ఆదోని, జూలై 26: ప్రభుత్వం అనుమతి లేకుండా ఏకంగా కొండనే ఆక్రమించుకుని ఓ వర్గం వారు ప్రార్థనా మందిరం నిర్మించారు. అంతటితో ఊరుకోకుండా కొం డపై షెడ్లు వేసి దానికి కల్వరికొండగా నామకరణం చేసిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వివాదానికి కారణమవుతోంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆదోని శివారులో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోతిగట్టు కొండను ఆక్రమించుకుని ప్రార్థనామందిరం నిర్మించడంతో పాటు అక్కడక్కడ శిలువలు పాతడంపై హిందు ధర్మరక్షణ సమితి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోతిగట్టు కొండపై పురాతనమైన బుద్ద విగ్రహాలు, శిలాశాసనాలు, అతిపురాతనమైన ఆదిమానవుల గుహలు ఉన్నాయి. క్రైస్తవులు కల్వరికొండగా, మిగిలిన ప్రజలంతా కోతిగట్టుగా పిలుచుకునే ఈ కొండ అక్రమణ వ్యహారం 2011 నుంచి వివాదాస్పందగా మారింది. 2011లో కల్వరికొండపై క్రైస్తవులు ప్రార్థనల కోసం ఏర్పాటుచేసిన శిలువను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో కోతిగట్టు కొండ అక్రమణ వ్యహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు రంగంలో దిగారు. ఈ సంఘటన హిందు ధర్మరక్షణ సమితి సభ్యుల పనే అంటే కొంతమంది క్రైస్తవులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారం సద్దుమణిగింది. అయితే తాజాగా గురువారం భజరంగ్‌దళ్ కార్యకర్తలు విజయకృష్ణ, నాగరాజుగౌడ్, రామాంజి, రవి, సాయి, అరుణ్, అంజి, విజయకృష్ణ తదితరులు కొతిగట్టుపై ఉన్న బుద్ద విగ్రహానికి పూజలు చేయడానికి వెళ్లగా అక్కడే ఉన్న క్రైస్తవులు అడ్డుకున్నారు. దీంతో భజరంగ్‌దళ్ కార్యకర్తలు కొండ అక్రమణ వ్యవహారాన్ని స్థానిక అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. క్రైస్తవులు కొండను అక్రమించుకోవడమే గాకుండా అక్కడ ఉన్న బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, హిందూమతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని, హిందు దేవుళ్లను దూషిస్తున్నారని ఆరోపించారు. కొండను అక్రమించుకుని ప్రార్థనా మందిరం నిర్మించి అక్కడక్కడ శిలువలు ఏర్పాటుచేశారని ఫిర్యాదు చేశారు. స్థానికులు ఈ కొండను కోతిగట్టుగా చాలాకాలం నుంచి పిలుస్తున్నారు. అయితే 2011లో క్రైస్తవులు కొండపై ప్రార్థనా మందిరిం పేర రేకుల షెడ్డు నిర్మించారు. మతపరమైన అంశం కావడంతో అప్పట్లో రెవెన్యూ, పోలీసు అధికారులు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఈకొండకు కల్వరికొండ అన్న బోర్డు కూడా ఏర్పాటుచేశారు. స్తంభాలు ఏర్పాటుచేసి కొండపైకి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కొండ చుట్టూ శిలువ గుర్తులు ఏర్పాటుచేశారు. దీనిపై కల్వరికొండ చర్చి పాస్టర్ ఆనంద్‌రాజు మాట్లాడుతూ తాము చాలాకాలం నుంచి కొండపై ప్రార్థనలు చేస్తున్నామన్నారు. అయితే ఎవరి అనుమతి తీసుకోలేదన్నారు. ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశామన్నారు. అయితే అందుకు ఆయన నిరాకరించారన్నారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి స్థానిక అధికారులు సహకరించకపోవడంతో డిప్యూటీ సీఎం రాజనరసింహను కలిశామన్నారు. ఆయన సహకారంతో విద్యుత్ స్తంభాలు నాటించి కనెక్షన్ తీసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా క్రైస్తవులు కొండను ఆక్రమించుకోవడమే గాక కొండ కిందఉన్న తమను బెదిరించి పొలం అక్రమించుకోవాలని చూస్తున్నారని పొలం యజమాని శ్రీనివాసులు ఆరోపించారు. చర్చికి చెందిన కొందరు వ్యక్తులు తమను బెదిరిస్తున్నారని శ్రీనివాసులు పేర్కొన్నారు.
హిందూ ధర్మ రక్షణ సమితి ఉద్యమం
ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న కోతిగట్టును క్రైస్తవులు అనుమతి లేకుండా అక్రమించుకున్నారని, చర్చి నిర్మించి ప్రార్థనలు చేస్తున్నారని హిందు ధర్మరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు ఆరోపించారు. 150 ఎకరాల విస్తీర్ణంలోని కొండను అక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారన్నారు. అంతేగాక కొండచుట్టూ శిలువలు పాతారన్నారు. కోతిగట్టుపై పురాతన బుద్ద విగ్రహాలు నేటికీ ఉన్నాయన్నారు. కొండపై ఉన్న అక్రమణలను తొలగించి పురాతన చరిత్రను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2011లోనే అధికారుల దృష్ఠికి ఈ వివాదం వచ్చినా పరిష్కరించలేదన్నారు. అక్రమణలను తొలగించకపోతే భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామన్నారు.
క్రీస్తు కల్వరి కొండ పేర ఏర్పాటుచేసిన బోర్డు. కోతిగట్టు కొండపై ఉన్న బుద్ధుడి విగ్రహాలు