కర్నూలు, మార్చి 1: రాష్ట్ర వ్యాప్తంగా పుర, నగర పాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. ఇందులో భాగంగా జిల్లాలో కర్నూలు నగర పాలక సంస్థతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు డోన్ పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తగా పుర పాలక సంఘంగా గుర్తింపు పొందిన నందికొట్కూరు, నగర పంచాయతీలుగా గుర్తింపు పొందిన ఆత్మకూరు, బనగానపల్లె, ఆళ్లగడ్డ, గూడూరులకు ఎన్నికలు కొంత ఆలస్యం కానున్నాయి. పాత పురపాలికల్లో ఎన్నికలు జూన్ మాసంలోగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆ శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. పురపాలకాల్లో ప్రజలు ఎన్నుకున్న కమిటీలు లేని పక్షంలో కేంద్ర నిధులు మంజూరు కావడం ఇబ్బందికరంగా ఉంటుందని దీంతో ఎన్నికల నిర్వహణ తప్పనిసరని వారు అంటున్నారు. పుర, నగర పాలక సంఘాలకు 2010లోనే గడువు పూర్తయినా పలు కారణాలు చూపుతూ ప్రభుత్వం సుమారు ఏడాది కాలం గడిపింది. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడిస్తున్నారు. కేంద్ర నిధులు రాకపోవడంతో కొన్ని పురపాలక సంఘాల నిర్వహణ కష్టతరంగా మారిందని వారు అంటున్నారు. ఎన్నికలు నిర్వహించి ప్రజా ప్రతినిధులు సమావేశమైతేనే ఆ నిధులను కేంద్రం నుంచి రాబట్టుకోగలరని వెల్లడవుతోంది. కాగా పురపాలక సంఘాల్లో బిసి ఓటర్ల గణన కార్యక్రమం పూర్తయింది. ఆయా పుర పాలక సంఘాల పరిధిలోని అన్ని మండల రెవెన్యూ, అభివృద్ధి కార్యాలయాలతో పాటు పురపాలక సంఘాల్లో బిసి ఓటర్ల జాబితాను సిద్ధంగా ఉంచి వాటిపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమం అనంతరం బీసీ ఓటర్ల తుది జాబితాను వెల్లడించి 2011 జనాభా లెక్కల ప్రకారం దామాషా పద్దతిలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి సదరు జాబితాను ఈ నెల 26వ తేదీ నాటికి ఎన్నికల కమిషన్‌కు పంపనున్నారు. ఆ వెంటనే ఎన్నికల కమిషన్ అన్ని పరిశీలించి తగిన తేదీలను ప్రకటిస్తూ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ వెలువరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఎన్నికల కమిషన్‌కు రాష్టప్రతి ఎన్నికల కార్యక్రమం ఉన్నందున జూన్ మాసాంతానికి లేదంటే జూలై 15వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల అనంతరం కొలువుదీరే కొత్త పాలకవర్గాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయించుకొని ఆయా పురపాలక సంఘాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, నిల్చిపోయిన కార్యక్రమాలను పూర్తి చేయడం వంటి వాటికి ప్రాధాన్యతనివ్వాల్సి ఉందని వెల్లడవుతోంది. ఎన్నికల తంతు ఒక వైపు ఉండగా మరో వైపు మార్చి అనంతరం ఏ రోజైనా పన్నుల పెంపుపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. పురపాలక సంఘాల్లో ప్రతి అయిదేళ్లకు ఒక సారి పన్నులు పెంచాలన్న 2002వ సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంవత్సరం పెంచాల్సి ఉందని అధికారులు అంటున్నారు. అయితే ఇందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉందన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఏప్రిల్ నెలలో పన్నుల పెంపుపై ప్రకటన విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం తప్పదని ఊహిస్తున్నారు. ఆ పార్టీ నాయకులు మాత్రం 2004లో పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పన్నులను పెంచలేదని ఈ సారి తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తే ప్రజలు సహకరిస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘాలకు ప్రజలు ఎన్నుకున్న పాలక వర్గాలు లేకపోవడం, గత పదేళ్లుగా పాత పన్నులే వసూలు చేస్తుండటం, నిర్వహణా ఖర్చులు పెరిగిపోవడంతో పురపాలక సంఘాల్లో అత్యవసర పనులు మినహా మరే పని చేపట్టలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. రానున్న జూన్‌లో ఎన్నికలు జరిగి అంతకు ముందు కొత్త పన్నుల విధానం అమలులోకి వస్తే ఆయా పురపాలక సంఘాల ఆదాయం పెరిగి అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంగతి ఎలా ఉన్నా ప్రజలను పన్నుల పెంపు వార్తలు మాత్రం నిద్ర లేకుండా చేస్తోంది.
నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్?
నంద్యాల, మార్చి 1: పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల పక్కన, రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో ఎంతో విలువైన నూనెపల్లె ఓవర్‌బ్రిడ్జి పక్కన ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ భూమిపై అధికారపార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. దీంతో రంగంలోకి దిగిన కొందరు అధికారపార్టీ పెద్దలు నూనెపల్లెలోని వ్యవసాయ మార్కెట్ స్థలాన్ని ప్రభుత్వ ధరకు విక్రయించి ఆ డబ్బుతో చాబోలురోడ్డు, లేదా పోలూరు రోడ్డు పక్కకు తక్కువ ధరకు ఇక్కడి కన్నా ఎక్కువ భూమి కొనుగోలు చేసి నూనెపల్లె మార్కెట్ యార్డ్ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని నూనెపల్లెలో ఎకరా భూమి రూ. 5కోట్ల రూపాయలు ఉండగా, నూనెపల్లె వ్యవసాయమార్కెట్ యార్డ్ సుమారు 8.60ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీంతో దీని విలువ సుమారు రూ.40కోట్లకు పైగా ఉంది. అయితే బహిరంగ మార్కెట్ లేకుండా ఉన్నతాధికారుల అనుమతితో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరకే కేవలం రూ.10కోట్లలోపే నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ 8.59ఎకరాల భూమిని కాజేసేందుకు అధికారపార్టీ పెద్దలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గతనెల ఫిబ్రవరి 23వ తేదీన నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సర్వసభ్య సమావేశంలో కూడా చైర్మన్‌తో సహా సభ్యులందరూ నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ నిరుపయోగంగా ఉందని, దీన్ని ఉన్నతాధికారుల ఆదేశాలతో బహిరంగ వేలం ద్వారా ఎక్కువ ధరకు విక్రయించి పట్టణ సమీపంలోని నాలుగురోడ్ల విస్తరణ పక్కన సుమారు 20ఎకరాల భూమి సేకరించి అందులోకి నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను మార్పు చేయడం రైతులకు కూడా ఉపయోగమేనని చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం తెలుసుకున్న రైతులు మాత్రం నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను పట్టణం నుంచి పట్టణానికి దూరంగా తరలించడం మంచిదికాదని, కొందరు స్వార్థపరుల ప్రతిపాదనలను ప్రభుత్వ ఉన్నతాధికారులు తిరస్కరించాలని విన్నవిస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని నిత్యం రద్దీగా ఉంటూ ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా సుమారు రూ.30కోట్ల విలువ చేసే పశువుల ఆసుపత్రి, వెటర్నరీ ఎడిఎ కార్యాలయం సుమారు 2.45ఎకరాల స్థలాన్ని 99ఏళ్ల లీజుపేరుతో తక్కువ ధరకు కాజేసేందుకు అధికారపార్టీ ప్రజాప్రతినిధి సమీప బంధువు ఏర్పాట్లు చేసుకోగా రైతులు, పట్టణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రయత్నం తాత్కాలికంగా నిలిచిపోయిందని, మళ్లీ నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ స్థలంపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుపడడం దురదృష్టకరమని రైతులు అంటున్నారు.
వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వివరణ...
నంద్యాల వ్యవసాయమార్కెట్ యార్డ్ పరిధిలో పట్టణంలోని టెక్కెలో 15.50 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్‌యార్డ్, నూనెపల్లెలో 8.59ఎకరాల విస్తీర్ణంలో యార్డ్, మండల కేంద్రమైన పాణ్యంలో 5.14ఎకరాల విస్తర్ణంలో యార్డ్, మండల కేంద్రమైన బండిఆత్మకూరులో 5ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్ యార్డ్‌లు ఉన్నాయని నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎం.విజయశేఖరరెడ్డి తెలిపారు. రీజనల్ మార్కెట్ యార్డ్ (కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) పరిధిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ల కన్నా నంద్యాల మార్కెట్ యార్డ్ ఆదాయంలో మొదటి స్థానంలో ఉందన్నారు. అయితే నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు ఎదురుగా ఓవర్ బ్రిడ్జి ఉండడం, ట్రాఫిక్ పెరిగిపోవడం, మార్కెట్ యార్డ్‌లోని 9గోదాములు, కార్యాలయ భవనం, విశ్రాంతి భవనం కూడా శిధిలావస్థకు చేరుకున్నాయని, గోదాములను బాడుగకు తీసుకున్న మార్కెఫెడ్, ఐకెపి వారు కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ధాన్యం, ఎరువులు నిల్వ చేసుకోలేమని ఖాళీ చేశారన్నారు. దీంతో నిరుపయోగం ఉంచడం కన్నా బహిరంగ మార్కెట్ వేలం ద్వారా నూనెపల్లె మార్కెట్ యార్డ్ స్థలాన్ని విక్రయించి పట్టణ సమీపంలో రైతులకు అందుబాటులో సుమారు 25ఎకరాల విస్తీర్ణంలో నూనెపల్లె మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న సమాలోచనలు మాత్రమే సభ్యులందరం చేశామని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, ఉన్నతాధికారులకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని ఆయన వివరించారు.
ఆదోని కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్!
ఆదోని, మార్చి 1: ఆదోని కాంగ్రెస్ పార్టీలో కోల్డ్‌వార్ సాగుతోంది. పార్లమెంట్ సభ్యులు కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి వర్గం నేతలు, మంత్రి టిజి వెంకటేష్ ఆశీస్సులు ఉన్న నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఎవరికివారే పట్టుసాధించుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సమన్వయం కుదరడం లేదు. మంత్రి టిజి వెంకటేష్ కొంతమంది నేతలకు ప్రాముఖ్యత ఇవ్వడంపై కోట్ల వర్గం నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్లిష్ట సమయంలో నాయకులంతా ఐక్యంగా ఉండకపోతే పార్టీకి కొంతనష్టం జరిగే పరిస్థితి ఉంటుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీని తన కన్నుసన్నల్లోనే నడిపించారు. సాయిప్రసాద్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మాజీ ఎమ్మెల్యే రాచోటి రామయ్య, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విట్టాకిష్టప్ప కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేయడానికి కృషి చేస్తున్నారు. వారి కృషి చాలావరకు ఫలించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తాము బయటకు వెళ్తే ఆ పార్టీకి జెండాకట్టేవారు కూడా ఉండరని అనుకున్న నేతల అంచనాలు తారుమారయ్యాయి. రాచోటి రామయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, విట్టాకిష్టప్ప సారథ్యంలో కాంగ్రెస్‌పార్టీ మళ్లీ పుంజుకుంది. అనేక గ్రామాల్లో కార్యకర్తలు కాంగ్రెస్‌పార్టీకి అండగా నిలిచారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌పార్టీ పట్టణంలో కూడా బలం పుంజుకుంటోంది. అయితే మంత్రి టిజి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త విట్టా రమేష్ పార్టీలోకి వచ్చారు. మంత్రితో మంచి సంబంధాలు ఉండడం వలన విట్టారమేష్ తన అనుయాయులకు చెరువుల కాంట్రాక్టు పనులు, వాటర్‌షెడ్ల పనులు ఇప్పించుకుంటున్నారు. ఈవిధంగా పనులు ఇప్పించడంపై కోట్ల వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను మంత్రి సిఫార్సుతోనే ఆయన అనుయాయులు రద్దు చేయించడంపై కూడా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్న కార్యకర్తలకు, పార్టీ కోసం ఉపయోగపడే వారికి అభివృద్ధి పనులు కేటాయించకుండా ఇతరులకు కేటాయించడంపైన కోట్ల వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదోని ఎఎస్పీ శిమోసిని రాత్రికి రాత్రే మంత్రి టిజి బదిలీ చేయించడంపై ఆదోనిలో కోట్ల వర్గీయుల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది. అంతేకాకుండా మంత్రికి అనుకూలంగా ఉన్న మనోహార్‌రావును సిమోసి స్థానంలో నియమించడంతో పరిస్థితి మరింత ముదిరింది. కోట్ల వర్గీయులు హుటాహుటీన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిని కలిసి శిమోసి బదిలీని రద్దు చేయించారు.
జీవితాంతం కాంగ్రెస్‌లోనే
డోన్, మార్చి1: కలియుగం వున్నంత కాలం తాము కాంగ్రెస్ పార్టీని వదలమని ఎంపి కోట్లజయ సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలోని ఐటిఐ సమీపంలోని కాంగ్రెస్ నాయకులు సీమ సుధాకరరెడ్డి స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎంపి మాట్లాడుతూ పబ్బం గడుపుకోవడానికి పూటకో పార్టీ మార్చే వ్యక్తుల పట్లప్రజల్లో చులకన భావం ఏర్పడుతోందని అన్నారు. ఏదో పార్టీని నమ్ముకుంటేనే బాగుపడతారని హితబోధ చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు ఏనాడు అన్యాయం జరుగలేదని తెలిపారు. దీనికి ఎమ్మెల్సీ సుధాకరబాబు, మాజీ జడ్పీచైర్మన్ ఆకెపోగు వెంకటస్వామిలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రోజుకో పార్టీ పుడుతున్నా వాటివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నా రు. జగన్ పార్టీ వల్ల ప్రజలకు ఒరిగేదేమి లేదని ఆ పార్టీ వచ్చేది లేదని, చచ్చేదిలేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ దోపిడి దొంగల పార్టీ అని ఆరోపించారు. వారు అక్రమమైనింగ్ ద్వారా దోచుకోవడమే వారి పని విమర్శించారు. తమ పార్టీలో ఎవ్వరైన అక్రమాలు చేసినా, అక్రమాలకు పాల్పడినా తాము చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని తెలుగుదేశం, జగన్ పార్టీలు కలలు కంటున్నాయని వారి కలలు కల్లలుగానే మిగిలి పోతాయని ఎద్దేవాచేశారు. రెండు రోజుల క్రితం తమ స్వగ్రామమైన లద్దగిరిలో నిర్వహించిన ఓ కార్యానికి జిల్లా ఉన్నతాధికారులొస్తే తాము అధికార దర్పానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం కాదన్నారు. నాడు టిడిపి హయాంలో కంబాలపాడులో నిర్వహించిన కార్యక్రమాలకు వెళ్తుండం లేదా అని ప్రశ్నించారు. తమపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాల వల్ల పేదలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయని చెప్పారు. కిరణ్ సర్కారు వల్ల ప్రజలకు ఎంతోమేలు జరుగుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కోట్ల స్పష్టం చేశారు.
జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తన భార్య కోట్ల సుజాత పోటీ చేస్తుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా డోన్ నుంచే సుజాత పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఆలూరు నుంచి పోటీ చేస్తుందని వచ్చే వార్తలు వాస్తవం కాదని చెప్పారు. త్వరలోనే తన తనయుడు రాఘవేంద్రబాబు (రఘుబాబు) రాజకీయాల్లోకి వస్తున్నాడని, ఆలూరు నుంచి పోటీ చేసే అవకాశం వుందని పార్టీవర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోట్లసుజాతమ్మ, మాజీ జడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కెడిసియంసి చైర్మన్ లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఆర్‌ఇ రవికుమార్, టిఇ కేశవయ్య గౌడు, నాగభూపణం రెడ్డి, ఆర్‌ఇ నాగరాజు, మాజీ ఎంపిపి సప్తశైల రాజేష్, హుసేనాపురం, క్రిష్ణగిరి సింగిల్ విండో చైర్మన్లు సీమ సుధాకరరెడ్డి, బ్రహ్మనందరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బోరెడ్డి పుల్లారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం. మహేశ్వరరెడ్డి, వలసల రామక్రిష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డి, తిమ్మయ్య యాదవ్, సిద్ధార్థ క్రిష్ణారెడ్డి, ఓబుళాపురం శేషిరెడ్డి, కమతం భాస్కరరెడ్డి, భాస్కర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
* జిల్లాలో 70,841 మంది విద్యార్థులు
* విస్తృత ఏర్పాట్లు
కర్నూలు(స్పోర్ట్స్), మార్చి 1: జిల్లాలో ఈ నెల 2 నుంచి 21 వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆర్‌ఐవో ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన తన ఛాంబర్‌లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐవో మాట్లాడుతూ జిల్లాలో 79 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 70,841 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతున్నారని అన్నారు. ఇందులో మొదటి సంవత్సరంలో 33,832 మంది, ద్వితీయ సంవత్సరంలో 27,185 మంది, ప్రైవేటుగా 9,464 మంది విద్యార్థులు హాజరు అవుతున్నట్లు తెలిపారు. 16 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని ఈ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఆంక్షలు విధిస్తూ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని అన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు నాలుగు ఫ్లైయింగ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించామన్నారు. 38 స్టోరేజ్ పాయింట్లలోప్రశ్నా పత్రాలను భద్రపరిచామని అన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో పరీక్షలను నిర్వహించేందుకు అనుమతించాలని కో-ఆర్డినేషన్ కమిటీలో జిల్లా పరిషత్ సిఇవో, డిఇవోలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా హై పవర్ కమిటీ, జిల్లా ఎగ్జామినేషన్ కమిటీల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని అన్నారు. సమయానికి బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ కోత అంతరాయాన్ని నివారించాలని ఆర్టీసి, ట్రాన్స్‌కో అధికారులను ఆదేశాలను కలెక్టర్ జారీ చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు 7.30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని 8.15 తరువాత పరీక్ష కేంద్రాల్లో ఎవ్వరిని అనుమతించబోమని ఆర్‌ఐవో స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో మంచి నీటి సౌకర్యం, ప్రథమ చికిత్స వంటి వౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. 0-60 శాతం హాజరు తక్కవగా వున్న వారికి కూడా ఎటువంటి ఫీజు లేకుండా జిల్లా కలెక్టర్ చోరవతో బోర్డు అధికారుల అనుమతితో హాల్ టికెట్లను విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశించామన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
మున్సిపాలిటీ పనులకు
పోటాపోటీగా టెండర్లు
ఆదోని, మార్చి 1: మున్సిపాలిటీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ప్రతిపాదించిన సిమెంట్ మురికి కాల్వలు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, మొదలగు అభివృద్ధి పనులకు గురువారం పిలిచిన ఈ-టెండర్లకు పోటాపోటీగా కాంట్రాక్టర్లు తక్కువ శాతానికి టెండర్లు వేసినట్లు సమాచారం. వారం రోజుల క్రితం ఈపనులకు వేసిన టెండర్లలో ఒక్కొక్క పనికి 25శాతం నుంచి 27శాతం వరకు తక్కువగా కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. ఒక నాయకుని అనుచరుడైన కాంట్రాక్టర్ టెండర్ వేయనందుకు నాలుగు రోజుల క్రితం వాటిని రద్దు చేయించారు. మున్సిపల్ అధికారులు మాత్రం సాంకేతిక లోపంతో టెండర్లు రద్దు చేశామని ప్రకటించారు. గురువారం మళ్లీ టెండర్లు పిలిచారు. మాజీ నేత నామినేషన్ పనులను కూడ ఇవ్వాలని పేచీ పెట్టడంతో కాంట్రాక్టర్లు రింగ్ కాలేదు. దీనితో పోటాపోటీగా టెండర్లు వేసినట్లు కాంట్రాక్టు వర్గాల భొగట్టా. ఒక్కొక్క పనికి 30శాతం వరకు కూడ తక్కువ టెండర్ వేసినట్లు అనధికార సమాచారం. రూ.6లక్షల 62వేల 857లతో రైల్వేస్టేషన్ నుంచి చిన్మయ విద్యాలయంవరకు సిసిరోడ్డు నిర్మాణం, రూ.6లక్షల 49వేల 869లతో ఎస్కేడికాలనీలో సిమెంట్ కాల్వలు, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి, రూ.4లక్షల 98వేల 744లతో ఎస్కేడికాలనీ, ఎల్‌ఐసి కాలనీవద్ద సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాల్వల నిర్మాణానికి, రూ.5లక్షల 41వేల 609లతో స్మశాన వాటికలో గుంతలు పూడ్చడానికి, రూ.3లక్షల 76వేల 455లతో స్మశాన వాటికలోని ఓపెన్ ప్లేస్‌లో మట్టి నింపడానికి, రూ.3లక్షల 35వేల 503లతో శివశంకర్‌నగర్‌లో సిసిరోడ్డు నిర్మాణానికిగాను గురువారం టెండర్లను పిలిచారు. అయితే కాంట్రాక్టర్ల మధ్య, నేతల మధ్య అంగీకారం కుదరకపోవడంతో పోటాపోటీగా తక్కువకు టెండర్లు వేసినట్లు తెలిసింది. శుక్రవారం టెండర్లను ఖరారు చేస్తారు.
హంస వాహనంపై
శ్రీ ప్రహ్లాద వరద స్వామికి గ్రామోత్సవం
ఆళ్ళగడ్డ, మార్చి 1: పుణ్యక్షేత్రమైన అహోబిలంలో 45, 6వ పీఠాధిపతులైన శ్రీవన్ శఠగోప నారాయణ యతీంద్ర మహాదేశికన్, శ్రీవన్ శఠగోప రంగనాధ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ ల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే గురువారం దిగువ అహోబిలంలో హంసవాహనంపై శ్రీ ప్రహ్లాద వరదస్వామి భక్తులకు దర్శన మిచ్చారు. ఉదయానే్య అర్చకులు శ్రీ ప్రహ్లాద వరదస్వామిని పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి శంసవాహనంపై కూర్చుండబెట్టి సాంప్రదాయం ప్రకారం రామానుజాచార్యుల వారి ఆలయం వద్ద వేద బ్రాహ్మణులు గోష్టి నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తూ అహోబిల మఠం చేరుకుంది. అక్కడ 45,46వ పీఠాధిపతులు శ్రీవన్ శఠగోప నారాయణ యతీంద్ర మహాదేశికన్, శ్రీవన్ శఠగోప రంగనాధ యతీంద్ర మహాదేశికన్ స్వామివార్లు హంస వాహనంపై కొలువుదీరిన శ్రీపహ్లాద వరదునికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరుకు చెందిన ఆర్ యస్ సంపత్ అండ్ సన్స్ ఉభయధారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. రాత్రి స్వామి సూర్యప్రభ వాహనం పై భక్తులకు దర్శన మిచ్చారు. ఈ కార్యక్రమానికి విజయవాడకు చెందిన విపి నరపింహాచార్యులు అండ్ సన్స్ ఉభయధారులుగా వ్యవహరించారు.
ఎగువ అహోబిలంలో ఉదయం జ్వాలా నరసింహస్వామికి అమ్మవార్లకు విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అహోబిలం అర్చకులు రమేష్ ఉభయధారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం అభిషేకం నిర్వహించారు. రాత్రి హనుమంత వాహనంపై జ్వాలా నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమానికి మద్రాస్‌కు చెందిన శ్రీకస్తూరి అండ్ సన్స్, కడపకు చెందిన పి రామశేషయ్య అండ్ సన్స్ ఉభయధారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాలన్, మేనేజర్ బివి నరసయ్య, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అహోబిలంలో నేడు
ఎగువ అహోబిలంలో శుక్రవారం రాత్రి చంద్ర ప్రభ వాహనంపై స్వామి భక్తులకు దర్శన మిస్తారు. దిగువ అహోబిలంలో ఉదయం శ్రీ యోగానృసింహ గరుడ విమానము, రాత్రి హనుమంత వాహనంపై స్వామి మాడా వీధుల్లో ఊరేగుతారు.
భక్తులకు అందుబాటులో
రాఘవేంద్రస్వామి పాదపూజ సేవ
మంత్రాలయం, మార్చి 1: రాఘవేంద్రస్వామి మఠంలో గురువారం నుంచి భక్తుల కోసం రాఘవేంద్రస్వామి పాదపూజ సేవను కొత్తగా ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 250 రూపాయల రుసుముతో ఈ సేవ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు శేషవస్త్రం, 10పరిమళ ప్రసాదాలను మఠం పీఠాధిపతులు అందజేస్తున్నట్లు మఠం మేనేజర్ వెంకటేష్‌జోషి తెలిపారు. ఉదయం 8.30గంటలనుంచి 9.30గంటలలోపు పాదపూజ సేవను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సదానందమే మనిషికి పరమానందం...
మహానంది, మార్చి 1: మనిషి జీవితంలో సదానందమే మానవ జన్మకు పరమానందాన్ని ప్రసాదిస్తుందని తత్వదర్శి, శక్తిపాద సిద్ద యోగీశ్వరులు, సిద్ద గురువు రమణానంద మహర్షి స్వామిజీ పేర్కొన్నారు. గురువారం మహానంది క్షేత్రంలోని శ్రీ వివేకానంద గురుకుల విద్యాలయం ఆవరణలో ఆయన చోడశోత్తర శత ప్రవచనజ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి ప్రవచన కార్యక్రమాన్ని విని షిరిడి సాయినాధుని యొక్క మహిమల గురించి తెలుసుకున్నారు. భక్తులను ఉద్దేశించి సిద్ద గురువు భక్తులను ఉద్దేశించి బోదిస్తూ మోక్షాపేక్షగల యజ్ఞాతి పరమ గురువు వలన ఉపదేశము పొంది బోదన తెలుసుకొనుటకు గానుముందుగా గురుధర్మములను తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. గురువు ధర్మములు తెలియక గురువులను గుర్తించలేరని, అలాగుర్తించని ఎడల బోధ కూడా తెలియదన్నారు. బోద తెలియని వారు మోక్షం పొందలేరన్నారు. మనిషిని కోరికల బంధం ఆవరించి ఉందని, కోరికల వలయంలో ఉన్న మానవుడు ఆనందంగా జీవించలేడన్నారు. సుఖం అనేది క్షణికమైందని, సిద్ద గురువును ప్రేమించినప్పుడే సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. సర్వం తెలిసిన వాడే సిద్ద గురువు అని వారిని ధ్యానించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని, అలాంటి వారే షిరిడి సాయినాధుడని ఆయన అన్నారు. సత్యాన్ని నిత్యం సాధించాలని, కాల గర్భంలో ఒంటరిగా కలిసి పోతారని,దుఖం అశాంతిని అధిగ మించాలని సదానందమే మనిషికి ఓ వరం అని ఆయన హితబోద చేశారు. అనంతరం స్వామి వారికి ఛోటాఖాన్ సాయినాధునికి ఉన్న కథను వివరించారు. అనంతరం హైదరాబాదుకు చెందిన చిన్నారులు నృత్యాలుచేసి భక్తులను ఆకట్టుకున్నారు. స్వామి వారికి పుష్పాభిషేకం, 16 మంది ముత్తయిదువలతోమ ప్రత్యేక హారతులు ఇచ్చారు.
హస్తకళలకు చేయూత అందిద్దాం
కల్లూరు, మార్చి 1: ఆధునిక యంత్ర తయారీ వస్తువుల స్థానంలో ప్రాచీన సాంప్రదాయ హస్తకళలు అందుబాటులోకి వచ్చాయని స్వదేశీ హస్తకళలకు కళాకారులకు స్నేహహస్తం అందించినపుడే వారు అభివృద్ధి బాటలో నడుస్తారని నగర పాలక కమిషనర్ వివివిఎస్ మూర్తి అన్నారు. గురువారం నగరంలోని బిఎఎస్ కల్యాణ మండపం నందు లేపాక్షి హస్తకళల ప్రదర్శనకు ముఖ్య అతిథిగాకమిషనర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళల అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో లేపాక్షి హస్తకళల వస్తు విక్రయ శాల కర్నూలులో ప్రారంభించడం నగర ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. తక్కువ ధరలతో మన్నికైన వస్తువులు లేపాక్షి సొంతం అన్నారు. నగర ప్రజలు ఈ ప్రదర్శనను సందర్శించి హస్త కళలను ఆదరించాలన్నారు. మేనేజర్ సుచింద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కలంకారి డ్రస్ మెటిరియల్, బెడ్‌షీట్లు, కొండపల్లి బోమ్మలతో పాటు ఇతర రాష్ట్రాల హస్తకళల సామాగ్రి కూడా ఇక్కడ లభిస్తున్నాయన్నారు. మార్చి 12 వరకు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, రంగస్థల కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతరాయచౌదరి పాల్గొన్నారు.
పాలకుల నిర్లక్ష్యంతో ఆలయానికి అరిష్ఠం
మహానంది, మార్చి 1: ఈ నెలాఖరులోగా మహానంది క్షేత్రంలోని ధ్వజస్తంభాన్ని దేవాలయ అధికారులుకాని, మంత్రి కాని చొరవ తీసుకొని ఏర్పాటుచేయకుంటే ఆలయం ముందే ధర్నా చేసి బంద్‌లు చేస్తామని శ్రీశైలం టిడిపి నాయకులు శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మహానంది, గాజులపల్లె గ్రామాల్లో గుడిసెలు, గడ్డివాములు కాలి నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం అందించారు. మహానంది గ్రామంలోని వెంకటస్వామి, రమణమ్మ, గాజులపల్లె గ్రామంలో సుధాకర్, భూపాల్, షాజిదా, కాల్లూరి సుబ్బమ్మ, వెంకటేశ్వర్లు కుటుంబాలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మహానంది క్షేత్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మహానందీశ్వరుని ధ్వజస్థంభం కూలి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు పట్టించుకొనే నాధుడే లేడన్నారు. మంత్రికి కాని, అధికారులకు కాని చేతకాకపోతే తామే ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహానంది క్షేత్రం అభివృద్ధి అంటే మంత్రికి ఏమాత్రం పట్టడం లేదని ఆయన విమర్శించారు. ఉగాది పర్వదినం నాటికి ధ్వజస్థంభాన్ని ఏర్పాటు చేయకపోతే ఆలయం ముందే ధర్నా చేస్తామన్నారు. మహానంది క్షేత్రానికి కోట్ల రూపాలయ ఆదాయం ఉన్నా అభివృద్ధి మాత్రం జరుగడం లేదన్నారు. పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహిస్తామని మహానంది వ్యాపార సంఘాలు హెచ్చరించాయి. మహానంది ధ్వజస్థంభం లేకపోవడంతో మండలంలో రైతులు తమ పంటలు పండక, నష్టపోతున్నారని ఆలయంలో ఎన్నో అరిష్టాలు జరుగుతున్నాయన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు ఆలయంలోనే మృతి చెందడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయమన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపిపిలు మునెన్న, భూపాల్‌రెడ్డి, గాజులపల్లె మాజీ సర్పంచ్ కిట్టు, భూమా కృష్ణమూర్తి, కంచర్ల ఈశ్వరయ్య, ఉల్లి వెంకటేశ్వర్లు, దస్తగిరి, భూమా గోపాల్, రమణయ్య, రాముడు, భువనేశ్వర్‌రెడ్డి, కెపి లింగారెడ్డి, సుబ్బయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.