విశాఖపట్నం, జూలై 29: అనేక మంది సమరయోధుల కృషి ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం ముక్కలవుతున్నా, జనం మాత్రం రోడ్ల మీదకు రావడం లేదు. వారి మనోభావాలను తెలియచేయడం లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్రం ముక్కలు చేయడానికి కొంతమంది రాజకీయ నాయకులు కనుసైగ చేసినట్టు తెలుస్తోంది. ప్రజల్లో ఏమాత్రం విభజన ప్రభావం లేదని, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాలన్నీ ఉత్తుత్తివేనని కొంతమంది ప్రభుత్వాలకు నివేదించినట్టు తెలుస్తోంది. నేడో, రేపో రాష్ట్ర విభజన జరిగినా, రెండు, మూడు రోజులు ఇక్కడి ప్రజలు ఉద్యమించి, ఆ తరువాత చల్లబడిపోతారని నిఘా వర్గాలు ప్రభుత్వానికి చేరవేసిన సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న తంతు చూస్తుంటే ఇదంతా నిజమనే అనిపిస్తోంది.
నగరంలో ఆరుగురు ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి, మరో ఎంపి ఉన్నారు. రాష్ట్ర విభజన విషయంలో రాష్టమ్రంతా భగ్గుమంటున్నా, ఇక్కడి ప్రజా ప్రతినిధుల్లో కనీసం ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడ్డం లేదు. ఏ రోజైనా, రోడ్డెక్కి పోరాటానికి దిగారా? ఇందులో అధికార పార్టీ వారికి ఇబ్బంది ఉంటే ఉండచ్చు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు ఏవిధంగా ప్రత్యేక తెలంగాణ కావాలని భీష్మించుకున్నారో, మరి సమైక్యాంధ్ర కావాలని ఈ ప్రాంత టిడిపి నాయకులు ఎందుకు అడగడం లేదు? జిల్లాలో నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎందుకు బయటకు రావడం లేదు? నగరంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాలు చూసే వారెవరికైనా, దాని తీవ్రత ఏమేరకు ఉందో అర్థమవుతోంది. కొంతమంది హోటల్ గదుల్లో కూర్చుని ప్రకటనలు జారీ చేస్తున్నారు. మరికొంతమంది నలుగురు, ఐదుగురు వ్యక్తులతో బయటకు వచ్చి, విభిన్న కార్యక్రమాలు చేసి పత్రికల వారిని సంతృప్తి పరుస్తున్నారు. ఒకరిద్దరు చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు చేసి నిరసన తెలుపుతున్నారు. నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న వాదన వినిపించాలంటే ఈ పోరాటం సరిపోతుందా?
నేడో, రేపో తెలంగాణ విభజనపై కేంద్రం ప్రకటన జారీ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే, రాష్ట్రానికి వాటిల్లిన నష్టంలో ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు కూడా భాగస్వాములు కాకతప్పదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలను ఉద్యమ బాట పట్టించడంలో ప్రజా ప్రతినిధులు ఏమాత్రం సఫలీకృతులు కాలేకపోయారన్నది వాస్తవం. రాష్ట్రం విడిపోవాలని కోరుకునే వారు కూడా ఇక్కడ లేకపోలేదు. అదే సమయంలో రాష్ట్రం ముక్కలు కాకూడదని అభిలషించే వారు కూడా ఎక్కువమందే ఉన్నారు. వారి మనోభావాలను స్థానిక నాయకులు ఎందుకు గౌరవించడం లేదు? ఇక్కడో విచిత్రమైన విషయం ఏంటంటే, తమ రాజకీయ భవిష్యత్‌ను కాపాడుకునేందుకు ప్రజల్లో స్పందన లేదన్న సంకేతాలను ప్రభుత్వాలకు అందచేసిన వారిలో ఈ సోకాల్డ్ రాజకీయ నాయకులు కూడా ఉన్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే రాష్ట్ర విభజన జరిగినా, శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నిఘా ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
నగరానికి మరిన్ని అదనపు బలగాలు
* పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా అదుపులో ఉంది
* నగర పోలీస్ కమిషనర్ శివధర్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: నగరానికి మరిన్ని అదనపు బలగాలు వస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ శివథర్‌రెడ్డి తెలియచేశారు. సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఇప్పటికే నాలుగు కంపెనీల అదనపు బలగాలు నగరంలో ఉన్నాయని అన్నారు. మరికొన్ని అదనపు బలగాలను పంపించవలసిందిగా ఉన్నతాధికారులను కోరామని ఆయన తెలియచేశారు. మరో రెండు, మూడు కంపెనీల బలగాలు వచ్చే అవకాశం ఉందని తెలియచేశారు. నగరానికి చెందిన పోలీస్ ఫోర్స్ ఎలాగూ ఉందని అన్నారు. ఒకవేళ ఉద్యమం ఉధృతమై శాంతి భద్రతలకు విఘాతం కలగనంతవరకూ ఇబ్బంది లేదని, ఒకవేళ పరిస్థితి చేయి దాటితేనే అదనపు బలగాలను రంగంలోకి దించుతామని ఆయన తెలియచేశారు. ముఖ్యమైన కూడళ్ళలో పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ర్యాలీలు, సభలు, సమావేశాలపై ఎటువంటి నిషేధం విధించలేదని ఆయన చెప్పారు.
విలీనంపై ఉత్తర్వులు నేడు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 28: గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థలో అనకాపల్లి, భీమిలి, మరో పది గ్రామాలను విలీనం చేస్తూ, ఉత్తర్వులు మంగళవారం విడుదల కానున్నాయి. ఈ ఉత్తర్వుల ఫైళ్ళపై అందరి సంతకాలు పూర్తయినా, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జిఓ విడుదల చేయచ్చా? చేయకూడదా? అని మున్సిపల్ శాఖ అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. జిఓ విడుదల చేసుకోవచ్చని ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులు సోమవారమే విడుదల కావల్సి ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బిజీగా ఉండడం వలన వీటిని మంగళవారం ఉదయం జారీ చేయనున్నారని తెలిసింది.
నిఘా వర్గాల నివేదికలు
english title:
n
Date:
Tuesday, July 30, 2013