(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
ఒకప్పటి బడి..అదో అందమైన గుడి..కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు గుండెదడ పుట్టించే అర్ధంకాని పెట్టుబడి..! పిల్లల భవిష్యత్ బంగారుబాటల్లో సాగాలనే బలహీనతను ఆసరాగా నేటి ప్రైవేట్ విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. శాస్ర్తియ విద్యాప్రమాణాలకు మంగళం పాడి తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు విద్యావిధానాలు, సృజనాత్మకతను వెలికితీసే ప్రక్రియ పాటించకపోగా వివిధ రకాలుగా అధిక మొత్తంలో ఫీజులు గుంజుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపును సైతం లెక్కచేయకుండా ఆర్భాటంగా మోసపూరిత ప్రకటనలతో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల పబ్లిక్ దోపిడీని నియంత్రించలేక ఇటు సర్కార్ బడులకు సరైన వసతులు..బోధనా సిబ్బందిని సమకూర్చలేక ప్రభుత్వం చతకలబడుతోంది. బోసినవ్వుల బాల్యం నుండి బండెడు పుస్తకాలు భుజాన వేసుకుని అంతస్థుల పాఠశాలలోని క్లాస్ రూంకు మెట్లెక్కి వెళ్లలేకపోతునప్పటికీ విద్యాహక్కు చట్టం అమలు చేయకుండా చోద్యం చూస్తున్నారు అధికారులు. ఏ ప్రైవేట్ పాఠశాలనైనా జిల్లా స్థాయి అధికారులు పరిశీలించిన దాఖలాలు కనిపించవు. కార్పొరేట్ సంస్థలంటేనే అన్నీ పాటిస్తారులే అనే సాధారణ అంచనాయే తప్ప విధివిధానాలు ఎలా పాటిస్తున్నారా పరిశీలించే దాఖలాలు ఎక్కడా కనిపించవు. బ్రాంచీలు పెట్టి ఒకే సంస్థకు గుర్తింపు చూపిస్తూ బురిడి కొట్టిస్తున్నా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ వెసులుబాటు మామ్మూళ్ల కోసమే అన్న విమర్శలూ లేకపోలేదు...ప్లేక్లాస్‌లు, కానె్టస్ట్, టెక్నో, ఐ.ఐ.టి ఫౌండేషన్ లాంటి హోరెత్తించే ప్రచారంలో ఫీజులు పిండేస్తున్నా అరికట్టడంలో అధికారుల అలసత్వం కనిపిస్తోంది. ఎ టు జెడ్, వన్ టు 100, నాలుగు రైమ్స్ నేర్పించడానికి 15 నుండి 20 వేలు వరకు వసూలు చేస్తుంటే వారికి తరగతులకు ఫీజుల మోత ఎలా ఉంటుందో ఇట్టే అర్ధమవుతోంది. అంతేకాదు రిజర్వ్ బ్యాంకు విధానాలకు విరుద్ధంగా ఓ కార్పొరేట్ విద్యావ్యాపార సంస్థ ఫీజులకు బదులు డిపాజిట్ల సేకరణలో పడింది. 1.75 లక్షల రూపాయలు కడితే ఏ ఫీజులు చెల్లించనక్కర్లేదని, పాఠశాలను విడిచిపెట్టేప్పుడు తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తోంది. ట్యూషన్ ఫీజు, కార్పస్ ఫండ్, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారం, స్కూల్ బస్సులాంటి వివిధ రకాల్లో సొమ్ములు వసూలు చేసి ఇష్టానుసారంగా బ్రాండెడ్ ఇమేజ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణ , మధ్యతరగతి ఆర్థిక స్థితిని కొల్లగొడుతున్నారు. చదువుల పేరుతో బురిడీ కొట్టిస్తూ అధిక ఫీజులు చెల్లిస్తున్న విషయంలో సాక్షాత్తు ఉన్నత న్యాయస్థానామే తీవ్ర వ్యాఖ్యలు చేసినా..ఎన్నోసార్లు తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళన చేసినా ఫలితం లేదు.
నిబంధనలు కేశవాయ స్వాహా..
దేదీప్యంగా వెలుగుతున్న కొన్ని కార్పొరేట్ బడులు కనీస నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. డి.ఇ.ఒ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ విద్యావ్యాపార సంస్థకు పూర్తిస్థాయి గుర్తింపు లేదు. స్కూల్ విడిచి వెళ్లే విద్యార్థులకు వేరే మండలంలో ఉన్న బ్రాంచ్ నుండి టి.సి. తదితర ధృవపత్రాలు జారీ చేయిస్తూ పబ్లిక్‌గా గత మూడేళ్లుగా పబ్బం గడుపుకుంటోంది. అంతేకాదు ఈ కార్పొరేట్ విద్యార్థులకు ఆటలు.. పాటలు జాంతానై.. ప్లేగ్రౌండ్స్ కూడా ఎక్కడా కనిపించవు. గుర్తింపు ఫైల్లో చూపించే ఆటస్థలం వాస్తవంగా ఎక్కడా కనిపించదు. కనిపించినా అది ఆటస్థలానికి పనికి రాదు. ఈ నిబంధనలను దగ్గరుండి పర్యవేక్షించి అమలుచేయాల్సిన సంబంధిత అధికారులు మామ్మూళ్ల మత్తులో ఫైళ్ల వరకే సరిపెట్టుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విషయాన్ని జిల్లా స్థాయి సంబంధిత అధికారులతో ప్రస్తావించగా కనీస అవగాహన లేకపోవడం విశేషం. భూకంప ప్రమాద పరిధిలో ఉన్నా ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా నాలుగు అంతస్థుల నిర్మాణం కనిపించడం శోచనీయం. పిల్లల్లో మానసిక ఉల్లాసం.. సృజనాత్మకత, విద్యాభివృద్ధికి ఊరికి ఆమడదూరంలో పాఠశాల నెలకొల్పాలి. అయితే రాబడే ప్రధానాంశంగా పుట్టుకొచ్చే ఈ విద్యాసంస్థలు ప్రధాన వ్యాపార కూడళ్లు, శబ్ధ, వాయు కాలుష్యాల మధ్య కనిపిస్తూ ప్రజానీకాన్ని గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సాయంత్రమైతే ఆయా విద్యాసంస్థలకు చెందిన బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలు, విద్యార్థుల సైకిళ్లు ఒకేసారి రోడ్లపైకి రావడంతో తీవ్ర రద్దీని నెలకొల్పుతున్నా ట్రాఫిక్ యంత్రాంగం ఎలాంటి ఆంక్షలు విధించడంలో విఫలమైంది. మరోవైపు ఎన్నోఏళ్లుగా పాఠశాలలు నెలకొల్పి జీవనోపాధి పొందుతున్న ఎందరో నిరుద్యోగులు కార్పొరేట్ విద్యావ్యాపారాల ధాటిని ఎదుర్కొనలేక తమ సంస్థలను మూసివేసి రోడ్డునపడ్డారు. జిల్లాలో ఉన్న 569 ప్రైవేట్ పాఠశాలల్లో ఇప్పటికే 35 పాఠశాలలు వరకు మూతపడినట్లు సమాచారం. విద్యావిధానానికి ఇంత విరుద్ధంగా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం.
చర్యలు తీసుకుంటాం..
గుర్తింపులేని, నిబంధనలు పాటించని పాఠశాలల విషయం తమ దృష్టికి రాలేదు. ఫీజులు వసూలు చేయడం పట్ల కఠినంగా ఏ విద్యాసంస్థ వ్యవహరించినా చర్యలు తప్పవు. అయితే ఏ క్లాస్‌కు ఎంత, ఎలా వసూలు చేయాలన్న మార్గదర్శకాలు ప్రభుత్వం నుండి లేవు. త్వరలో అన్ని ప్రైవేట్ పాఠశాలలను సందర్శించి విద్యాహక్కు చట్టం, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న సంస్థలను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
- ఎస్.అరుణకుమారి,
జిల్లా విద్యాశాఖాధికారిణి.
‘సీమాంధ్ర ప్రజల మనోభావాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా’
శ్రీకాకుళం (టౌన్), జూలై 29: సీమాంధ్ర ప్రజల మనోభావాలను యుపిఎ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. సోమవారం ఎపి ఎన్జీవో సంఘం, విద్యార్ధి సంఘం, బార్ అసోసియేషన్ నాయకులు కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగతంగా తాను సమైక్యవాదిని అని, గతంలో కూడా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు ఆజాద్, దిగ్విజయ్ సింగ్‌లను కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా రాష్ట్ర విభజన జరుగక ముందే ఏదేదో జరిగిపోయిందంటూ ఊహించుకుంటూ మాట్లాడటం సబబుగా లేదన్నారు. సీమాంధ్ర నాయకురాలిగా ఇక్కడి ప్రజల మనోభావాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆమె చెప్పారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ కన్వీనర్ రామ్మోహనరావు ఉన్నారు.
ముక్కలు చేస్తే సహించం!
ఎచ్చెర్ల, జూలై 29: రాష్ట్రాన్ని సహించేది లేదని అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులంతా ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వారంతా తరగతులు బహిష్కరించి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని కేసీఆర్ డౌన్..డౌన్.., యు.పి.ఏ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని సమైక్యాంధ్ర ముద్దు..తెలంగాణ వద్దంటూ గద్గద స్వరంతో నినదించారు. రాజకీయ లబ్ది కోసం కొంతమంది స్వార్ధపూరిత నేతలు తెలంగాణ కావాలని కోరుతున్నారు తప్ప అక్కడ ప్రజలంతా సమైక్యంగా ఉండాలని భావిస్తున్నారని గుర్తుచేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికల ఆధారంగానే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర జె.ఏ.సి రాష్ట్ర నాయకులు బలగ ప్రకాష్, యూనివర్శిటీ జెఎసి ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
డయల్‌యువర్ కలెక్టర్‌కు 13 వినతులు
పాతశ్రీకాకుళం, జూలై 29: డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమానికి సోమవారం 13 వినతులు వచ్చాయి. గ్రామంలో పారిశుద్ధ్య సమస్య ఉందని పొందూరు మండలం ఎల్.వెంకటరమణ ఫిర్యాదు చేశారు. రాజీవ్ యువకిరణాలు ద్వారా శిక్షణ పొందానని, తనకు ఉపాధి కల్పించాలని మెళియాపుట్టికి చెందిన అప్పన్న కోరారు. అలాగే పావలావడ్డీ రుణాలు మంజూరు చేయాలని పలాస మండలానికి చెందిన మణి కోరారు. పాఠశాలకు విద్యుత్ కనెక్షన్లు ఇంతవరకు అందించాలని జి.సిగడాంకు చెందిన ఎన్.ప్రసాదరావు అన్నారు. నాగావళి కాలువ నీరు శివారు భూములకు చేరడం లేదని వీరఘట్టంకు చెందిన జి.రమేష్, వీరితోపాటు మరిన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డిఎంహెచ్‌ఒ గీతాంజలి, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.
ఘాట్‌రోడ్ మీదుగా సాగిన షర్మిల పాదయాత్ర
సారవకోట, జూలై 29: మరోప్రజాప్రస్థానంలో భాగంగా షర్మిల చేపడుతున్న పాదయాత్ర సోమవారం ఉదయం మండలం దాసుపురం గ్రామం నుంచి ప్రారంభమైంది. ప్రారంభంలో వైఎస్సార్‌సీపీ ఉపనేత, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, రాష్టక్రమిటీ సభ్యురాలు వరుదు కల్యాణి, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు రాత్రి షర్మిల బస చేసిన శిబిరం వద్ద స్వాగతం పలికారు. అనంతరం దాసుపురం గ్రామస్థులతో కొద్దిసేపు ముచ్చటించిన షర్మిల మూడువేల కిలోమీటర్ల పరిధి దాటేందుకు ఉత్సాహపడుతూ ఘాట్‌రోడ్ మీదుగా తన పాదయాత్రను కొనసాగించారు.
సాధారణంగా జనసంచారం లేని ఘాట్‌రోడ్ మీద కూడా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు అక్కడక్కడా బారులుతీరి షర్మిలకు స్వాగతం పలకడం విశేషం. దాసుపురం గ్రామం దాటిన తరువాత ఘాట్‌రోడ్‌కు ప్రవేశించేముందు పార్టీ మండల కన్వీనర్ బంకి రమణ నవతల గ్రామానికి చెందిన మహిళలు ఎదురువెళ్లి షర్మిలను ఆహ్వానించారు. అక్కడ నుండి నవతల గ్రామం వద్ద షర్మిల కొద్దిసేపు ఆగారు. నవతల ప్రజల నుండి స్వాగత సత్కారాలు స్వీకరించిన అనంతరం నవతల జంక్షన్‌కు చేరుకున్నారు. నవతల జంక్షన్‌లో షర్మిల కోసం ఎదురుచూస్తున్న ప్రజానీకానికి అభివాదం తెలుపుతూ బహిరంగసభకు తరలిరావాలని కోరారు. అక్కడ నుండి భారీ ఊరేగింపుగా జిల్లా నాయకులు, మండల ప్రజలు వెంట రాగా మూడువేల కిలోమీటర్లు దాటే స్థలానికి ధనుపురం గ్రామం పొలిమేరల్లోకి చేరుకున్నారు. ఈమె వెంట జిల్లా నాయకులు అంధవరపు సూరిబాబు, పి.ఎం.జె.బాబు, ఎచ్చెర్ల సూర్యనారాయణ, మాజీ జెడ్పీటిసి చిన్నాల రామసత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఘాట్‌రోడ్‌పై యాత్ర సాగిన కారణంగా పాతపట్నం పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
పట్టణంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నం
శ్రీకాకుళం (టౌన్), జూలై 29: పట్టణంలో రోడ్లు, భవనాల శాఖకు చెందిన రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, వ్యక్తిగత అజెండాతో అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నాగావళి నదిపై పాతవంతెన తొలగింపులో తాము ప్రత్యామ్నాయం చూపాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా కొంత భాగం తొలగించి విడిచిపెట్టేశారని వాపోయారు. రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండెంటు ఇంజనీరు వ్యక్తిగత ప్రతిష్టకు పోయి వర్షాకాలం వస్తున్న సమయంలో వంతెనను కూల్చడం వలన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. తాము పదేపదే చెబుతున్నప్పటికీ పట్టించుకోలేదని, ఇంతవరకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని అన్నారు. కేవలం చుట్టు తిరగడానికి ఆర్టీసీ బస్సును వేయించి చేతులుదులుపుకున్నారని, అయితే ఆ బస్సు సైతం నేడు సరిగా తిరగడం లేదని చెప్పారు. ఇందుకు కారణాలను క్వాలిటీ కంట్రోల్ అధికారులు, విజిలెన్సు అధికారులు విశే్లషించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, గొర్లె కృష్ణారావు, బి.గుప్త తదితరులు పాల్గొన్నారు.
కనీసవేతనం రూ. 12500 ఇవ్వాలి
శ్రీకాకుళం (టౌన్), జూలై 29: మున్సిపాల్టీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం 12500 రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం ఈ దీక్షలను ప్రారంభిస్తూ మాట్లాడారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని, చనిపోయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సదుపాయాలు వెంటనే కల్పించాలని కోరారు.
రెగ్యులర్ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పని కష్టంతో కూడుకున్నదని, అటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయమన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు చేసి తమ సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. కార్యక్రమంలో డి.జగదీష్, ఆర్.రమణ, ఎన్.శంకర్రావు, డి.విజయ తదితరులు పాల్గొన్నారు.