అమరావతి, జూలై 28: అమరావతి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఓట్ల లెక్కింపులో అధికారులు, పోలీసులు అక్రమాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తెలగతోటి ప్రసన్నకుమారి గెలిస్తే ఆమెను కాదని, కాంగ్రెస్ వర్గానికి చెందిన గుడిశె నిర్మలాదేవి 23 ఓట్ల తేడాతో గెలిచారని ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రమైన అమరావతిలోని బృందావన హోటల్ సెంటర్, సత్తెనపల్లి క్రాస్ రోడ్డు వద్ద తెలుగుదేశం, మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. సుమారు 5 గంటల పాటు రాస్తారోకో జరగడంతో పుణ్యక్షేత్రమైన అమరావతి దర్శనం కోసం వచ్చిన యాత్రికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఆందోళన కారులను అమరావతి తహశీల్దార్ జి సుజాత, శాంతి భద్రతలకు విఘాతం కల్గించవద్దని, రాస్తారోకో విరమించాలని కోరగా సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో మండల పరిషత్ అధికారులు, ఎన్నికల అధికారులు, అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఆందోళన విరమించి రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహశీల్దార్ సుజాత హామీ ఇచ్చారు. సత్తెనపల్లి డిఎస్‌పి జగదీశ్వర్‌రెడ్డి, అమరావతి సిఐ బి మరియదాసు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాస్తారోకో చేస్తే లాఠీఛార్జ్ చేయాల్సి వస్తుందని స్పష్టం చేయడంతో ఆందోళన కారులు విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన తెలగతోటి ప్రసన్నకుమారి, పార్టీ నాయకులు షేక్ మాబుసుభాని, కొల్నాటి కోటయ్య, న్యాయవాది కనె్నధార హనుమయ్య, కరిముల్లా, షేక్ అమాన్, హష్మి, అల్లాభక్షు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సిబ్బంది చర్యకు నిరసనగా ధర్నా
* ట్రాఫిక్‌కు అంతరాయం
సత్తెనపల్లి, జూలై 28: అచ్చంపేట మండలం, మిట్టపాలెం గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుతెలిపిన చేకూరి సత్యవతి ఒక్క ఓటుతో గెలిచినప్పటికీ ప్రత్యర్ధి పోలు హనుమాయమ్మ గెలిచినట్లు ఎన్నికల సిబ్బంది ప్రకటించడం అన్యాయమంటూ బాధిత వర్గాలు ఆదివారం నాడు డిఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇది అన్యాయమని ప్రశ్నించినందుకే పోలీసులు దాడి చేసి కాంగ్రెస్ పార్టీ వర్గీయులను గాయపరిచారని బాధిత వర్గాలు ఆరోపించారు. అనంతరం ప్రజా సంఘాల అధ్వర్యంలో భాధితులు తాలుకా సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. దీంతో మాచర్ల-గుంటూరు వెళ్ళే ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం ప్రజా సంఘాల నాయకులతో పట్టణ పోలీసులు మాట్లాడి ధర్నాను విరమింపచేశారు.
పోలీసుల అనాలోచిత చర్యకు నిరసనగా కాలనీవాసుల ధర్నా
పోలీసుల తప్పిదంతో ఆగ్రహించిన భాధితులు మండల పరిధిలోని నందిగం అడ్డరోడ్డులో ధర్నాకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందిగామ గ్రామ పంచాయితీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధి చెంబెటి నాగమల్లేశ్వరి గెలుపొందడంతో ఆదివారం నాడు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి వర్గీయులతో ఇరువురు వ్యక్తులు వాదనకు దిగారు. అంతేకాక ఘర్షణకు దారితీయడంతో భాధితులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు వివరాలలోకి వెళ్ళకుండా హడావిడిగా గ్రామంలోని వేరే కాలనీకి వెళ్ళి హల్‌చల్ చేశారు. లాఠీకి పనిచెప్పారు. దానితో అగ్రహించిన ఆప్రాంతవాసులు పోలీసుల తప్పిదంపై మండిపడ్డారు. అయినప్పటికి పోలీసుల వైఖరిలో మార్పు లేకపోవడంతో వారు నందిగం అడ్డరోడ్డులో ధర్నాకు దిగారు. దాంతో గంటపాటు గుంటూరు-మాచర్ల వైపు వెళ్ళే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. వాస్తవం తెలుసుకున్న డిఎస్పీ జగదీశ్వరరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని సర్దిచెప్పారు. తప్పిదాన్ని ఒప్పుకున్నారు. గ్రామపెద్దల సహకారంతో సమస్య సద్దుమణిగింది.
గ్రామసీమల అభివృద్ధికి
టిడిపి కృషి: ఎమ్మెల్యే ప్రత్తిపాటి
యడ్లపాడు, జూలై 28: గ్రామ సీమల అభివృద్ధికి, వైద్యసేవల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యతనిస్తుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ఆయన యడ్లపాడులో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి సువార్తమ్మకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల ప్రాధాన్యతావసరాలను గుర్తించి వ్యవహరిస్తోంద ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక పంచాయతీలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుందని, తుదివిడత పోలింగ్‌లో సైతం తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.