తెనాలి, జూలై 28: గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలోని కొల్లూరు మండలం కిష్కిందపాలెంలో ఇంటి వెనక పెరట్లో దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ సిఐ బి శ్రీనివాసరావు, కొల్లూరు ఎస్‌ఐ వెంకటేశ్వరావు కథనం ప్రకారం మండలంలోని కిష్కిందపాలెం గ్రామానికి చెందిన బిఎల్‌కె ప్రసాద్‌కు చెందిన ఇంటి వెనక భాగంలో సుమారు 5 టన్నుల ఎర్ర చందనం దుంగలు పాతిపెట్టి ఉంచారన్న సమాచారం ఆదివారం పోలీసులకు అందింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వరావు తన సిబ్బందితో తహశీల్దార్ మోహనకృష్ణ సంయుక్తంగా ప్రసాద్ ఇంటిపై దాడులు చేశారు. పెరటిలో పాతిపెట్టి ఉంచిన సుమారు 35 నుండి 40 లక్షల రూపాయల విలువగల ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. దుంగలను తహశీల్దార్ ద్వారా అటవీ శాఖాధికారులకు అప్పగించి, నిందితుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.
తెలంగాణపై కాంగ్రెస్‌ది పూటకోమాట
* సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు
గుంటూరు, జూలై 28: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ పూటకోమాట చెబుతూ స్వలాభం కోసం దేనికైనా ఒడికట్టేందుకు వెనుకాడబోదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాఘవులు విలేఖర్లతో మాట్లాడారు. తెలంగాణపై పార్లమెంటులో మెజార్టీ సభ్యులు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఓటింగ్ జరపాలన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సిపిలు తెలంగాణపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాల కాలం పోయిందని, నిర్ణయాలు తీసుకోవాల్సిన కాలం వచ్చిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ నాటకాలను వీడి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రాఘవులు హితవు పలికారు.