విశాఖపట్నం, జూలై 29: జిల్లాలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితు కారణంగా రైవాడ జలాశయం కింద ఉన్న ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు రైవాడ జలాశయం నుంచి నీటిని వరి పంటకు అందించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులను సంప్రదించగా, రైవాడ కాలువలో ఉన్న పూడికను తొలగించాలని సూచించారు. రెండు రోజుల్లో ఆ పని పూర్తి చేయాల్సిందిగా జివిఎంసి కమిషనర్‌ను మంత్రి గంటా ఆదేశించారు. ఈ పని పూర్తి కాగానే, శుక్రవారం నుంచి రైతులకు రైవాడ నీరు అందుతుంది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకం
* పార్లమెంట్‌లో చర్చిస్తే సత్తా చూపిస్తా
* రాజకీయ పార్టీల్లో స్పష్టత రావాలి
* ఎంపి సబ్బం హరి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా విభజనకు తాను వ్యతిరేకినని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఎపి ఎన్జీఓ జిల్లా విభాగం అధ్వర్యంలో సమైక్య వాదులు, విద్యార్థులు సీతమ్మధారలోని ఎంపి హరి ఇంటిని సోమవారం ముట్టడించారు. సమైక్యాంధ్రను కోరుకుంటున్న వారిలో తాను మొట్టమొదటి వ్యక్తినని, సమైక్య ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈసందర్భంగా ఉద్యమకారులకు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విడదీయం సామన్యమైన అంశం కాదని, దీనికి శాస్ర్తియ విధానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ములాయంసింగ్ యాదవ్ వంటి సీనియర్ రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను నిర్ధ్వందంగా వెల్లడించారని అన్నారు. రాజకీయ పార్టీలు తమ వ్యక్తిగత అజెండాలు, ఓట్లు,సీట్ల కోసం ప్రాంతాల మధ్య వైషమ్యాలకు తెరతీస్తున్నాయని ఆరోపించారు. మేం విభజిస్తాం.. నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటూ రాజకీయ పార్టీల అధిష్టానాలు చేస్తున్న వాదనను ఆయన కొట్టి పారేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరిగితే తన వాదనను విన్పిస్తానని హామీ ఇచ్చారు.
ముందుండి నడిపిస్తారా? నాతో పాటు నడుస్తారా?
సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమస్పూర్తితో ముందుకు రావడాన్ని ఈసందర్భంగా ఆయన కొనియాడారు. మీరు చేస్తున్న ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. సమైక్యాంధ్రను సాధించేందుకు జరుగుతున్న ఉద్యమంలో మీరంతా ముందుండి నన్నునడిపిస్తారా లేనిపక్షంలో నాతోపాటు సమైక్యాంధ్ర సాధనకోసం కలసి నడుస్తారా అని ఎంపి హరి ఉద్యమ కారులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఎవరేమి చేసినా ఈరాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, దానికి సమైక్యతే మార్గమన్న వాస్తవాన్ని పాలకులకు స్పష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, విద్యార్ధి సంఘాలు ముందుకు రావడం హర్షణీయమన్నారు.
ఇదిలా ఉండగా సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని కోరుతూ సమైక్యాంధ్ర ఉద్యమకారులు, ఎన్జీఓ ప్రతినిధులు, విద్యార్థులు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడిని చేపట్టగా ఎంపి హరి మాత్రం వారికి సంఘీభావం తెలుపుతూ తన వైఖరిని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంపి ఇంటివద్దకు చేరుకున్నారు. ఈసందర్భంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఎంపి ఇంటి వద్ద మొహరించారు. అయితే తాను కరడుగట్టిన సమైక్యవాదినని పేర్కొంటూనే ఉద్యమానికి మద్దతు ప్రకటించడంతో ఆందోళన కారులు హరి ప్రసంగం విని వెనుదిరిగారు. ముట్టడిలో ఎపి ఎన్జీఓ జిల్లా కార్యదర్శి గోపాలకృష్ణ, నగర అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు, ఇతర ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
రెండు నుంచి ఫ్లైఓవర్‌లో రాకపోకలకు అనుమతి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: ఆశీల్‌మెట్ట వద్ద జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులతో జివిఎంసి చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఆగస్టు రెండు మూడు తేదీల్లో ఫ్లైవర్‌పై రాకపోకలకు అనుమతించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాణం పనులు పూర్తి చేసుకున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు భావించారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా జరపాలని కూడా భావించారు. వచ్చేనెలలో జరగనున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం జిల్లాకు రానున్న నేపధ్యంలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఉంటుందని అందరూ భావించారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో సిఎం చేతుల మీదుగా ఫ్లైఓవర్ ప్రారంభించే అవకాశాలు కన్పించడం లేదు. దీంతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని యంత్రాంగం నిర్ణయించింది. అధికారికంగా ప్రారంభించకపోయినప్పటికీ రాకపోకలకు అనుమతించాలని భావిస్తున్నారు. లాంఛనంగా ఫ్లైఓవర్‌పై రాకపోకలను ప్రారంభించినప్పటికీ సమయం చూసుకుని అధికారికంగా ప్రారంభోత్సవం చేయాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ సోమవారం తనను కలిసిన విలేఖరుల వద్ద వెల్లడించారు. ప్రజలకు దీన్ని అందుబాటులోకి తెచ్చే విషయంపై ప్రభుత్వం నుంచి కూడా సానుకూలత వ్యక్తం కావడంతో ఇక లాంఛనంగా దీన్ని వినియోగంలోకి తెచ్చే అంశంపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఫ్లైఓవర్‌కు నామకరణం విషయంలో ఇంకా స్పష్టత చేకూరలేదని కమిషనర్ వాఖ్యల ద్వారా వెల్లడైంది.
జిల్లాలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితు కారణంగా
english title:
v
Date:
Tuesday, July 30, 2013