తంబళ్ళపల్లె, మార్చి 1: మూడువేల ఎకరాల పచ్చని అడవితల్లికి దుండగులు నిప్పు పెట్టారు. రెండురోజుల క్రితం మండల కేంద్రానికి సమీపంలోని సాధుకొండ అడవికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. మంటలు ఎగిసిపడి సాధుకొండ మొత్తం కాలిపోయింది. బోడ్రెడ్డివారికోట గ్రామస్థులు మంటలు ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొండ రెండురోజులుగా మండుతూనే ఉంది. ఈ దహనంతో కొండశివార్లలోని 30కు పైగా గ్రామాల్లోని సుమారు 20వేల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారు. లక్షలాది జీవరాసులకు ఆశ్రయం లేనట్లే అయంది. సుమారు ఐదు కిలోమీటర్లు విస్తరించిన సాధుకొండలో విలువైన వనసంపద దొరుకుతుంది. ఈ అడవిలో టేకు, సండ్ర, పచ్చారి, కానుక, వేప, పగడ తంగేడు, ఇసుకరేణి చెట్లతో పాటు సీతాఫలం, ఉసిరి, బిక్కి, ఉపంజి, వెలగ, నేరేడు, బలస, ఈత లాంటి పండ్లచెట్లు విరివిగా వున్నాయి. ఇక వనమూలికలు కరక్కాయి, నేలవేము, తిప్పతీగ, చిత్రమూలం, సారపప్పు, నన్నారివేళ్ళు, మారేడుగడ్డలు, పాలగడ్డలు, బగ్గిడి, చల్లగింజలు, పడపత్రి, జాజిపత్రి, ఎల్లంబంక, పొలికిబంక, మంగకాయలు వంటి పలు రకాల మూలికలు లభిస్తాయి. ముఖ్యంగా నిరుపేదవర్గాల ఆశాదీపం బోధ, తేనె, తుమికాకు ఈ అడవులకు నిలయం. అడవికి నిప్పండించడంతో జంతువులు, పలు పక్షాదుల పరిస్థితి దయనీయం. ఈ అడవుల్లో జింకలు, అడవిపందులు, ఎలుగుబంట్లు, అడవిగొర్రె, హైనాలు, అడవికుక్కలు, కుందేళ్ళు విరివిగా ఉన్నాయి. వీటితో పాటు పాములు, కొండచిలువలు, తొండలు, ఉడుములు, బల్లులు, ముంగీసలు, ఊసరివెల్లిలు దర్శనమిస్తాయి. ఇక పక్షులు నెమళ్ళు, గోరింక, చిలకలు, కోకిల, గుడ్లగూబలు, పిచుకలు, కముజుపిట్టలు, బెల్లగువ్వలు, చమరకాకిలు వంటి లెక్కలేనన్ని ఉన్నాయి. కీటకాలు, సీతాకోకచిలుకలు, కందిరీగ, తూనీగ, తేనెటీగ, మిడతలు, చందమామ, అక్షింతపురుగులు, లక్షలసంఖ్యలో జీవిస్తాయి. అడవి బుగ్గిపాలు కావడంతో లక్షల సంఖ్యలో జీవరాసులు కొన్ని అగ్నికి ఆహుతికాగా మరికొన్ని ఇనుముకొండ, మల్లయ్యకొండలకు పారిపోయాయి. ఈ అడవిలోకి పశుగ్రాసాన్ని నమ్ముకుని సుమారు 20వేలకు పైగా పశువులు ఉండగా అడవి కాలిపోవడంతో జీవాలను అయినకాడికి కసాయివాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఆ రెండు కొండల వంతు
తంబళ్ళపల్లె సమీపంలోని మల్లయ్యకొండ, సాధు ఇనుముకొండలు పెట్టని కోటగా ఉన్నాయి. ఈ కొండలలో వేలాది కుటుంబాలు పోషణలతో పాటు లక్షలాది జంతుజాలానికి ఆశ్రయం లాంటి కొండల్లో రెండురోజులుగా సాధుకొండ కాలిపోతుండగా ఆ రెండు కొండలు మిగిలాయి. ఈ కొండలు కాలిపోతే మరికొన్ని వేల కుటుంబాలు బాధిత కుటుంబాల్లోకి చేరడం ఖాయం. కొండలను కాల్చే వారిపై కఠినంగా శిక్షలు లేకపోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
మదనపల్లె మున్సిపాలిటీలో ఎసిబి సోదాలు
*విలువైన రికార్డులు స్వాధీనం
* హడలెత్తిన అధికారులు
మదనపల్లె, మార్చి 1: అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వానికి, విజిలెన్స్ అధికారులకు, ఎసిబి అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్ళడంతో గురువారం సాయంత్రం ఆకస్మికంగా ఎసిబి అధికారులు మదనపల్లె మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలువైన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పురపాలక సంఘం కార్యాలయంలోని కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ శాఖల విభాగాల్లోని పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఎసిబి ఎస్‌ఐలు సూర్యనారాయణ, ప్రసాద్‌లు తెలిపారు. సాయంత్రం కార్యాలయానికి ఎసిబి అధికారులు వచ్చినట్లు తెలుసుకున్న ఆయా శాఖ అధికారులు హడలెత్తారు. అన్ని శాఖలపై మూకుమ్మడిగా సోదాలు నిర్వహించారు. అనంతరం అన్ని శాఖల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు హడలెత్తిపోయారు. ప్రధానంగా ఇంజనీరింగ్ విభాగంలో ఎక్కువగా అవినీతి అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదుచేయడం, వాటిపై మున్సిపల్ ఉన్నతాధికారులకు నోటీసులు జారీచేయడం, ఉన్నతాధికారులచే విచారణకు ఆదేశించినా ఏ అధికారి విచారణ జరిపిన దాఖలాలు లేవు. అయితే దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఎసిబికి అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో ఎసిబి అధికారులు గత 15రోజుల క్రితమే కార్యాలయంపై నిఘా వేసినట్లు సమాచారం. అంతేకాకుండా కార్యాలయంలో ఎవరెవరు ఏయే శాఖల్లో అవినీతికి పాల్పడుతున్నారో ఇదివరకే ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాలపై దృష్టి కేంద్రీకరిస్తూ తాజాగా జరిగిన సోదాల్లో ఆయా శాఖల పరిధిలో విలువైన రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
టెన్త్‌లో మంచి ఫలితాలు సాధించకపోతే
కఠిన చర్యలు
పుత్తూరు, మార్చి 1: త్వరలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించకపోతే ఆ హైస్కూల్ ప్రధానోపాధ్యాయలపై కఠన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక బాలికల హైస్కూల్‌లో జరిగిన పుత్తూరు డివిజన్ మండల విద్యాశాఖాధికారులు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా దేవానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సర్వశిక్ష అభయాన్ పథకం కింద లక్షల రూపాయలు విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పరుస్తున్నాయన్నారు. ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ హైస్కూల్‌లో పని చేస్తున్నప్పటికీ పరీక్ష ఫలితాలల్లో వెనకంజ ఎందుకు వేస్తున్నారని ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. గత ఏడాదిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో కనీసం 35శాతం ఫలితాలు రాని వారు ఈ ఏడాదిలో ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని కోరారు. అనంతరం పుత్తూరు డివిజన్ డిప్యూటీ విద్యాశాఖాధికారి డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ ఆయా సబ్జెక్టలకు సంబంధించి ఉపాధ్యాయలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ప్రతి హైస్కూల్‌లో ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నించాలని కోరారు. ఈసమావేశంలో పుత్తూరు డివిజన్ పరిధిలోని మండల విద్యాశాఖాధికారులు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయలు పాల్గొన్నారు.
తిరుపతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు
ప్రణాళికలకు కసరత్తు
తిరుపతి,మార్చి 1: తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెయ్యాలన్న లక్ష్యంతో రూపొందిస్తున్న ప్రణాళికలు మరో ఆరు నెలల్లో ఒక కొలిక్కి వస్తాయని తిరుపతి ఎంపి డాక్టర్ చింతామోహన్ అన్నారు. తిరుపతి అభివృద్ధికి సంబంధించి టిటిడి ఇఓ, జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్‌పి, నగర పాలక సంస్థ, తుడాతో పాటు పలు విభాగాధిపతులతో కూడుకున్న టాస్క్ఫోర్స్ కమిటీలో ఉన్న అధికారులతో తిరుపతి అభివృద్ధి కమిటీ సమావేశం పేరుతో ఎంపి డాక్టర్ చింతామోహన్ గురువారం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపి చింతా మాట్లాడుతూ తిరుపతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు అనుగుణంగా అధికారుల్లో చిత్తశుద్ధి కన్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు వైఫల్యాలు ఎలా ఉన్నా తిరుపతి అభివృద్ధికి అధికారులు ఎవ్వరికివారు తమ వంతు పాత్రను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆయన కోరారు. ప్రణాళికలను సిద్ధం చేయడంలో ఏవైనా అవాంతరాలు వస్తే వాటికి సంబంధించిన మెలుకువలను తెలుకోవడానికి నిపుణుల సహకారం తీసుకోవాలన్నారు. ఇక నిర్లక్ష్యం, అలసత్వాన్ని సహించబోమని హెచ్చరించారు. తక్షణం 3 కోట్ల రూపాయలతో తిరుపతి నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతికి చుట్టుపక్కల వున్న చెరువులు, కుంటలు కబ్జాకు గురి కావడంతో భూగర్భజలాలు తగ్గిపోయాయన్నారు. అయితే తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా ఉన్నారని, అవసరమైన నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా కలెక్టర్‌కు ఇందుకు సంబంధించి ఇప్పటికే తగు అదేశాలు ఇచ్చారన్నారు. అవసరమైతే కండలేరు నుండి నీటిని పంపింగ్ చేసుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రానున్న వేసవిలో నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అదికారులు చొరవ చూపాలని సిఎం కలెక్టర్‌ను ఆదేశించారన్నారు. నగరంలో ప్రధానంగా ఉన్న ట్రాపిక్ సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
ఐఐటి నిపుణులు అందించిన ప్రణాళికలు అమలుచేసి తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు నగరంలో మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. రాబోయే రెండేళ్లలో తిరుపతిని అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నామన్నారు.
ట్రాఫిక్ సమస్య
పరిష్కారానికి చర్యలు
తిరుపతి అభివృద్ధి కమిటీ సమావేశానికి విచ్చేసిన చెన్నైకి చెందిన ఐఐటి నిపుణుడు డాక్టర్ వి తామిజాహ్ అరసన్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పవర్‌ఫాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ అధికారులకు వివరించారు. తిరుపతి నగరంలో లక్ష ద్విచక్రవాహనాలు, 4వేల ఆటోలు, 2వేల బస్సులు, 3వేల కార్లు ఉన్నాయన్నారు. తిరుపతి నగరంలో ఉన్న రోడ్లపై ( ఈ వాహనాలన్నీ నగరంలో ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్య జఠిలం అవుతుందన్నారు. నగరంలో 4లక్షల మంది జనాభా ఉన్నారని, దీనికితోడు శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా రోజుకు 50 నుండి 70 వేల మంది ఉంటారన్నారు. ఈ నేపధ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలను తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు. శ్రీనివాసం నుండి అలిపిరి వరకూ ఫ్లై ఓవర్స్ వెయ్యాల్సి వస్తే ముందుగా నగరంలో వున్న ట్రాఫిక్ వ్యవస్ధను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్లై ఓవర్‌పై ఎక్కువ సంఖ్యలో వాహనాలు వెళ్లి అటు తరువాత మరో మార్గంలో దిగగానే ఇరుకు ప్రాంతం, ఇరుకు రోడ్లు ఉండరాదన్నారు. తిరుపతి నగరానికి ప్లై ఓవర్ల నిర్మాణ పరిస్థితి లేకుండానే నగర శివార్ల మీదుగా బైపాస్ నిర్మాణం జరిగితే నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందన్నారు. భక్తులు సంచరించే ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు.
భీమునిచెరువులో విద్యార్థుల శ్రమదానం
పుత్తూరు, మార్చి 1: నారాయణవనం మండలంలోని భీమునిచెరువు గ్రామంలో సిద్దార్ధ ఇంజనీరింగ్ విద్యార్థులు శ్రమదానంతో పలు పనులు చేపట్టారు. ఈ గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా ఈశ్వరన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నంతలో కొంత నిధులతో మీగ్రామ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులకు సామాజిక సేవ అలవాటు కావడానికి ఇటువంటి శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. నీటి పైపుల మరమ్మతులు, మొక్కలు నాటడం, ఉచిత వైద్య శిబిరం వంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. విద్యార్థుల శ్రమదానానికి గ్రామస్థులు కూడా సహకరించాలని కోరారు. ఈసమావేశంలో విద్యార్థులు, గ్రామ ప్రజలు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
సిడిపిఓ కార్యాలయం తనిఖీ
కార్వేటినగరం, మార్చి 1: మండల కేంద్రంలో ఉన్న సిడిపిఓ కార్యాలయాన్ని రీజనల్ జాయింట్ డైరెక్టర్ విజయకుమారి గురువారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా అంగన్‌వాడీ కార్యకర్తల, సూపర్‌వైజర్ పోస్టులు ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, గర్భవతులకు ఇస్తున్న కోడిగుడ్లను సక్రమంగా సరఫరా చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. ఈ ఆహారం పంపిణీలో ఏదైనా అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రికార్డులు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. 88సూపర్‌వైజర్ పోస్టులను, 291హెల్పర్లను, 251అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిడి ఉషాపణికర్, సి డి పి ఓ పద్మావతి, సూపరింటెండెంట్ విశ్వనాధం, ఇందిర, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
‘యువత భాగస్వామ్యంతోనే పల్లెసీమల ప్రగతి సాధ్యం ’
తిరుపతి, మార్చి 1: యువత భాగస్వామ్యంతోనే పల్లెసీమల ప్రగతి సాధ్యమవుతుందని జిల్లా పంచాయతీ అధికారి శేషారెడ్డి అన్నారు. గురువారం తిరుపతి రూరల్ మండలం పైడిపల్లిలో అగ్రశ్రీ ఆధ్వర్యంలో ‘స్థానిక సంస్థల్లో యువత కీలకభాగస్వామ్యం’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం స్థానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వుచేశాయన్నారు. ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విద్యాధికులైన యువత కీలకపాత్ర వహించాలని పిలుపునిచ్చారు. యువత అన్ని అంశాల్లో ముందుండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అగ్రశ్రీ సంచాలకులు డాక్టర్ సుంరదరరామ్ ప్రాజెక్టు పూర్వాపరాలు, వాటి నిర్వహణ, విధివిధానాల గూర్చి వివరించారు. స్థానిక సంస్థల్లో యువత కీలక భాగస్వామ్యం అనే అంశంపై సంవత్సరకాలం పాటు చేపట్టనున్న ఈ పైలట్ ప్రాజెక్టు మొదటి దశలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, బీహార్, పశ్చిమబెంగాల్, నాగాలాండ్ పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎంపిక చేసిన గ్రామపంచాయతీల్లో పరిశోధన కార్యక్రమాలను శ్రీపెరంబదూర్ రాజీవ్ గాంధీ జాతీయ యువత అభివృద్ధి సంస్థ చేపట్టనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాస్ట్రానికి సంబంధించి అగ్రశ్రీ ద్వారా పరిశోధన కార్యక్రమం నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకుందని అందులో భాగంగా తాము పైడిపల్లిని ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కోదండరామిరెడ్డి, ప్రత్యేక అధికారి మమత, కార్యదర్శి మధుసూదన్, ఆదర్శరైతు విశ్వనాదరెడ్డి, సంఘమిత్ర లీడర్ జయలక్ష్మి, సాక్షరభారతి సమన్వయకర్తలు రుక్మిణి, ఉమాగౌరీ, గ్రామయువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలన
కార్వేటినగరం, మార్చి 1: మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఎంపిడిఓ కార్యాలయంలో కేంద్రబృందం పరిశీలించింది. కార్వేటినగరం ఎంపిడిఓ కార్యాలయ భవనంలో మండలశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె జి కొరియన్, ఆర్ ఎం అబ్దుల్ రహీం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుమండలాలను, 11గ్రామపంచాయతీలను, అనంతపురం జిల్లాను ఆదర్శవంతమైన గ్రామాలుగా ఎంపిక చేసి ప్రోత్సహిస్తోందన్నారు. . ఇందుకు గాను జిల్లాకు 20 లక్షల రూపాయలు, మండలాలకు 10లక్షలు, గ్రామపంచాయతీలకు ఆరులక్షలు చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో కార్వేటినగరం మండలం ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమన్నారు. కార్వేటినగరం ఎంపిడిఓ కార్యాలయంలో జరుగుతున్న ఉపాధి పనుల రికార్డులు పరిశీలించారు. అనంతరం కార్వేటినగరం సంపత్ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అక్కడున్న విద్యార్థులు భోజన ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని చెప్పడంతో వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. భారతదేశంలో చదువుతున్న వారిలో ఆంధ్రప్రదేశ్ నుండే అధిక సంఖ్యలో ఐఎఎస్ అధికారులు ఉన్నారన్నారు. పాఠశాలలో విద్యార్థులు వివరాలను టీచర్ వేణుగోపాల్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్వేటినగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల (లక్ష్మీమహల్) భవనాన్ని పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో మరమ్మతులు చేపట్టాలని సిఇఓ నాగేశ్వర్‌కు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్, మందుల గదిని పరిశీలించారు. గాదంకిలో ఇందిరజలప్రభ ఉపాధి పథకం కింద మామిడిచెట్లు, పండ్లతోటల పెంపకాన్ని వారు పరిశీలించారు. బిల్లుదొన ఎస్టీకాలనీలోని కామధేను పథకం కింద పాడి ఆవులను పరిశీలించి వాటి ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రమైన కార్వేటినగరంలో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న పాలశీతలీకరణ కేంద్రాన్ని పరిశీలించి రోజుకు ఎన్ని లీటర్లు పాలు వస్తున్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. రెండువేల లీటర్లు వస్తున్నాయని సభ్యులు చెప్పడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సి ఇ ఓ నాగేశ్వర్‌రావు, రిటైర్డ్ డి పి ఓ నాగరాజు, ఎంపిడి ఓ శ్రీనివాసప్రసాద్, వైద్యాధికారి డాక్టర్ రవిరాజు, పశువైద్యాధఙకారి శ్రీ్ధర్, ఎం ఇ ఓ హేమారెడ్డి, ఎపియంలు సుజాత, గంగయ్య, ఇ ఓ పి ఆర్ డి వేణయ్య, ఎ ఇలు ప్రకాష్‌రెడ్డి, లీలామనోహర్‌నాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేయాలి
తిరుపతి,మార్చి 1: ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్ధ అయిన టిటిడి విద్య, వైద్య రంగానికి పెద్దపీట వెయ్యాల్సిన అవసరం ఉందని తిరుపతి ఎంపి డాక్టర్ చింతామోహన్ తెలిపారు. టిటిడి బడ్జెట్‌ను ప్రజల్లో చర్చించాలని తాను టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజును కోరామన్నారు. 67 ఏళ్ల కిందట ఎస్వీ ఆర్ట్స్ కళాశాల నిర్మాణం జరిగిందన్నారు. అయితే నేడు దానికి సున్నం వేసే పరిస్థితి లేదన్నారు. శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కాలేజిలో నీళ్లుకు గతి లేదన్నారు. పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్న రుయాకు వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్య, వైద్య రంగానికి టిటిడి సహాయం చేస్తే ప్రభుత్వానికి చేదోడువాదోడుగా ఉంటుందన్నారు. టిటిడి చైర్మన్ బాపిరాజు విద్య, వైద్య రంగానికి ఎక్కువగా నిధులు కేటాయిస్తారన్న నమ్మకం తనకున్నదన్నారు. టిటిడి బడ్జెట్ రూపకల్పనకు ముందు అందరి సలహాలు తీసుకోవాలని అప్పుడే ఆ బడ్జెట్‌కు న్యాయం జరుగుతుందన్నారు. టిటిడి పరిధిలోని అన్ని విద్యాసంస్థల అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. తిరుపతిలో ఆరు యూనివర్శిటిల్లో జీతాలు సైతం లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టిటిడిలాంటి ధార్మిక సంస్ధ సామాజిక సేవలో ముందుండాలని కోరారు.
అమలుకాని ముఖ్యమంత్రి హామీలు
తిరుపతి, మార్చి 1: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలని, ఏ ఒక్కటి అమలుకు నోచుకోవడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ రామానాయుడు విమర్శించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో డెయిరీలను తెరిపిస్తామని చీఫ్ విప్‌గా వున్న సమయం నుండి చెపుతున్నారని, సిఎం అయినా ఆయన హామీలు అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న చిత్తూరు జిల్లాలోని ప్రాథమిక వైద్య కేంద్రాల వద్ద ఉచితంగా మందులు అందించే చర్యలు చేపడతామన్నారు. తిరుపతి వంటి నగరంలో రాయలసీమ ప్రజలకు అందుబాటులో ఉన్న రుయాసుపత్రిలో సైతం మందుల కొరత వేధిస్తోందన్నారు. పేదలకోసం అన్ని రకాల మందులను అందుబాటులో వుంచుతామన్న హామీ ఇప్పటి వరకూ అమలు కాలేదన్నారు. తిరుపతి నగరంలో 16వేల మంది ఇందిరమ్మ లబ్ధిదారులుగా తేల్చినా ఇప్పటి వరకూ కనీసం 2వేల మంది అర్హులకు ఇళ్లు ఇవ్వలేదన్నారు. హంద్రీనీవా- సుజల స్రవంతి, గాలేరు - నగరి ప్రాజెక్టులు కాలువలకు ఈపర్యాయం బడ్జెట్‌లో కేటాయింపులు కూడా అంతంత మాత్రం చేయడం ద్వారా వీటి నిర్మాణంపై రైతులు ఆశలు వదులుకున్నారన్నారు. 800 కోట్ల రూపాయలతో జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, 400 కోట్లతో తిరుపతిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామి ఇచ్చిన సిఎం దాన్ని నిలబెట్టుకోలేకపోయారన్నారు. రెవిన్యూ సదస్సుల ద్వారా జిల్లాలో మిగులు భూములను గుర్తించి ఆరవ విడత పేదలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే పంపిణీ చేసిన భూములకే దిక్కులేని పరిస్దితి వుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చేతుల మీదుగా శ్రీకాళహస్తి మండలం గొల్లపల్లి వాసులకు ఇచ్చిన పట్టాలకు, బుచ్చినాయుడు కండ్రిగ కొలంబాకం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఎందుకూ పనికి రావడంలేదని ఎద్దేవా చేశారు. తిరుపతి వేదాంతపురం, పాడిపేటలో పేదలకు ఇండ్ల స్ధలాలు ఇస్తామని చెప్పిన మాటలు హామిలుగా మిగిలిపోయాయని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో సిఎం మాటలకు చేతలకు ఎంతో తేడా ఉందన్నారు. సిపిఐ జిల్లా మహాసభల తీర్మానం మేరకు బుధవారం తిరుపతిలో నిర్వహించిన సిపిఐ జిల్లా కార్యవర్గంలో తీర్మానించిన మేరకు మార్చి 12న సిఎం హామీలు - నీటి మూటలు అన్న నినాదంతో జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయనున్నట్లు రామానాయుడు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు పెంచలయ్య, మురళీ, రాధాకృష్ణ, ఎన్‌డి రవి పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో శృతిహాసన్
తిరుపతి,మార్చి 1: ప్రముఖ సినీ హీరో కమల్‌హాసన్ కుమార్తె శృతిహాసన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఒక కళాశాల యువనోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె గురువారంనాడు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు టిటిడి అధికారులు, అభిమానులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
వేతనాల బకాయల విడుదలపై హర్షం
తిరుపతి,మార్చి 1: యురోపియన్ ఎఎన్‌ఎంలకు పెరిగిన వేతనాల బకాయిలతో సహా ప్రభుత్వం విడుదల చేయడం పట్ల సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య, ప్రధాన కార్యదర్శి కందారపు మురళి గురువారం ఒక ప్రకటనలో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సిఐటియు పోరాట ఫలితంగా 5200 రూపాయ నుండి 10 వేల రూపాయలు వేతనం పెంచుతూ 2011 ఫిబ్రవరిలో ఉత్తర్వులు విడుదల చేసినప్పటికి జీతం అమలు కానందున ఉద్యమాలు చేసి సాధించుకున్నామన్నారు. ్ర
‘విద్యుత్ బిల్లులపై సర్‌చార్జి వసూలు దారుణం’
తిరుపతి,మార్చి 1: విద్యుత్ బిల్లులపై వినియోగదారుల నుండి 2 రూపాయలు నుండి 25 రూపాయలు సర్‌చార్జిలు వసూలు చేయడం దారుణమని, ఈ విధానం మానుకోని పక్షంలో ఆందోళనలు చేయ్యాల్సి వుంటుందని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు వాడ గంగరాజు గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
కొనసాగుతున్న వర్శిటీల అధ్యాపకుల దీక్షలు
తిరుపతి,మార్చి 1: ఎస్వీయూ, శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీల్లో జరుగుతున్న అధ్యాపకుల దీక్షలు గురువారం నాల్గవరోజు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా దీక్షల్లో పాల్గొన్నవారిలో ఎస్వీయూలో ప్రొపెసర్లు మునిరత్నంరెడ్డి, చంద్రవౌళేశ్వర్‌రావు, ఎంఎస్‌ఆర్ మూర్తి, రంగారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, మహాలక్ష్మమ్మ దీక్షల్లో పాల్గొన్నారు. అలాగే మహిళా వర్శిటిలో ప్రోపెసర్లు శ్రీదేవి, అరుణ, ప్రభావతి, అనురాధా, విజయజ్యోతి, మల్లీశ్వరి, కుసుమ పాల్గొన్నారు.
‘ఎస్సీవర్గీకరణ జరిగేంత వరకూ ఆందోళన ఆగదు’
తిరుపతి,మార్చి 1: ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకూ తమ ఆందోళన ఆగదని ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌ఎఫ్ ఎంఇఎఫ్ నేతలు హెచ్చరించారు. తిరుపతి ఆర్‌డిఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు గురువారం ఆరవ రోజు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ నాయకులు ఉమామహేశ్వర్‌రావు, జి బాలసుబ్రమణ్యం, మునిరాజా, రాజశేఖర్, సుధాకర్‌మాదిగ, గోపీమాదిగ, వెంకటరత్నం, బీసి విద్యార్ది నాయకుల బాస్కర్ యాదవ్, బాలాజి యాదవ్, బాబు యాదిగ, మహిళా నాయకురాళ్ళ బాగ్యమ్మ, పార్వతమ్మ, మునిరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.