పాతబస్తీ, జూలై 28: పేదవాని మధుర ఫలం, చిన్నారుల, వృద్ధుల అమృతఫలం నేడు మింగుడుపడని వెలక్కాయలా తయారైంది. నిత్యావసరాలు నింగికి, కూరగాయలు అదే దారి, చివరకు అరటి పండు నేడు అటకెక్కి కూర్చుంది. క్షుద్బాధ తీర్చుకోడానికి పేదలను ఆదుకునే అరటి పండు ధర నేడు ధనికులకు సైతం దడ పుట్టించేంత పెరిగాయి. రెండు నెలల క్రితం డజను అరటిపండ్లు కేవలం రూ.20 నుండి 25లకే లభించగా నేడు వాటి ధరలు డజను రూ.40కి చేరింది. కర్పూర అరటి పండు ధర పెరిగినా అవి మరీ చిన్నవిగా ఉంటున్నాయని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. కృష్ణా ఆయకట్టు ప్రాంతంలోని పంట దిగుబడి ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. గత ఏడాది సుమారు 25 వేల ఎకరాల్లో అరటి సాగు ఉండగా గిట్టుబాటు ధరలు ఉండడం లేదని రైతులు ప్రత్యామ్నాయంగా స్వీట్ కార్న్ సాగు వైపు మొగ్గు చూపడంతో ఈ ఏడాది కేవలం 15 వేల ఎకరాల్లోనే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అరటి సాగు ఉంది. దాంతో డిమాండుకు తగిన పంట అందుబాటులో లేకుండా పోయింది. అరటి వ్యాపారులు తమిళనాడు, తిరుచనాపల్లి, నంద్యాల, రావులపాలెం తదితర దూర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఛార్జీలు తరుగు, తదితరాల భారాన్ని వినియోగదారులపై మోపడంతో వాటి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కర్పూర అరటి స్థానిక పంట దండిగా చేతికందాలంటే ఇంకా రెండు నెలలు ఆగాల్సిందేనని రైతులు చెబుతున్నారు. నాందేడ్ రకం అరటి పంట నేడు పూర్తిగా కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్ళింది. దీంతో వాటిని హోల్‌సేల్‌లో కిలో రూ.14 ధర పలుకుతుండగా రిటైల్ వ్యాపారులు డజనుల్లో అమ్ముతున్నారు. గతంలో డజను నాందేడ్ అరటిపండ్లు రూ.25 నుండి 30కి అమ్మగా నేడు వాటి ధర రూ.30 నుండి 40కి చేరాయి. అమృతపాణి మాత్రం చిన్నకాయలే లభిస్తున్నాగాని అవి కూడా డజను రూ.30 పలుకుతున్నాయి. ఇక రోగులకు వైద్యులు సిఫార్సు చేసే చక్కెరకేళి రూ.60 నుండి 70కి అమ్ముతున్నారు. అవనిగడ్డ, గుంటూరు జిల్లా పెదపులివర్రు ప్రాంతాలు, రావులపాలెం పరిసరాల్లో చక్కెరకేళి సాగు ఉన్నాగాని వాటి ధరలు మాత్రం రాను రాను నింగిని అంటుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా అధిక ధరలు భరించలేని పేద, బడుగు వర్గాల ప్రజలు ఏ పండో, ఫలమో తిని కడుపు నింపకుందామన్నాగాని వాటి ధరలు భారం కావడంతో దిక్కుతోచని దయనీయ స్థితికి చేరుకుంటున్నారు.
పాలకులకు పట్టని టీచర్ల సమస్యలు
అజిత్‌సింగ్‌నగర్, జూలై 28: విజయవాడ నగర పాలక సంస్థ ఉపాధ్యాయులు తమ జీతాల కోసం చేస్తున్న ఉద్యమం పాలకులకు పట్టకపోవడం శోచనీయమని ఆల్ మైరార్టీ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్ నగర లీగల్ ఎడ్వైజర్ షేక్ అల్లాభక్షు పేర్కొన్నారు. 010 జీవో ద్వారా జీతాలివ్వాలని కోరుతూ విజయవాడ నగర పాలక సంస్థ పాఠశాలల ఉపాధ్యాయులు నగరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా ఉపాధ్యాయుల దీక్షకు మద్దతు పలికిన ఆల్ మైనార్టీ ఎంప్లారుూస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సంఘీభావంగా రిలేదీక్షలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం అన్ని రకాలు అభ్యున్నతి చెందాలంటే విద్యాభివృద్ధి జరగాలని, ఇందుకు అహర్నిశలు శ్రమించి విద్యావ్యాప్తికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర పాలకులు వివక్ష వహిస్తున్న తీరు గర్హినీయమన్నారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ 010 జీవో ద్వారా జీతాలిస్తుండగా కేవలం విజయవాడ, విశాఖపట్నం ఉపాధ్యాయులకు మాత్రమే 010 ద్వారా జీతాలివ్వకపోవడంతో సకాలంలో జీతాలందక అనేక ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న వైనం శోచనీయమన్నారు. గత 13 రోజులుగా ఉపాధ్యాయులు ఉద్యమం చేపట్టినా పాలకులు వారి ఉద్యమానికి స్పందించకపోవడం వారి పనితీరుకు నిదర్శనంగా ఉందన్నారు. కార్యక్రమంలో మైనార్టీ ఎంప్లారుూస్ అసోసియేషన్ నాయకులు షేక్ సిరాజ్ భాషా, రాష్ట్ర కోశాధికారి సిటీ కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్ధుల్ రజాఖ్, నగర ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆలీ, రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ ఇమాంభాషా, సయ్యద్ అహ్మద్, ఎండి హుస్సేన్ పాల్గొన్నారు.
సినీ నటుడు మురళీమోహన్‌కు జంధ్యాల స్మారక పురస్కారం
విజయవాడ , జూలై 28: ప్రఖ్యాత చలనచిత్ర నటుడు మాగంటి మురళీమోహన్‌కు హాస్యబ్రహ్మ జంధ్యాల స్మారక పురస్కారాన్ని ఆదివారం సాయంత్రం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సుమధుర కళానికేతన్ అందించింది. మూడురోజులపాటు సంస్థ నిర్వహించిన రాష్టస్థ్రాయి 18వ హాస్య నాటికల పోటీల్లో మూడవరోజున బహుమతి ప్రదానోత్సవ వేదికపై సంస్థ 40వ వార్షికోత్సంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వేదికపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోనేరు రాజేంద్రప్రసాద్, కోగంటి సత్యనారాయణ, సివిడి సుబ్బారావు, సుమధుర కమిటీ అధ్యక్షులు సామంతపూడి నరసరాజు, పరిషత్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్. మురళీకృష్ణ, డాక్టర్ ఎంసి దాస్, సంస్థ కార్యదర్శి పసుమర్తి వెంకట భాస్కరశర్మ తదితరులు పాల్గొని సుమధుర సంస్థ అందిస్తున్న 12వ స్మారక పురస్కారాన్ని ఈ ఏడాది హాస్య రసోత్సవ వేదికపై మురళీమోహన్‌కు ఆహూతుల కరతాళ ధ్వనుల మధ్య అందించారు.
ముగిసిన హాస్య నాటికల పోటీలు
మూడు రోజులపాటు జరిగిన ఈ హాస్య నాటికల పోటీల్లో ప్రేక్షకులు హాస్యరస జగత్తులో విహరించారు. ప్రతి నాటిక మంచి చెడుల విశే్లషణతో సందేశాత్మకంగా ప్రతి సన్నివేశంలోను హాస్యాన్ని జోడిస్తూ ప్రదర్శించిన తీరు ప్రేక్షకులకు హాస్య రసౌషధాన్ని అందించింది. మూడవరోజు ఆదివారం నాటి ప్రదర్శనల్లో ప్రథమంగా మల్లాది క్రియేషన్స్ (హైదరాబాద్) వారి సమర్పణలో బివి రామారావు రచించగా మల్లాది భాస్కర్ దర్శకత్వం వహించిన సీకట్లో సంద్రుడు నాటిక ప్రదర్శితమైంది. నటీనటులుగా కె. రామస్వామి, మల్లాది భాస్కర్, టి. మురళీధర్, విఆర్ కుమార్, ఎంఎస్ హాసన్, కె. శ్రీహరి, పుండరీకాక్షశర్మ, కె. అప్పలస్వామిలు వారి వారి పాత్రలను చక్కగా పోషించారు. ఓ ప్రజాప్రతినిధి మద్యం సేవించి తన భార్యతో గొడవపడటం చూడలేని ఓ ముష్టివాడు వాళ్ల యింటి ఎదురుగా వీధిలైటును పగులగొట్టి సంసారం సంస్కారంతో సాగాలని చెప్పే ఇతి వృత్తంతో ప్రదర్శన సాగింది.
2వ ప్రదర్శనగా లిఖితసాయిశ్రీ క్రియేషన్స్ (గోవాడ) వారి సమర్పణలో భాగవతుల ఉదయ్ రచించగా దర్శకత్వం వహించగా సంగీతం రాజు, సాంబశివరావులు సమకూర్చగా ఎఎస్‌ఎన్ మూర్తి రంగాలంకరణ, జయంతి సుబ్రహ్మణ్య సతీష్ ఆహార్యం, నిర్వహణ జోగారావు చేసిన కక్కుర్తి నాటిక ప్రదర్శితమైంది. నటీనటులుగా జోగారావు, ఉదయ్, మాధవి, విఆర్‌కె రావు, లక్ష్మణ్, శ్రీనివాస్, జయంతి సుబ్రహ్మణ్య దీక్షిత్‌లు వారి వారి పాత్రలను పోషించారు. మనిషి స్థాయికి మించి సంపాదన వస్తోంటే అందులో ఏదో పాపం దాగి వుందని అలా వచ్చే సొమ్ము అశాంతికి గురిచేస్తుందని కక్కుర్తిపడితే ఇక్కట్ల పాలవుతామని ఈ నాటిక కథాంశం. మొత్తం 37 నాటికలు రాగా 10 నాటికలు ఎంపికై ప్రదర్శితమయ్యాయి. న్యాయనిర్ణేతలుగా సినీ నటులు రావి కొండలరావు, కోట శంకరరావు, జిఆర్‌కె మూర్తిలు వ్యవహరించారు.