గుంటూరు, జూలై 28: జిల్లా వ్యాప్తంగా మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరువయ్యాయి. తొలివిడత తెనాలి డివిజన్‌లో, మలివిడత గుంటూరు డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు జరగగా ఈనెల 31వ తేదీన నరసరావుపేట డివిజన్‌లో జరగనున్నాయి. గత పది రోజులుగా నరసరావుపేట డివిజన్‌లో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించగా సోమవారం సాయంత్రంతో ప్రచార ఘట్టానికి తెరపడనుంది. తొలి, మలి విడతల్లో జరిగిన ఎన్నికలు దాదాపు ప్రశాంతంగా ముగియగా అత్యంత సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత గ్రామాలు అత్యధికంగా ఉన్న నరసరావుపేట డివిజన్‌లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది. డివిజన్ పరిధిలో 103 సమస్యాత్మక, 91 అత్యంత సమస్యాత్మక, 20 మావోయిస్టు ప్రభావిత గ్రామాలుండగా కేవలం 49 మాత్రమే సాధారణ గ్రామాలు కావడంతో పోలీసు, పోలింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. నరసరావుపేట డివిజన్‌లో 355 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 56 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 299 పంచాయతీలకు ఈనెల 31వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు గాను 813 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 2687 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలను ఆయా పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాగైనా గెలిచేందుకు వక్రమార్గాలను అనే్వషించే పనిలో పడ్డారు. ఇప్పటికే తొలి, మలి విడతల్లో ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి జోష్ మీద ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం నెలకొంది. నరసరావుపేట డివిజన్‌లో సైతం తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రధానంగా డబ్బు, మద్యం పంపిణీపై అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బు పంపణీ కీలకంగా మారింది. అభ్యర్థులు డబ్బును మంచినీటిలా ఖర్చుచేస్తూ ఓటుకు రేటు కట్టి మరీ నోట్లను పంచుతున్నారు. దీంతో అభ్యర్థుల గెలుపోటములపై డబ్బు పంపిణీ తీవ్ర ప్రభావం చూపనుంది. డివిజన్‌లోని పలు మేజర్ పంచాయతీల్లో ఒక్కో ఓటుకు 2 వేల నుండి 5 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక్కో అభ్యర్థి కనీసం 30 నుండి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు వెనుకాడని పరిస్థితి నెలకొంది. పలు గ్రామాల్లో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మధ్య ఒప్పందాలు జరగ్గా మరికొన్ని గ్రామాల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా అభ్యర్థులను నిలిపి గెలిపించే వరకు పొత్తులు కుదిరినట్లు సమాచారం.
* 299 పంచాయతీలు, 2687 వార్డులకు ఎన్నికలు * సమస్యాత్మక గ్రామాలపై నిరంతర నిఘా
english title:
final round
Date:
Monday, July 29, 2013