విశాఖపట్నం, జూలై 29: వుడా సొంతంగాను, ప్రైవేటు భాగస్వామ్యంలోను అభివృద్ధి పరిచిన లేఅవుట్‌లలో ప్లాట్లను వేలం ద్వారా కేటాయించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు విసి యువరాజ్ తెలిపారు. మొత్తం 15 లేఅవుట్‌లలో 152 ప్లాట్‌లను విక్రయించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈనెల 14,15 తేదీల్లో వేలం ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.
కాలుష్యాన్ని నియంత్రించాలి
* ఆందోళనకు తెదేపా సిద్ధం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: విశాఖ పోర్టు నుంచి బొగ్గు ఇతర ఖనిజాలను తరలించేందుకు రోడ్డు రవాణా విధానాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విరమించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే వేగన్ల ద్వారా రవాణ చేయడం వల్ల కాలుష్య ప్రభావం తగ్గడంతో పాటు ప్రమాదాలు నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. కొంతమంది ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల వత్తిడికి తలొగ్గిన అధికారులు రోడ్డు మార్గం గుండా బొగ్గును తరలించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల పర్యావరణ పరంగా ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో పోర్టు చైర్మన్‌గా అజయ్‌కల్లాం ఉన్న కాలంలో దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు పాత పద్ధతిలో లారీ ఆపరేటర్లకు అవకాశం కల్పించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నగర పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ చైనా వంటి ఇతర దేశాల్లో ఇప్పటికీ పర్యావరణానికి, ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండానే రవాణా జరుగుతోందని వివరించారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ తరపున ఆందోళనకు తాము సిద్ధమని హెచ్చరించారు.
అక్టోబర్ 12న విశాఖలో రెహ్మాన్ సంగీత విభావరి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 29: భారత సంగీత దిగ్గజం ఎఆర్ రెహ్మాన్ సంగీత విభావరి అక్టోబర్ 12న విశాఖలో నిర్వహించనున్నారు. భారతదేశంలో రెహ్మాన్ సంగీత ప్రదర్శనల్లో భాగంగా కోల్‌కత్తా, జైపూర్, అహ్మదాబాద్ పట్టణాలతో పాటు విశాఖలో సంగీత ప్రదర్శన ఇవ్వనున్నారు. దక్షిణ భారతదేశం ప్రదర్శనకు విశాఖ నగరాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే ఈసంగీత కార్యక్రమానికి సంబంధించి టెకెట్ట విక్రయాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నారు. సంగీత దర్శకుడు రెహ్మాన్ తన ప్రమోటర్లు టెక్నోఫ్రంట్, రాపోర్ట్ గ్లోబల్ ఈవెంట్స్‌తో కలిసి ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఏప్రిల్ మీడియా ప్రతినిధి కోమల ఆర్ గౌడ ఒక ప్రకటనలో తెలిపారు.
వుడా సొంతంగాను, ప్రైవేటు భాగస్వామ్యంలోను
english title:
v
Date:
Tuesday, July 30, 2013