స్ప్రింగ్ మనిషి..
అత్యుత్తమ అథ్లెట్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆరోన్ ఇవాన్స్‌కు ఓ అద్భుతమైన నైపుణ్యం ఉంది. మిగతా అథ్లెట్స్ కంటే అతను ఎక్కువ ఎత్తు గాల్లోకి ఎగరగలడు. ఈ లక్షణమే అతనికి స్ప్రింగ్ మనిషిగా పేరుతెచ్చింది. ఐదేళ్ల వయసులోనే తాను అవలీలగా గాల్లో జంప్ చేయగలనని తెలుసుకున్న ఇవాన్స్ అప్పటి నుంచి సాధన ప్రారంభించాడు. బ్రూస్ లీ సినిమాలు తెగ చూసి, మార్షల్ ఆర్ట్స్‌లో మాదిరి పరిగెత్తడం, పల్టీలు కొట్టడం, గాల్లోకి ఎగరడం ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు వేగంగా వెళుతున్న కార్ల పైనుంచి దూకుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. వరుసగా మూడు కార్ల పైనుంచి దూకి గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించాడు. మిల్వాకీ ప్రాంతానికి చెందిన ఈ చిచ్చర పిడుగు మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడానికి ఏక దీక్షతో, విశేషంగా శ్రమిస్తున్నాడు.
ఆలౌట్ 13..
ఇంగ్లీష్ కౌంటీల్లో అత్యల్ప స్కోరు కేవలం 13 పరుగులు. 1877-78 సీజన్‌లో సెంటర్‌బరీని ఢీకొన్న ఆక్లాండ్ అతి తక్కువ స్కోరుకే కుప్పకూలింది. 13 పరుగుల్లో ఎనిమిది ఎక్‌స్ట్రాల రూపంలో లభించాయి. ఒక బ్యాట్స్‌మన్ అత్యధికంగా రెండు పరుగులు చేశాడు. ఆక్లాండ్ రికార్డును ఇప్పటి వరకూ కౌంటీల్లో ఎవరూ బద్దలు చేయలేకపోయారు. ఈ ఏడాది మే మాసంలో లాంకషైర్‌ను ఢీ కొన్న ఎసెక్స్ జట్టు 20 పరుగులకే ఆలౌటైంది. అందులో జైక్ మిక్లెన్‌బర్గ్ వాటా 10 పరుగులు. 1901లో యార్క్‌షైర్‌ను ఎదుర్కొన్న ఎసెక్స్ 30 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అత్యల్ప స్కోరుగా నమోదైన ఆ రికార్డును అదే జట్టు తుడిచేసింది. 1878లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎంసిసి 19 పరుగులకే చాపచుట్టేసింది. విల్‌ఫ్రెడ్ ఫ్లవర్స్ అత్యధికంగా 11 పరుగులు చేశాడు. 1922లో యార్క్‌షైర్‌ను ఢీకొన్న ససెక్స్ 20 పరుగులకే ఆలౌట్‌కాగా, అందులో వికెట్‌కీపర్ జార్జి స్ట్రీట్ ఒక్కడే పది పరుగులు సాధించాడు. ఇలాంటి చెత్త రికార్డుల కోసం ఏ జట్టూ ప్రయత్నించదేమో!
టెన్నిస్‌లో క్రికెటర్ ప్రతిభ!
కెన్యా ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆసిఫ్ కరీం 1999 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, మనసు మార్చుకొని 2003లో మరోసారి రంగంలోకి దిగాడు. ఆ పోటీల్లో కెన్యా సెమీస్ వరకూ చేరింది. అప్పటికి 39 సంవత్సరాల వయసున్న కరీం ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించి, 8.2 ఓవర్లలో కేవలం ఏడు పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో అతను ఆరు మెయిడెన్లు వేయడం విశేషం. ఇవన్నీ పక్కకు ఉంచితే, క్రికెటర్‌గా మైదానంలోకి దిగడానికి ముందు కరీం కెన్యా తరఫున డేవిస్ కప్ టెన్నిస్ పోటీల్లో పాల్గొన్నాడు. 1988లో ఈజిప్టుపై ఆడిన మూడు మ్యాచ్‌లను ఓడినప్పటికీ, క్రికెట్‌లో టెస్టులు, టెన్నిస్‌లో డేవిస్ కప్ మ్యాచ్‌లు ఆడిన అరుదైన ఘనతను సంపాదించుకున్న కోటర్ రామస్వామి (్భరత్/ఇంగ్లాండ్), రాల్ఫ్ లెగాల్ (వెస్టిండీస్) సరసన స్థానం సంపాదించాడు. ఎస్‌ఎం హాదీ 1936లో రామస్వామితో కలిసి ఇంగ్లాండ్ టూర్‌లో డేవిస్ కప్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, అతను టెస్టు మ్యాచ్ ఆడలేకపోయాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి పేరు సంపాదించినప్పటికీ అతనికి టెస్టుల్లో అవకాశం లభించకపోవడంతో, ఈ జాబితాలో స్థానం దక్కలేదు.