పరవాడ, మార్చి 2: స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన వైజ్ఞానిక మేళా అందరినీ ఆకట్టుకుంది. మండలంలో గల 56 పాఠశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు వారి వారి నైపుణ్యానికి పదునుపెట్టి వివిధ ప్రాజెక్టులను రూపొందించి వైజ్ఞానిక మేళాలో ప్రదర్శించారు. శుక్రవారం ఈ వైజ్ఞానిక మేళాను మండల విద్యాశాఖాధికారి కెఎల్‌జె మోహనరావు ప్రారంభించారు. సైన్స్, మేథ్స్‌లలో ప్రాథమిక విద్యార్థులు రూపొందించిన నమూనాలు చూపరులను ఆలోచింపజేశాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన నమూనాలు నిలిచాయని కార్యక్రమాన్ని సందర్శించిన ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానించారు. పరవాడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు తయారుచేసిన మానవ జీవన వ్యవస్థ చేసే పనిని విద్యుద్దీపాలతో రూపొందించి ఆహూతులకు వివరించారు. ఈ నమూనాకే ప్రథమ బహుమతి దక్కింది. అలాగే దేశపాత్రునిపాలెం పాఠశాల విద్యార్థులు మానవ ఆహారపు అలవాట్లపై రూపొందించిన నమూనా కూడా వచ్చినవారిని ఎంతగానో ఆకట్టుకుంది. గొరుసువానిపాలెం పాఠశాల విద్యార్థులు వివిధ ఖనిజాలను సేకరించి మేళాలో మేమే ముందున్నామన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలో ప్రథమ స్థానాన్ని మెట్టపాలెం పాఠశాల విద్యార్థులు దక్కించుకున్నారు. ఆటోమేటిక్ లైట్నింగ్ సిస్టమ్ నమూనాను మెట్టపాలెం విద్యార్థులు తయారుచేసి బహుమతిని దక్కించుకున్నారు. వ్యర్థాలతో విద్యుత్ సరఫరా, పిరమిడ్స్ వంటి నమూనాలను తయారుచేసి పరవాడ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు బహుమతిని దక్కించుకున్నారు. పాత నాణాలను సేకరించి ప్రదర్శించడంలో తానాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బహుమతి సాధించగా, తిక్కవానిపాలెం విద్యార్థులు విద్యుత్తు ప్రవహించే విధానంపై తయారుచేసిన నమూనాకు బహుమతి దక్కింది. మేళాను సందర్శించిన వారిలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పైల శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క రామునాయుడు, రిటైర్డ్ ఉపాధ్యాయులు పైల సన్యాసిరావు, మాజీ ఉపసర్పంచ్ పైల రమణబాబు, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం.సునీత, ఎంఆర్‌పిలు గోపాలకృష్ణ, గణేష్ ఉన్నారు.
ఎయు అధికారులకు ‘ఆడిట్’ అక్షింతలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 2: ఆంధ్రా యూనివర్సిటీలో చాలా కాలంగా జరుగుతున్న నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరి ఇష్టారాజ్యంగా వారు భూములను ధారాదత్తం చేసేయడం, వర్సిటీకి చెందిన నిధులకు సరైన లెక్కలు చూపించకపోవడాన్ని స్టేట్ ఆడిట్ అధికారులు తీవ్రంగా పరిగణించారు. కొద్ది రోజుల కిందట ఇక్కడికి వచ్చిన ఆడిట్ అధికారులు ఇక్కడ అనేక లోపాలను గుర్తించారు. వీటన్నింటికీ సంబంధించి రికార్డులను తీసుకురావల్సిందిగా ఆదేశించారు. ఈ రికార్డులన్నింటినీ స్టేట్ ఆడిట్ అధికారులు గురువారం పరిశీలించారు. వర్సిటీలో క్యాష్ బుక్ నిర్వహణ సక్రమంగా లేదని, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీని నిర్వహణ సరైన పద్ధతిలో ఉండాలని ఆడిట్ అధికారులు ఆదేశించారు. ప్రతి వారం బ్యాంక్ స్టేట్‌మెంట్ తెప్పించుకుని, జరిగిన జమా ఖర్చులతో పోల్చి చూసుకోవాలని ఆదేశించింది. అలాగే ఎయులో చేపట్టిన ప్రాజెక్ట్‌లకు అడ్వాన్స్‌లు చెల్లిస్తుంటారు. నెలలు గడిచినా ఆ అడ్వాన్స్‌లకు సంబంధించి సదరు వ్యక్తులు బిల్లులు ఇవ్వడం లేదు. ఇకపై రెండుసార్లు మాత్రమే అడ్వాన్స్ ఇస్తారు. వీటికి సంబంధించిన బిల్లులను మూడు నెలల్లో సమర్పించాల్సి ఉంటుంది. అలా లేని పక్షంలో బాధ్యుల జీతాల నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. ఎయు లైబ్రరీలో 4.5 లక్షల పుస్తకాలు ఉన్నాయని భావిస్తున్నారు. వీటిని లెక్కించాలని, పాడైపోయిన, చెదలుపట్టిన పుస్తకాలను తొలగించాలని నిర్ణయించారు. 2000-2007లో ఆడిట్‌లో ఇంకా అనేక లోపాలు చోటుచేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. హాస్టల్‌లో మెస్ చార్జీల వసూళ్ళలోని లోపాలను గుర్తించింది. దీనిపై స్టేట్ ఆడిట్ కార్యాలయం, లేదా ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.