 2,40,960 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 24 గేట్లను తెరచి దిగువకు 2,27,025 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని జూరాల జలవిద్యుత్ కేంద్రం ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. శుక్రవారం జూరాల ప్రాజెక్టు నుంచి 36వేల క్యూసెక్కుల వరద నీటిని వినియోగించుకొని ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరిపినట్లు అధికారులు తెలిపారు. సుమారు 185 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిపినట్లు వారు తెలిపారు.
.............
జూరాల 30 గేట్ల ద్వారా విడుదలవుతున్న వరద
30గేట్లు ఎత్తివేత * కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
english title:
j
Date:
Saturday, July 27, 2013