మచిలీపట్నం, మార్చి 1: పురపాలక సంఘ ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పురపాలక సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా బిసి ఓటర్ల జాబితాను అధికారులను విడుదల చేశారు. జిల్లాలో ఐదు పురపాలక సంఘాలతో పాటు నూతనంగా ఏర్పడిన ఉయ్యూరు, నందిగామ, తిరువూరు పురపాలక సంఘాలకు ఈ విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. బిసి ఓటర్ల సర్వే పూర్తి కావటంతో జాబితాలను పురపాలక సంఘాల వారీగా మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు విడుదల చేశారు. జిల్లాలో ఐదు పురపాలక సంఘాలతోపాటు కొత్తగా ఏర్పడిన నందిగామ, తిరువూరు, ఉయ్యూరు పురపాలక సంఘాల్లో లక్షా 40వేల 795 మంది బిసి ఓటర్లు ఉన్నట్లు సర్వేలో తేలింది. అత్యధికంగా మచిలీపట్నం పురపాలక సంఘంలో 43,394 మంది బిసి ఓటర్లు ఉండగా అత్యల్పంగా తిరువూరు పురపాలక సంఘంలో 8,044 మంది బిసి ఓటర్లు ఉన్నారు. గుడివాడలో 31,999 మంది, జగ్గయ్యపేటలో 12,466, నందిగామలో 8,187, ఉయ్యూరులో 12,133, పెడనలో 12,709 మంది బిసి ఓటర్లు ఉన్నారు. బిసి ఓటర్ల జాబితాను అన్ని పురపాలక సంఘ, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ జాబితాలపై ఈనెల 3వతేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 4వతేదీ నుండి 6వతేదీ వరకు అభ్యంతరాలను విచారించే అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. 7వతేదీ నుండి 9వతేదీ వరకు అభ్యంతరాలపై విచారణ నిర్వహిస్తారు. 10, 11తేదీల్లో తుది ఓటర్ల జాబితాను రూపొందించి 12వతేదీన ప్రకటిస్తారు. 13, 14తేదీల్లో పురపాలక సంఘ డైరెక్టర్‌కు తుది జాబితా, రిజర్వేషన్‌లను సమర్పించనున్నారు. 15వతేదీ నుండి 20వతేదీ వరకు బిసి వార్డులను ప్రకటిస్తారు. 21, 26తేదీల్లో పురపాలక సంఘ స్థాయిలో బిసి వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పురపాలక సంఘాల్లో అభివృద్ధి కుంటుపడిందన్న విమర్శలు లేకపోలేదు. ప్రత్యేక పాలన పట్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ప్రభుత్వం పురపాలక సంఘ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. బిసి ఓటర్ల జాబితా పూర్తయిన నాలుగు నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించింది. బిసి ఓటర్ల జాబితా ఒక కొలిక్కి రాగానే ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనుంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు పురపాలక సంఘ ఎన్నికలతో ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
* ఆరుగురికి తీవ్రగాయాలు
నందిగామ, మార్చి 1: నందిగామ - మధిర రహదారి మధ్యలో కొండూరు గ్రామ క్రాస్ రోడ్డు వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందిగామ నుండి మధిర వైపు వెళ్తున్న ఆటో కొండూరు క్రాస్ రోడ్డు వద్ద అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో చందర్లపాడు మండలం పొక్కునూరుకు చెందిన నండ్రు వెంకమ్మ (60), గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామానికి చెందిన నలగట్ల సావిత్రి మృతి చెందగా, నండ్రు వెంకటేశ్వర్లు, పాడిశెట్టి రంగమ్మ (దెందుకూరు), షేక్ లాల్‌సాహెబ్ (మీనవోలు), పి జయప్రకాష్ (కీసర), రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలమాల చిన వెంకటేశ్వర్లు, తలమాల సుశీల తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన వెంటనే ఆటోడ్రైవర్ పరారైనట్లు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోక్‌సభ స్పీకర్‌కు ఘనస్వాగతం
గన్నవరం, మార్చి 1: లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించేందుకు ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో సాయంత్రం 4.40 గంటలకు గన్నవరం వచ్చారు. రన్‌లే నుండి కారులో బయట వచ్చిన ఆమెకు అధిక సంఖ్యలో పాల్గొన్న రెండు జిల్లాల కాంగ్రెస్ నాయకులు, పలు క్రైస్తవ సంఘాలు, ఎస్సీ సంఘాల వారంతా పుష్పగుచ్చాలు, పూలదండలతో స్వాగతం పలికారు. రన్‌వే మెయిన్‌గేటు నుండి స్పీకర్ వస్తుండటంతో పోలీసులు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేయటంతో పాటు రోప్ టీంను ఏర్పాటు చేశారు. దీంతో తమ నాయకురాలిని చూడాలని ఆతృతతో ఒక్కసారిగా ఆమె కారువైపు అభిమానులు తోసుకువెళ్లారు. పోలీసులు వారందరినీ అడ్డుకొని కొంత మంది ముఖ్య నాయకులకే స్పీకర్‌ను కలిసే అవకాశాన్ని కల్పించారు. అనంతరం స్పీకర్ రోడ్డు మార్గగుండా విజయవాడకు వెళ్లారు. స్పీకర్ రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటంతోపాటు కాన్వాయ్ వెళ్ళే వరకు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్, మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, పిసిసి కార్యదర్శి కొలనుకొండ శివాజీ, డిసిసి ఇన్‌చార్జి నరహరశెట్టి నరసింహరావు, పారిశ్రామికవేత్త సిరీస్ రాజు, గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు, నూజివీడు ఆర్‌డిఓ బి సుబ్బారావు, విజయవాడ తూర్పు విభాగం ఏసిపి గీతాదేవి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ రవిబాబు, గన్నవరం కాంగ్రెస్ నాయకులు నల్లూరి వెంకటేశ్వరరావు, నెర్సు శ్రీనివాసరావు, కొమ్మినేని మల్లిఖార్జునరావు, గోపిశెట్టి వీరాస్వామి, దళిత నాయకులు నిడమర్తి రామారావు, చిన్నారావు, తిరివీధి కోటయ్య, నానిబాబు తదితర రెండు జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రైస్తవ, దళిత సంఘాలు స్వాగతం పలికేందుకు వచ్చారు. ఇదిలా ఉండగా స్పీకర్ వెంట అదే విమానంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి కూడా గన్నవరం వచ్చారు. ఈ సందర్భంగా కన్నా యూత్ ఆధ్వర్యంలో విమానాశ్రయం నుంచి విజయవాడ వరకు భారీ కార్ల ర్యాలీ జరిగాయి.
పదవ తరగతి పరీక్షలకు 62,323 మంది
మచిలీపట్నం , మార్చి 1: ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఎంవి కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 62,323 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయనున్నట్లు తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 51,747 మంది కాగా ప్రైవేట్ విద్యార్థులు 10,576 మంది ఉన్నారన్నారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 242 పరీక్షా కేంద్రాలను, ప్రైవేట్ విద్యార్థుల కోసం 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 14 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విజయదుందుభి
చందర్లపాడు, మార్చి 1: ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం చందర్లపాడులో మండల కన్వీనర్ కోట బుచ్చియ్య ఆద్వర్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను విచ్చేశారు. గ్రామంలోని అయ్యప్పస్వామి గుడి వద్ద నుండి కార్లు, బైకుల ర్యాలీతో బాణాసంచ కాల్చుకుంటూ గ్రామంలో గొప్ప ఊరేగింపుగా వచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకున్న ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే వారు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరు మాత్రమే అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం రాజకీయ కుమ్ములాటలతో కుక్కలు చింపిన ఇస్తరిలా తయారైందని, ఇంత దరిద్రమైన రాజకీయాలు ఎప్పుడూ ప్రజలు చూసి ఉండరని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయమని జోస్యం చెప్పారు. గతంలో జరిగిన కడప ఎన్నికల మాదిరిగానే డిపాజిట్లు రావని, అందుకే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం జంకుతోందని అన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవినీతిపరుడు అంటున్నారే కాని, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు అవినీతిపరులు కాదా అని ప్రశ్నించారు. సునామీలా వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఓర్వలేకే సిబిఐ దాడులు జరిపిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగన్ ప్రభంజనం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తాతినేని పద్మావతి, యూత్ నాయకులు అబ్రహం లింకన్, సానికొమ్ము వెంకటేస్వరరెడ్డి, కోటేరు ముత్తారెడ్డి, కొవెలమూడి వెంకటనారాయణ, చింతోటి ప్రసాదు, గుడేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రతో విడదీయరాని అనుబంధం
అజిత్‌సింగ్‌నగర్, మార్చి 1: స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటి వరకూ ఆంధ్రప్రదేశ్‌తో మా కుటుంబానికి రెండు తరాల అనుబంధం ఉందని, ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుందని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ పేర్కొన్నారు. బాప్టిస్టునగర్ జింఖానా క్లబ్ వద్ద దళిత క్రైస్తవ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్, బాప్టిస్టునగర్, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దళితుల ఆశాజ్యోతి, మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా తన భర్త మంజుల్‌కుమార్‌తోపాటు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో స్పీకర్ మీరాకుమార్ మాట్లాడుతూ దళితుల, పేద, బడుగు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక ప్రగతితోనే దేశాభ్యున్నతి జరుగుతుందని, వీరి అభివృద్ధి కోసం అనేక పథకాలను నిర్వహిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలతోపాటు వారికి అవసరమైన వివిధ అవసరాలను పార్లమెంటు సభ్యుల దృష్టికి తీసుకువస్తే వారు వాటిని పార్లమెంటులో ప్రస్తావించి ఆయా అవసరాలు తీరేలా చర్యలు తీసుకొంటారన్నారు. సామాజిక అభ్యున్నతికి పార్లమెంటు నిరంతరం కృషి చేస్తుందని, పార్లమెంటులో రూపొందించిన చట్టాల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలోని అణగారిన, నిమ్నజాతుల వారికోసం ఏయే చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఆనాడు గాంధీ ఇతర దేశ నాయకులతో బాబూజీ తపన పడ్డారని, ఆయనలో ఉన్న తపనతోనే ఆయన నిర్వహించిన కేంద్ర మంత్రి పాలన హయాంలో అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో తనకు రెండు తరాల అనుబంధం ఉందని, నేటి తరాల వారికి అక్కలా ఉండి ఈ సంబంధాలను ఎప్పటికీ వీడేది లేదన్నారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ముఖ్యంగా ఐటి, సిలికాన్‌వాలి తదితర రంగాల్లో అభివృద్ధి ఎంతో బాగుందన్నారు. అదేవిధంగా మైక్రోఫైనాన్స్ విధానం ఎంతో చక్కగా అమలైందని, ఈ విషయాన్ని రెండు సంవత్సరాల క్రితం ఒక సెమినార్‌లో బంగ్లాదేశ్ నోబెల్ బహుమతి విజేత మహ్మమద్ యూనస్ తన ప్రసంగంలో పేర్కొనడం హర్షనీయమన్నారు. ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారు ప్రథమంగా పార్లమెంటును తరువాత తాజ్‌మహల్‌ను చూసిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌ను చూడాలనుకోవడం సహజమన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రావడానికి తనకు ఎంతో ఇష్టంగా ఉంటుందని, ప్రతి సంవత్సరం తాను ఈ రాష్ట్రానికి వస్తున్న విషయాన్ని అమె గుర్తుచేసారు. తన తండ్రి బాబూజీతోపాటు తనకు కూడా తెలుగు ప్రజలంటే మక్కువ ఎక్కువ అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రామ్ సుమారు యాభై సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగానే కాకుండా కేంద్రంలో అనేక పదవులను అలంకరించారు గానీ, ఆయన పదవీ కాలంలో ఎటువంటి చిన్న ఆరోపణలు, విమర్శలనైనా ఎదుర్కొనని మహా నాయకుడని కొనియాడారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలిచే విగ్రహాల ఏర్పాటు ఎంతో హర్షనీయమన్నారు. తండ్రి బాటలోనే మీరాకుమార్ పయనిస్తున్నారని, ప్రస్తుతం స్పీకర్‌గా పనిచేస్తున్న మీరాకుమార్ ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన స్పీకర్‌గా ఉన్నారన్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు లగడపాటి రాజ్‌గోపాల్ మాట్లాడుతూ దళిత క్రిస్టియన్ల కోసం, సమసమాజ స్థాపన కోసం, దళితజాతి అభ్యున్నతికై బాబూజీ చేసిన కృషి అజరామరమన్నారు. పండిట్ నెహ్రూ మంత్రివర్గంలో అతి చిన్న వయస్సులోనే కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన ఘనత ఆయనదన్నారు. ఆయన జీవితాంతం ప్రజాసేవకే అంకితమైన మహనీయుడన్నారు. బాబూజీ మార్గంలో పయనించి సామాజిక అభ్యున్నతికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సుధీర్ఘ దేశ రాజకీయ చరిత్రలో బాబూ జగ్జీవన్‌రామ్ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగిందని, దేశంలోని దళితులు సామాజిక, ఆర్థిక ఎదుగుదల జరగాలని కోరుకొంటూ అయన నిర్వహించిన మంత్రి పదవుల్లో అనేక పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడన్నారు. పామర్రు ఎమ్మెల్యే డివై దాసు మాట్లాడుతూ బాబూజీ దళిత కులదైవమని, దేశంలో అంటరానితనాన్ని రూపుమాపి చట్టసభలో దళితులకు అవకాశం కల్పించిన ఘనత ఆయనదేన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి తదితరులు ప్రసంగించారు. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం జాతీయ అద్యక్షుడు రెవరెండ్ లంకా కరుణాకర్‌దాస్ అద్యక్షత వహించిన ఈకార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ జి రవిబాబు, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైలా సోమినాయుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహరావు, మాజీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మట్టా జోబ్ రత్నకుమార్, తదితరులు పాల్గొన్నారు. సభానంతరం స్పీకర్ మీరాకుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు.
ఫిఫ్టీ ఫిఫ్టీ
విజయవాడ, మార్చి 1: రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత అతిపెద్ద దేవాలయంగా పేరొందిన దుర్గమ్మ గుడికి పాలకవర్గం ఏర్పాటులో ఇక తాత్సారం జరుగకుండా ఎంపి లగడపాటి రాజగోపాల్, శాసనసభ్యులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌ల మధ్య రాజీ కుదిరినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. నామినేటెడ్ పదవుల పందారంలో జరుగుతున్న జాప్యాన్ని ఇటీవల జరిగిన నగర కాంగ్రెస్ సమావేశంలో కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దుర్గగుడికి గత మూడేళ్లుపైగా కమిటీ లేకపోవటంపై అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ లోపం.. దీనికి తోడు అవినీతి అక్రమాలు చోటు చేసుకోవటంతో దుర్గగుడి తరచూ వార్తల్లోకి ఎక్కాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తొలుత దుర్గగుడి పాలకవర్గం ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రజాప్రతినిధుల్లో కల్గుతున్నది. దుర్గగుడి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నందున చైర్మన్ పదవి తాను సిఫార్సు చేసిన వ్యక్తికే దక్కాలని ఆ ప్రాంత శాసనసభ్యుడు వెలంలపల్లి శ్రీనివాస్ గతంలో కె రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పావులు కదిపారు. ప్రజారాజ్యంకు చెందిన వెలంపల్లి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరినందున తమ సిఫార్సులకే ప్రాధాన్యమివ్వాలని లగడపాటి, మల్లాది, ప్రస్తుత సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా చైర్మన్ పదవి తన మామ ఉపేంద్ర లోక్‌సభకు పోటీ చేయటం ప్రారంభించి నప్పటి నుంచి తనకు సైతం పశ్చిమలో వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పారిశ్రామికవేత్త బాయన వెంకట్రావుకు ఇప్పించడానికి లగడపాటి తన శాయశక్తుల కృషి చేస్తున్నారు. అయితే మల్లాది విష్ణు మాత్రం తాను ఉడా చైర్మన్‌గా ఉన్నప్పటి నుంచి తనకు ఎంతో సన్నిహితంగా మెలుగుతూ వస్తోన్న విక్రమ్ మోహన్‌కు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో పాలకవర్గం ఏర్పాటుకు బ్రేక్ పడుతూ వచ్చింది. దీంతో లగడపాటి, మల్లాది విష్ణు మధ్య ఓ రాజీ జరిగినట్లు తెలిసింది. దీని ప్రకారం ఒక ఏడాది బాయన వెంకట్రావు, రెండో ఏడాది విక్రమ్ మోహన్ చైర్మన్‌గా బాధ్యత వహిస్తారు. పాలకమండలిలో వెల్లంపల్లి సిఫార్సు చేసినవారికి పెద్దపీట వేస్తారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా, అలాగే కృష్ణాజిల్లా నుంచి కూడా చైర్మన్ పదవి కోసం పలువురు ప్రజాప్రతినిధులు అనేక సిఫార్సులు చేస్తున్నారు. ఒక దఫా ఆయన గుంటూరు జిల్లాకు చైర్మన్ పదవి ఇవ్వాలని మరీ కోరుతున్నారు. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం సౌలభ్యం లేకనే గతంలో నగర మేయర్ పదవికి ముగ్గురు పంచుకున్నారు. తొలి ఏడాది సిపిఐకి చెందిన తాడి శకుంతల, ఆ తర్వాత రెండేళ్లు ఎంపి లగడపాటి వర్గానికి చెందిన మల్లికా బేగం, చివరి రెండేళ్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వర్గానికి చెందిన ఎంవి రత్నబిందు మేయర్లగా వ్యవహరించారు.
సర్వీస్ ఛార్జీ
విజయవాడ, మార్చి 1: రేపోమాపో లేదా ఏక్షణాన అయినా విద్యుత్ ఛార్జీలు పెరుగగలవనే సంకేతాలు అందుతున్న నేపథ్యంలో సర్వీస్ ఛార్జీ పేరిట వినియోగదారుల నుంచి అదనపు రుసుం వసూళ్లు ప్రారంభమయ్యాయి. అత్యధిక మందికి పాత బిల్లులు జారీ అయినా చెల్లింపు సమయంలో అదనంగా సర్వీస్ ఛార్జీ కూడా వసూలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే విద్యుత్‌శాఖ అధికారులు సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సిందేనంటూ ప్రకటనలు కూడా జారీ చేశారు. కేవలం ఈ సర్వీస్ ఛార్జీ వల్ల జిల్లా వినియోగదారులపై సాలీనా కనీసం 24 కోట్ల రూపాయల అదనపు భారం పడినట్లయింది. ఇక మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపుదలపై రాష్ట్రంలో డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇటీవలే తిరుపతిలో బహిరంగ విచారణ కూడా జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విద్యుత్ బిల్లుల ద్వారా లభించే రాబడిపై డిస్కంలు అదాయపుపన్ను శాఖకు చెల్లించాల్సిన పన్నుల సైతం సర్వీస్ ఛార్జీ పేరిట ముక్కుపిండి వసూలు చేసేందుకు తగు ఏర్పాటు చేశారు. ప్రతి వినియోగదారునిపై కనీసం 2 రూపాయల నుంచి 25 రూపాయల వరకు అదనపు భారం పడనుంది. కృష్ణాజిల్లాలో 12 లక్షల 35వేల విద్యుత్ కనెక్షన్‌లున్నాయి. వీటిల్లో 14వేల కనెక్షన్‌లు పారిశ్రామిక, వాణిజ్యపరంగా ఉన్నాయి. ఇక మిలిగిన 12 లక్షల 11వేల కనెక్షన్‌లు గృహావసరాలకు సంబంధించినవే. సగటున ప్రతి బిల్లుకు కనీసం రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. 200 రూపాయల నుంచి వెయ్యి వరకు బిల్లు చెల్లించే వారి నుంచి 5 రూపాయలు, ఐదువేల వరకు బిల్లు చెల్లించేవారి నుంచి 10 రూపాయలు, ఆపైన చెల్లించే వారి నుంచి 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇలా అదనపు రుసుం చెల్లించకపోతే అసలు బిల్లులే కట్టించుకోవద్దంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ విధంగా వసూలు చేస్తే జిల్లావాసులపై ప్రతి నెల కనీసం రెండు కోట్ల మేర అదనపు భారం పడుతుంది. గృహావసరాల కనెక్షన్‌దారుల్లో అత్యధిక మంది ఐదువేలు వరకు చెల్లించేవారున్నారు. పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్‌దారుల్లో 10వేలుపైనే బిల్లులు చెల్లించేవారున్నారు. 2010 ఆగస్టులో గృహావసర కనెక్షన్‌లపై ఛార్జీలు పెంచకపోయినా పారిశ్రామిక, వాణిజ్య వినియోగ విద్యుత్‌పై యూనిట్‌కు 50పైసలు పెంచగా జిల్లాపై రెండు కోట్ల రూపాయల మేర భారం పడింది. గత రెండేళ్లలో విద్యుత్ వినియోగదారుల నుంచి వివిధ రూపాల్లో 20 కోట్ల రూపాయలు వసూలు చేశారు. తాజాగా నెలకు మరో రెండు కోట్ల రూపాయల భారం పడినట్లయింది. ఇదిలా ఉండగా సర్వీస్ ఛార్జీ విధింపునకు నిరసనగా జిల్లాలో తొలుతగా సిపిఎం సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇంకా ఇతర రాజకీయ పక్షాలకు వేడిపుట్టినట్లు కన్పించడంలేదు.
విద్యుత్ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్
ఇంద్రకీలాద్రి, మార్చి 1: రానున్న ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుస్తుచర్యలు తీసుకోకపోవటంతో త్వరలో విపరీతమైన విద్యుత్ సంక్షోభం ఏర్పడి ‘రాష్ట్రం’ అంధకారంలోకి వెళ్ళే పరిస్థితులు నెలకొన్నాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అర్బన్ అధ్యక్షుడు జలీల్‌ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు ఇబ్బందికరంగామారిన ఈ విద్యుత్‌కోత విషయంలో సర్కార్ వెంటనే చర్యలు తీసుకోకపోతే వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ స్టేషన్‌లు ముట్టడి తప్పదని జలీల్‌ఖాన్ హెచ్చరించారు. పాతబస్తీ తారాపేటలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో అటు ప్రజలకు, ఇటు పరిశ్రమలు తదితర వాటికి అసరాల మేరకు విద్యుత్ సరిపోతోందని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే రాష్ట్రం అంధకారంలోనికి వెళ్లే పరిస్థితులు నెలకొంటాయని అధికారులు చెప్పినప్పటికీ వారి మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా కేవలం పదవి కోసం సియం పట్టించుకోలేదన్నారు. నేడు రాష్ట్ర నాయకులు చేసిన తప్పునకు ప్రజలు శిక్ష అనుభవించవల్సిన ఖర్మపట్టిందన్నారు. ప్రజలకు మేలు చేయవల్సిన ప్రజాప్రతినిధులు నేడు బహిరంగంగా అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర సర్కార్ విధానాలపై నిప్పులు చెరిగారు. మహానేత వైయస్ రాజశేఖరెడ్డి ఎంతో కష్టపడి కాంగ్రెస్‌పార్టీ నాయకులకు అధికారం అప్పగిస్తే నేడు ఈ నాయకులు ఆ మహానేత ఆశయాలకు తూట్లు పొడిచి అటు ప్రజలకు, మహానేతకు ఒకేసారి అన్యాయం చేశారన్నారు. ఇప్పటికే క్రాఫ్‌హాల్‌డే ప్రకటించిన రైతన్న బాటలోనే నేడు చిన్న పరిశ్రమల యాజమానులు కూడా పరిశ్రమలను మూసి వేస్తున్నారన్నారు. విద్యుత్‌కోత పుణ్యమైన చిన్నపరిశ్రమలు పూర్తిస్థాయిలో ఒక్కొకటి మూత పడటంతో వీటిలో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడుతున్నారని జలీల్‌ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్‌లో రాష్ట్రంలో కోటి హెక్టార్లలో పంటలు వేయవల్సిన రైతులు విద్యుత్‌కోత పుణ్యమని కేవలం 60లక్షల ఎకరాల్లో మాత్రమే రబీపంటలు వేసినప్పటికీ ప్రస్తుతం రైతన్నకు వేసిన పంట చేతికి వచ్చేవరకు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధులు రాంపిళ్ళ శ్రీను, కెనడీ, యూత్ నాయకులు బండారు వెంకట్, మన్నం అశోక్, 39వ డివిజన్ అధ్యక్షుడు మనోజ్‌కొఠారీ, వివిధ డివిజన్‌లకు చెందిన నాయకులు పాల్గొన్నారు.