ఇంగ్లాండ్ స్టార్ స్ట్రయికర్ వేన్ రూనీ ‘అమ్మకం’ ఓ ప్రహసనంగా మారింది. అతనిని కొంటున్నట్టు చెల్సియా ప్రకటనలు గుప్పిస్తుంటే, అలాంటిదేమీ లేదని మాంచెస్టర్ యునైటెడ్ సాకర్ క్లబ్ స్పష్టం చేస్తున్నది. ‘ట్రాన్స్‌ఫర్’ పేరుతో ఫుట్‌బాల్ క్లబ్స్ తమ ఆటగాళ్లను అమ్మడం కొత్తకాదు. కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. రోజురోజుకూ ట్రాన్స్‌ఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు రూనీని 60 మిలియన్ పౌండ్లకు చెల్సియా కొంటున్నట్టు ప్రచారం జరిగింది. అంతేగాక, రూనీకి బదులు జువాన్ మతా లేదా డేవిడ్ లూయిజ్‌ను ఇవ్వడానికి కూడా చెల్సియా సిద్ధపడినట్టు వార్తలు వచ్చాయి. రూనీ అంటే తనకు ఎంతో ఇష్టమని, అతను తమ జట్టులో ఉండాలని కోరుకుంటున్నానని చెల్సియా అధినేత జోన్ వౌరిన్హో పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే, మాంచెస్టర్ యునైటెడ్ ఈ వార్తలను ఖండించింది. ‘రూనీ అమ్మకానికి లేడు’ అంటూ వ్యాఖ్యానించింది. చెల్సియాకు రూనీ బదిలీ కేవలం ఊహాగానమేనంటూ కొట్టిపారేసింది. ఇలావుంటే, మాంచెస్టర్ యునైటెడ్‌కు చీఫ్‌గా వ్యవహరించిన అలెక్స్ ఫెర్గూసన్ తన బాధ్యతల నుంచి వైదొగడంతో రూనీ తీవ్ర మనస్తాపానికి గురైనట్టు సమాచారం. అతను లేని మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో తాను కొనసాగలేనని అతను స్పష్టం చేసినట్టు స్కై స్పోర్ట్స్ న్యూస్ టెలివిజన్ పేర్కొంది. రూనీ ‘అమ్మకం’ ఊహాగానాలు చెలరేగడానికి స్కై స్పోర్ట్స్ ప్రసారం చేసిన వార్త కూడా ఒక కారణం. ఈ వార్తలో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి.
ఇంగ్లాండ్ స్టార్ స్ట్రయికర్ వేన్ రూనీ ‘అమ్మకం’ ఓ ప్రహసనంగా మారింది
english title:
runi
Date:
Sunday, July 28, 2013