Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మూడు కొత్త రైతుబజార్లు

$
0
0

విశాఖపట్నం, మార్చి 1: అందరికీ అందుబాటులో ఉండే రైతుబజార్లను మరిన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దీనిలో భాగంగా వీటి ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఇప్పటికే జివిఎంసి నాలుగో డివిజన్ పోతినమల్లపాలెం, వేపగుంట, అనకాపల్లి మునిసిపాలిటీ పరిధిలో కొత్తగా మూడు రైతుబజార్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. వీటితోపాటు అవసరాన్నిబట్టి మరికొన్నింటిని ఏర్పాటు చేసే అవకాశాలను జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న జనాభాకనుగుణంగా రైతుబజార్లను విస్తరించాలని, జిల్లాలో మరికొన్నిచోట్ల వీటి అవసరాన్ని గుర్తించిన జాయింట్ కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. దీనిలోభాగంగా రైతుబజార్ల ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధితాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన కనీసం ఎకరా స్థలాన్ని సేకరించే క్రమంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈవిధంగా స్థలాల సేకరణ, రవాణా, స్టాల్స్, కూరలు పండించే రైతులు తదితర అంశాలపై సంబంధితాధికారులు దృష్టిపెట్టారు. నెల రోజల వ్యవధిలో ఇవన్ని పూర్తయితే ఉగాది కానుకగా విశాఖవాసులకు కొత్త రైతుబజార్లను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో అతి పెద్ద హౌసింగ్‌బోర్డు కాలనీల్లో కూకట్‌పల్లి తరువాత పోతినమల్లయపాలెం కావడంతో ఇక్కడే రైతుబజార్ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడ రైతుబజార్ ఏర్పాటైతే దళారుల వ్యాపారాలకు కళ్ళెం వేసినట్టే. పుట్టగొడుగుల్లో వెలుస్తోన్న కూరల దుకాణాలతో ఇక్కడి రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయి. రైతుబజార్ ఏర్పాటుతో వీటన్నింటినీ నియంత్రించినట్టు అవుతుంది. ఆకాశనంటే కూరలు, పప్పుల ధరలకు కళ్ళెం వేయవచ్చు. మరోపక్క ఇందులో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పిఎం పాలెంలో రైతుబజార్ వస్తే సమీపంలోనున్న ఆనందపురం, పద్మనాభం, భీమిలి పరిసరాల్లో రైతుల నుంచి కూరలు, పప్పులను సేకరించి రవాణా చేయడం సులభమవుతుంది. అన్నింటి కంటే ప్రధానంగా దాదాపు 15 గ్రామాల ప్రజలకు ఇది అందుబాటులో ఉంటుంది. పోతినమల్లయ్యపాలెం, బక్కన్నపాలెం, కొమ్మాది, సాయినగర్, శంభువానిపాలెం (గిరిజన గ్రామం), కారుషెడ్ ఏరియా, లా కాలేజీ, స్టేడియం ఏరియా, మిధిలాపురి వుడా కాలనీ, చంద్రపాలెం తదితర ప్రాంతవాసులకు ఇది ప్రయోజనంగా ఉంటుంది. అయితే పిఎం పాలెంలో స్థల సేకరణ జరగాల్సి ఉంది. ఇదే తరహాలో వేపగుంటలో మరో రైతుబజార్ ఏర్పాటు కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇటు గోపాలపట్నం, పెందుర్తి ప్రాంతాల్లో రైతుబజార్లు ఉన్నందున ఈ రెండింటి మధ్యనున్న వేపగుంట, సుజాతనగర్ ప్రాంతాల్లో ఒకచోట రైతుబజార్‌ను ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. సుజాతనగర్,వేపగుంట, సింహాచలం తదితర పరిసర ప్రాంతాలన్నింటికీ ఇది అందుబాటులో ఉంటుంది కూడా. అందువల్ల ఈ మూడుచోట్ల రైతుబజార్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

మరో 50 ఆర్టీసీ కొత్త బస్సులు
విశాఖపట్నం, మార్చి 1: ఆర్టీసీ విశాఖ రీజియన్ తన వ్యాపారాన్ని మరింత పెంచుకునే క్రమంలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూనే మరోపక్క వ్యాపార లక్ష్యాలను ఊహించని విధంగా పెంచుకునేందుకు ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న నగరవాసుల రవాణా అవసరాలకు దీటుగా మరిన్ని సిటీ సర్వీసులను అందుబాటులో తీసుకురావాలని భావిస్తున్న ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు త్వరలో 30 ఆర్టీసీ కొత్త సర్వీసులు వస్తున్నాయి. వీటిని ఉగాది కానుకగా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
ఇవి కాకుండా ఇంద్ర, వెనె్నల తరహా ఏసి బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టేందుకు రీజనల్ మేనేజర్ వై.జగదీష్‌బాబు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలోభాగంగా ఇప్పటికే తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాలకు శని, ఆదివారాల్లో ఇక్కడ నుంచి ప్రత్యేక ఏసి సర్వీసులను నిర్వహిస్తున్నామన్నారు. ఇదే తరహాలో దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా సరికొత్త సదుపాయాలతో కూడిన బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు చెప్పారు. పర్యాటకశాఖతో సమన్వయమై కోరిన మేర ఆర్టీసీలను అందివ్వాలని, దీని ద్వారా వ్యాపార లక్ష్యాలను పెంచుకోవాలన్నది ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ వేసవి సీజన్‌లో దేశం నలుమూలలకు, రాష్ట్రంలోనున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీగా ఆర్టీసీ బస్సులను నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని, ప్రయాణికుల నుంచి వచ్చే ఆదరణను దృష్టిలో పెట్టుకుని వీటిని అందుబాటులో ఉంచదలిచామన్నారు. గత ఏడాది నవంబర్ నుంచి మూడు మాసాల పాటు ప్రత్యేక సర్వీసుల నిర్వహణ ద్వారా అయ్యప్ప భక్తులకు సౌలభ్యంగా ఉంచామని, సంక్రాంతి పండుగ సమయంలోనూ ఉత్తరాంధ్ర ప్రజలు ఎటువంటి రవాణఆ సమస్యలు ఎదుర్కొనకుండా బస్సులను నిర్వహించగలిగామన్నారు. ఇదే తరహాలో వేసవి సెలవుల్లో విద్యార్థులకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాల్సిన భక్తులకు సర్వీసులు వేయదలిచామన్నారు.

చేజారిపోతున్న దేవుని భూములు
విశాఖపట్నం, మార్చి 1: జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన భూములు కబ్జాకు గురవుతున్నాయి. వీటిని రక్షించే ప్రయత్నాలు నామమాత్రమే అవుతున్నాయి. దీంతో ఆక్రమణదారులకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. ఆక్రమణలకు కళ్ళెం వేసేందుకు ఈ శాఖ ఉన్నతాధికారులు అనేకసార్లు చేపట్టిన చర్యలకు రాజకీయ వత్తిళ్ళు బ్రేక్ వేస్తున్నాయి. ఫలితంగా ఏళ్ళు గడుస్తున్నా కబ్జాలకే కళ్ళెం వేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేవుని భూముల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా దేవాలయాల భూములను తక్షణమే స్వాధీనపర్చుకోవాలని, ఇందుకోసం ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో దేవాదాయ, ధర్మాదాయశాఖ అధికారులు ఆక్రమణలపై కనె్నశారు. అయితే వీటన్నింటికంటే ముందుగా ఆక్రణల తొలగింపు కార్యక్రమానికి మంచి ముహూర్తం చూసుకుంటున్నారు. ఎటువంటి రాజకీయ వత్తిళ్ళు లేకుండా, బాధితులు కోర్టుకు వెళ్ళే అవకాశానివ్వకుండా భారీ పోలీసు భద్రత మధ్య ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించే క్రమంలో సంబంధితాధికారులు వ్యూహాత్మక రచన చేస్తున్నారు. ఇది విజయవంతమైతే జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన ఎకరాల కొలది దేవుని భూములు ఈ శాఖ చేతుల్లోకి వచ్చినట్టే. దీంతోనే ఉగాది దాటిన తరువాత ఆక్రమణలపై దృష్టిపెట్టాలని కూడా ఆలోచన చేస్తున్నారు. జిల్లాలో ఆక్రమణలకు గురైన దేవుని భూములు దాదాపు 40 వేల ఎకరాలున్నట్టుగా సంబంధితాధికారులు గుర్తించారు. ఇందులో సింహాచలం పంచ గ్రామాలకు సంబంధించిన దేవుని ఆక్రమిత భూములే దాదాపు తొమ్మిది వేల ఎకరాలుగా తెలుస్తోంది. విశాఖ జిల్లాలో యలమంచిలి, భీమిలి, విశాఖ నగరంలో, సంగివలస, అనకాపల్లి, కశింకోట, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో దాదాపు 25 వేల ఎకరాల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవన్ని స్వాధీనపర్చుకుంటే కోట్లాది రూపాయల విలువైన దేవాదాయ, ధర్మాదాయ ఆస్తులు చేతికొచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఈ విధమైన ఆక్రమణ తొలగింపునకు ముందుగా పోలీసు భద్రతను సమకూర్చుకోవాల్సి ఉంది. దీని తరువాత అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశంగా క్షణాల్లో ఆక్రమణలను నేలమట్టం చేసే అత్యంత అధునాతన యంత్రాలుండాలి. బాధితుల నుంచి ఎటువంటి ప్రతిఘటనలు రాకుండా మరిన్ని చర్యలు చేపట్టే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.

‘సుజల స్రవంతి’ని విస్మరించేది లేదు
చోడవరం, మార్చి 1: ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి చెందిన టెండర్లు నేటికీ రద్దుకాలేదని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిర్మాణం జరగదన్న వార్తలలో వాస్తవం లేదన్నారు. రైతులకు సాగునీరు, పట్టణవాసులకు మంచినీరు సౌకర్యాలను కల్పించడం కోసం సుజల స్రవంతిని నిర్మాణం జరిపేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం నిధుల కేటాయింపులు చేస్తోందన్నారు. సుజల స్రవంతి ద్వారా సుమారు ఎనిమిది లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలిపారు. శ్రీకాకుళంలో 78 వేల ఎకరాలు, విజయనగరం జిల్లాలో మూడులక్షల 75 వేల ఎకరాలు, విశాఖ జిల్లాలో మూడు లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు విశాఖ వాసులకు మంచినీరు, పరిశ్రమలకు కూడా నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు ద్వారా కల్పించేందుకు అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏడువేల 218కోట్ల రూపాయలతో ఆరు ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు తయారుయ చేసినట్టు చెప్పారు. ఇందుకోసం తొలిసారిగా 50కోట్ల రూపాయలను 2009వ సంవత్సరంలో విడుదల అయ్యాయన్నారు. అయితే అప్పట్లో తొమ్మిది లక్షలు మాత్రమే ఖర్చు జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇరిగేషన్ అవసరాల కోసం 15వేల కోట్ల రూపాయలను కేటాయించారని, కేవలం ప్రతిపక్షాలు అసెంబ్లీని నిర్బంధించి రాద్ధాంతం చేయడం కోసమే అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికీ టెండర్లు రద్దుకానందున ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని విస్మరించడం లేదన్నది అర్ధమవుతుందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మూడెడ్ల శంకరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిలపర్తి భాస్కరరావు, దొండా రాంబాబు, ఓరుగంటి నెహ్రూ, జ్యోతుల రమేష్, పాము రాజు, సకలా సూరిబాబు, తేజ పాల్గొన్నారు.

తాండవ జలాల పరిరక్షణకు కాగడాల ప్రదర్శన
నాతవరం, మార్చి 1: కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేయకుండా తాండవ రైతుల పక్షంగా నిలవాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. గురువారం రాత్రి తాండవ జాలల పరిరక్షణ కొరకు నాతవరం గ్రామంలో భారీ కాగడాల ప్రదర్శన చేశారు. గ్రామంలో వందలాది మంది రైతులు కాగడాలు పట్టుకుని స్థానిక ఆసుపత్రి నుంచి ర్యాలీగా బస్టాండ్ వరకు వెళ్ళి అక్కడ మానవహారం నిర్వహించారు.అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తాండవ జలాలను తాగునీరుకు తరలించాలన్న ఆలోచన సరైంది కాదని, దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. రైతుకు సహాయం చేయాల్సిన నేతలు తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్షాలపై దుమ్మెతిపోయడం ఎంత వరకు సమంజసమన్నారు. అసలే తాండవ నీరు సాగుకే పూర్తిగా సరిపోని పక్షంలో మంచినీటి కోసం తరలిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈనేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తాండవ నీటిని బయటకు తరలిస్తే చూస్తూ సహించేది లేదని అయ్యన్న అన్నారు.
తాండవ జల పరిరక్షణ సమితి చైర్మన్ వేచలపు శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ 52 వేల ఎకరాల ఆయకట్టుకు తాండవ నీటిని నేటికీ పూర్తి స్థాయిలో అందించని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో అడుగంటిన నీటిని మంచినీటి కొరకు ఏ విధంగా తరలించడానికి ఆమోదించారో తెలియడం లేదన్నారు. ఇప్పటికైనా నీటి తరలింపు చర్యలు మానుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా రైతులు, మండలంలో రైతులు భారీ స్థాయిలో పాల్గొన్నారు

పథకాలు కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి
పాయకరావుపేట, మార్చి 1: జిల్లాలోని 76 వేల మంది భవన నిర్మాణ కార్మికుల్లో 555 మందికి కోటి మూడు లక్షల రూపాయల ప్రయోజనాలు చేకూర్చినట్లు జిల్లా అసిస్టెంట్ లేబర్ కమీషనర్ కేశవపండా తెలిపారు. శ్రీసాయి శ్యామల తుని, పాయకరావుపేట మేషనరీ పనివార్ల యూనియన్ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మిక సంక్షేమ మండలి అందిస్తున్న ప్రయోజనాలు భవన కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేవలం 62 రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందిన కార్మికులకు ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం పొందినా, మరణించినా రెండు లక్షల రూపాయలు, 50 శాతం అంగవైకల్యం పొందితే లక్ష రూపాయలు, సాదారణ మరణం పొందితే 30 వేల రూపాయలు, మహిళా కార్మికులకు ప్రసూతి సమయంలో ఐదువేల రూపాయలు, పని చేస్తూ కార్మికులు మరణిస్తే 50 వేల రూపాయలు, కార్మికుని కుమార్తెకు వివాహ సమయంలో ఐదువేల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈప్రయోజనాలను ఉపాధి హామీ కూలీలకు కూడాఅందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందు కోసం జిల్లాలో రెండు లక్షల మందిని ఉపాధి కూలీలను పేర్లు నమోదు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నెల రోజుల పాటు సభ్యత్వ నమోదు , స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.సి.పి. సిమ్మెంట్ ప్రతినిధి మోహన్‌రావు, పాలూరి గుప్త, టి.ఎస్.ఎన్.మూర్తి, యూనియన్ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, జి. చిన్నారావు, సి.హెచ్.శ్రీనివాసరావు, ఎం.సత్తిబాబు, కె. చంటి తదితరులు పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
గొలుగొండ, మార్చి 1: పుణ్యకేత్రమైన దారమట్టంలో అనుమానాస్పద స్థితిలో ఒక యువతి ఉరివేసుకుని మరణించింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కొయ్యూరు మండలం గుంజులింగాపురం గ్రామానికి చెందిన కూడా కుమారి గత కొంత కాలంగా క్రితం ఇదే మండలం చిట్టింపాడు గ్రామానికి చెందిన ఒక యువకుడు ప్రేమించి మోసం చేశాడని తెలిసింది.
ఈ యువతిని వదలించుకునేందుకు అప్పట్లోనే చిట్టింపాడు గ్రామానికి చెందిన స్థానిక రాజకీయ నాయకులు కుమారికి 30 వేల రూపాయలు ఇచ్చి రాజీ ప్రయత్నాలు చేసారు. ఆరు నెలల క్రితం 20 వేల రూపాయలు అందజేశారు. మిగతా పది వేల రూపాయలు నేటికీ ఇవ్వలేదు. ప్రేమించిన వ్యక్తి కుమారిని ఏదో ఒక విధంగా హత్య చేయాలని గతంలో ఒక్కసారి ప్రయత్నించాడని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన దారమట్టం ప్రాంతంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పశువుల కాపర్లు చూసి సమీప గ్రామాలైన కొత్తపాలెం, ద్వారకా నగరం గ్రామాలకు తెలిపారు. దీంతో హుటాహుటినా సంఘటనా స్థలానికి పలువురు చేరుకున్నారు. శివాలయానికి ఎదురుగా ఉన్న పెద్ద పణుకు దగ్గర ఉన్న చెట్టుకు యువతి చున్నీతో ఉరివేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇది హత్యేనని, ఆత్మహత్య కాదని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.

నత్తనడకన దోమతెరల పంపిణీ
పాడేరు, మార్చి 1: మన్యంలో మలేరియాకు కారణమవుతున్న దోమల నుంచి గిరిజనులకు రక్షణ కల్పించేందుకు చేపట్టిన దోమ తెరల పంపిణీ నత్తనడకన సాగుతోంది. గిరిజనులకు దోమతెరలను పంపిణీ చేయడం ద్వారా దోమ కాటు నుంచి వారికి రక్షణ కల్పించి తద్వారా మలేరియాను నివారించవచ్చుననే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దోమతెరల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విశాఖ గిరిజన ప్రాంతానికి మూడు లక్షల ఎనిమిది వేల 66 దోమ తెరలను ప్రభుత్వం సరఫరా చేసింది. గిరిజన ప్రాంతానికి దోమతెరలు చేరి నెల రోజులు కావచ్చినా ఇంతవరకు వీటిని గిరిజనులకు పూర్తిస్థాయిలో పంపిణీ చేయడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మన్యానికి పంపిణీ చేసిన దోమతెరలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరవేసి ఇందిరాక్రాంతి పథం, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో గిరిజనులకు పంపిణీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఒక కుటుంబలో ఇద్దరు సభ్యులు ఉంటే ఒకటి, ఐదుగురు సభ్యుల వరకు రెండు, ఆరుగురికి మూడు, ఆరుగురికి పైగా సభ్యులు ఉన్న కుటుంబానికి నాలుగు వంతున దోమ తెరలను పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ఒక్కొక్క ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గిరిజన జనాభా కుటుంబాల ఆధారంగా ఆయా ఆరోగ్య కేంద్రాలకు దోమతెరలను పంపిణీ చేయాలని భావించారు. అయితే ఏజెన్సీలోని 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఈ ప్రాతిపదికన దోమతెరలు చేరాల్సి ఉండగా ఇంతవరకు చాలా ఆరోగ్య కేంద్రాలకు దోమ తెరలు చేరనేలేదు.
మండల కేంద్రాలలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు మాత్రమే దోమ తెరలను చేరవేసినప్పటికీ గ్రామాలలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు దోమతెరలు ఇంతవరకు చేరకపోవడంతో గిరిజన కుటుంబాలకు దోమతెరలు అందడంలో జాప్యం చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గిరిజన ప్రాంతంలోని కేవలం ఏడు ఆరోగ్య కేంద్రాలు మాత్రమే మండల కేంద్రాలలో ఉండగా మిగిలిన 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సైతం గ్రామాలలోనే పనిచేస్తున్నాయి. గ్రామాలలో పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రాలలో కొన్ని ప్రధాన రహదారి మార్గంలో ఉండగా చాలా వరకు మారుమూల గ్రామాలలో పనిచేస్తున్నట్టు సమాచారం.
అయితే మారుమూల గ్రామాలకు చెందిన ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేయాల్సిన దోమతెరలను ఆయా మండల కేంద్రాలకు అధికారులు చేరవేసి అక్కడి నుంచి గ్రామాలలో ఉండే ఆరోగ్య కేంద్రాలకు వీటిని అందచేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు జారీ చేసిన ఆదేశాల ప్రకారం మారుమూల గ్రామాలకు దోమతెరల పంపిణీ అనేది అంత సులువుగా జరగడం లేదని, ఇందుకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. మండల కేంద్రం నుంచి మారుమూల గ్రామాలకు దోమ తెరలను తీసుకు వెళ్ళేందుకు ప్రధానంగా రవాణా సమస్య ఎదురవుతుందని, ప్రయివేట్ వాహనాలలో తీసుకువెళ్ళేందుకు అవసరమైన వ్యయానికి నిధులు లేవని అంటున్నారు. ఆరోగ్య కేంద్రాలలో ఉన్న అంబులెన్స్‌ల ద్వారా వీటిని గ్రామాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ చాలా ఆరోగ్య కేంద్రాలలో అంబులెన్స్‌లు మరమ్మతులతో మూలుగుతున్నాయి. ప్రయివేట్ వాహనాల ద్వారా గాని దోమ తెరలను గ్రామాలలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించడం తమకు భారంగా పరిణమించిందని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాక్రాంతి పథం, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో దోమ తెరలను పంపిణీ చేయాలని ఆదేశించిన అధికారులు వీటిని గ్రామాలకు తరలించే బాధ్యతను వారికి అప్పగిస్తే బాగుండేందని వారు చెబుతున్నారు. గ్రామాలకు దోమ తెరలను పంపిణీ చేసే బాధ్యతను వైద్య సిబ్బందిపై ఉంచి వీటి పంపిణీని మాత్రం ఇందిరాక్రాంతి పథం, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం వలన తాము వీటిని గ్రామాలకు చేరవేసేందుకు నానా పాట్లు పడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా మన్యంలో దోమతెరల పంపిణీని ఈ నెల 10వ తేది నాటికి పంపిణీ చేయాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ ప్రభాకర్ వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు మరో ఎనిమిది రోజులలోగా దోమతెరల పంపిణీ పూర్తి కావలసి ఉండగా ఇంతవరకు చాలా ఆరోగ్య కేంద్రాలకు ఇవి చేరని పరిస్థితి నెలకొనడం గమనార్హాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు నాటికి సైతం గిరిజనులకు దోమ తెరలను పంపిణీ చేయడం సాధ్యం కాదని అంటున్నారు. ఈ విషయమై ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి చర్యలు తీసుకుని గ్రామాలలో ఉండే ఆరోగ్య కేంద్రాలకు దోమ తెరలను చేరవేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని, లేదా వాహన సదుపాయాన్ని కల్పించాలని పలువురు సూచిస్తున్నారు.
ఐ.టి.డి.ఎ. పి.ఒ. విస్మయం
మన్యంలోని మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దోమ తెరలు ఇంతవరకు చేరకపోవడం పట్ల పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి కె.శ్రీకాంత్ ప్రభాకర్ విస్మయం వ్యక్తం చేశారు. మండల కేంద్రాలలో దోమ తెరలు మూలుగుతున్న విషయమై ఆంధ్రభూమి ఆయన దృష్టికి తీసుకువెళ్ళగా అన్ని ఆరోగ్య కేంద్రాలకు దోమతెరలు పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయితే మారుమూల గ్రామాల ఆరోగ్య కేంద్రాలకు దోమ తెరలు ఎందుకు చేరలేదో అర్థం కావడం లేదని, ఈ విషయమై పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

రోడ్డుప్రమాదంలో 13 మందికి గాయాలు
కశింకోట, మార్చి 1: మండలంలోని గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మందికి గాయాలు కాగా వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కెజిహెచ్‌కు తరలించినట్టు స్థానిక ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ఎన్‌జి పాలెం గ్రామం నుండి లంకెలపాలెంలో ఉన్న ఫార్మాసిటీలో కూలీపని చేసేందుకు 13 మంది ఆటోలో స్వగ్రామం నుండి బయలుదేరారు. అయితే తాళ్ళపాలెం కూడలి దాటిన అనంతరం వీరు వెళుతున్న ఆటోను వెనుకనుండి లారీ బలంగా ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న 13 మందికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వీరిని అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

అందరికీ అందుబాటులో ఉండే రైతుబజార్లను మరిన్ని ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం
english title: 
raithu bazars

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>