* ఒక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన బ్యాట్స్‌మన్ చివరి వరకూ నాటౌట్‌గా నిలిస్తే ‘క్యారీడ్ బ్యాట్’ అంటారు. టెస్టు క్రికెట్‌లో ఈ విధంగా ఇన్నింగ్స్ ముగిసే వరకూ నాటౌట్‌గా కొనసాగిన బ్యాట్స్‌మెన్ చాలా మందే ఉన్నారు. అయితే, మొదటి బంతికే ఓపెనర్ అవుటైతే, ఆ వెంటనే బ్యాటింగ్‌కు వచ్చి చివరి వరకూ నాటౌట్‌గా నిలిచిన వాళ్లు టెస్టు క్రికెట్‌లో లేరు. కానీ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈరికార్డు గ్రాహం హెన్రీ పేరుమీద ఉంది. 1968లో క్రైస్ట్‌చర్చి మైదానంలో ప్లంకెట్ షీల్డ్ టోర్నమెంట్‌లో భాగంగా సెంటెన్‌బరీతో జరిగిన మ్యాచ్‌లో ఒటాంగో ఓపెనర్ డి మోజ్ మొదటి బంతికే అవుటయ్యాడు. దీనితో కెప్టెన్ నియోల్ మెక్‌గ్రెగర్ బరిలోకి దిగాడు. చివరి వరకూ నాటౌట్‌గా నిలిచి 113 పరుగులు సాధించాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో అదే రీతిలో జట్టును ఆదుకోలేకపోయాడు. ఫలితంగా ఒటాంగో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది.
* ఇంగ్లీష్ కౌంటీ క్లబ్ వార్విక్‌షైర్ సొంత మైదానం ఎడ్జిబాస్టన్. కానీ, టెస్టుల్లో ఇప్పటి వరకూ స్థానిక ఆటగాళ్లలో ఎవరూ ఆ మైదానంలో సెంచరీ సాధించలేకపోయారు. ఇదే మైదానంలో మొత్తం 71 సెంచరీలు నమోదైతే, వాటిలో 43 సెంచరీలు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌వే. కానీ వార్విక్‌షైర్ ఆటగాళ్లలో ఎవరూ ఈ జాబితాలో లేరు. ఇయాన్ బెల్ చేసిన 76 పరుగులే లోకల్ బ్యాట్స్‌మన్ అత్యధిక స్కోరు. టెస్టుల్లో నిరాశే ఎదురైనా, వనే్డల్లో మాత్రం రికార్డు కొంత మెరుగ్గానే ఉంది. ఈ మైదానంలో 1996 ఆగస్టులో పాకిస్తాన్‌తో జరిగిన వనే్డలో నిక్ నైట్ 113 పరుగులు చేశాడు. 2010లో బంగ్లాదేశ్‌పై జొనథాన్ ట్రాట్ 110 పరుగులతో రాణించాడు. లోకల్ బ్యాట్స్‌మెన్ టెస్టు సెంచరీలు చేయలేకపోయారన్న స్థానిక అభిమానులకు ఇది కొంత ఊరటనిచ్చే అంశం.
* మామూలు కార్లను నడిపితే మజా ఏముంటుందని అనుకున్నాడో ఏమోగానీ ఇండియానాపొలిస్‌కు చెందిన 44 ఏళ్ల పాల్ స్టెండర్ ఏకంగా మిసైల్ కార్‌తో రోడ్లపై దూసుకెళుతున్నాడు. 1967 మోడల్ చవర్లెట్ కారుకు పైన క్షిపణిని ఉంచి, దానిని ఇంజన్‌తో అనుసంధానం చేశాడు. అత్యంత వేగవంతమైన కార్ల తయారీలో ఎంతో నైపుణ్యం సంపాదించిన ఇండీ బాయిస్ సాయంతో స్టెండర్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోలేని అతని చవర్లెట్ ఇప్పుడు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో పరుగులు తీస్తున్నది. దీనికి ‘జెట్-ఇంపాలా 67’ అని పేరు కూడా పెట్టాడు స్టెండర్.
* భారత్‌లో రెజ్లింగ్‌కు ప్రాచుర్యం కల్పించడం కోసం ఇండియన్ రెజ్లింగ్ లీగ్‌ను ప్రారంభించాలని భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యుఎఫ్‌ఐ) నిర్ణయించింది. లీజర్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సహకారంతో వచ్చే జనవరి-్ఫబ్రవరిలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. ఆరు ఫ్రాంచైజీలతో లీగ్‌ను ప్రారంభిస్తారు. ఒక్కో ఫ్రాంచైజీలో పురుషులు, మహిళలు ఏడుగురు చొప్పున ఉంటారు. వీరిలో విదేశీ రెజ్లర్లు ఇద్దరు ఉండవచ్చు. బౌట్‌లకు ప్రజలను ఆకర్షించేందుకు రెజ్లింగ్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తారు. సోనేపట్, పుణే, న్యూఢిల్లీ, వారణాసితో పాటు మరో రెండు పట్టణాల్లో పోటీలు జరిగే అవకాశం ఉంది. కాగా, ప్రతీ ఫ్రాంచైజీలో ఒక ప్రముఖ రెజ్లర్ ఉండేలా రెజ్లింగ్ ఫెడరేషన్ చూస్తోంది. రెజ్లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి యువత ఆసక్తి కనబరిచేలా ఈ లీగ్ ఉండాలని భావిస్తోంది. ఈ సంవత్సరమే లీగ్‌ను ప్రారంభించాలనుకున్నా, ఒలింపిక్స్ ఉండటంతో వీలుపడలేదని రెజ్లింగ్ లీగ్ పాలక మండలి చైర్మన్ జి ఎస్ మనీందర్ తెలిపాడు. ఈ లీగ్‌లో దేశంలో రెజ్లింగ్ స్థాయి పెరుగుతుందని చెప్పాడు. వచ్చే ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో ఎనిమిది పతకాలైనా గెలవగలమని మనీందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
* క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలో గ్రీక్ అథ్లెట్ ప్రొటిసెలాస్ నిల్చున్న చోటి నుంచి కదలకుండా డిస్కస్‌ను 152 అడుగుల దూరానికి విసిరాడు. సుమారు 2,500 సంవత్సరాలు ఆ రికార్డు చెక్కుచెదరలేదు. 1928 ఒలింపిక్స్‌లో క్లారెన్స్ హౌసర్ 155 మీటర్ల దూరానికి డిస్కస్‌ను విసిరి ప్రొటిసెలాస్ రికార్డును అధిగమించాడు. అయితే, ప్రొటిసెలాస్ మాదిరి కాళ్లు కదపకుండా ఒకే చోట నిలబడి డిస్కస్‌ను ఎవరూ విసరలేదు.
* ఫార్ములా వన్ రేస్ కారులో సుమారు 80,000 విడిభాగాలను వాడతారు. 99.9 శాతం ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫార్ములా వన్ కారును రూపొందిస్తారు. సగటున 80 విడి పరికరాలు తప్పుగా అసంబుల్ చేసే అవకాశం ఉంది.
* మారథాన్‌లో పాల్గొనడంపై ప్రజలు రోజురోజుకీ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య ప్రతి ఏడాదీ పెరగుతూనే ఉంది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన మెరైన్ కార్ప్స్ మారథాన్‌లో 30 వేల మంది కంటే ఎక్కువే పాల్గొనడం విశేషం. ఈ ఏడాది మారథాన్‌ను రెండు గంటల 20 నిమిషాల్లో పూర్తి చేసిన ఆగస్టస్ మేయో విజేతగా నిలవగా, రెండు గంటల 42 నిమిషాల్లో రేసును పూర్తి చేసిన హిరుత్ గ్వాన్‌కల్ మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది 50 వేల మంది ఈ మారథాన్‌లో పా ల్గొంటారని అంచనా.
ఒక ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన బ్యాట్స్‌మన్
english title:
carried bat
Date:
Sunday, July 28, 2013