మచిలీపట్నం, జూలై 28: డెల్టా సాగుకు నీరు విడుదల చేయకపోతే ఆగస్టు 1న ఇరిగేషన్ ఎస్‌ఇ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొనకళ్ళ నారాయణరావు హెచ్చరించారు. ఆదివారం ఇక్కడ జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ జలాశయాలు నీటితో కళకళలాడుతున్నా ప్రభుత్వం డెల్టాకు సాగునీరు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాట్లు ఆలస్యమవ్వటం వల్ల దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తపర్చారు. తుఫాన్‌ల బారిన పడకుండా పంటను రక్షించుకునేందుకు ప్రభుత్వం కనీస చర్యలు కూడా చేపట్టలేదని విమర్శించారు. కాలువలకు నీరు విడుదల చేయకపోవడం వల్ల నాట్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న పాలకులు వ్యవసాయ రంగాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రానికి నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల చేయకపోతే ఆగస్టు 1న ఇరిగేషన్ ఎస్‌ఇ కార్యాలయం ఎదుట నిరవధిక ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు 870 అడుగులు నీరు చేరినా డెల్టా రైతులకు నీరు అందడం లేదన్నారు. రైతుల కోసం నిరవధిక పోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తొలి, మలి విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ చావు దెబ్బతిన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనపై నమ్మకం ఉంచిన ప్రజలు తెలుగుదేశం పార్టీ బలపర్చిన మెజార్టీ అభ్యర్థులను గెలిపించారన్నారు. ఈ ఫలితాలను చూసైనా పాలకులు కళ్ళు తెరవాలన్నారు. ప్రజలు టిడిపికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. అవనిగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నికలో దివంగత శాసనసభ్యులు అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిప్రసాద్ ఆగస్టు 1న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మిగతా పార్టీలు కూడా ఏకగ్రీవానికి సహకరించాలని ఉమ, నారాయణరావు కోరారు. ఇప్పటికే కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలకు లేఖలు రాశామని వారు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర, లంకిశెట్టి బాలాజీ, బత్తిన దాస్, తదితరులు పాల్గొన్నారు.
డెల్టా సాగుకు నీరు విడుదల చేయకపోతే ఆగస్టు 1న
english title:
irrigation
Date:
Monday, July 29, 2013