Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

$
0
0

కడప, మార్చి 1: జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభకానున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం 21,328 మంది, ద్వితీయ సంవత్సరంలో 24,738 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రథమ సంవత్సరంలో 1,949 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,542 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 84 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 15 రోజుల ముందే విద్యార్థులకు హాల్‌టిక్కెట్ల అందజేశారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధించేందుకు భారీగా సిట్టింగ్ స్క్వాడ్లు, ఫైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యంతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే తక్షణం డీబార్ చేయాలని ఇప్పటికే కలెక్టర్ ఇంటర్మీడియట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరీక్షల సమయంలో రెవెన్యూ అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించున్నారు. విద్యార్థులు పరీక్ష సమయానికి ఖచ్ఛితంగా పరీక్ష కేంద్రానికి హాజరు కావాల్సి ఉంది.

రోడ్డున పడ్డ రిమ్స్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల

కడప , మార్చి 1 : రిమ్స్‌లో పనిచేస్తున్న 37 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ఇందుకు నిరసనగా గురువారం డిడి కార్యాలయాన్ని బాధితులు ముట్టడించారు. వీరి ఆందోళనకు సిఐటియు మద్దతు పలికింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రామమోహన్ మాట్లాడుతూ ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ రిమ్స్ డైరెక్టర్ నోటీసులు జారీ చేశారన్నారు. వీరంతా రోస్టర్ పద్ధతికి విరుద్ధంగా నియామకం పొందారని, అందుకే తొలగిస్తున్నట్లు డైరెక్టర్ పేర్కొనడం బాధాకరమన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఉద్యోగులను ఉన్న ఫలంగా ఎలా తొలగిస్తారని రిమ్స్ అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు. ఉద్యోగిని తొలగించాలంటే నోటీసు ఇవ్వాలని, అతనికి ఆరు నెలల వరకు వేతనం అందించాలన్న విషయాన్ని విస్మరించడం రిమ్స్ అధికారుల అహంకారాన్ని తెలియజేస్తుందన్నారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్రంలోని మిగిలిన నాలుగు రిమ్స్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో కలసి ఆందోళనను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి శంకర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు సుబ్బయ్య, భాస్కర్, గంగాధర్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి చర్యలేవీ?
చాపాడు, మార్చి 1: ఫ్లోరైడ్ సమస్యను తీర్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. అధికారులు ప్రభుత్వానికి పంపుతున్న ప్రతిపాదనలు ప్రజలను ఊరించడం తప్ప ఫలితం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు దపాలుగా 30 కోట్ల రూపాయలతో చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలు అయ్యాయని స్థానికులు వాపోతున్నారు. పెన్నా -కుందూ నదుల నీటి సరఫరా వల్ల ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొని మంచి జీవితాన్ని గడుపుదామని ఆశించిన ప్రజానీకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ప్రతిపాదనలు చేయడం మినహా అధికారులు ఏమాత్రం స్పందించిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. చాపాడు గ్రామానికి చుట్టు పక్కల ఉన్న పల్లవోలు, ఖాదర్‌పల్లె, నాగులపల్లె, రాజువారిపేట, నక్కలదినె్న, అయ్యవారిపల్లె, అనంతపురం, తదితర గ్రామాల ప్రజలను ఎంతోకాలంగా ఫ్లోరైడ్ సమస్య పట్టిపీడిస్తోంది. ఇక్కడి మంచి నీటి పథకాలు అంతంతమాత్రంగా పనిచేయడమేకాకుండా వాటి నుంచి వెలువడే నీరు ఫ్లోరైడ్ కావడంతో వాటిని వినియోగిస్తే జబ్బులు వస్తున్నాయనే కారణంగా ప్రజలు మంచి నీటికోసం నానాయాతన పడుతున్నారు. ఈ గ్రామాలతోపాటు మండలంలోని మరిన్ని గ్రామాలలో ఫ్లోరైడ్ సమస్యను అధికమించేందుకు 2004-05 ఆర్థిక సంవత్సరంలో 14కోట్ల రూపాయలతో పెన్నానది నుంచి ప్రొద్దుటూరు, చాపాడు మండలాలకు తాగునీటి సరఫరా చేయాలని ప్రభుత్వం భావించి అందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. ఆ ప్రతిపాదనలు వెళ్ళిన తరువాత పెన్నానదిలో నీటి కొరత ఏర్పడిందని ఆ ప్రతిపాదనలు అంతటితో ఆగి పోయాయి. తరువాత 2008-09 ఆర్థిక సంవత్సరంలో సాధారణ ఎన్నికలకు ముందు మరోమారు 16 కోట్ల రూపాయలతో కుందూనది నీటిని చాపాడు- ప్రొద్దుటూరు మండలాలకు మళ్ళించాలనే ఉద్ధేశ్యంతో ప్రతిపాదనలు తయారయ్యాయి. ఆ ప్రతిపాదనలు వెళ్లి నాలుగేళ్లు కావస్తున్న ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. కుందూనదికి పడమర భాగాన ఉన్న మడూరు, నాగులపల్లె, ఖాదర్‌పల్లె, పల్లవోలు, చాపాడు, రాజువారిపేట, సీతారామపురం, అయ్యవారిపల్లె, ఎన్ ఓబాయపల్లె, కుచ్చుపాప, వెదురూరు, గ్రామ పంచాయతీలకు తాగునీటి సమస్యను తీర్చేందుకు ప్రణాళికలు సిద్దం అయ్యాయి. అదేవిధంగా కుందూ నదికి తూర్పు భాగాన గల అన్నవరం, టి ఓపల్లె, పెద్దచీయ్యపాడు, భధ్రిపల్లె, సోమాపురం, సిద్దారెడ్డిపల్లె, విశ్వనాధపురం, లక్ష్మిపేట, అల్లాడుపల్లె, పెద్ద గులువలూరు, చిన్న గులువలూరు పంచాయితీలకు తాగునీటి సరఫరా కోసం మరొ సారి ప్రణాళికలు సిద్ధంచేసి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. మండలంలోని 38 మంచి నీటి పథకాలకు ఈనదుల ద్వారా నీటి సరఫరాను చేపట్టాలని అధికారులు భావించి అందుకు అనుగుణంగా సర్వేలు చేసి ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో 16 గ్రామాలలో ఓవర్‌హెడ్ ట్యాంకులు లేని కారణంగా అక్కడ ట్యాంకులు నిర్మించి వాటికి కూడా కుందూనది నీటిని అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలు ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. చాపాడు చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంది. రాజువారిపేట, పల్లవోలు, ఖాదర్‌పల్లె, తదితర గ్రామాల్లో చౌడు భూముల్లో పంటలకు కూడా ఇక్కడి నీరు ఉపయోగపడకపోవడంతో సమస్య అధికంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగడానికి కూడా నీరు లేకపోవడంతో పంటలు, తాగునీరు కొరత ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. నక్కలదినె్న గ్రామంలో చేపట్టిన రక్షిత మంచి నీటి పథకం అంతంతమాత్రంగా పనిచేస్తోంది. పెన్నా నది నుంచి నీటిని సరఫరా చేయాలని దశాబ్ద కాలం కిందట 26లక్షల రూపాయలతో పనులు చేపట్టినా ఇప్పటికి అరకొరగానే తాగునీటి సరఫరా అవుతోంది. కుందూ నది నుంచి ఖాదర్‌పల్లె మీదుగా పల్లవోలు గ్రామానికి ఏర్పాటు చేసిన మంచి నీటి సరఫరా పథకం కూడా అటకెక్కింది. ఇక్కడ కూడా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేకపోతొంది. ఇలాంటి సమస్యలు ప్రతి గ్రామంలో చోటుచేసుకుని ఉన్నాయి. ఫ్లోరైడ్ సమస్యను అధికమించేందుకు ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.

వాతావరణ మార్పుల అధ్యయనమే వైవియూ ధ్యేయం
కడప , మార్చి 1 : వాతావరణ మార్పులు పరిశోధన అధ్యయనంపై యోగివేమన విశ్వవిద్యాలయం ప్రత్యేక దృష్టి, శ్రద్ధ సంకల్పించినట్లు ఉపకులపతి అర్జుల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం వైవియూలో ఏర్పాటు చేసిన వాతావరణ మార్పులు, భౌతిక శాస్త్రం, సాంకేతిక అధ్యయన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పరిశోధనకు విశ్వవిద్యాలయాలు పట్టుకొమ్మలన్నారు. వాతావరణంలో మార్పులు సంభవిస్తే సమాజంపై ప్రభావం చూపుతుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా ల్లో వాతావరణంపై అవగాహన లేని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నా రు. వాతావరణంలో సమతుల్యం లేక, సకాలంలో వర్షాలు పడక పంటలు పండడం లేదన్నారు. ఇలాంటి సదస్సులతో రైతులకు, సమాజానికి అవగాహన కల్పించే దిశలో యువ శాస్తవ్రేత్తలు అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సదస్సులు నేటి నుంచి శనివారం వరకు జరగనున్నాయన్నారు. వాతావరణ అధ్యయన సదస్సుల కాన్ఫ్‌రెన్స్ చైర్మన్ డాక్టర్ కె. కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత నాలుగేళ్లతో పోల్చుకుంటే వైవియూ భౌతిక శాస్త్ర పరంగా వాతావరణ పరిశోధనలో ముందంజలో ఉందన్నారు. మరో రెండు సంవత్సరాల్లో పరిశోధనల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆ దిశలోనే భౌతిక శాస్త్ర విభాగం మార్గదర్శకంగా యువశాస్త్ర వేత్తలను తీర్చిదిద్దుతోందన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన నేషనల్ సెంట్రల్ యూనివర్శిటీ తైవాన్ ప్రొఫెసర్ సిజె. పాన్ మాట్లాడుతూ భారతదేశంలో ఇతర విశ్వవిద్యాలయాల్లో లేని వాతావరణ పరిశోధనలు, అధ్యయనం యోగివేమన యూనివర్శిటీలో ఉండడం అభినందనీయమన్నారు. విదేశీ విశ్వవిద్యాలయ, వైవీయూ సమన్వయంతో వాతావరణ పరిశోధన కార్యక్రమం ఏర్పాటు చేయడమైందన్నారు. ఈ సందర్భంగా వాతావరణ పరిశోధనకు సంబంధించి 100 పరికరాలను యోగివేమనకు ఇచ్చామన్నారు. వీటిని విద్యార్థులు, యువ శాస్తవ్రేత్తలు ప్రత్యేక శ్రద్ధతో ఉపయోగించుకోవాలన్నారు. మహాత్మా గాంధీ యూనివర్శిటీ, నల్గొండ ఉపకులపతి ప్రొఫెసర్ కట్టా నరసింహులు మాట్లాడుతూ విద్యార్థులు ప్రాథమిక విజ్ఞాన శాస్త్రంపై అవగాహన పెంచుకుని గొప్ప శాస్తవ్రేత్తలుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలమూరు యూనివర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ వి. గోపాల్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఐఎండి. చెన్నై ప్రొఫెసర్ ఎస్. రాఘవన్, ఎడిసిఓఎస్, ఎన్‌ఆర్‌ఎస్‌ఎ హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ పిబి. రావు, ఎస్‌పిఎల్ విఎస్‌ఎస్ సి తివేండ్రమ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణమూర్తి, పాలమూరు యూనివర్శిటీ కుల సచీవులు డాక్టర్ కె. వెంకటాచలం, వైవీయూ కుల సచీవులు ఆచార్య వలిబాషా, వైవీయూ ప్రిన్సిపల్ ఆచార్య టి. వాసంతి, ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ డాక్టర్ వై. నజీర్ అహ్మద్, పిఆర్‌ఓ డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

సీమ జిల్లాల రైతులకు ఉచితంగా టేకు మొక్కల సరఫరా
రాజంపేట, మార్చి 1: రాయలసీమ జిల్లాలోని రైతులకు 1.60 లక్షల టేకు మొక్కలను సరఫరా చేయుచున్నామని గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ కమిషనర్ (హైద్రాబాద్) కె.విద్యాసాగర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని పోలి పంచాయతీ చిన్నిల్లుగారిపల్లెకు చెందిన రమణారెడ్డి అనే రైతు నిర్వహిస్తున్న నర్సరీని, మంటపంపల్లెలో అటవీ సంరక్షణ నర్సరీని ఆయన పరిశీలించారు. అనంతరం క్లస్టర్ స్థాయి జీవనోపాధుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి రాయలసీమ జిల్లాలకు 1.60 లక్షల టేకు మొక్కలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. కడప, కర్నూలు జిల్లాలకు 50 లక్షలు చొప్పున, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు 30 లక్షల వంతున అందిస్తామన్నారు. ఈ టేకు మొక్కలను రైతులు పొలాల గట్లపై, సరిహద్దుల వెంబడి నాటుకుని అభివృద్ది చెందాలన్నారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరులో ఈ మొక్కలు కొనుగోలుచేసి నర్సరీ కేంద్రాలలో పెంచి రైతులకు ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సూచనలు చేశారు. డ్వామా ఆధ్వర్యంలో విస్తృతంగా రైతులకు సేవలు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. వేసవికాలంలో కూడా ఈ టేకు మొక్కలు వాతావరణాన్ని తట్టుకుని మొలకెత్తుయన్నారు. మూడేండ్ల వరకు ప్రభుత్వం టేకు మొక్కల సంరక్షణకు మొదట రూ. 56, రెండో సంవత్సరం రూ. 36, మూడో సంవత్సరం రూ. 24లు కొంత నగదును రైతులకు చెల్లిస్తుందన్నారు. ఈ ఏడాది స్వచ్ఛంధంగా రైతులు టేకు మొక్కలు పెంచడానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. ఎకరానికి 160 టేకు మొక్కలు పెంచవచ్చునన్నారు. గతంలో అటవీ, ప్రభుత్వ సంరక్షణలో ఈ మొక్కల ఉత్తత్పి జరిగేదని, ఈ ఏడాది నుండే రైతులకే నేరుగా మొక్కలు అందజేస్తామన్నారు. ఇందిరప్రభ ద్వారా లబ్ది పొందిన నిరుపేదలకు మొక్కల పెంపకంకై ఆర్ధికసాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్‌ఓ శ్రీనివాసులరెడ్డి, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, వన అధికారి సుధాకర్‌రెడ్డి, అడిషనల్ పీడీ మనోహర్, ఎపిపి శ్రీనివాసులు, పీడీ శ్రీనివాసులురెడ్డి, డిఎఫ్‌ఆర్‌ఓ రెడ్డెయ్య, ఎంపిడిఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మండుతున్న ఎండలు.. రజకులకు ఇక్కట్లు

రాజంపేట, మార్చి 1: ఎండలు మొదలవ్వడంతో రజకుల కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది వర్షాభావంతో ఇక్కడి ఏ చెరువు, వంక, మడుగులో చుక్కనీరు లేదు. ఉన్న కాస్తానీరు ఎండలతో మాయమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎక్కడా కనిపించని చుక్కనీటితో రానున్న రోజుల్లో పొట్టగడవడమెలా అన్న ఆందోళన రజక కుటుంబాలను పీడిస్తున్నది. దశాబ్దాలుగా ప్రభుత్వానికి రజకులు తమకష్టాలు పరిష్కరించమని చేస్తున్న విజ్ఞప్తులు చెవిటివాని ముందు శంఖం ఊదిన చందంగా మారుతున్నాయి. తప్పితే రజకుల కష్టాల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమీలేవు. రజకుల పొట్టగడవడం మాట అటుంచితే అన్నివర్గాల ప్రజలు తమ బట్టలు ఉతికే నాథుడు కరవై పడుతున్న కష్టాలు చెప్పనలవి కాదు. బట్టలు ఉతికేందుకు చుక్కనీరు లేకపోవడంతో రజకులు ఎవరూ బట్టలు ఉతకడం మానేస్తుండడంతో వాషింగ్ మెషిన్స్ కొనుగోళ్లు అధికమయ్యాయి. ఈ కష్టాల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం రాజంపేట డివిజన్‌లోని ప్రతి మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీలన్నింటిలో దోబీఘాట్లు ఏర్పాటు చేయాలని రజకుల నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి వినిపిస్తుంది. దోబీఘాట్లు నిర్మాణం చేయకుంటే రానున్న రోజుల్లో రజకుల కుటుంబాలు వీధులపాలయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ తరచూ వర్షాభావంతో కుంటల్లో, వాగుల్లో, మడుగుల్లో, చెరువుల్లో నీరు లేక తాము పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉంటున్నట్టు రజక కుటుంబాలు వాపోతున్నాయి. దీంతో తమ వాడుకలను చాలావరకు వదులుకోవాల్సి వచ్చిందని, దీంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు.
విధిలేక రజకవృత్తిని కొనసాగించాల్సి వస్తుందన్నారు. దోబీఘాట్లు ఏర్పాటుచేస్తే వర్షాలతో పనిలేకుండా తమ వృత్తికి సంబంధించి సమస్యలు లేకుండా బతుకుతామన్నది వీరి వాదన. వేసవి నెలల్లో బట్టలు ఉతుక్కునేందుకు రజకులు పడుతున్న బాధలు చెప్పనలవి కావడం లేదు. దీంతో తాము కూడా గుడ్డలు ఉతుక్కుని తీసుకెళ్ళేందుకు ఆలస్యమవుతుండడంతో వినియోగదార్లకు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్నారు. వర్షాకాలమైతే ఆయా గ్రామ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, వాగులు, వంకలు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉంటాయని దీంతో తమకెలాంటి సమస్యలు ఏర్పడవని, వర్షాభావం సమయంలోనే తాము తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్టు వివరించారు. తమకెలాంటి ఇబ్బందులు లేకండా దుస్తులు ఉతుక్కునేందుకు అవసరమైన వసతిని కల్పించాలన్నారు. ఇక్కడ వర్షాలు లేని సంవత్సరాలే ఎక్కువగా ఉంటున్నాయని దీంతో చెరువులకుగాని, కుంటలు, వాగుల్లో ఎక్కడా నీరు చేరకపోవడంతో రజకులు బట్టలు ఉతికేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. పొలాల్లో ఉన్న బోరుబావుల దగ్గరకు బట్టలు ఉతికేందుకు వెళితే రైతులు మురికి గుడ్డలను బోరుబావుల దగ్గర ఉతికితే మురికి నీరంతా పొలాల్లోకి వెళ్లి పంటలు దెబ్బతింటాయని రైతులు బోరుబావుల దగ్గర గుడ్డలు ఉతికేందుకు ఒప్పుకోవడం లేదని రజకులు వాపోతున్నారు. నీరున్న చోటకు వెళ్ళాలంటే కొన్ని గ్రామాల్లో సుదూరం ఉండడంతో రజకులు పడుతున్న బాధలు వర్ణణాతీతంగా ఉందన్నారు. కొన్ని గ్రామాల్లో సుదూరంలో నీరున్న చోటకు పెద్దస్థాయిలో గుడ్డలు తీసుకెళ్ళి ఉత్తుకొని తీసుకుని వస్తున్నామని వారు అంటున్నారు. చాలా చెరువుల్లో రజకులే సొంతంగా గుంతలు తీసుకుని, ఆ గుంతల్లో ఉండే నీటితో బట్టలు ఉతకాల్సి వస్తుందని వారు అంటున్నారు. అలా ఒకేచోట గుడ్డలు ఉతకడం వలన ఆ గుంతలోని నీరు ఎటు ప్రవహించకుండా ఒకే చోట ఉన్నందున నీరు కూడా కలుషితమవుతుందన్నారు. ప్రభుత్వం, ఇక్కడి ప్రజాప్రతినిధులు రజకులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా అవసరమైన శాశ్వత చర్యలు గైకొనాల్సి ఉంది. వీలైతే ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో దోబీఘాట్లు ఏర్పాటుకు చర్యలు గైకొనాల్సి ఉంది.

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఇంటి పన్నుల దోపిడీ
ప్రొద్దుటూరు, మార్చి 1: వాణిజ్య ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రొద్దుటూరులో మున్సిపాలిటీ అధికారుల అశాస్ర్తియ పనుల విధానం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉంది. అమాంతంగా పెరిగిన ఇంటి పన్నుల కారణంగా ప్రజలపై మోయలేని భారం పడి సామాన్యుని బతుకు భారంగా మారింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ పేరుతో అమలు అవుతున్న పన్నుల విధానం ఆందోళన కల్గిస్తూ ఉంది. 1990 నుండి ఇక్కడ ఇష్టానుసారంగా పన్నులు విధిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుండి వ్యక్తమవుతూ ఉంది. నియమనిబంధనలు గాలికి వదిలేసి ఆదాయం పెంచుకోవడమే ఉద్ధేశ్యంగా అధికారులు భారాన్ని ప్రజలపై మోపారు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా విధించనంత పన్నులు ఇక్కడ అమలవుతున్నాయంటే ఈ మున్సిపాలిటీకి ప్రజల సంక్షేమం ఏమాత్రం పట్టడం లేదని అర్థం అవుతూ ఉంది. స్థానిక సంస్థలు మనగలగాలంటే పన్నులే ప్రధాన ఆదాయం. అయితే ఇబ్బడి ముబ్బడిగా పన్నులు పెంచితే చెల్లించే స్తోమత ప్రజలకు ఉందో లేదో గమనించాల్సిన భాద్యత పాలకులకు ఉండాలి. ప్రభుత్వం పన్నుల వసూళ్లకు అనుసరించాల్సిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా వసూళ్ళు చేయాల్సిన మున్సిపాలిటీలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో కూడా స్పెషల్ గ్రేడ్ పేరుతో పన్నులు వసూలుచేస్తూ చరిత్ర సృష్టించిన ప్రొద్దుటూరు మున్సిపాలిటి ప్రస్తుతం మరింత ఆదాయం కోసం గత దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న పన్నులను కూడా కలిపి విధించడం భాదాకరం. అసలు పన్నులు పెరిగేందుకు, పెంచేందుకు అటు కౌన్సిలర్లు, ఇటు అధికారులు కూడా కారణమని ప్రజలు భావిస్తున్నారు. పన్నులు పెంపునకు సంబంధించిన అంశాన్ని అజెండాలో పొందుపరిచి కౌన్సిల్ ఆమోద ముద్ర వేసుకున్నఅధికారులు పట్టణంలో ఏ తరహా పన్నులను అమలు చేయవచ్చు ఇందుకు మార్గదర్శకాలు ఏమిటి మిగతా మున్సిపాలిటీల్లో ఏ తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంది. అయితే గతంలో ఉన్న పాలకమండలి గానీ, ప్రతిపక్ష సభ్యులుగానీ ఈవిషయంపై ఏనాడు చర్చించిన పాపానపోలేదు. కౌన్సిల్ సభ్యుల ఇళ్లకు, మాజీ కౌన్సిల్ సభ్యుల ఇళ్లకు ఆయా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు విధించిన పన్నులను పరిశీలిస్తే వారికి తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీఎత్తున పన్నులు పెరగడానికి కారణమైన ప్రజాప్రతినిధులకు పెరిగిన పన్నుల భారం తెలియడం లేదు. విధించిన పన్నుల విధానంలో అనుసరించిన పద్దతులపై ఇప్పటి వరకు అటు అధికారులుగానీ, ఇటు కౌన్సిల్ కానీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేదు. మున్సిపల్ చట్టం స్పష్టంగా చెప్పిన పద్దతులను కూడా అధికారులు అనుసరించకపోవడంకారణంగా భారీ పన్నుల భారాన్ని ప్రజలు మోయాల్సి వస్తోంది.
ఒకసారి జరిగిన తప్పును సరిదిద్దుకోవచ్చు గానీ, తిరిగి అవే తప్పులు ఇక్కడ కొనసాగుతున్న కారణంగా ప్రజలకు శాపంగా పరిణమించింది. జోన్ 3 పరిధికి వచ్చే ముఖ్యమైన కూడళ్ళు, వ్యాపార ప్రాంతాల్లో పన్నుల విధానం ఎంత అశాస్ర్తియంగా జరిగిందో పొరుగున ఉన్న మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న పన్నుల విధానాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, కార్పొరేషన్ స్థాయిలో వసూళ్ళు చేస్తున్న పన్నులకు మించి ప్రొద్దుటూరులో వసూళ్లు చేయడం భాదాకరమని ప్రజలు గగ్గొలు పెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టణంలోని కొన్ని ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించి పన్నుల భారాన్ని మరింతగా పెంచడంతో బాడుగ ఇళ్ల యజమానులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఒకప్పుడు వెయ్యి రూపాయలు, 1500 రూపాయలు బాడుగ ఉండే ఇళ్లు కూడా ప్రస్తుతం 3, 4 వేలు ఉందంటే సామాన్యుడు బాడుగ ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి దాపరించింది. పెరుగుతున్న పన్నుల భారం కారణంగా ఇంటి యజమానులు కూడా ఇష్టానుసారం బాడుగలు పెంచుతున్నారు. దీంతో చిరు వ్యాపారుల మనుగడ మరింత కష్టంగా మారింది. ఇప్పటికైనా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు సామాన్యుడు జీవించేలా పన్నులను సరిదిద్దాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈవిషయంపై ప్రజాప్రతినిధులు పెదవిప్పకపోవడం వెనుక వాస్తవం ఏమిటో వారికే తెలియాల్సి ఉంది.

మండుతున్న ఎండలు
రాయచోటి, మార్చి 1: ప్రతి ఏటా మార్చి అనంతరం మండే ఎండలు ఈ ఏడాది మార్చి ప్రారంభంలోనే మండుతున్నాయి. ఉదయం చలి పెడుతున్నప్పటికీ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో ప్రయాణికులు, ప్రజలు శీతల పానియాల వైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా వేసవి కాలం ప్రారంభంలో పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఉదయం ఈశాన్యం నుంచి గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత కొంత ఉండడం, పగటి వేళ పడమటివైపు నుంచి గాలి వీస్తుండడంతో ఎండలు మండుతున్నాయని వాతావరణ శాఖాధికారులు చెప్పిన విషయం విధితమే. ఈ ఏడాది తీవ్ర వర్షాబావం వల్ల చెరువులు, కుంటలు ఎడారుల్లా తలపిస్తుండడం, మార్చి మాసంలోనే భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగు నీటికి సైతం గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎంత తీవ్ర ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేకపోవడంతో రైతులంతా కూలీలుగా మారి ఉపాధి పనులకు వెళ్తున్నారు. మండుతున్న ఎండల్లో పనులు చేయడానికి తీవ్ర ఇబ్బందిగా ఉందని కూలీలు వాపోతున్నారు. ప్రభుత్వం ఉపాధి పనులు చేసే చోట కూలీలు ఎండ నుంచి ఉపశమనం పొందడానికి షామియానా, తాగు నీరు, ప్రథమ చికిత్సకు కావాల్సిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం మండుతున్న ఎండలకు వడదెబ్బకు చనిపోతున్నారని పలువురు అంటున్నారు. వేసవి రావడంతో మొన్నటి వరకు సప్పగా సాగిన శీతల పానియాలకు మంచి గిరాకీ ఏర్పడింది. మధ్యాహ్నం వేళల్లో ఏ షాపు వద్ద చూసినా దాహం తీర్చుకోవడానికి ప్రజలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా పట్టణంలో షరబత్తు బండ్లు ఎక్కడ పడితే అక్కడ వెలసడం, రంగు నీళ్లును విక్రయించడం, కుండలో మజ్జిగ వంటి వ్యాపారాలపై ఆదారపడి జీవిస్తున్నారు.

ఏడు ఇసుక ట్రాక్టర్లు సీజ్
రైల్వేకోడూరు, మార్చి 1: పట్టణంలో గురువారం ఏడు ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సిఐ ఆనందరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ హజీవలీ సిబ్బందితో ట్రాక్టర్లను సీజ్ చేసి, రూ. 10 వేలు అపరాధరుసుం విధించారు.
విద్యుత్ షార్ట్ సర్క్వూట్‌తో కొట్టం దగ్ధం
చక్రాయపేట, మార్చి 1: మండలంలోని కుప్పం పంచాయతీ బురుజుపల్లె గ్రామానికి చెందిన పి.గంగయ్య బోదకొట్టం విద్యుత్ షార్ట్ సర్క్వూట్‌తో గురువారం కాలిపోయినట్లు బాధితులు వాపోయాడు. ఈ ఘటనలో రూ. 50వేల మేరకు ఆస్తినష్టం వాటిళ్లిందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సాహాయం అందజేయాలని గ్రామస్థులు కోరారు.
హోంగార్డుపై దాడి
రామాపురం, మార్చి 1: విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై చంద్రశేఖర్ అనే వ్యక్తి దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్లితే ఎస్‌ఐ వరప్రసాద్ ఆదేశాల మేరకు గురువారం వాహనాలను తనిఖీ చేస్తుండగా రాయచోటికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి వాహనంలో తప్పతాగి వస్తుండగా అతని వాహనాన్ని ఆపి విచారించగా, ఆగ్రహానికి లోనైన చంద్రశేఖర్ విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై దాడికి దిగాడు. పోలీసు స్టేషన్ ఎదురుగానే ఈ సంఘటన జరగడంతో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ తెలిపారు.
200 మామిడి చెట్లు అగ్నికి ఆహుతి
సుండుపల్లె, మార్చి 1: మండలంలోని పొలిమేరపల్లె గ్రామంలో సానిపాయి రహదారికి ఆనుకుని ఉన్న రాజన్న తదితరులకు చెందిన 200 మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే మధ్యాహ్నం 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలోని ఎండుగడ్డికి నిప్పు పెట్టడంతో మంటలు మామిడి తోటలోకి వ్యాపించాయని, 200 మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల మామిడి చెట్లు కాలిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
24 సిలిండర్లు పట్టివేత
బద్వేల్, మార్చి 1: పట్టణంలోని హోటళ్లపై గురువారం దాడులు నిర్వహించి 24 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్‌సప్లై అధికారి ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని హోటళ్లు, చిరుబండ్ల వ్యాపారులపై దాడులు నిర్వహించామన్నారు. ఇళ్లకు మంజూరు చేసిన సిలిండర్‌ను వ్యాపారులు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకారెండు రోజుల పాటు దాడులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ఎఎస్‌ఓ శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, ఇఇడిటి బ్రహ్మయ్య, సుబ్బరామరాజు, విఆర్‌ఓలు పాల్గొన్నారు.

ఆహారం విషతుల్యం - ఒకరి మృతి
మైదుకూరు, మార్చి 1: మైదుకూరులోని రాఘవేంద్ర హోటల్‌లో ఆహారం విషతుల్యం కావడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. బుధవారం ఉదయం మైదుకూరులోని రాఘవేంద్ర హోటల్‌లో ఇడ్లి సాంబారు తినడంవల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన దండు చిన్నవీరయ్య ప్రొద్దుటూరులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. హోటల్ యజమాని రఘురామయ్య, ఆయన కోడలు కేతరి అస్వస్థతకు గురయ్యారు. తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. స్థానిక జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న ఖాజీపేట మండలం తవ్వారిపల్లెకు చెందిన విద్యార్థి నాగసుధాకర్‌రెడ్డి పరిస్థితి విషమించడంతో వెంటనే కర్నూలు తరలించారు. శాంతినగర్‌కు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి పరిస్థితి విషమించడంతో 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మైదుకూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆహారం విషతుల్యం కావడం వల్లే ఇలా జరిగిందనా లేదా మరే కారణాలు ఉన్నాయా అనే విషయాలపై లోతుగా ఆరా తీయాల్సి ఉంది. సీఐ రామచంద్ర ద్వారా డీఎస్పీ చల్లా ప్రవీణ్‌కుమార్ ఆరా తీశారు

జిల్లాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభకానున్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు
english title: 
exams from today

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>