గుంటూరు, జూలై 28: పంచాయతీ ఎన్నికల్లో విధులకు హాజరుకాని పోలింగ్ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ నుండి నరసరావుపేట డివిజన్‌లోని మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విధులకు హాజరుకాని సిబ్బందిపై చర్యలు తీసుకునే అధికారాన్ని జిల్లా ఎన్నికల అధికారికి ఇచ్చిందన్నారు. ఈ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధులకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. తెనాలి, గుంటూరు, నరసరావుపేట డివిజన్‌లలో పంచాయతీ ఎన్నికలకు నియమించిన సిబ్బందిలో శిక్షణ తరగతులకు హాజరుకాని సిబ్బంది ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం నరసరావుపేట ఆర్‌డిఒ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. అలా హాజరుకాని సిబ్బందిపై ఎన్నికల చట్టాలను అనుసరించి తగు క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నరసరావుపేట డివిజన్‌లోని 20 మండలాల్లో ఈనెల 31వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 29వ తేదీ సాయంత్రానికల్లా ఓటర్లందరికీ ఓటింగ్ స్లిప్‌లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు స్లిప్ లేకపోయినప్పటికీ గుర్తింపుకార్డుతో ఓటును వినియోగించుకోవచ్చని సూచించారు. పోలింగ్ సిబ్బంది ఈనెల 30వ తేదీ ఉదయానికల్లా మండల కేంద్రాల్లోని పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. గుంటూరు, తెనాలి డివిజన్లలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అదేస్ఫూర్తితో నరసరావుపేట డివిజన్‌లో ఎన్నికలు ముగిసేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు.
* కలెక్టర్ సురేష్‌కుమార్
english title:
suresh kumar
Date:
Monday, July 29, 2013