విజయపురిసౌత్, జూలై 28: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆదివారం సాయంత్రం సాగర్‌కు నీటి చేరిక పెరిగింది. శ్రీశైలం రిజర్వాయర్ నుండి నాగార్జునసాగర్ జలాశయానికి 21,859 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో సాగర్ నీటిమట్టం 522.60 అడుగుల వద్ద కొనసాగుతున్నట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇది 154.06 టిఎంసిలకు సమానం. సాగర్ జలాశయం నుండి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 450 క్యూసెక్కులు నీటిని, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుండి మొత్తం 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 866.10 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 126.60 టిఎంసిలకు సమానం. ఎగువ జలాశయలైన జూరాల, రోజాప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి 3,40,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
తల్లిపై కూతురి విజయం
మంగళగిరి, జూలై 28: మండల పరిధిలోని కాజ పంచాయితీ 10వ వార్డు మెంబరుగా సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన తాడిబోయిన బాజిమ్మ వైఎస్‌ఆర్ సీపీ, కాంగ్రెస్, టిడిపి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన తన తల్లి చావలి అన్నపూర్ణపై 9 ఓట్ల తేడాతో విజయం సాధించింది. నామినేషన్ దాఖలైన రోజునుంచి తల్లీ కూతుళ్ల విజయంపై గ్రామంలో ఆసక్తిగా చర్చించుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు గ్రామస్థులు ఉత్కంఠగా ఎదురు చూశారు.
గ్యాస్ ధర పెంపులో రిలయన్స్‌కు తలొగ్గిన ప్రభుత్వం
గుంటూరు , జూలై 28: రిలయన్స్ కంపెనీ ఒత్తిడి, బెదిరింపులకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉత్పత్తి ధరను యూనిట్ 4.2 డాలర్ల నుండి 8.4 డాలర్లకు పెంచిందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఆదివారం స్థానిక ఎన్‌జిఒ కాలనీలోని సప్తరుషి ఆశ్రమంలో గ్యాస్ ధరలు - రిలయన్స్ పర్యావసానాలు అనే అంశంపై ఎన్‌జిఒ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి సాంబిరెడ్డి అధ్యక్షతన స్టడీ సర్కిల్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తంగా పాల్గొన్న లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల రిలయన్స్ కంపెనీ లక్ష కోట్ల లాభం పొందనుందన్నారు. కేజీ బేసిన్‌లోని గ్యాస్ సంపదను స్వాధీనం చేసుకున్న రిలయన్స్ ఒప్పందాలను ఉల్లంఘించి గ్యాస్ ఉత్తత్తి చేయలేదని సుప్రీంకోర్టుతో పాటు ‘కాగ్’ కూడా రిలయన్స్ నిర్వాకాలను బహిర్గతం చేశాయన్నారు. పీపుల్ ఫర్ ఇండియా ఫోరం వైస్ చైర్మన్ వివిఎస్ సురేష్ మాట్లాడుతూ గ్యాస్ ధరలను పెంచడం వల్ల పెట్టుబడులు పెద్దఎత్తున వస్తాయని, ఉత్పత్తి పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థకు లాభకరమని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు అవాస్తవమన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యుత్, యూరియాలకు సంబంధించి ఖర్చు పెరిగి ఆ భారం ప్రజలపై పడుతుందన్నారు. గతంలో కూడా 1.79 డాలర్ల నుండి 4.24 డాలర్లకు ధర పెంచినప్పుడు కూడా ప్రభుత్వం ఇదే రకమైన వాదన చేసిందని, రిలయన్స్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు అంతర్జాతీయ ధరలతో పోలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పి గంగయ్య చౌదరి, ఎన్‌ఎస్ భార్నబాస్, వి వెంకటేశ్వరరెడ్డి, ఎం వీరయ్య, ఈ శివారెడ్డి, కె సాంబశివరావు, ఎన్ భావన్నారాయణ, కెవిఎల్ రామకృష్ణారావు, జె వెంకట్రావ్ పాల్గొన్నారు.
పెదగొల్లపాలెం ఓట్లు మళ్లీ లెక్కించాలి
కర్లపాలెం, జూలై 28: మండలంలోని పెదగొల్లపాలెం గ్రామ పంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నిక ఓట్లను మళ్ళీ లెక్కించాలని ఓడిన సర్పంచ్ అభ్యర్థి యారం ప్రసాదరావు డిమాండ్ చేశారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్‌లో కొందరు నాయకులతో కలిసి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ ఈ నెల 23న ఎన్నికలు ముగిసిన అనంతరం ఓట్లు లెక్కింపులో 11,12వార్డుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తమ గుర్తుపై పడిన ఓట్లను మరో అభ్యర్థి గుర్తుపై పడినట్లు లెక్కించారన్నారు. అంతేగాక కౌంటింగ్ హాల్‌లో ఉన్న తమ ఏజెంట్ బుచ్చిరాజును కౌంటింగ్ గది నుండి బయటకు పంపారన్నారు. తాము ఈ విషయాన్ని ఎంపిడిఓ, తహశీల్దార్, ఎస్‌ఐకి వివరించి రీకౌంటింగ్ కోరగా తాము ఏమీ చేయలేమని చెప్పినట్లు ప్రసాద్ తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుని రీకౌంటింగ్ జరపాలని అర్జీలు పంపినట్లు వివరించారు.
పల్లెల్లో జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం
రెంటచింతల, జూలై 28: మండల పరిధిలోని పది పంచాయతీ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రంగంలోకి దిగారు. మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ మద్దతుదారులను సర్పంచ్‌లుగా అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో వౌలిక సదుపాయాలు కల్పించినట్లు గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. గత వారం యరపతినేని మేజర్ పంచాయతీ అయిన రెంటచింతలలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన పాముల సంపూర్ణమ్మకు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మండలంలోని పంచాయతీ ఎన్నికలకు రాజకీయ వేడి రగిలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ అసమ్మతి నేత గాదె యర్రజోజిరెడ్డితో సమాలోచనలు జరిపి, దేశం పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టడంలో కృషి చేశారు. తక్కెళ్ళపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న చల్లా మట్టారెడ్డి తరఫున అక్కడి దేశం నాయకులు ప్రచారం చేస్తున్నారు.
ఈ ఖరీఫ్‌లో సాగునీరు వచ్చేనా?
భట్టిప్రోలు, జూలై 28: ఈ ఖరీఫ్‌కు సాగునీటి విడుదల జరుగుతుందా.. లేదా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం బ్యాంకు కెనాల్ నుండి వెల్లటూరు వద్ద అరకొర నీటిని విడుదల చేయటంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఎంతో ఆశతో నారుమళ్ళు సిద్ధం చేసుకున్న రైతులకు అధికారులు విడుదల చేసిన నీరు ఏమాత్రం సరిపోలేదు. బ్యాంక్ కెనాల్‌కు పక్కనే ఉన్న ఎటిఎస్ చానల్ పరిధిలో సుమారు 2 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. ఒకపక్క సాగునీరు సక్రమంగా రాక కాలువ పూడిపోటంతో పోసిన నారుమళ్లకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వివరణ కోరగా తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని ఇచ్చిన నీటితోనే సరిపెట్టుకోవాలని చేతులెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు రోడ్డెక్కాల్సి వస్తుందని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో సాగునీరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులు
తెనాలి , జూలై 28: కృష్ణా డెల్టా ప్రాంతంలోని తెనాలి మండల గ్రామాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలోని కొలకలూరు, హాప్‌పేట, ఖాజీపేట, గుడివాడ, కోపల్లె, అంగలకుదురు, సోమసుందరపాలెం కంచర్లపాలెం తదితర గ్రామాల్లో రైతులు ఇప్పటికే వరినారుమళ్ళు వేసుకున్నారు. ప్రస్తుతం మళ్ళకు బోర్లు, నీళ్ళ కుంటలు, చెరువుల ద్వారా నీటిని మళ్లిస్తూ నారు పెంచుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు విడుదల చేయటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు మేజర్ కాల్వల ద్వారా పంట కాల్వలకు చేరేలోగా వరినారు అదునులోకి వస్తుందని, వెంటనే నాట్లు వేసుకోవచ్చునని భావిస్తున్నారు. ఇదే తరుణంలో కొందరు రైతులు వ్యవసాయ శాఖాధికారుల సహాయ, సహకారాలతో నేరుగా వరినాటు విధానంపై దృష్టి మళ్ళించారు. సాగునీరు సకాలంలో విడుదల కావటంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే సుమరు 500 హెక్టార్లలో వరినారుమళ్ళు పెంచుతున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మరో 500 హెక్టార్ల వరకు వెద పద్ధతిలో వరినాట్లు వేసేందుకు రైతులు ముందుకు వస్తున్నట్లు ఎఓ అమలకుసమారి తెలిపారు. ఇప్పటికే మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీల్లో పట్టాదారు పాస్ పుస్తకాలున్న రైతులకు మేలు రకం వరి విత్తనాలను సబ్సిడీపై అందజేశామన్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రైతులు కొంత వరకు పనులు వాయిదా వేసుకుంటున్నారు. ఈ నెల 23నాటికి ఎన్నికలు ముగియటంతో తిరిగి వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మెరక భూములు, తక్కువ సాగునీరున్న ప్రాంతాల్లో వెద పద్ధతిలో నాట్లు వేసుకోవటం శ్రేయస్కరమని వ్యవసాయ విస్తరణాధికారులు సూచిస్తున్నారు.
సిపిఎం నేత మృతికి పలువురి సంతాపం
కొల్లిపర, జూలై 28: ప్రముఖ సిపిఎం పార్టీ నాయకులు బొంతు సాంబిరెడ్డి(70) ఆదివారం మృతి చెందారు. మండల కేంద్రమైన కొల్లిపరకు చెందిన సాంబిరెడ్డి కమ్యునిస్టు పార్టీకి ఎనలేన సేవలు చేశారు. 1974లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర శిక్షణ తరగతులను కొల్లిపరలో విజయవంతంగా నిర్వహించారు. సాంబిరెడ్డి అందుకు ఆవిరళ కృషి చేశారు. పార్టీ అగ్రనాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్యలచే అభినందనలు పొందారు. రైతాంగ సమస్యలపై జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. సాంబిరెడ్డి మృతదేహానికి పలువులు సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఘన నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఎన్నికల అధికారులకు
శిక్షణ తరగతులు
నాదెండ్ల, జూలై 28: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహించినట్లు ఎంపిడివో దాసరి అనురాధ ఆదివారం తెలిపారు. ఈ శిక్షణ తరగతులను ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించామన్నారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. 14 గ్రామాల రిటర్నింగ్ అధికారులతో శిక్షణ తరగతులను నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియంలో రిటర్నింగ్ అధికారులు ప్రధాన భూమిక పోషించనున్నట్లు ఆమె తెలిపారు. పివోలు, ఏపివోలు, ఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
పివోలు, ఎపివోలకు శిక్షణ తరగతులు
రొంపిచర్ల, జూలై 28: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పివోలు, ఏపివోలకు రెండో విడత శిక్షణ తరగతులు ఆదివారం జరిగాయి. శిక్షణలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, ఎంపిడివో ఎస్ రాజేష్, డెప్యూటీ తహశీల్దార్ లక్ష్మీప్రసాద్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇలు జగన్మోహన్‌రెడ్డి, ఇమ్మానియేలు పాల్గొన్నారు. మండలంలోని 25 పంచాయితీలకు గానూ 600 మందికి శిక్షణ ఏర్పాటు చేయగా మొత్తం 478 మంది హాజరయ్యారు. పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఛాలెంజ్ ఓట్లు, టెండర్ ఓట్ల విషయంలో అనుసరించాల్సిన పద్ధతులు, బ్యాలెట్ బాక్స్ నిర్వహణ, కౌంటింగ్ విషయంలో పోలైన ఓట్లతోపాటు పోస్టల్ బ్యాలెట్‌లో వచ్చిన ఓట్ల లెక్కింపు సిబ్బందికి వివరించారు.
పోలీసు బందోబస్తు
మాచవరం, జూలై 28: గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు సిబ్బంది రాత్రివేళల్లో కూడా గ్రామాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్ షఫీ తెలిపారు. ఆదివారం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎదురెదురుపడటంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఓటర్లకు మద్యం, డబ్బు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీల నాయకులను హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల్లోపు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని ఎస్‌ఐ షఫీ అభ్యర్థులను కోరారు.
నడకతో ఆరోగ్యం
తెనాలి, జూలై 28: దినచర్యలో నడకకు ప్రాధాన్యం ఇస్తే ఆరోగ్యం బాగుంటుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎమ్‌వి.రావ్ అన్నారు. స్థానిక గాంధీనగర్‌లోని కవిరాజ పార్కులో సీనియర్ సిటిజన్స్ సమావేశం హాల్‌లో ఆదివారం వాకర్స్ క్లబ్ తెనాలి అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి అధ్యక్షతన నిర్వహించిన వాకర్స్ సమావేశంలో డాక్టర్ ఎమ్‌వి.రావ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనారోగ్య సమస్యలను అధిగమించడంలో నడక ప్రాధాన్యత వివరించారు. మధుమేహ వ్యాధి లక్షణాలు వివరించారు. ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల మధుమేహ వ్యాధి సోకుతుందన్నారు. ఊబకాయం, ఉదర భాగంలో కొవ్వు పెరగడం వల్ల మధుమేషం, గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. రోజువారీ నడక అనేక శారీర రుగ్మతలను అధిమించేందుకు దోహదపడుతుందన్నారు. మానసిక తృప్తి కోసం సామాజిక సేవలు అలవర్చుకోవాలన్నారు. తెనాలి వాకర్స్ క్లబ్ చేపడుతున్న సేవలను డిస్ట్రిక్ గవర్నర్ ఎస్.రామ్మోహనరావు ప్రశంసించారు. ఈ డి.అబ్బయ్య, బాలరాజు కృష్ణంరాజు, కె.శ్రీనివాసరావు దంపతులు మహాత్మాగాంధీ ఫెలోషిప్ స్వీకరించారు. 19 మంది క్లబ్ సభ్యులు పాట్రన్ సభ్యత్వం , కొత్తగా ఐదుగురు సాధారణ సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమానికి క్లబ్ కార్యదర్శి కె.రవిబాబు స్వాగతం పలకగా, ఉపాధ్యక్షుడు కె.రామ్మోహనరావు, అశోక్ కుమార్, రాఘవరావు, సుబ్రహ్మణ్యం, పావులూరి రాంబాబు, శ్రీనివాస్, జొన్నలగడ్డ సుబ్బారావు తదితర సభ్యులు పాల్గొన్నారు.
అ‘పూర్వ’ కలయకతో అమితానందం
నరసరావుపేట, జూలై 28: పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో 1984-85 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక అమరా ఇంజనీరింగ్ కళాశాలలో కలుసుకున్నారు. దేశ నలుమూలల్లో స్థిరపడిన ఆ బ్యాచ్ విద్యార్థులు హాజరై పాత మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. గతంలో జరిగిన సమ్మేళన కార్యక్రమంలో మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలకు బెంచీలు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. ప్రస్తుతం లక్ష రూపాయల విరాళంతో నరసరావుపేట-85 ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఆ డబ్బుతో హైస్కూల్‌కు కావాల్సిన వసతులు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, వైద్య శిబిరాలతోపాటు పలు సేవా కార్యక్రమాలకు వినియోగించేందుకు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అమరా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అమరా వెంకటేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ కొత్త శివబాబు, నాగసరపు నరసింహారావు, డాక్టర్ పుచ్చ ఆనంద్, అర్వపల్లి శ్రీనివాసరావు, జుజ్జూరి రామకృష్ణ, మేకల నాగేశ్వరరావు, ఎస్‌వి భక్త్ఛినల్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.