ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్... నిన్న మొన్నటి వరకూ ఢిల్లీ వరకే పరిమితమైన పేరిది. కానీ, ఇప్పుడు దేశ వ్యాప్తంగా అతని పేరు మారుమోగుతోంది. ఆరో ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులే వెలుగులోకి తెచ్చారు. లోతుగా వెళుతున్న కొద్దీ ఎంతోమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ సిఇవోగా వ్యవహరించిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ కటకటాల వెనక్కి వెళ్లాడు. బ్రిటన్ దేశస్థుడైన రాజ్ కుంద్రాను క్రికెట్ వ్యవహారాల నుంచి బోర్డు సస్పెండ్ చేసింది. గురునాథ్ పేరు తెరపైకి రావడంతో, శ్రీనివాసన్ తన బాధ్యతల నుంచి తప్పుకొని, విచారణ పూర్తయ్యే వరకూ వర్కింగ్ కమిటీ చీఫ్ బాధ్యతలను జగ్మోహన్ దాల్మియాకు అప్పగించాల్సి వచ్చింది. బోర్డు కార్యదర్శి సంజయ్ జగ్దాలే, కోశాధికారి అజయ్ షిర్కే, ఐపిఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా రాజీనామాలకు కారణమైన ఈ కేసును పరిశోధిస్తున్న నీరజ్ కుమార్ భారీ కసరత్తే చేస్తున్నాడు. క్రికెట్ గురించి తెలుసుకోవడం మొదలుకొని, క్రికెట్ చరిత్రలో ఫిక్సింగ్ లేదా అలాంటి సంఘటనల వివరాల వరకూ ప్రతి విషయాన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 59 ఏళ్ల నీరజ్‌కు పోలీస్ శాఖలో మూడు దశాబ్దాలకుపైగా పని చేసిన అనుభవం ఉంది. ఎన్నో కేసులను అతను అత్యంత సమర్థంగా పరిష్కరించాడు. ఇప్పుడు స్పాట్ ఫిక్సింగ్ కేసులో ‘అవినీతి కొండ’ను తవ్వుతున్నాడు. కోట్లాది మంది అభిమానుల నమ్మకాన్ని నిలువుపాతర వేసిన ఈ మహమ్మారితో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాడు. డబ్బు, పలుకుబడి, అధికార బలం ఉన్న ఎంతోమంది నుంచి వస్తున్న ఒత్తిడులను అధిగమించి, ఆటగాళ్లను ప్రలోభ పెట్టే సంప్రదాయం పునాదులను వెతుకుతున్నాడు. ఈ కేసును చేపట్టక ముందు క్రికెట్ పట్ల అతనికి ఉన్న అవగాహన అంతంత మాత్రమే. కానీ, విచారణ చేపట్టిన తర్వాత అమీతుమీ తేల్చుకునే పనిలో పడ్డాడు. క్రికెట్ చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాడు. 1932లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను, ప్రత్యేకించి సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను భారీ స్కోరు చేయకుండా నిలువరించేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ డగ్లస్ జార్డీన్ అనుసరించిన ‘బాడీలైన్’ వివరాలు తెలుసుకున్నాడు. బ్రాడ్‌మన్ శరీరానికి బలంగా తగిలే విధంగా బంతులు వేయాల్సిందిగా ఫాస్ట్ బౌలర్లు హరొల్డ్ లార్‌వుడ్, బిల్ వోస్‌లను జార్డీన్ ఆదేశించాడు. ఆ సంఘటనను ప్రస్తావిస్తూ, ఆటగాళ్లను నయానాభయాన తమ మాట వినేట్టు చేసుకోవడం ఆ రోజుల నుంచే ఉందని నీరజ్ అంటున్నాడు. ఆటగాళ్ల చెడు ప్రవర్తన అభిమానులను వంచించడమేనని అతని అభిప్రాయం. స్పాట్ ఫిక్సింగ్ దోషులకు కఠిన శిక్ష పడితేగానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు తెరపడవని స్పష్టం చేస్తున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కొండను తవ్వుతున్న నీరజ్ ఇంకెన్ని సంచలనాలను వెల్లడిస్తాడో, తెరచాటున ఉండి నాటకమాడుతున్న ఎంత మంది బడాబాబుల పేర్లు బయటపెడతాడో చూడాలి.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్...
english title:
spot
Date:
Sunday, July 28, 2013