మచిలీపట్నం, జూలై 28: మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. ఈ నెల 31న బందరు, గుడివాడ డివిజన్‌ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. బందరు డివిజన్ పరిధిలో 12 మండలాల్లో 233 గ్రామ పంచాయతీలు ఉండగా 41 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 192 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు 551 మంది పోటీ పడుతున్నారు. గుడివాడ డివిజన్‌లో 9 మండలాల్లో 219 గ్రామ పంచాయతీలకు గాను 48 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 171 గ్రామ పంచాయతీల్లో 486 మంది సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్నారు. సోమవారం సాయం త్రం 5గంటలకు ప్రచారానికి బ్రేక్ పడనుంది. ఈ రెండు డివిజన్‌లలో అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఈ నెల 17న నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుండి రంగంలో ఉన్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి, మలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో తుది విడత ఎన్నికలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా, విజయవాడ నగర పరిధిలోని పోలీసు సిబ్బందితోపాటు అదనపు బలగాలను రంగంలోకి దించారు. ఎలాంటి అలజడులు రేగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఓటర్లకు ప్రలోభాలు తుది విడతలో కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రచార వ్యవధి ఎక్కువ ఉండటంతో బందరు, గుడివాడ డివిజన్‌లలో ఎన్నికల ఖర్చు తడిసిమోపెడైంది. ఓటుకు భారీ మొత్తంలో సొమ్ము చెల్లించేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇప్పటికే డబ్బు పంపిణీలో నిమగ్నం కాగా ఈ రెండు రోజుల్లో మరింత విస్తృతంగా డబ్బు, మద్యం, ఇతరత్రా పంపిణీలకు కొందరు అభ్యర్థులు సిద్ధమయ్యారు. హోరాహోరీ పోరాటంలో ఎవరికి వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా కృషి చేస్తున్నారు. మొత్తం మీద తుది విడత పోరుకు వివిధ రాజకీయ పార్టీలు కూడా కాలు దువ్వుతున్నాయి. తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. తొలి, మలి విడతల్లో జరిగిన గ్రామ పోరులో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. తుది విడత ఫలితాలు కూడా తమకు అనుకూలంగా మలచుకునేందుకు తెలుగుతమ్ముళ్ళు వ్యూహం రూపొందిస్తుండగా కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా గెలుపు కోసం ఎత్తుగడలు వేస్తున్నాయి.
సర్పంచ్ గద్దె ప్రసాద్‌కు ఎంపి లగడపాటి అభినందన
కంచికచర్ల, జూలై 28: కంచికచర్ల గ్రామ సర్పంచ్‌గా అత్యధిక మెజార్టీతో ఎన్నికైన గద్దె ప్రసాద్‌ను ఆదివారం ఉదయం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభినందించారు. కంచికచర్ల సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో గద్దె ప్రసాద్ పోటీ చేశారు. ఆదివారం ఉదయం విజయవాడ నుండి హైదరాబాదు వెళుతున్న ఎంపి లగడపాటికి స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా గద్దె తన అనుచరులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ను లగడపాటి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ప్రజలు అభిమానం, నమ్మకంతో అత్యధిక మెజార్టీ ఇచ్చినందున ప్రజాభిమానం చూరగొనేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఈసందర్భంగా లగడపాటిని గద్దె దుశ్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నన్నపనేని నర్శింహారావు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కీసరలో సర్పంచ్‌గా ఎన్నికైన నందిగామ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పరిటాల రామకోటేశ్వరరావు సతీమణి దివ్యను కూడా లగడపాటి దుశ్శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.