శ్రీకాకుళం, మార్చి 1: అక్రమ మద్యం అరికట్టాలని, ఏసీబీ దాడుల్లో పట్టుబడిన వారి పేర్లను బహిర్గతం చేయాలంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన, ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం పట్టణంలోని 36 వార్డుల నుంచి కార్యకర్తలు, జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్న ఆందోళన ఉదయం ఏడు రోడ్ల కూడలిలో కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ప్రారంభించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన వందలాది మంది మహిళలు, కార్యకర్తలనుద్దేశించి ఎర్రన్నాయుడు మాట్లాడుతూ మూడు దశాబ్దాలపాటు జిల్లా ప్రజల ఆదరణ పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులపై బురద చల్లాలనుకునే వారిపైనే బురద పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 1983 నుంచి నేటివరకు తనపై, శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే అప్పలసూర్యనారాయణపైనా ఎఫ్.ఐ.ఆర్. నమోదు కాలేదని, క్రిమినల్ కేసులు కూడా లేవని, అంత నిజాయితీగా ప్రజల హృదయాల్లో నిలిచామన్నారు. అధికారంలో ఉన్న వారు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా ఎవరు ఏమిటో జిల్లా ప్రజలకు తెలుసన్నారు. మంత్రి ధర్మానకు ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం ఉంటే వెంటనే 2.14 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పగించాలని, కనె్నధార లీజులు రద్దు చేసుకోవాలని, పెద్దపాడు సమీపంలో 27 ఎకరాల భూమిని తిరిగి పేదలకు కేటాయించాలని ఎర్రన్నాయుడు డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో అక్రమ మద్యం అరికట్టాలని దేశం పార్టీ గతంలోనే ఎస్.పి.ని కలసి వినతిపత్రం అందించిందని, అధికార దాహంతో అక్రమాలకు పాల్పడుతున్న నాయకులు, వారి అనుచరుల పేర్లు బహిర్గతం అవుతున్నాయనే అక్కసుతో చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు, దాడులు చేయించడం సిగ్గుచేటన్నారు. సభలో మాజీ ఎమ్మెల్యే అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లా రాజకీయాలను మలినం చేసి, అధికారం కోసం అవినీతిపరుల కోటరీని తయారుచేసిన ధర్మానను బర్త్ఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్లపై హైకోర్టు సూచనలమేరకు ఎసిబి దాడులు నిర్వహించి సేకరించిన సిండికేట్ల పేర్లు బహిర్గతం చేయాలన్నారు.
అనంతరం ఏడురోడ్ల జంక్షన్ నుంచి మద్యం మాఫియాకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎర్రన్నాయుడు ప్రారంభించారు. జి.టి.రోడ్డు, సూర్యమహల్ జంక్షన్, రామలక్ష్మణ జంక్షన్ మీదుగా గొంటివీధిలో ఉన్న ఏసీబి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఏసీబి కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి ఎర్రన్నాయుడు బృందం వినతిపత్రం అందించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తో తప్పుడు వార్తలు చెప్పించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని, సిండికేట్లను నడపడంలో బాగస్వామ్యం వహించిన అధికార, అనధికారులను అరెస్టు చేసి నిజానిజాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొర్ను ప్రతాప్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పి.వి.రమణ, మాదారపు వెంకటేష్, ఎస్.వి.రమణ మాదిగ, గుమ్మా నాగరాజు, మాజీ కౌన్సిలర్లు రోణంకి మల్లేశ్వరరావు, మావూరు శ్రీనివాస్, కేశవ రాంబాబు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
విలీనానికి హైకోర్టు బ్రేకులు!
* రికార్డులు స్వాదీనం చేసుకున్న అధికారులు
* రెండు పంచాయతీల్లో గుబులు
ఎచ్చెర్ల, మార్చి 1: గ్రామ పంచాయతీలను శ్రీకాకుళం మున్సిపాలిటీలో విలీనం చేయడం చెల్లదని హైకోర్టు బ్రేక్ వేసింది. విలీనానికి వ్యతిరేకంగా పంచాయతీలు తీర్మానాలు ఇచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయినప్పటికీ జీవో నెంబర్-30 విడుదలచేసి మండలంలో కుశాలపురం, తోటపాలెం గ్రామ పంచాయతీలను గ్రేటర్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీనిని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడం ఈ పంచాయతీలో విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం ఉండడంవలన పిసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అక్కడ కాంగ్రెస్ నేతలకు విలీనం లేకుండా చూస్తానని భరోసా ఇచ్చారని రాజధాని వర్గాల ద్వారా తెలిసింది. అయినప్పటికీ ఆ రెండు పంచాయతీల మాజీ సర్పంచ్‌లు పైడి అనసూమ్మ, కల్లేపల్లి రమణకుమారితోపాటు మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ (246) ప్రకారం ప్రభుత్వ నిర్ణయం సరైన రీతిలో లేనట్లు వ్యాఖ్యానించి గత నెల 17వతేదీన హైకోర్టు న్యాయమూర్తి భవానీ ప్రసాద్ ఈ తీర్పును వెల్లడించారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల కుశాలపురం, తోటపాలెం గ్రామ పంచాయతీల రికార్డులను జిల్లా ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకోవడంతో పలు సందేహాలు వ్యక్తవౌతున్నాయి. తిరిగి ఈ గ్రామాల్లో గుబులు ఆరంభమైంది. రికార్డులు స్వాధీనం చేసుకోవడం వెనుక ఆంతర్యమేమిటోనన్న ఆందోళన స్థానికులను కలవర పెడుతోంది.
హోంగార్డుల ఉద్యోగాలకు దరఖాస్తులు
ఎచ్చెర్ల, మార్చి 1: స్థానిక ఎ.ఆర్.పోలీసు గ్రౌండ్‌లో హోంగార్డు ఉద్యోగాల దరఖాస్తులను స్వీకరించేందుకు గురువారం శ్రీకారం చుట్టడంతో అభ్యర్థుల తాకిడి అధికమైంది. జిల్లా నలుమూలల నుంచి అభ్యర్థులు చేరుకుని దరఖాస్తులు అందజేసేందుకు ఉత్సాహం కనబర్చుతున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె.వి.వి.గోపాలరావు ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయ సిబ్బంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హాల్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో పొందేవిధంగా ధ్రువీకరణ పత్రాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈనెల 12వతేదీ నాటికి 18 నుంచి 50సంవత్సరాల వయసు కలిగి జిల్లాకు చెందిన వారై ఉండాలి. కేటగిరీ-ఎ పోస్టుకు ఎస్.ఎస్‌సి. ఉత్తీర్ణులు, కేటగిరీ-బి(టెక్నికల్), కేటగిరీ-సి కారుణ్య నియామకం పోస్టుకు ఏడవ తరగతి ఉత్తీర్ణత అర్హులుగా గుర్తించారు. జిల్లాలో ఖాళీల వివరాల ప్రాప్తికి నియామకాలకు చర్యలు చేపట్టారు. పై అర్హతలు ఉన్నవారంతా దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రావడం తో మొదటి రోజే పోలీసు మైదానం సందడిగా కన్పించింది. దీనికి తోడు జైలు వార్డు పోస్టుల కోసం దరఖాస్తులు గత కొన్నాళ్ల నుంచి ఇదే మైదానంలో స్వీకరిస్తున్నారు. మార్చి 15వతేదీతో గడువు ముగియడంతో అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించుకునేందుకు పోటీపడటం కనిపించింది. ఇప్పటి వరకు 2055 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గడువు వరకు పది నుంచి ఒంటి గంట వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని ఎస్పీ కార్యాలయ సిబ్బంది స్పష్టం చేశారు. ఈ పోస్టుల నియామకం రాష్టస్థ్రాయిలో ఉంటుందని వారు తెలిపారు.
‘ఉపాధి’ లక్ష్యాన్ని అధిగమించండి
* కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
నరసన్నపేట, మార్చి 1: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యాన్ని తప్పనిసరిగా అధిగమించాలని జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని రావులవలస, డోకులపాడు పంచాయతీల్లో జరుగుతున్న చెరువు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమణలకు గురైన చెరువులపై దృష్టి సారించామని, ఆక్రమణలు తొలగిస్తారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2.70లక్షల మంది కూలీలు ఉపాధి పనులను చేపడుతున్నారని, ఇంతవరకు జిల్లాలో 234 కోట్ల రూపాయలను వెచ్చించారని చెప్పారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు రెండు వేలకు పైగా చెరువులు ఉన్నాయని, ఇవన్నీ దాదాపుగా కబ్జాకు గురయ్యాయని, ముందుగా పూర్తిస్థాయిలో ఆక్రమణలకు గురైన చెరువులపై దృష్టి సారించి వాటిల్లో ఉపాధి పనులను చేపడతారని అన్నారు. రావులవలస పంచాయతీలో సిరిగాం చెరువు రెండు ఎకరాల 30సెంట్లు విస్తీర్ణం కలిగి ఉండి, పూర్తిగా ఆక్రమణకు గురికావడంతో ఇక్కడ పనులను చేపట్టారని, డోకులపాడులో బూసయ్యకర్ర చెరువు సుమారు ఏడెకరాల 60సెంట్లు ఉం డగా, దీని పరిస్థితి ఇదేవిధంగా ఉండడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారించి తొలగిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు ఆయా పంచాయతీల్లో చెరువుల్లో ఆక్రమణల తొలగింపులో అధికారులకు, ప్రజాప్రతినిధులకు సహకరించాలని, రానున్న రోజుల్లో ఈ చెరువులే వ్యవసాయానికి ఆధారమవుతాయని, ఈ దిశగా ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు.
తహశీల్దార్ కార్యాలయ ఆకస్మిక తనిఖీ
గురువారం మండలంలోని చెరువు పనులను పరిశీలించిన కలెక్టర్ అనంతరం ఆకస్మికంగా మండల తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయ భవన వివరాలను పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్ వెంకట్రావును అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ మరమ్మతులకు నిధులను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
శరవేగంగా సాగుతున్న వంతెన నిర్మాణం
పాతశ్రీకాకుళం, మార్చి 1: జిల్లా కేంద్రంలో కలెక్టర్ బంగళా సమీపంలో నాగావళి నదిపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎచ్చెర్ల మండలంలోని పొన్నాడ పరిసర గ్రామాల ప్రజలు ఎన్నోయేళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న వంతెన నిర్మాణం ఎట్టకేలకు సాకారం కానుండడంతో ఇరువైపులా ఉన్న ప్రజానీకం నిర్మాణం పనులను ఆసక్తిగా తిలకిస్తున్నారు. వాంబే కాలనీ సమీపంలో రాఘవేంద్రస్వామి ఆలయం నుండి వంతెన పనులు ప్రారంభించారు. ముందుగా సాయిగిరి దిగువన ఉన్న ప్రాంతంలో చదును చేసి, సాయిల్ టెస్ట్ చేసి, పిల్లర్ల నిర్మాణానికి పనులు ముమ్మరం చేశారు. అక్కడ నుండి నేరుగా నదీ గర్భంలో తాత్కాలికంగా రోడ్డు నిర్మించి వంతెన పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. వేసవిలో నదిలో నీటి ప్రవాహం నెమ్మదిగా ఉంటుందనే విషయాన్ని గుర్తించిన కాంట్రాక్టర్లు శ్రీకాకుళం పట్టణం నుండి పనులు వేగవంతం చేశారు. కలెక్టర్ బంగళా సమీపంలో నాగావళి నదిలో నీరు లేకపోవడంతో ఇటువైపు నుంచి పనులు ముమ్మరం చేశారు. సుమారు 21కోట్ల రూపాయలతో నిర్మించే ఈ వంతెన నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో కాంట్రాక్టర్ శరవేగంగా పనులు చేపడుతున్నట్లు తెలిసింది. కలెక్టర్ బంగళా సమీపంలో ప్రైవేటు స్థలంలో కాంట్రాక్టర్లు షెడ్‌లు వేసుకుని, అక్కడే నివాసం ఏర్పరచుకుని రేయింబవళ్లు వంతెన పనులు చేపడుతున్నారు. నదిలో నీటి ప్రవాహం కోసం సిమెంట్ పైపులు వేసి, దానిపై ఎర్రమట్టితో తాత్కాలికంగా రోడ్డు నిర్మించి, వంతెన పనుల్లో వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. నిర్మాణంలో మొదటి ఘట్టం పూర్తి కావడంతో ఇక పిల్లర్లు వేసే పని ప్రారంభించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు.
సక్రమంగా పదో తరగతి పరీక్షలు
* డి.ఇ.ఒ. మల్లేశ్వరరావు
శ్రీకాకుళం(రూరల్), మార్చి 1: పదోతరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి బలివాడ మల్లేశ్వరరావు సూచించారు. ప్రభు త్వ బాలికోన్నత పాఠశాలలో గురువారం శ్రీకాకుళం డివిజన్‌కు సంబంధించి డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 189 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించా ల్సి ఉండగా, డివిజన్ పరిధిలో 71 కేం ద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. జిల్లాలో 73 సెంటర్లను సి-కేటగిరీలో ఉంచామన్నారు. దీనిపై ప్రత్యేక భద్రత ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. కేంద్రంవద్ద మంచినీటి సౌకర్యం మెడికల్ కిట్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఓఎంఆర్ షీటును ముం దుగానే నింపేదుకు విద్యార్థులు అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలన్నారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే ఇన్విజిలేటర్‌పై చర్యలు తీసుకుంటారన్నారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సభ్యుడు సత్యనారాయణ, ఎ.సి. వై.సత్యనారాయణ నాయుడు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే ‘పల్లెకు పోదాం’
శ్రీకాకుళం(రూరల్), మార్చి 1: సమస్యల పరిష్కారానికే పల్లెకుపోదాం నిర్వహిస్తున్నామని టాస్క్ఫోర్స్ అధికారి ఆర్.గొల్ల అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం మండలంలోని పాత్రునివలస పంచాయతీలో పల్లెకుపోదాం నిర్వహించారు. మండల స్థాయి అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి పంచాయతీ పరిధిలోనున్న ఉన్నత పాఠశాలను, రెండు అంగన్‌వాడీ కేంద్రాలను, మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను, పశువైద్య కేంద్రాన్ని, రేషన్‌డిపోను, ఆరోగ్య ఉపకేంద్రాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ సత్తిబాబు, ఎంపిడిఓ ఆర్.వెంకట్రామన్, వ్యవసాయాధికారిణి ఉషాకుమారి, ఎంఇఒ శర్మ, ఐకెపి ఎపిఎం సుజాత, ఎన్‌ఆర్‌ఇజిఎస్ ఎపిఓ యుగంధర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎ.ఇ హేమలత పాల్గొన్నారు.
వాడాడ ఛానల్‌కు వరదగట్టు నిర్మించాలి
* పల్లెకుపోదాంలో వంజంగి ప్రజల మొర
ఆమదాలవలస, మార్చి 1: తమ గ్రామానికి ఆనుకుని ఉన్న వాడాడ ఛానల్ గెడ్డకు తక్షణమే వరదగట్టు నిర్మించాలని మండలంలోని వంజంగి గ్రామస్థులు గురువారం నిర్వహించిన పల్లెకుపోదాం కార్యక్రమంలో అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. టాస్క్‌పోర్స్ అధికారి ఎం.్ధనుంజయరావు అధ్యక్షతన జరిగిన పల్లెకుపోదాంలో వర్షాకాలంలో గెడ్డ దుస్థితిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండ అప్పలనాయుడు అధికారులకు వివరించారు. గెడ్డగట్టు బలహీనంగా ఉండడం వలన సుమారు వంద మీటర్ల వరకూ కంతలు పడి దిగువ పొలాలు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. వాడాడ ఛానల్ నీరు విడిచిపెట్టకపోవడం వలన ఈ పరిసరాల్లోని మంచినీటి బావులు అడుగంటిపోయాయని, వేసవి నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నాగావళి నదిలో సాగునీరును విడిచిపెట్టాలని కోరారు. అదే విధంగా గ్రామానికి సంబంధించి మరిన్ని విద్యుత్ స్తంభాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వీర్రాజు, సిడిపిఓ పాపినాయుడు పాల్గొన్నారు.
టి.ఆర్.టి. నిర్వహణపై అభ్యర్థుల్లో గందరగోళం
పోలాకి, మార్చి 1: ఉపాధ్యాయ నియామక పరీక్షలు (టిఆర్‌టి) నిర్వహణపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఈ పరీక్షలు మే 2, 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన విడుదల చేస్తూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. పరీక్షలు రాయబోయే అభ్యర్థులు కూడా ఉద్యోగ సాధనకై ప్రిపరేషన్‌ను ఒక మహాయజ్ఞంగా చేస్తున్నారు. కొందరు కోచింగ్ కేంద్రాలను ఆశ్రయించగా, మరికొందరు ఇళ్ళ వద్దనే చదువుతూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఈసారి టిఆర్‌టికి ముందే టెట్‌ను అర్హతగా చేస్తూ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసింది. టెట్‌లో అర్హత సాధించిన వారే టిఆర్‌టికి అర్హులుగా చేస్తూ దరఖాస్తు స్వీకరిస్తున్నారు. టెట్‌లో అర్హత సాధించని కొందరు అభ్యర్థులు తమకు కూడా టిఆర్‌టికి అనుమతించాలని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై విద్యాశాఖామంత్రి కొంత చొరవ తీసుకుని టెట్‌లో అర్హత సాధించని వారికి కూడా టిఆర్‌టికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తూ నియామక చివరి దశనాటికి టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలన్న విషయంపై ప్రభు త్వం ఆలోచన చేస్తుందని ప్రకటించారు. తరువాత మరో ఆలోచన చేసి టిఆర్‌టి కన్నా ముందుగానే మేలో టెట్ నిర్వహించి జూన్ లేదా జూలైలో టిఆర్‌టి నిర్వహించే విషయమై ఆలోచన చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధమైన అస్పష్టమైన ప్రకటనల వలన అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు కోరుతున్నారు.
మొక్కుబడిగా ‘పల్లెకు పోదాం’
సారవకోట, మార్చి 1: అధికారులు సమయపాలన పాటించకపోవడం, అధికార బృందంలో సమన్వయం లేకపోవడం దరఖాస్తులెన్ని సమర్పించినా సమస్యలు సమస్యలు గానే మిగిలిపోవడంవలన ప్రజలు ఆసక్తికనబరచకపల్లెకుపోదాం తూతూమంత్రంగా సాగిపోతుంది. మండలంలోని కొమ్ముసరియాపల్లి గ్రామంలో గురువారం జరిగిన పల్లెకుపోదాం ఉదయం 11.30గంటలైనా ప్రారంభం కాలేదు. అధికార యంత్రాంగం ఎవరికి వారు ఒక్కొక్కరు చేరుకోవడం ప్రారంభించారు. బృందం నాయకుడు టాస్క్ఫోర్స్ అధికారి 12గంటల తరువాత గ్రామానికి చేరుకున్నారు. మండల విద్యాశాఖాధికారి బోయిన దాలిశెట్టి పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించి కాలక్షేపం చేశారు. వివిధ శాఖల పనితీరు పరిశీలన రికార్డులకే పరిమితం చేస్తున్నారు. ప్రజలతో చర్చించి ప్రభుత్వ పథకాల అమలును తెలుసుకోలేకపోతున్నారు. టాస్క్ఫోర్సు అధికారి గ్రామానికి చేరిన వెంటనే నేరుగా గ్రామసభ నిర్వహించి పల్లెకుపోదాం కార్యక్రమాన్ని ముగించారు. ఇదే వేదికపై తహశీల్దార్ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. డి-పట్టాలు మంజూరు కోసం పలువురు అర్జీలు సమర్పించగా డ్రైనులను శుభ్రపరచాలని స్థానికులు కోరారు. ఎంపిడిఓ రాధ, తహశీల్దార్ నర్సింహులు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు
* పి.ఒ. సునీల్
రాజ్‌కుమార్
సీతంపేట, మార్చి 1: ఏజెన్సీ ప్రాం తాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో సమస్య పరిష్కరించేందుకు నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ఐ.టి.డి.ఎ. పి.ఓ. కె.సునీల్‌రాజ్‌కుమార్ చెప్పారు. గురువారం స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ 13వ ఆర్దిక సంఘం నిధులు 4.50 కోట్ల రూపాయల వ్యయంతో 13 రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే 29 లక్షల రూపాయలతో 38 గ్రావిటేషన్ ఫ్లో నిర్మాణాలు చేపట్టామన్నారు. ఐ.ఎ.పి. నిధులు 10 లక్షల రూపాయలతో మరో 10 గ్రావిటేషన్ ఫ్లో పథకాలు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. గ్రీవెన్స్ విభాగానికి మంచినీటి సమ స్య పరిష్కారం కోరుతూ వినతులు రాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఐ.టి.డి.ఎ. పరిథిలోని 7 టి.ఎస్.పి. మండలాల్లో మంచినీటి సమస్య సీతంపేట మండలంలోనే అధికంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా 90 లక్షల రూపాయలతో 60 మంచినీటి బావులు నిర్మిస్తున్నామన్నారు. 13వ అర్దిక సంఘం నిధులతో గిరిజన గ్రామాల్లో మంచినీటి బావులలో క్లోరినేషన్, బోరుబావుల మరమ్మత్తులు చేయిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో 1.5కోట్ల రూపాయలతో గిరిజన యువకేంద్రం, సీతంపేట ఐ.టి.ఐ, వి.టి.ఐ. భవనాలకు ఆనుకుని 1.70 లక్షల రూపాయలతో రెండు గిరిజన యువకేంద్రాల భవన నిర్మాణాలకు నిధులు కేటాయించామన్నారు. అలాగే పలాస, పాతపట్నం, సీతంపేట మండలాల్లో పోస్టుమేట్రిక్ వసతి గృహాల భవన నిర్మాణం, సీతంపేట, మెళియాపుట్టి, మందసలో మూడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
పల్లెకు పోదాంలో సమస్యలను గుర్తించండి
సీతంపేట, మార్చి 1: పల్లెకు పోదాం కార్యక్రమం ద్వారా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి పరిష్కరించాలని ఐటిడిఎ పి.ఓ. కె.సునీల్‌రాజ్‌కుమార్ అధికారులను సూచించారు. గురువారం మండలంలోని దోనుబాయి పంచాయతీలో పల్లెకుపొదాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి.ఒ. దొనుబాయి పిహెచ్.సి.ను సందర్శించారు. పిహెచ్.సి.లో మందుల కొరత, రోగుల తాకిడి, రికార్డుల నిర్వహణ పరిశీలించారు. అనంతరం వారపు సంతను పరిశీలించి ఆ ప్రాంతాన్ని ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. ద్వారా చదునుచేసి రచ్చబండ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉందని పిఒ దృష్టికి గ్రామస్థులు తీసుకువచ్చారు. దోనుబాయిలో 16 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశామని, అలాగే గ్రామంలోని బోరువెల్స్ మరమ్మతులు చేయిస్తామన్నారు. పిహెచ్.సి.లో ఆసుపత్రి అభివృద్ధ్ది నిధులతో అదనంగా మూడు బెడ్‌లు, పిల్లోస్ కొనుగోలు చేయాలని ఆసుపత్రి సిబ్బందికి ఆదేశించారు. గ్రామంలో పంచాయతీ భవనం ఏర్పాటుకు ప్రతిపాదన చేస్తున్నామని పిఒ వివరించారు. జి.పి.ఎస్. పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యాప్రమాణాలపై ఆరా తీశారు. అనంతరం పశువుల దాణాను పి.ఒ. గిరిజన లబ్ధిదారులకు అందజేశారు. దీనికి ముందుగా మర్రిపాడు గ్రామాన్ని పి.ఒ. సందర్శించి 10 లక్షల రూ పాయలతో నిర్మిస్తున్న చెక్‌డ్యాంను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి కె.నాగోరావు, ఎంపిడిఒ రమణమూర్తి, తహశీల్దార్ ప్రసాద్, ఎ.పి.ఎం. నారాయణరావు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
లడ్డూల కొరత రానివ్వం
* ఇ.ఒ. ప్రసాద్ పట్నాయక్
శ్రీకాకుళం (కల్చరల్) మార్చి 1: ఆదిత్యుని దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేపట్టామని, లడ్డు కొరత రాకుండా చూస్తామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి బలివాడ ప్రసాద్ పట్నాయక్ స్పష్టం చేశారు. రథసప్తమి తరువాత ప్రసాదం కౌంటర్లు మార్చడంతో తయారీలో కాస్త జాప్యం అవుతోందని, నిత్యం వచ్చే భక్తులతోపాటు ఆదివారాల్లో వేల సంఖ్యలో వచ్చే భక్తులకు కూడా లడ్డు ప్రసాదంలో కొరత రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ముందుగా లడ్లు సిద్దం చేయించి ఉంచుతున్నట్లు ఆయన తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల్లో ఒక్కొక్కరికి రెండు లడ్లు మాత్రమే ఇస్తామని, ఇరవై, ఏభై లడ్లు కావాలని అడిగి ఇబ్బంది పెట్టవద్దని ఆయన కోరారు.
ఆర్.ఐ.ఒ. కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన
శ్రీకాకుళం(రూరల్), మార్చి 1: ఆధునిక పద్ధతులను ఉపయోగించి మంచి నాణ్యమైన భవనాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటర్మీడియట్ విద్య ప్రాంతీయ తనిఖీ అధికారి కార్యాలయ సొంత భవనం నిర్మాణానికి గురువారం జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో 50 లక్షల రూపాయలతో భవనాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం నిర్మించనుంది. ఈ భవన నిర్మాణం వలన ఇంతవరకు సొంత భవనం లేని ఆర్. ఐ.ఒ. కార్యాలయానికి సొంత భవనం చేకూరుతుంది. ప్రభుత్వ పురుషుల డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ బి.పోలీసు కళాశాల భవనాన్ని ఇందుకు కేటాయించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవనం మంచి ఆకర్షణీయంగా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. కార్యక్రమంలో ప్రాంతీయ తనిఖీ అధికారి ఎన్.వి.తిరుమలాచార్యులు, జిల్లా వృత్తి విద్యాధికారి కె.గోవిందరాజులు, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎం.ఆర్.జి. నాయుడు, ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ పి.ఎస్.కుమార్, చైతన్య సహకార జూనియర్ కళాశాలల అధినేత జామి బీమశంకరరావు, రిటైర్డ్ సెట్‌శ్రీ సి.ఇ.వో సురంగి మోహనరావు పాల్గొన్నారు.