ఒంగోలు, మార్చి 1: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ఉదయం ఎనిమిది నుండి 11 గంటల వరకు జరుగుతాయి. జిల్లాలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 50,248 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రథమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 22,896 మంది, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 18,867 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ద్వితీయ సంవత్సరంలో ప్రైవేటు విద్యార్థులు 5,388 మంది ఉండగా, మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు 1750 మంది, రెండవ సంవత్సరం ఒకేషనల్ ప్రైవేటు విద్యార్థులు 193 మంది ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 15 సమస్మాత్మాక కేంద్రాలను బోర్డు అధికారులు గుర్తించారు. వాటిలో వేటపాలెంలోని బీబీహెచ్ జూనియర్ కాలేజీ, టంగుటూరు, సంతమాగులూరు, పొన్నలూరు, తురిమెళ్ళ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా కనిగిరి, మద్దిపాడు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం, కొండెపి, పొదిలి, కొమరోలు, పామూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పెదదోర్నాల జూనియర్ కాలేజీ, మార్కాపురంలోని ఎస్‌వికెపి, కంభం ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గిద్దలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ, అర్ధవీడు ఆదర్శ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పరీక్షల్లో అవకతవకలు జరగకుండా 12 స్క్వాడ్‌లను ఏర్పాటుచేశారు. వాటిలో ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్‌లు, నాలుగు ప్లయింగ్ స్క్వాడ్‌లు ఉన్నాయి. ఈనెల రెండవ తేదీన ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలుచేస్తున్నట్లు జిల్లా ఎస్‌పి కొల్లి రఘురామిరెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మొబైల్ పెట్రోలింగ్ తిరుగుతుందని ఎస్‌పి తెలిపారు.
కల్లాల్లో ధాన్యం
రైతులకు తప్పని తిప్పలు
దక్కని గిట్టుబాటు ధర!
కందుకూరు, మార్చి 1: విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి అందేవరకు రైతాంగం తిప్పలు వర్ణనాతీతం. ఎన్నో ఆటుపోట్లకు ఎదురునిలిచి పండించిన కాసింత పంటకు దళారుల రంగ ప్రవేశంతో సరైన గిట్టుబాటు ధర రాక రైతులు ఆందోళకు గురవుతున్నారు. మార్కెట్ మాయాజాలంలో దళారుల పాత్ర కీలకంగా ఉండడంతో రైతుల నోటి దగ్గరకు వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతు ప్రభుత్వం అని చెపుప్పుకుంటున్న సర్కార్ కష్టాల సమయంలో మాత్రం ఆదుకోవడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. మూడు నెలల క్రితం విత్తన ధర రూ.75 ఉంటే, ఇప్పుడు రూ.42కు పడిపోవడం ఆందోళన రేకెత్తిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులకు రెండు మాసాల క్రితం మార్కెట్‌లో పలికిన ధర ఇప్పుడు కానరావడం లేదు. ధాన్యం కొనుగోలుకు ఐకెపి ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సవాలక్ష నిబంధనలతో ఉత్పత్తులు తీసుకెళ్లినా రైతులను నిరాశ పరుస్తున్నారు. దీంతో ప్రైవేటు వ్యాపారుల మీదనే రైతులు ఆధార పడుతున్నారు. ధాన్యం ప్రస్తుతం ఎల్‌ఆర్ రకం రూ.800, బిపిటి రకాలు రూ.830 ధర పలుకుతుంది. పెరిగిన ఖర్చుల దృష్ట్యా రూ.1000చొప్పున ధర లభిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. దళారుల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేయించి ప్రయోజనం పొందుతున్నారు. రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలు వారికి లాభాల పంట పండించింది. మారుమూల పల్లెల్లో ఇప్పటికీ రూ.7,200లకు కొనుగోలు చేస్తున్నారు. రబీ పంటల ఉత్పత్తుల ధరలు కూడా దారుణంగా పడిపోయాయి. 3,50,000హెక్టార్లలో పంటలు సాగు కావల్సి ఉండగా, అత్యధికంగా శనగ పంట లక్ష హెక్టార్లలో సాగులోకి వచ్చింది. పంట వేసే నాటికి జెజి-11రకం శనగ ధర రూ.3,800ఉండగా, ప్రస్తుతం రూ.3,400లకు పడిపోయింది. అదేవిధంగా మొక్కజొన్న పంట వేసే నాటికి క్వింటా రూ.1400ఉండగా, ప్రస్తుతం రూ.1150మాత్రమే ధర పలుకుతుంది. ఎకరాకు 8క్వింటాళ్ళు కావల్సిన మినుము 2నుంచి 4 క్వింటాళ్లు మధ్య మాత్రమే చేతికి అందాయి. మినుము పంట సాగు చేసే నాటికి క్వింటా ధర రూ.4వేలు ఉండగా, ప్రస్తుతం రూ.3,600లకు తగ్గిపోయింది. కందులు రెండు నెలల క్రితం రూ.3,500ఉండగా, ప్రస్తుతం రూ.3,200లకు పడిపోయింది. పెసర, మిర్చి ధర కూడా రైతులను నిరాశ పరుస్తోంది. పత్తి కొనుగోళ్ళలో దళారుల రాజ్యమే నడుస్తుంది. రెండు మాసాల క్రితం పత్తి ధర రూ.4,500 ఉండగా, ప్రస్తుతం రూ.3,800లకు పడిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారుల ద్వారా విక్రయించుకుంటున్నారు. మిర్చి గత ఏడాది క్వింటా రూ.8వేలు పలుకగా, ప్రస్తుం సగానికి సగం రూ.4వేలకు పడిపోయింది. ఈపరిస్థితులలో ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతు నాయకులు కోరుతున్నారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పిస్తాని ఇందిరాక్రాంతి పథం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిరాశ పరుస్తున్నాయి. సవాలక్ష నిబంధనలతో రైతులను ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిసింది. దీంతో చేసేది ఏమి లేక ప్రైవేటు వ్యాపారులపైనే రైతులు ఆధార పడాల్సి వస్తోంది. ఒకపక్క పంట ప్రారంభంలో చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతుండడంతో పంటను ఎంతోకొంతకి తెగనమ్మి అప్పులు తీర్చుకోవాలన్న ఆలోచనతో రైతులు ఉన్నారు. ప్రభుత్వం సకాలంలో ముందుకు వచ్చి పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయకపోవడం, రైతు చేసిన అప్పులు తీర్చలేక అనేక ప్రాంతాల్లో రైతన్నలు తనువు చాలిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ప్రభుత్వం నేరుగా రైతులు పండించిన పంటలను గొనుగోలు చేయాలని రైతు సంఘాలు ఏటా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేదని రైతు నాయకులు అంటున్నారు. ఏప్రభుత్వం వచ్చినా రైతు సంక్షేమం గురించి మాట్లాడడం తప్ప ఆచరణలో మాత్రం ఉంచడం లేదని, ఇప్పటికైనా రైతులు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఒంగోలుకు ఉప ఎన్నిక జరిగేనా?
బరిలో బాలినేని, దామచర్ల, ఆనంద్!
ఒంగోలు, మార్చి 1: జగన్ వర్గం పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించటంతో ఆ ప్రభావం రాష్ట్రంలోని ఆయన వర్గం శాసనసభ్యులపై పడే అవకాశాలు ఉన్నాయి. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు గతంలోనే అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు రాజీనామా పత్రాలను అందచేసిన విషయం తెలిసిందే. దమ్ముంటే తమ రాజీనామాలను ఆమోదించాలని జగన్ వర్గం శాసనసభ్యులు పదేపదే అధిష్ఠానానికి సవాల్ విసురుతూనే ఉన్నారు. ఈక్రమంలో ఎంపి మేకపాటి రాజీనామాను ఆమోదించిన అధిష్ఠానం త్వరలోనే శాసనసభ్యులపై వేటువేస్తే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. నాల్గవసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఎన్నికల గోదాలో దిగనున్నారు. ఆమేరకు ఆయన ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో సుడిగాలి పర్యటన జరుపుతూనే ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లోని అనైక్యత కారణంగానే బాలినేని భారీ మెజార్టీతో గెలుపొందుతూ వస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన రాష్టస్థ్రాయిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గతంలో జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో జిల్లాలోని అత్యధిక సీట్లల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నూకసాని బాలాజీ ఉన్నప్పటికీ పార్టీ బాధ్యతలను అన్నీ తానై బాలినేని చూసుకుంటున్నారు. ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే నాలుగోసారి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బాలినేని పోటీచేసి తన తడాఖా చూపేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం బాలినేనిని వీడిన చాలామంది నాయకులు ఎన్నికల సమయంలో ఆయన పంచన చేరే అవకాశాలు లేకపోలేదు. మొత్తంమీద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాలినేని రంగంలోకి దిగనుండగా తెలుగుదేశం పార్టీ తరపున ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పోటీ పడనున్నారు. ఉపఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలను ఎదుర్కొనేందుకు దామచర్ల ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. వార్డులు, గ్రామాలవారీగా పర్యటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే ఉన్నారు. దామచర్ల ఆర్థికంగా కూడా ముందువరసలో ఉండటంతో ఆయన పేరునే గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. ఇదిలాఉండగా దామచర్లకు బయట పోరు కంటే ఇంటి పోరే ఎక్కువగా ఉంది. ముందుగా ఇంటిపోరును దామచర్ల చక్కదిద్దుకుంటే ఆయన గెలుపు సులభమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాని దామచర్ల ఒంగోలు నియోజకవర్గంలో పాగావేస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నది కొంతమంది నియోజకవర్గ నాయకులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఉపఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్ఠానవర్గం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసి ఓటమిపాలైన పర్వతనేని ఆనంద్, మాజీ మునిసిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకమే.
వైభవంగా శ్రీరామ పట్ట్భాషేకం
భక్తులకు అనుగ్రహభాషణం చేసిన అహోబిళ జీయర్‌స్వామి
మార్కాపురంరూరల్, మార్చి 1: మార్కాపురం పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీలో ఉన్న శ్రీరామనామక్షేత్రంలో జరుగుతున్న 49వ శ్రీ హరేరామనామ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి ఆలయంలో శ్రీరామ పట్ట్భాషేకాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గోళ్ళ వాసుదేవరావు, వెన్నా పోలిరెడ్డి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించగా ఆలయ అర్చకులు తిరుమలచార్యులు, కె రఘునాథచార్యులు పట్ట్భాషేక మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ త్రిదండి అహోబిళ రామానుజ జీయర్‌స్వామి పట్ట్భాషేక మహోత్సవానికి హాజరై భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. ప్రతి మనిషి సత్ప్రవర్తన కలిగి ఉండాలని, దైవచింతన, ధార్మిక చింతన ఉండాలన్నారు. సన్మార్గంలో నడవాలని కోరారు. ఈసందర్భంగా జీయర్‌స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకాగా నిర్వాహకులు ఎస్ పెద్దయోగిరెడ్డి, జివి సుబ్బయ్య, కె రాజారెడ్డి, డి వెంకటరెడ్డి, పి చెంచయ్యలు భక్తులకు తీర్ధప్రసాదాలను అందించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అఖండజ్యోతి ఉద్వాసన, మహాపూర్ణాహుతి నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. గురువారం ఉదయం వికాస తరంగిణి ఆధ్వర్యంలో భక్తులు విష్ణుసహస్రనామపారాయణం, భగవద్గీత పారాయణాన్ని నిర్వహించారు.
మేలో ఎంసిఐ బృందం రాక
రిమ్స్ డైరెక్టర్ బి అంజయ్య వెల్లడి
ఒంగోలు అర్బన్, మార్చి 1: రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌స్ (రిమ్స్) వైద్య కళాశాలను భారత వైద్య మండలి (ఎంసి ఐ) బృందం మే నెలలో పరిశీలించనుందని రిమ్స్ డైరెక్టర్ బి అంజయ్య తెలిపారు. గురువారం రిమ్స్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27, 28 తేదీలలో ముగ్గురితో కూడిన ఎంసిఐ బృందం రిమ్స్ వైద్య కళాశాలను సందర్శించిందన్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాదు, శ్రీకాకుళం, కడప, ఒంగోలుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రిమ్స్ వైద్యకళాశాలను ఏర్పాటుచేసిందని తెలిపారు. అయితే మూడు జిల్లాల్లో ఇప్పటికే నాల్గవ బ్యాచ్ ప్రారంభమైందని, ప్రస్తుతం జిల్లాలో రెండవ బ్యాచ్ కూడా ప్రారంభం కాకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వచ్చిన ఎంసిఐ బృందం కొన్ని సౌకర్యాలు సక్రమంగా లేనందువల్ల రెండవ బ్యాచ్‌కు అనుమతి ఇవ్వలేదన్నారు. తిరిగి మే నెలలో ఎంసిఐ బృందం రిమ్స్ వైద్య కళాశాలను సందర్శిస్తుందని ఆయన తెలిపారు. జూన్ 15వ తేదీన హైదరాబాదులో రిమ్స్ వైద్య కళాశాలలపై సమావేశం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు రిమ్స్ వైద్య కళాశాలకు 240 కోట్ల రూపాయలను ప్రతిపాదించగా, 185 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. ఎంసిఐ బృందం తిరిగి వచ్చేసరికి రిమ్స్ వైద్య కళాశాలలో అసంపూర్తిగా ఉన్న భవనాలు, ల్యాబ్‌లు, ప్రహరి నిర్మాణాలు చేపడ్తామని పేర్కొన్నారు. ఈసారి తప్పనసరిగా ఎంబిబిఎస్ రెండవ బ్యాచ్‌కు అనుమతి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక కార్యదర్శి పివి రమేష్ రిమ్స్‌లోని సౌకర్యాలను మెరుగుపర్చిందుకు 45 కోట్ల రూపాయలను విడుదల చేశారని తెలిపారు. రిమ్స్ వైద్య కళాశాలను అన్ని హంగులతో తీర్చిదిద్దుతామన్నారు. ఏప్రిల్ 15వ తేదీలోగా నిర్మాణాలను పూర్తిచేస్తామన్నారు. ఈసమావేశంలో రిమ్స్ వైద్య కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ జి భుజంగరావు, సిఎస్‌ఆర్‌ఎం డి సుజాత తదితరులు పాల్గొన్నారు.
అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్
మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య ధ్వజం
చీరాల, మార్చి 1: అధిక ధరలను అరికట్టకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతూ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, టిడిపి సభ్యత్వ నమోదు పరిశీలకుడు పట్నం సుబ్బయ్య ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అరాచకాలను ఆపాలంటే ఒక్క టిడిపికే సాధ్యమన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలోకన్నా సభ్యత్వ నమోదు కార్యక్రమం చీరాల నియోజకవర్గ పరిధిలో చాలా చురుకుగా సాగుతున్నదని తెలిపారు. ఈసారి సభ్యత్వ నమోదు చేసుకునేందుకు యువత, మహిళలు ఎక్కువ ఆసక్తి చూపటం హర్షనీయమన్నారు. చీరాల రూరల్, వేటపాలెం మండలాలలో అత్యధికంగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని ఆ మండలాల నాయకులును అభినందించారు. సమష్టి సహకారంతోనే సభ్యత్వ నమోదు విజయవంతం అవుతుందన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో గ్రామ, మండల స్థాయి ఎన్నికలు పూర్తిచేస్తామన్నారు. అనంతరం మే మొదటి వారంలో జిల్లా స్థాయి ఎన్నికలను పూర్తిచేసి మే 28, 29, 30 తేదీలలో జరుగనున్న మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ ఎంపిక జరుగుతుందన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ , మండల అధ్యక్షులు డేటా నాగేశ్వరరావు, పాలిబోయిన చిన అంకిరెడ్డి, కోటా సాంబయ్య, ఎస్‌టి సెల్ రాష్ట్ర కార్యదర్శి మల్లి రామకృష్ణ, డాక్టర్ భవానీ ప్రసాద్, బోయిన రాఘవ, గుంటూరు మాధవరావు, గుద్దంటి చంద్రవౌళి, పి వినోద్, నాదెండ్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘రాష్ట్రంలో మాఫియా పాలన’
చీమకుర్తి: రాష్ట్రాన్ని మాఫియా పాలిస్తోందని మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య ధ్వజమెత్తారు. గురువారం చీమకుర్తిలోని ఎంఎస్‌ఆర్ ప్రాంగణంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి సభ్యత్వ నమోదులో భాగంగా బాపట్ల పార్లమెంటు పరిధిలోని నాలుగు నియోజకవర్గాల పరిశీలనలో భాగంగా తాను సంతనూతలపాడు నియోజకవర్గానికి వచ్చినట్లు తెలిపారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో యువకులైన మన్నం శ్రీ్ధర్‌బాబు సభ్యత్వ నమోదులో జిల్లాలో ప్రథమస్థానంలో ఉన్నారన్నారు. ఇలాంటి యువకులకు ప్రోత్సాహం ఇచ్చి రాబోయే ఎన్నికల్లో విజయానికి బాటలు వేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ దోపిడీ విధానం, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై తమపార్టీ పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో తిరిగి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుకావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావల్సిందేనన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో క్రీయశీలక సభ్యత్వం 10,500 మంది తీసుకున్నారన్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఏడువేలు, పర్చూరు 4,500, చీరాలలో 2,500 మంది సభ్యులు చేరారన్నారు. అనంతరం తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నం శ్రీ్ధర్ మాట్లాడుతూ ఈనియోజకవర్గాన్ని జిల్లా వ్యాప్తంగా సభ్యత్వంలో ముందువరసలో ఉండటానికి సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మన్నం ప్రసాదు, వివరం గోవిందు, కట్రగడ్డ రమణయ్య, గుండవరపు శ్రీను, వేల్పూల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
జరుగుమల్లి, మార్చి 1: మండలంలోని కామేపల్లి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ షాకుతుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించిన పరికరాలలో పురాతన నాణ్యప్రదర్శన, సౌరశక్తి విద్యుత్ శక్తిగా మార్చిడం, మూత్రపిండాలు పనిచేయు విధానం, సూక్ష్మ బిందు సేద్యం, పిన్‌మోల్‌కెమేరా, ఫుట్‌సెల్, విద్యుత్ మోటారు, విటమిన్లు లభించే ఆహార పదార్థాలు, ప్రమాద సూచిక విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈప్రదర్శన చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో వచ్చి తిలకించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా వైజ్ఞానిక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన శాస్ర్తియ విధానానికి సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను ఈప్రదర్శనలో ఉంచారన్నారు. ప్రదర్శనకు ఉంచిన వాటిలో ఉత్తతమైన వాటిని ఎంపిక చేస్తామని తెలిపారు. సైన్స్ జాతిని జాగృతం చేసి, అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని అన్నారు. ఈప్రదర్శనలో విద్యార్థులలోని శాస్ర్తియ సృజనాత్మకతను వెలికితీసి వారిని బుల్లి శాస్తవ్రేత్తలుగా తయారు చేసిందన్నారు. సైన్స్‌లేనిదే మానవజీవితం లేదని, సైన్స్‌ను అవగాహన చేసుకొని విద్యార్థులు శాస్తవ్రేత్తలుగా రూపాంతరం చెందాలని సూచించారు. శాస్తవ్రేత్తలు విద్యార్థులలోనే ఉన్నారని, ఆదిశగా ఎదగాలంటే వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ఈసైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలో లక్ష్మీనారాయణ, ప్రసాద్, పద్మ, కోటేశ్వరరావు, కెవిఎస్.రజినీకుమారి, జి.సుబ్బారావు సహకారంతో గణిత నమూనాలను ప్రదర్శనలో ఉంచారన్నారు.
ఆటో బోల్తాపడి
తొమ్మిది మందికి గాయాలు
చీరాల, మార్చి 1: ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో మిరపకాయ కోత పనికి వెళ్తున్న తొమ్మిది మంది కూలీలు గాయాలపాలైన సంఘటన సంతరావూరు-గొల్లపాలెం గ్రామాల మధ్య గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు సంతరావూరుకు చెందిన డి బిక్షవతి, టి మహాలక్ష్మమ్మ, ఎం రూతుమ్మ, ఎస్ భారతమ్మ, జి కోటమ్మ, ఎం రోజానమ్మ, ఎస్ మాణిక్యం, కె సుబ్బమ్మ, కె ఎస్తేరమ్మలు సంతరావూరులో ఆటో ఎక్కారు. గొల్లపాలెంకు వెళ్తుండగా మార్గమధ్యంలో గుంతలు తప్పించబోయి ఆటోడ్రైవర్ అత్యవసర బ్రేక్ వేయటంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఆటోలో మొత్తం 12 మంది ఉండగా వారిలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవటంతో వారు ఇంటికి వెళ్ళారు. తీవ్ర గాయాలపాలైన తొమ్మిది మందిని 108 సిబ్బంది చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వీరిలో బిక్షవతి, రోజానమ్మల పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఔట్‌పోస్టు పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.
క్షతగాత్రులకు పరామర్శ
సంతరావూరు-గొల్లపాలెం గ్రామాల మధ్య జరిగిన ఆటో ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులను గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏరియా వైద్యశాలలో పరామర్శించారు. నాయకులు యడం రవిశంకర్, దళిత క్రైస్తవ నాయకులు నీలం శామ్యూల్ మోజస్ తదితరులు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైద్యాధికారి సిహెచ్ ప్రసన్నకుమర్‌ను మెరుగైన వైద్యసేవలు అందించాలని వారు కోరారు.
మహిళ దారుణ హత్య
తర్లుపాడు, మార్చి 1: మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని తాడివారిపల్లి ఘాట్‌రోడ్డులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా మాచవరం మండలం పినె్నల్లి గ్రామానికి చెందిన మైలమూరి పార్వతి (30)కి రెంటచింతల గ్రామానికి చెందిన పి శ్రీనివాసులుతో వివాహమైంది. ఆమె మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను హతమార్చిన సంఘటనలో నిందితురాలిగా ఉంది. కాగా గురువారం కొనకనమిట్ల మండలం వేములపాడులో జరిగే ఒక వివాహానికి హాజరయ్యేందుకు వచ్చింది. ఈ సమయంలో కొందరు వ్యక్తులు పార్వతిని జీపులో ఎక్కించుకొని ఘాట్‌రోడ్డు వైపు తీసుకువెళ్ళారు. రోడ్డుపై జీపు ఆపి పార్వతిని బలవంతంగా లాక్కువెళ్తున్న సంఘటనను అటుగా వెలుతుండిన ప్రయాణికులు చూసి వేములపాడు బస్టాండ్‌లో సమాచారం అందించారు. ఈమేరకు అక్కడ ఉన్న యువకులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళగా అప్పటికే పార్వతి మృతి చెంది ఉంది. గొంతుకు కండువతో బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె సన్నిహితులే ఈ సంఘటనకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్శి డిఎస్పీ వెంకటలక్ష్మి, పొదిలి సిఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కేసును ఛేదించేందుకు ఒంగోలు నుంచి క్లూస్ టీంను, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు.
ఉపాధి పనుల్లో అవకతవకలపై
మొబైల్ కోర్టులో విచారణ
డ్వామా పిడి రమేష్‌కుమార్ వెల్లడి
కందుకూరు, మార్చి 1: ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అవకతవకలపై ఇకనుంచి మొబైల్ కోర్టుల ద్వారా విచారణ చేపట్టనున్నట్లు డ్వామా పిడి ఎ.రమేష్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో తనను కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల పరిధిలోని కేసులకు సంబంధించి గుంటూరులో ఏర్పాటు చేయనున్న మొబైల్ కోర్టులో విచారణ జరుగుతుందని తెలిపారు. అవకతవకలు జరిగినట్లు రుజువు అయితే మూడు నెలల నుండి రెండేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో మూడు విడతల జరిగిన ఉపాధి హామీ సామాజిక తనిఖీలో కోటి రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. అందులో 35లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు తెలిపారు. పథకం సక్రమంగా అమలుకు పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
మొక్కుబడిగా సామాజిక తనిఖీకి ప్రజా వేదిక
కందుకూరు రూరల్: ఉపాధి హామీ పతకంలో జరిగిన అవినీతి అక్రమాలపై సామాజిక తనిఖీ బృందాల సర్వే బహిరంగ ప్రజా వేదిక జనం లేక వెలవెలబోయింది. గురువారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ చర్చావేదిక జరిగింది. ఈకార్యక్రమానికి డ్వామా పిడి ఎ.రమేష్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే సామాజిక తనిఖీతో ఏమి వనగూరేది లేదని ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనలేదు. తనిఖీలో పాఠం మాదిరిగా సిబ్బంది సామాజిక తనిఖీల సారాంశాన్ని చదివారే తప్ప, ఏఏ గ్రామాలలో ఎంత అనేది పూర్తిస్థాయిలో చదవలేదని పలువురు పెదవి విరిచారు. ఈ ప్రజా వేదికలో ఎంపిడిఓ హేమాద్రినాయుడు, ఎపిఓ నాగేశ్వరరావు పనితీరుపై పిడి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమానికి ఎపిడి కాత్యాయని హాజరయ్యారు.
ఒంగోలులో ఆక్రమణల తొలగింపు
ఒంగోలు, మార్చి 1: నగరపాలక సంస్థ అధికారులు గురువారం ఒంగోలులో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలో నిరంతరం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుండడంతో అధికారులు ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. తొలుత లంబాడిడొంకలోని రోడ్లకు ఇరువైపుల వున్న షాపులు, ఇతరత్రా ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని ఒంగోలు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టారు. లంబాడిడొంకలోని రోడ్లకు ఇరువైపుల వున్న బంకులు, టీ షాపులు, జ్యూస్ షాపులు. సైకిల్ మెకానిక్ షాపులు. రోడ్డుకు అడ్డంగా మోటారు మెకానిక్ షాపులను తొలగించారు. ఆక్రమణల తొలగింపుపై షాపుల యజమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎన్నో సంవత్సరాలుగా లంబాడిడొంకలో చిన్నచిన్న బంకులను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. రోడ్డులో ఎవరికి ఇబ్బంది కలుగకుండా తమ వ్యాపారాలను చేసుకుంటున్నట్లు తెలిపారు. షాపులను తొలగించడం వల్ల తమ జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుందని, తమ షాపుల తొలగింపు కార్యక్రమాన్ని ఆపాలని నగరపాలక సంస్థ అధికారులను వేడుకున్నారు. అయినప్పటికీ నగరపాలక అధికారులు పోలీసు అధికారుల సహకారంతో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. తొలగించిన తోపుడుబండ్లు, బంకులను మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లలో వేసుకుని నగరపాలక సంస్థ కార్యాలయానికి తరలిచించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఒంగోలులో నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతుండడంతో ఆక్రమణల తొలగింపు చేపట్టినట్లు తెలిపారు. తొలుత లంబాడిడొంకలో ఆక్రమణల తొలగింపు చేపట్టినట్లు తెలిపారు, శుక్రవారంనాడు 60 అడుగుల రోడ్డులో ఆక్రమణలు తొలగించనున్నట్లు తెలిపారు. ఆ తరువాత నగరంలో ఇరుకుగా వుండే రోడ్ల వెంబడి ఆక్రమణలను తొలగంపు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇదిలా వుండగా ఇప్పటికే నగరంలోని కర్నూలు రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా నగరంలోని కొత్తపట్నం రోడ్డు, ట్రంకురోడ్డు విస్తరణ కార్యక్రమాలను చేపట్టే యోచనలో నగరపాలక సంస్థ అధికారులు ఉన్నారు.
వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధికార ప్రతినిధుల ఎంపిక
ఒంగోలు అర్బన్, మార్చి 1: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధులుగా నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు, టి నర్సింగరావులను ఎంపిక చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు ఒంగోలు, కనిగిరి, కందుకూరు డివిజన్‌లకు చెందిన నాయకులను జిల్లాపార్టీ అధికార ప్రతినిధులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. సామాజిక న్యాయం పాటిస్తూ జిల్లా అధికార ప్రతినిధులను ఎంపిక చేశామన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అధికార ప్రతినిధులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. వైఎస్ కుటుంబం కోసం నెల్లూరు ఎంపి మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేసి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారన్నారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమారి రాజమోహన్‌రెడ్డి రాజీనామా ఆమోదించటం శుభపరిణామం అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయం తథ్యమన్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా తమ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి మాట్లాడుతూ తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నాయకులు వైవి సుబ్బారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడిన తీరు రాష్ట్ర ప్రజలను విశేషంగా ఆకట్టుకుందన్నారు. అనంతరం జిల్లా పార్టీ అధికార ప్రతినిధులు కొఠారి రామచంద్రరావు, టి నర్సింగరావులు మాట్లాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా తమవంతు సహకారాలు అందిస్తామన్నారు. ఒంగోలు నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పార్టీ అభివృద్ధికోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి రానున్న కమిటీలో సముచితస్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల సుధాకర్‌బాబు, సేవాదళ్ చైర్మన్ ఆవుల చంద్రశేఖరరెడ్డి, ఆపార్టీ నాయకులు దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, రాయని వెంకట్రావు, వసంత్, నత్తల భీమేష్, టి అంజిరెడ్డి, కావూరి సుశీల తదితరులు పాల్గొన్నారు.