అమరావతి, జూలై 28: గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం మండల పరిధిలోని యండ్రాయి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు కర్రలు, మారణాయుధాలతో కాంగ్రెస్ వర్గీయులపై దాడి చేశారు. పోలీసులు కథనం ప్రకారం... మండల పరిధిలోని యండ్రాయి గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న అభ్యర్థి వీరేంద్ర, వాసిరాజు చక్రవర్తిరాజు, అద్దంకి స్వామి, వెంకట్రావ్, సాంబశివరావును ప్రత్యర్థి వర్గానికి చెందిన తెలుగుదేశం వర్గీయులు వాసిరాజు శంకరరాజు, గోరంట్ల సర్వేశ్వరరాజు, తలమాల రాధాకృష్ణ, వలివేటి ధర్మారావు, జమ్ముల రవికుమార్, దేవబత్తిన సాంబశివరావు, మోహనరావులతో పాటు మరికొంత మంది మారణాయుధాలతో దాడి చేశారు. దాడిలో గాయపడిన కాంగ్రెస్ వర్గీయులు అమరావతి 30 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరావతి ఎస్‌ఐ ఎ మల్లిఖార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాడికొండలో టిడిపి హవా
తాడికొండ, జూలై 28: గతంలో జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించక పోయినా సర్పంచ్ ఎన్నికల్లో తన సత్తా చాటుకుంది. మరోసారి తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయిలో చెక్కుచెదరలేదని నిరూపించుకుంది. తాడికొండ మండలంలో 15 గ్రామ పంచాయతీలకు గాను 8 పంచాయతీలను సొంతం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన పోరులో టిడిపి విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నిలిపింది. త్వరలో జరగబోయే మండల పరిషత్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని పార్టీ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ మండలంలో కాంగ్రెస్ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంత్రి మొదటి నుంచి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ పట్ల మండల ప్రజలు వ్యతిరేకతతో ఉన్న విషయం స్థానిక ఎన్నికల ద్వారా రుజువైంది. మండలంలో మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో కేవలం 4 స్థానాలను గెలుచుకోవడంతో స్థానిక కార్యకర్తల్లో నైరాస్యాన్ని నింపింది. ఎన్నికల సమయంలో తప్ప మండలంపై పెద్దగా కేంద్రీకరించక పోవడంతోనే ఇలాంటి ఫలితాలు వెలువడ్డాయని స్థానికంగా చర్చ జరుగుతుంది. గ్యాస్, పెట్రోల్, కరెంట్ కోతలు, ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచడంతోనే దాని ప్రభావం స్థానిక పోరులో స్పష్టం కనపడింది. చావు తప్పి కన్నులోట్టపోయిన చందంగా నూతనంగా ఏర్పడిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టిడిపి బలపర్చిన అభ్యర్థుల్లో బండారుపల్లి సర్పంచ్‌గా పి లావణ్య (267 మెజార్టీ), కంతేరుకు తోకల శ్రీలత (119), లాంకు దాసరి సుభాషిణి (20), మోతడకకు దొడ్డా వీరయ్య (211), పొనె్నకల్లుకు జి శివలీల (12), రావెలకు బి ఆదినారాయణ (690), పాములపాడుకు శ్రీ రామాంజనేయులు (331), తాడికొండ సర్పంచ్‌కు నూతక్కి నవీన్‌కుమార్ (48 మెజార్టీ) ఎన్నికయ్యారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల్లో బేజాతపురం సర్పంచ్‌గా జెల్దికుమారి (463), ముక్కామలకు తమనంపల్లి ఏసుదాసు (106), నిడుముక్కలకు పప్పుల రవికుమారి (139), దామరపల్లికి ఎన్ సరస్వతి (125) ఎన్నికయ్యారు. వైఎస్‌ఆర్ సిపి బలపర్చిన అభ్యర్థిని బొర్రా భాగ్యలత 503 ఓటర్ల మెజార్టీతో లచ్చన్నగుడిపూడి సర్పంచ్‌గా విజయం సాధించారు. స్వతంత్య్ర అభ్యర్థి సింగ్ బాబోజమ్మ గరికపాడు సర్పంచ్‌గా 240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మేజర్ పంచాయతీ తాడికొండలో టిడిపి అభ్యర్థికి 4188, వైఎస్‌ఆర్ సిపి బలపర్చిన అభ్యర్థికి 4152, కాంగ్రెస్‌కు 1019 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థికి 550 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ 41 ఓట్లు వచ్చాయి.