Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బంగారం కోసం వివాహిత హత్య?

$
0
0

బొబ్బిలి , మార్చి 1: బంగారం కోసం ఓ వివాహితను హత్య చేసిన విషయం గురువారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధి వెంకటరాయుడుపేటలో గోపిశెట్టి నిర్మల(36)ను బుధవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిర్మల బుధవారం రాత్రి 8గంటల సమయంలో బహిర్భూమి కోసం భూపతిరాయుడు తోటలోకి వెళ్ళి ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె రెండవ కుమార్తె భవాని బంధువులకు తెలియజేయగా వారు వెతకడం ప్రారంభించారు. రాత్రి 11.30 గంటలకు నిర్మల శవమై కనిపించడంతో కొంత మంది ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారని భావించారు. ఆమె మెడలో ఉన్న రెండు తులాల పుస్తెలతాడు, రెండు తులాల నల్లపూసలను అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బతుకు తెరువు కోసం పాచిపెంట మండలం కేసలి నుంచి 25 ఏళ్ళ క్రితం వెంకటరాయుడుపేటలో భర్త శ్రీనివాసరావుతో కలిసి చిన్న కిరణాషాపును నడుపుతున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. ఇందులో శ్రీలతకు వివాహం చేయగా భవాని 9వ తరగతి నారశింహునిపేట హైస్కూల్లో చదువుతోంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ కార్తీకేయ సంఘటనా స్థలాన్ని గురువారం క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాగిన మైకంలో గుర్తు తెలియని వ్యక్తులు బంగారం కోసం నిర్మలను హత్య చేసి ఉంటారన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక పంపాలని బొబ్బిలి డిఎస్పీ ఎన్. శ్రీదేవిరావును ఆదేశించారు. దోషులను విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఎఎస్పీ టి.మోహనరావు, డిఎస్పీ ఎన్.శ్రీదేవిరావు, సిఐ ఎల్.మోహనరావు, ఎస్‌ఐలు సాంబశివరావు, సతీష్, అమ్మినాయుడు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శవపంచనామ చేసి పోస్టుమార్టం నిమిత్తం బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్‌లను తెప్పించి పూర్తి స్థాయిలో పరిశీలించారు. వీఆర్వో సింహగిరి పట్నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మలపై అత్యాచారం జరగలేదు
నిర్మల మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం బొబ్బిలి డిఎస్పీ ఎన్.శ్రీదేవిరావు, స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారి వెంకునాయుడు గురువారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడుతూ నిర్మలపై అత్యాచారం జరగలేదని పేర్కొన్నారు. కేవలం బంగారం కోసం ఆమెను హత్య చేసి ఉంటారన్నారు.

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
విజయనగరం, మార్చి 1: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 47,127 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిమిత్తం 67 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను ఆర్.ఐ.ఓ గోవిదంరాజు గురువారం విలేఖరులకు వివరించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి 21,927 మంది, రెండో సంవత్సరానికిగాను 25,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. వీరిలో ప్రధమ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 18,419 కాగా, వొకేషనల్‌కు చెందిన 3,508 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 17,075 మంది, ప్రైవేటు విద్యార్థులు 4,662 మంది, రెగ్యులర్ వొకేషనల్ విద్యార్థులు 2,834 మంది, ప్రైవేటు వొకేషనల్ విద్యార్థులు 629 మంది పరీక్షలు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. 67 పరీక్షా కేంద్రాలకు గాను 21 ప్రభుత్వ కళాశాలల్లోను, 31 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలల్లోను, అయిదు ఎయిడెడ్ కళాశాలల్లోను, అయిదు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లోను, మరో నాలుగు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లోను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లతో పాటు మరో నాలుగు సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీరితో పాటు తహశీల్దార్లు, డిప్యూటి తహశీల్దార్లు సైతం పరీక్ష నిర్వహణను పర్యవేక్షిస్తారని తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని హైపర్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కమిటీ, అడ్వయిజరీ కమిటీలు పర్యవేక్షిస్తాయన్నారు. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటిండెంట్లతో పాటు 67 మంది శాఖాపరమైన అధికారులను నియమించినట్టు ఆయన వెల్లడించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను 15 నిముషాల ఆలస్యం వరకూ అనుమతించనున్నట్టు తెలిపారు. హాల్ టికెట్లు పోగొట్టుకున్న విద్యార్ధులు ధృవీకరించిన కళాశాల ఎన్‌రోల్ కాపీని తీసుకురావాలని సూచించారు. అలాగే విజయనగరం పట్టణంలో కొత్తగా ఎన్.ఆర్.ఐ కళాశాలను పరీక్షా కేంద్రంగా నిర్ణయించామని, అయితే హాల్‌టికెట్లపై ఎన్.ఆర్.ఐ కళాశాల బొబ్బిలిగా ముద్రితమైందని, విద్యార్ధులు గమనించాలని స్పష్టం చేశారు.

‘అక్రమ నిర్మాణాలపై కలెక్టర్‌కు నివేదిక’
గజపతినగరం, మార్చి 1: స్థానిక వెంకటేశ్వర సినిమాహాలు ఎదురుగా నిర్మాణంలోగల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై దర్యాప్తు జరిపినట్లు స్థానిక తహశీల్దారు జి.జయదేవి గురువారం తెలిపారు. షాపింగ్‌కాంప్లెక్స్‌ను జాతీయ రహదారుల విభాగానికి చెందిన ప్రభుత్వస్థలం ఆక్రమించుకుని షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు సర్వేలో వెలుగులోకి వచ్చినందున సంబధింత షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తున్న యజమానికి నోటీసు జారీచేసినట్లు చెప్పారు. ఇటీవల జిల్లా కలెక్టర్ నుంచి అందిన ఆదేశాల మేరకు సర్వే జరిపామన్నారు. సర్వే ద్వారా వచ్చిన అంశాలను తదుపరి చర్యనిమిత్తం జిల్లా కలెక్టర్‌కు నివేదిక ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. ఇంతవరకు జరిగిన నిర్మాణాన్ని తొలగించాలని పేర్కొన్నట్లు తెలిపారు. షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మాణానికి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసినట్లు అంగీకరించారు. షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మాణ పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మధుపాడ గ్రామపంచాయతీ పరిధిలోగల చాకలిబంద వద్ద జాతీయ రహదారి పక్కన ప్రభుత్వభూమిని ఆక్రమించుకుని జరిపిన ఇళ్ళ నిర్మాణాలు తొలగించమని ఆ గ్రామకార్యిదర్శికి లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆక్రమణల తొలగింపు సమయంలో తగురక్షణ కల్పించాలని స్థానిక ఎస్సైను లిఖితపూర్వకంగా కోరామన్నారు. జాతీయ రహదారికి ఇరుపక్కల ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ఆర్‌అండ్‌బి జెఇ తనకు తెలియజేసినట్లు తెలిపారు. పుట్‌పాత్ నిర్మాణానికి ఆటంకాలు లేకుండా మిగిలిన అక్రమ ఆక్రమణలు తొలగించనున్నట్లు తెలిపారు.

20 సహకార భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు
గజపతినగరం, మార్చి1 : జిల్లాలో 20ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాలకు అవసరమైన స్వంత భవనాలు నిర్మించడానికి కోటి రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపించినట్లు సమగ్ర సహకార అభివృద్ధి చీఫ్ ప్రాజెక్టు ఆఫీసర్ అట్టాడ హేమసుందర్ చెప్పారు. గురువారం ఇక్కడ విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క భవన నిర్మాణానికి ఐదులక్షల రూపాయల వంతున ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 50ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘం కొత్త భవనాలకు 2కోట్ల 35లక్షల ఖర్చుతో నిర్మించామన్నారు. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరాంతంలోగా అన్ని సహకార వ్యవసాయ పరపతి సంఘాలకు స్వంత భవనాలు సమకూరనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఖరీఫ్ సీజన్‌లో కోటి 45లక్షల ఖర్చుతో ఎరువులు విక్రయించినట్లు చెప్పారు. సమావేశంలో స్థానిక సొసైటీ సిఇఓ నారాయణరావు పాల్గొన్నారు.

బస్సు ఢీకొని ఒకరి మృతి
విజయనగరం (కంటోనె్మంట్), మార్చి 1: ఆర్టీసీ అద్దెబస్సు ఢీకొని గురువారం ఒక వ్యక్తి మృతి చెందాడు. పట్టణంలో బాలాజీ కూడలి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో స్థానిక స్టేడియం పేట కాలనీ మాదిగ వీధికి చెందిన వెలుచూరి గెడ్డయ్య (65) మృతి చెందాడు. వీధుల్లో తిరగుతూ చెప్పులు కుట్టుకుని జీవించే గెడ్డయ్య యధావిధిగా తన పనిలోకి వెళ్తుండగా శ్రీకాకుళం వైపు నుంచి వస్తోన్న ఆర్టీసికి చెందిన అద్దెబస్సు వెనుకు నుంచి వచ్చి ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతునికి భార్య పైడమ్మతోపాటు ముగ్గురు సంతానం ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కైన గెడ్డయ్య అకాల మరణం పొందడంతో ఆ కుటుంబంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్రాక్టర్ బోల్తా : 15మందికి గాయాలు
నెల్లిమర్ల, మార్చి 1: మండలానికి చెందిన రామతీర్థం జంక్షన్‌లో బుధవారం రాత్రి పెళ్ళిబృందం ట్రాక్టర్ బోల్తాపడి 15మంది గాయపడ్డారు. ఇదే మండలానికి చెందిన తంగుడుబిల్లి గ్రామానికి చెందిన పెళ్ళిబృందం గుర్ల మండలానికి చెందిన చింతలపేటలోని వివాహానికి వెళ్ళి ట్రాక్టర్‌పై తిరిగి స్వగ్రామానికి తిరిగివస్తుండగా రామతీర్థం జంక్షన్‌లో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో 15మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మిమ్స్ అసుపత్రికి తరలించారు. ఎస్సై టి.వరప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందతున్న క్షతగాత్రులను నియోజకవర్గ దేశం పార్టీ ఇన్‌చార్జి పతివాడ నారాయణస్వామి తదితరులు పరామర్శించారు.

చెట్టును ఢీకొన్న వాహనం.. చిన్నారి మృతి
* 10 మందికి గాయాలు
బొండపల్లి, మార్చి 1: మితిమీరిన వేగంతో వెళ్తూ టాటా మేజిక్ వాహనం ఒకటి అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును దుర్ఘటనలో నెలల పసికందు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. విజయనగరం నుంచి గజపతినగరం వెళ్తున్న వాహనం బొండపల్లి కోల్డ్ స్టోరేజ్ సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈప్రమాదంలో ఒంపల్లి గ్రామానికి చెందిన కర్రి జ్యోత్స్న (పసికందు) మృతి చెందింది. ఇదే ప్రమాదంలో చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వల్లూరి సత్యనారాయణ, కొత్తకోట వెంకటరావు, కర్రి మారయ్య, పైల గోపాల్, డెంకాడ అప్పలరాజు, కర్రి లక్ష్మి, కూర్మ అప్పలనాయుడు, పొందూరు రమణ, పుణ్యాన అప్పలస్వామి తదితరులు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారి జ్యోత్సను వైజాగ్ కె.జి.హెచ్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. బొండపల్లి ఎస్సై స్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘బోధనలో సాంస్కృతిక అంశాలపై దృష్టి పెట్టండి’
విజయనగరం (కలెక్టరేట్), మార్చి 1: ప్రాధమిక పాఠశాలల్లో చిన్నారులకు బోధించే పాఠ్యాంశాలలో సాంస్కృతిక అంశాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని, వీలును బట్టి ఉపాధ్యాయులు సంగీత, సాంస్కృతిక తదితర అంశాలను చిన్నారులకు పలువిధాలగా వివరించాలని, తద్వారా చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని జిల్లావిద్యాశాఖ అధికారి వి.ఎస్.సుబ్బారావు అన్నారు. సాంస్కృతిక విద్య, సిసిఆర్‌టిల పాత్ర అన్న అంశంపై మూడు రోజుల పాటు స్థానిక కోటలోని ఎంఆర్ ఉన్నతపాఠశాలలో ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణాతరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ సభకు హాజరైన డిఇఒ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఈశిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలతోపాటు తమ సొంత ప్రతిభ ద్వారా నాణ్యమైన విద్యను, సరళతరమైన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. డిప్యూటి డిఇఒ నాగమణి మాట్లాడుతూ ఆటపాటల ద్వారా, వివిధ రకాల ముగ్గులు, చిత్రాల ద్వారా విద్యార్థులకు మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు తదితర అంశాలను వివరించాలని, వచ్చే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచెందుకు ఉపాధ్యాయులు తమ వంతుకృషి చేస్తు అంగన్‌వాడీ కేంద్రాలవద్దఉన్న విద్యార్థుల వివరాలు సేకరించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డైట్‌ప్రిన్సిపల్ టికెవి సత్యనారాయణ, ఎఎంఓ శ్రీనివాసరావు, ఎంఆర్ ఉన్నతపాఠశాల హెచ్.ఎం రామలక్ష్మి, వల్లూరి పాఠశాలప్రదానోపాధ్యాయురాలు శారద పాల్గొన్నారు.
బోనంగిలో అగ్నిప్రమాదం
గంట్యాడ, మార్చి 1: మండలానికి చెందిన బోనంగి గ్రామంలో గురువారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో రూ.8లక్షల వరకు అస్థినష్టం జరిగింది. బాధితులకు చెందిన ధాన్యం, అపరాలు, విలువైన వస్తువులు సమస్తం కాలి బూడిద కావడంతో వారంతా కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాద సమయంలో ఇళ్లల్లో ఎవ్వరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారం ప్రకారం బాలిరెడ్డి ఈశ్వరరావుఇంటికి నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. దీనితో పరిసర ప్రాంతాల్లో పల్లి సన్యాసమ్మ, డి.రాము, డి.సన్నిబాబు, అప్పలనాయుడు, సిహెచ్.పోలీసు, లక్ష్మణ, బి.సూరిబాబు, ఆకేటి చెల్లమ్మ తదితరుల ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు ధైర్యం చేసి ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లను బయటకు తేవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమాచారం అందుకున్న విజయనగరం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉమ, సిబ్బంది ప్రమాదంలో జరిగిన ఆస్థినష్టాన్ని అంచనా వేశారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సిఉంది. ఇదిలా ఉండగా బాదితులంతా కూలీ,నాలీపై ఆధారపడి జీవిస్తున్నవారుకావడంతో ప్రమాదంలో జరిగిన నష్టంతో వీరువీదిన పడ్డారు.
మృత్యు శకటాలుగా ఆటోలు
జామి, మార్చి 1: భక్తుల ఆనందోత్సాహాల నడుమ జరగాల్సిన ఎల్లారమ్మ జాతరలో చోటుచేసుకున్న పలు అపశృతులు నలుగురి నిండు ప్రాణాలను బలిగొనడంతోపాటు పలువురు క్షతగాత్రులుగా మిగిలారు. జాతరను చూసి అమ్మవారి దర్శనం చేసుకుందామనుకున్న కొందరు దర్శనానంతరం తిరుగుప్రయాణంలో ప్రమాదాల బారిన పడ్డారు. ఇదే మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో10 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత చోటుచేసుకున్న ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పొయిన వారి కుటుంబీకులు విలపిస్తున్నారు. బలరాంపురం వద్ద ఆటో లారీని ఢీకొన్న ఘటనలో విజయనగరం మండలం చెల్లూరు రామజోగిపేటకు చెందిన నక్క అబద్దం (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ నరేష్, మరో ప్రయాణికుడు అప్పలరాజు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇదే మండలం కుమరాం ఉన్నత పాఠశాల వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో విజయనగరం మండలం నాయుడు పేటకు చెందిన బొట్టానాయుడు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈఘటనలో జె.సంతోష్, గొలగాని వెంకన్న, రీసు రాజు, సూర్యారావులుగాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఎల్లారమ్మ జాతరకు వచ్చి తిరిగి తన స్వగ్రామమైన అనంతగిరి మండలం జీడికపాడు వెళ్తున్న జెర్రి సోమయ్య (40) జాగరం వద్ద ఆటో నుంచి జారి పడి తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు. అలమండ సంత వద్ద జరిగిన మరో ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. కొత్తవలస నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈమె మృతి చెందింది. అలాగే జామి మండల కేంద్రంలో గురువారం ఉదయం సైక్లిస్ట్‌ను మోటారు బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయాల పాలైయ్యారు. భక్తి శ్రద్దలతొ పాల్గొనాల్సిన అమ్మవారి జాతరలో కొందరు మద్యం తాగడమే ఈప్రమాదాలకు కారణాలుగా పలువురు వ్యాఖ్యానించడం విశేషం. మద్యం మత్తులో ఆటోలను నడిపి పలువురి ప్రాణాలను బలిగోనడంతో ఆటోలు మృత్యుశకటాలుగా మారాయి. జాతర సమయాల్లో మద్యం తాగి వాహనాలు నడపటంపై దృష్టి సారించాల్సి ఉంది.

కాలిన గాయాలతో విద్యార్థి మృతి
గుర్ల, మార్చి1: ఇంటిలో వంట చేస్తుప్రమాదవశాత్తు దుస్తులకు నిప్పంటుకుని కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతు విద్యార్థిని అశువులు బాసిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి పోలీసులు, విద్యార్థిని తల్లిదండ్రులు అందించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మండలంలోని పున్నపురెడ్డి పేట గ్రామానికి చెందిన పున్నపురెడ్డి కిత్తయ్య, అప్పలరాములకు చెందిన కుమార్తె పున్నపురెడ్డి రమ(14) గురువారం ఉదయం తన ఇంటిలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె దుస్తులకు నిప్పంటుకోవడంతో ఆమె కేకలు విని స్థానికులు మంటలు ఆదుపు చేసి 108వాహనంలో విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం సమయంలో ఇంటిలో ఎవ్వరులేకపోవడంతో పూర్తిగా ఆమె శరీరం కాలిపోవడంతో ఆమె మృతి చెందుతూ గురువారం సాయంత్రం ఆసుపత్రిలో మృతి చెందినట్టు వైద్యులు సమాచారమిచ్చారు. మృతురాలు పాలవసల ఉన్నతపాఠశాలలో 9వ తరగతి చదువతోంది. అయితే తల్లిదండ్రులు ఉదయానే్న పొలం పనులకు వెళ్లిపోవడంతో వంట బాధ్యతలు ఈమె చెపట్టినట్టు తెలిపారు. ఈమేరకు తండ్రి కిత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్ల ఎస్.ఐ విజయకుమార్ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి తల్లిదండ్రులతోపాటు ఒక తమ్ముడు ఉన్నాడు. ఈసంఘటన ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది.

‘10 వేల యూనిట్ల రక్తం సేకరణ లక్ష్యం’
గజపతినగరం, మార్చి 1: వచ్చే ఏడాది జిల్లావ్యాప్తంగా వంద క్యాంపులు నిర్వహించి 10వేల యూనిట్ల రక్తాన్ని సేకరించేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు ఇక్కడి రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ అట్టాడ హేమసుందర్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం రక్తదానం చేసినవారికి రాష్ట్ర గవర్నర్ నుంచి వచ్చిన ప్రశంసాపత్రాలను మాజీ ఎంపిపి మక్కువ శ్రీ్ధర్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 20వేల యూనిట్లు రక్తం అవసరమైతే తమ సంస్థద్వారా 10వేల యూనిట్లు సేకరణకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ప్రస్తుత ఏడాదిలో ఆరువేల యూనిట్లు లక్ష్యం కాగా ఇంతవరకు ఐదువేల యూనిట్లు రక్తాన్ని సేకరించామన్నారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో 24గంటలు నిరంతర రక్తదాన సేకరణకేంద్రం నడుస్తుందన్నారు. రక్తదానం చేసేవారు ఉదయం 6నుంచి సాయంత్రం మధ్య ఇవ్వాలన్నారు. ప్రతిఒక్కరూ రక్తదానంపట్ల ఉన్న అపోహను తొలగించుకొని ముందుకురావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామీణప్రాంతాలకు విస్తరించాలన్న ఆలోచనతో చేస్తున్నామన్నారు. డిఇఓ శ్రీనివాసరావు, సహకార సంఘం సిఇఓ నారాయణరావు పాల్గొన్నారు.

హోంగార్డుల నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం (కంటోనె్మంట్), మార్చి 1: జిల్లాలో ఖాళీగా ఉన్న హోంగార్డు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్తికేయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కల్గిన స్ర్తి, పురుష అభ్యర్ధుల నుంచి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈ నెల 1 నుంచి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్ధులు పోలీసు వెబ్‌సైట్ లోని రిక్రూట్‌మెంట్ వెబ్ పేజీ నుంచి హోంగార్డుల నియామకానికి దరఖాస్తు పత్రాన్ని, హాల్ టికెట్‌ను పొందవచ్చనని తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం గతంలో పంపిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోమని, తాజాగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. అభ్యర్ధులు దరఖాస్తు పత్రానికి, తమ అర్హత ధ్రువీకరణ జెరాక్స్ పత్రాలతోపాటు రెండు కలర్ పాస్‌పోర్టు సైజు ఫొటోలను జతపర్చి జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో తమ ఒరిజనల్ ధ్రువపత్రాలతో స్వయంగా ఈ నెల 1 నుంచి 7 తేదిలోగా హాజరు కావాలని తెలిపారు. అభ్యర్ధులు ఈ నెల 12వ తేదినాటి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కల్గిన జిల్లాకు చెందిన వారు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నియామకాలను మూడు కేటగిరీలుగా విభజించి నియమించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళా హోంగార్డు నియామకాలకు అభ్యర్ధులు కనీసం 150 సెంటీమీటర్లు ఎత్తు వుండాలని ఆయన తెలిపారు. అభ్యర్ధుల విద్య, సాంకేతిక విద్య, ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాత హాల్‌టికెట్లును జారీచేసి, శారీరక దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ఖాళీలను త్వరలో ప్రకటిస్తామని ఎస్పీ తెలిపారు.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
విజయనగరం , మార్చి 1: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకుగాను ముందస్తుప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లాకలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య గ్రామీణ నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. జిల్లాకు నిధుల కొరత లేదని, కనుక అధికారులు మండలాల వారీగా నీటి సమస్యలు గుర్తించడంతోపాటు, అవసరమైన చోట బోర్లు బాగుచేయడంతో కొత్త బోర్లకుప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాచేయాలని, అలాగే బోర్లును రైతాంగం నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకుంటే అద్దెను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. గురువారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నీటి కష్టాలపై పత్రికల్లో వార్తలు వస్తే సహించేందిలేదని, వార్తలు వెలువడిన సందర్భంలో ఆయా ప్రాంతాలను గుర్తించి సమస్య పరిష్కారానికి చేపట్టిన చర్యలు, ఇతర అంశాలను తక్షణమే పత్రికల ద్వారా తెలియజేయాలన్నారు. అలాగే అక్రమంగా కనెక్షన్‌లు కలిగిన వారిపై అధికారులు ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, అలా చేయలేని అధికారులు ఇక్కడ నుంచిబదిలీపై వెళ్లిపోవచ్చని సూచించారు. అక్రమ కనెక్షన్ దారులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే వాటిని రద్దు చేయాలని, ఇంజనీర్లు పనిచేసే చోట నివాసం ఉండాలని, 15రోజుల్లోగా అలా చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గిరిజన ప్రాంతాలకు అవసరమైన తాగునీటి పథకాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపితే ఐఎపి ద్వారా నిధులు మంజూరుచేయడం జరుగుతుందన్నారు. మండలాల వారీగా జిల్లా వ్యాప్త సర్వే నిర్వహించి సమస్య ఉన్నచోట సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అలాగే మండల అభివృద్ది అధికారుల ఫోన్‌నెంబర్లను ప్రజలకు తెలియజేసి సమస్యలపై ఫిర్యాదు చేసే విధంగా ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. ఇప్పటి నుంచి ప్రతి 15రోజులకు ఒకసారి ఈ విషయమై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో బోర్లు రిపేరు, నీటిసరఫరాకు గాను రూ.46.5లక్షలు కలెక్టర్ మంజూరు చేశారు.
సాక్షరభారత్ కార్యక్రమనికి సిడిల ద్వారా ప్రచారం: ఇదిలా ఉండగా ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న సాక్షరభారత్ పరీక్ష నిర్వహణకు సంబందించి ప్రజలను, నిరక్షరాస్యులను చైతన్యం చేసేందుకుగాను గ్రామాల్లో సిడిల ద్వారా ప్రచారం నిర్వహించాలని, ప్రతి గ్రామంలోను రామమందిరాలు, ఆధ్యాత్మిక కేంద్రాలలలోను సిడిలను వేసి ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అలాగే ఆటోల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల లోపు పరీక్ష కేంద్రాలకు వెళ్లి పేపర్లనురాస్తే చాలు అక్షరాస్యులుగా మారిపోతారన్న సందేశాన్ని ఈసిడిలో పొందుపరిచినట్టు కలెక్టర్ వెల్లడించారు. అలాగే ఈనెల 16,17,18 తేదీల్లో మండల కేంద్రాల్లో ఏ ఒక్కఉద్యోగికి సెలవు మంజూరు చేయడం జరగదని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లాపరిషత్ సిఇఓ కొండయ్యశాస్ర్తీ, డిపిఓ నాగరాజువర్మ, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్.ఇ గోపాలకృష్ణ, ఇఇ మీరాప్రసాద్, డిఇఓ, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో అల్లుడు, మామ మృతి
చీపురుపల్లి, మార్చి 1: పట్టణంలో కుమ్మరి కాలనీకి సమీపంలో పాలకొండ-విజయనగరం రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఇటకర్లపల్లి గ్రామానికి చెందిన మాజీసర్పచులు గొర్లె అక్కలనాయుడు(45), మీసాల లక్ష్మునాయుడు(60) గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. మీసాల లక్ష్మునాయుడు, గొర్లె అక్కలనాయుడులు విజయనగరంలో ఉన్న అక్కలనాయుడికి కుమార్తె, లక్ష్మునాయుడుకు మనుమరాలు అయిన ప్రశాంతి గృహప్రవేశానికి హీరోహోండా బైక్‌పై విజయనగరం వెళ్ళారు. వీరిరువురు ప్రశాంతి గృహప్రవేశం చూసుకుని విజయనగరం నుండి తిరిగి వస్తుండగా చీపురుపల్లి పట్టణంలోన ఎపి31టిఎ4355 నెంబరు గల లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ద్విచక్రవాహనంపై వస్తున్న అక్కలనాయుడు, లక్ష్మునాయుడులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన లక్ష్మునాయుడు, అక్కలనాయుడులు మామా అల్లుడులు కావడం విశేషం. మీసాల లక్ష్మునాయుడుకి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా, నలుగురు కుమారులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. గొర్లె అక్కలనాయుడుకు ఒక కుమారుడు, ఒక కుమార్తెకాగా కుమార్తె ప్రశాంతి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. మృతులు అక్కలనాయుడు, లక్ష్మునాయుడులు ఇరువురు ఇటకర్లపల్లి గ్రామానికి మాజీ సర్పంచులు కావడం మరోవిశేషం. మృతదేహాలవద్ద గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు తరలివచ్చి మృతదేహాలవద్ద రోదిస్తున్నారు. ఈ మేరకు చీపురుపల్లి ఎస్సై అబ్దుల్ మారూఫ్, హెచ్‌సి పాపారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి
బొబ్బిలి(రూరల్), మార్చి 1: మహిళలపై నానాటికి జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని బొబ్బిలి, సాలూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు తెంటు లక్ష్మునాయుడు, గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మండలం వెంకటరాయుడుపేట గ్రామంలో బుధవారం రాత్రి జి.నిర్మలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం విధితమే. దీనిపై గురువారం సంఘటనా స్థలాన్ని వారు పరిశీలించి బంధువులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల చట్టాలను పటిష్టవంతం చేసేందుకు ప్రభుత్వం ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు. ఇటీవల గుమ్మలక్ష్మీపురంలో మహిళపై అత్యాచారం జరిగినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. పట్టణ, గ్రామాల్లో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఈ సందర్భంగా సి.పి. ఎం. పార్టీ నాయకులు రెడ్డి వేణు, రామారావుతోపాటు ఐద్వా నాయకులు వి. ఇందిర, బి. రమణమ్మలు మాట్లాడుతూ మహిళలపై దారుణంగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. విచ్చలవిడిగా అన్ని గ్రామాల్లో బెల్టుషాపులను ఏర్పాటు చేసి మద్యానికి బానిసై అత్యాచారాలకు ఒడిగట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బెల్టుషాపులను ఎత్తివేయాలని కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.

అన్‌సర్వే భూముల సర్వేకు చర్యలు
సాలూరు, మార్చి 1: సాలూరు, పాచిపెంట మండలాల్లోని 21 అన్ సర్వే గ్రామాల భూములను సర్వే చేయడానికి చర్యలు చేపడుతున్నామని జిల్లా సర్వేయింగ్ ఏ.డి. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ పాచిపెంట మండలంలో 17, సాలూరు మండలంలో 4 గ్రామాలు సర్వే కాలేదన్నారు. దిగువ మెండంగి ప్రాంతంలో గనుల తవ్వకానికి అనుమతి కోరినందున అక్కడ భూములకు సర్వే చేస్తామన్నారు. దిగువ మెండంగి భూములు అటవీశాఖ పరిధిలో ఉన్నాయా? రెవెన్యూ పరిధిలో ఉన్నాయా? అన్న విషయాన్ని తేల్చడానికి ఉమ్మడిగా తనిఖీ చేస్తున్నామన్నారు. ఈ నిర్ధారణ తరువాత జి.పి. ఎస్. పద్ధతిలో సర్వే జరగలేదన్నారు. దిగువ మెండంగి భూముల సర్వే చేయడానికి 14 నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.
అటవీశాఖ పరిధిలో భూములున్నట్లయితే నిబంధనల ప్రకారం గనుల తవ్వకాలకు అనుమతి లభించిందని సర్వే ఏ.డి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన వెంట సబ్ డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
లోక కళ్యాణార్థం గాయత్రీ జపయజ్ఞం
సాలూరు, మార్చి 1: స్థానిక శారదా సత్సంగ సమాజం ఆశ్రమంలో గురువారం లోక కళ్యాణార్ధం గాయత్రీ జపయజ్ఞాన్ని ఆశ్రమ పీఠాధిపతి దేవీ ఉపాసకులు ముద్దు సత్యనారాయణమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణార్ధం శారదా సత్సంగ ఆశ్రమం ఆవరణలో కామాక్షీదేవి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. ఈ మేరకు ఈ నెల 11న శంకుస్థాపన జరిపేందుకు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ముందుగా చండీహోమం, గాయత్రీ హోమం, లలితా హోమం, నవగ్రహాలకు, తదితర దేవతలకు హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 18రోజుల పాటు గాయత్రీ జపయజ్ఞాన్ని చేపట్టామన్నారు. గాయత్రీ దేవీ సర్వ దేవతలకు అధిష్టాన దేవతయని గాయత్రీ జపయజ్ఞాన్ని నిర్వహించే వారికి బ్రహ్మ హత్యాపాపాలు పోతాయన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

సీజనల్ హాస్టల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి
బొబ్బిలి(రూరల్), మార్చి 1: వలసలు వెళ్లిన తల్లిదండ్రుల విద్యార్థులకు నూతనంగా ఏర్పాటు చేసిన సీజనల్ హాస్టల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి సి.హెచ్.లక్ష్మణరావు కోరారు. మండలం మెట్టవలస గ్రామంలో గురువారం సీజనల్ హాస్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే వలసలు వెళ్లారని, వారి కోసం ప్రభుత్వం సీజనల్ హాస్టల్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దీక్షా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు శాంతికుమారి మాట్లాడుతూ ఈ హాస్టల్లో 63మంది పిల్లలకు ఉచితంగా 3 పూటలా భోజనం పెట్టడం జరిగిందన్నారు. ప్రతీ ఒక్కరూ సక్రమంగా ఉండాలని కోరారు. ఏమైన సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. దశల వారీగా మరికొన్ని గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సంస్థ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్. ఎం. జె.సి.రాజుతోపాటు మాజీ ఎం.పి.టీ.సి సభ్యులు పువ్వల మాధవ, మాజీ సర్పంచ్ కెల్ల తవుడు, తదితరులు పాల్గొన్నారు.

బంగారం కోసం ఓ వివాహితను హత్య చేసిన విషయం గురువారం వెలుగుచూసింది
english title: 
murder for gold

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>