విశాఖపట్నం, జూలై 29: పారిశుద్ధ్య విభాగంలో కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించే బాధ్యతను క్రమంగా మహిళా సంఘాలకు అప్పగించే ఆలోచన ఉన్నట్టు జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం గ్రీవెన్స్ అనంతరం తన ఛాంబర్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ కార్మికుల జీతాల నుంచి కోతపెడుతున్న పిఎఫ్,ఇఎస్‌ఐ సొమ్మును వారి ఖాతాలకు జమచేయకుండా కుంభకోణానికి పాల్పడిన సంఘటనల నేపధ్యంలో జివిఎంసి ఆధీనంలోని వైశాఖి మహిళా మండలి ఆధ్వర్యంలో ప్రస్తుతం జీతాల చెల్లింపు జరుగుతున్నట్టు వివరించారు. ఈకార్యక్రమంపై ఎటువంటి ఆరోపణలు వచ్చేందుకు అవకాశం లేదని, అంతా పారదర్శకంగానే జరుగుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక జివిఎంసి పరిధిలోని అన్ని వార్డుల్లోను ఇదే తీరును కొనసాగించేందుకు ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. ముందుగా రెండో వార్డులో మహిళా సంఘాలకు పారిశుద్ధ్య పనులను అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు. దశలవారీగా అన్ని వార్డుల్లోను ఈ ప్రతిపాదన తీసుకువస్తామని, అందుకు న్యాయసంబంధ పరిశీలన జరుపుతున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే గుర్తింపు యూనియన్‌కు పారిశుద్ధ్య పనుల కాంట్రాక్టులు కట్టబెట్టడంపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన ఆచితూచి స్పందించారు. దీనిపై కూడా న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకోనున్నట్టు తెలిపారు.
అన్ని జోన్లను హెల్ప్‌డెస్క్‌లు
ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేవిధంగా జివిఎంసి పరిధిలోని ఆరు జోనల్ కార్యాలయాల్లోను హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు. హెల్ప్‌డెస్క్‌ల వద్ద జివిఎంసి తరపున ఒక ఉద్యోగిని నియమించి ప్రజలకు దరఖాస్తుల విషయంలో పూర్తి సమాచారాన్ని అందించడంతో పాటు అవసరమైన చెల్లింపుల నిమిత్తం అందుబాటులోనే సౌకర్యం విభాగాన్ని, పక్కనే సిటిజన్ చార్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే రెండు జోన్లలో ఈవిధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. సిటిజన్ చార్టర్ ప్రకారం నిర్ణీత వ్యవధిలో దరఖాస్తును పరిష్కరించని పక్షంలో అపరాధరుసుం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరి
జివిఎంసి పరిధిలోని బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్‌సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. నగర పరిధిలో 4300 భవనాలను పరిశీలించి ఫైర్‌సేఫ్టీ పరికరాలు లేనట్టు గుర్తించడం జరిగిందని, వీటిలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, కల్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే వీరికి నోటీసులు జారీ చేయడం జరిగిందని, నిర్ణీత కాలవ్యవధిలోగా స్పందించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 300 విద్యాసంస్థలు, 66 పెట్రోల్ బంక్‌లు, మరో 30 వాణిజ్య సంస్థలు ఉన్నాయని తెలిపారు. నగర పరిధిలో అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న 105 పురాతన భవనాలు ఉన్నట్టు గుర్తించామని, వీరికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకూ 12 భవనాలను కూల్చివేసినట్టు ఆయన తెలిపారు. ప్రమాదకర స్థాయిలో ఉన్న భవనాలను గుర్తించేందుకు అధీకృత ఇంజనీరింగ్ సంస్థలు ఒక్కో భవనానికి 13 నుంచి 20 వేల రూపాయలు ఛార్జీలుగా వసూలు చేస్తున్నాయని తెలిపారు. సకాలంలో స్పందించని పక్షంలో తామే భవనాన్ని కూల్చి ఖర్చులను యజమానుల నుంచి వసూలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. జివిఎంసి పరిధిలో ఫైళ్ల పరిష్కారం విషయంలో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీని నియమించినట్టు కమిషనర్ తెలిపారు. ఫైళ్ల క్లియరెన్స్ విధానాన్ని సరళతరం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
జివిఎంసిలో భీమునిపట్నం, అనకాపల్లి సహా 10 పంచాయతీల విలీనానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యే అవకాశాలున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉత్తర్వులు అందగానే పరిపాలనా సంబంధమైన ప్రక్రియను చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే రెండు మున్సిపాలిటీలు, 10 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించామని, ఉత్తర్వులు జారీకాగానే రికార్డులు స్వాధీనం చేసుకోవడంతో పాటు అధికారిక కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా చేపట్టడం జరుగుతుందని, నిబంధనల ప్రకారం విలీన ప్రాంతాలతో కలిపి 81 వార్డులు ఏర్పాటు కానున్నాయని తెలిపారు.
పిసిపిఐఆర్‌లో పర్యావరణ అధ్యయనానికి 7 సంస్థల ఆసక్తి
* వుడా విసి యువరాజ్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: కాకినాడ - విశాఖపట్నం తీరప్రాంతంలో రానున్న పిసిపిఐఆర్ పరిధిలో జీవధార వనరులు, పర్యావరణం, పరిసరాల పరిరక్షణకు పెద్దపీట వేయనున్నట్టు వుడా ఉపాధ్యక్షుడు ఎన్ యువరాజ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని 10 మండలాల పరిధిలో 97 గ్రామాలను కలుపుకుని 640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న కారిడార్‌లో భూభాగంతో పాటు తీరప్రాంతం, సముద్ర జలాలు, ఆవాస ప్రాంతాల్లో ఎటువంటి పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలన్న అంశంపై విస్తృత చర్చ జరుగుతోందని ఆయన వెల్లడించారు. పారిశ్రామికాభివృద్ధికి ఎటువంటి విఘాతమేర్పడకుండా చేపట్టాల్సిన శాస్ర్తియ విధానాలపై సమగ్ర ప్రణాళిక నిమిత్తం ఏడు సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈసంస్థల ప్రతినిధులతో తన కార్యాలయంలో సోమవారం ఆయన చర్చించారు. ఇప్పటికే పర్యావరణం, కోస్తా నియంత్రణ మండలి నిబంధలపై అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. బిడ్డింగ్ ద్వారా ఎంపికైన సంస్థ పిసిపిఐఆర్ పరిధిలో మూడు సీజన్లకు సంబంధించి మెరైన్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అధ్యయనం నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రీబిడ్ అనంతరం నిపుణుల కమిటీ ఆసక్తి కనబరచిన సంస్థల అనుమానాలను నివృత్తి చేస్తుందన్నారు. టెండర్ ప్రక్రియలో పాల్గొనే సంస్థలు ఆగస్టు 12లోగా తమ బిడ్లను సమర్పించాల్సి ఉంటుందన్నారు. అర్హత కలిగిన సంస్థను నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుందని, కమిటీ సిఫార్సుల మేరకు పిసిపిఐఆర్ బోర్డు సమావేశంలో చర్చించి సముద్ర పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనానికి సంస్థను ఎంపిక చేస్తుందని తెలిపారు. పిసిపిఐఆర్ పరిధిలోకి వచ్చే పరిశ్రమలు, ఇతర ఉత్పాదక సంస్థల ప్రభావం తీర సముద్ర జలాలు, సముద్ర జీవరాశులపై ఎటువంటి ప్రభావం చూపకుండా చేపట్టాల్సిన మార్గాలు, శాస్ర్తియ విధానాలు ఈ అధ్యయనంలో ఉంటాయని తెలిపారు.
* అన్ని జోనల్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు * ఫైర్ నిబంధనలు పాటించకపోతే చర్యలు * జివిఎంసి కమిషనర్
english title:
m
Date:
Tuesday, July 30, 2013