విశాఖపట్నం, జూలై 29: రాష్ట్ర సమైక్యతకు కట్టుబడి ఉండాలని, ఇప్పటికైనా సమైక్యాంధ్రపై స్పష్టమైన హామీనివ్వాలని కోరుతూ సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ కమిటీ, ఏపీఎన్జీవో అసోసియేషన్, ఏపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఎంవిపి కాలనీలోనున్న కేంద్ర సహాయమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. ఇందులో పెద్ద ఎత్తున విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ‘రాష్ట్ర విభజన వద్దు...సమైక్యమే ముద్దు’ అంటూ కెసిఆర్, కోదండరామయ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. సమైక్య నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వీరందర్ని చెదరగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ పరిస్థితులు కాస్త స్వల్ప ఉద్రిక్తతకు దారితీసాయి. ఢిల్లీలో ఉన్న పురంధ్రీశ్వరి పర్సనల్ సెక్రటరీ ద్వారానైనా సమాచారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూలమైన ప్రకటన చేస్తే సీమాంధ్రలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయాలని లేనిపక్షంలో రాజకీయ జీవితం లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఎటువంటి పరిస్థితుల్లోను రాయలసీమ తెలంగాణకు అంగీకరించమన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. సమైక్యాంధ్ర యువజన జేఏసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వస్తే యువకులు ఉపాధి అవకాశాలను కోల్పోతారని, కార్మికులు, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎంపీలు,కేంద్ర మంత్రులు తమ పదవుల కోసం స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు. పురంధ్రీశ్వరి ఇంతవరకు సమైక్యాంధ్రపై ఎటువంటి ప్రకటన చేయలేదని, ఇప్పటికైనా స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, కోస్తాతీర ప్రాంతంనందు సుదీర్ఘకాలం నుండి అభివృద్ధి లేక నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు. దీర్ఘకాలికంగా అభివృద్ధి అంతా హైదరాబాద్‌నందు చేసి పెద్దపెద్ద కంపెనీలు అక్కడ ఏర్పాటై ఐటి అభివృద్ధి అంతా అక్కడక్కడే చేసి ఇపుడు దీనిని తెలంగాణాలో కలిపితే చూస్తూ ఊరుకోమన్నారు. నదీ జలాలు, విద్యుత్ సమస్యలు దీనివల్ల ఉత్పన్నమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎపీ రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్.నాగేశ్వరరెడ్డి, ఏపీఎన్జీవో అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మలాకుమారి, ఎన్‌ఐఆర్, సమతా కాలేజీలకు చెందిన విద్యార్థులు, ఎన్జీవో, రెవెన్యూ సర్వీసుల సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
* అరెస్టులు
ముట్టడి కార్యక్రమంలో పాల్గొని నిరసనలు తెలిపిన ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, సమైక్యాంధ్ర యువజన జెఏసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆడారి కిషోర్‌కుమార్, ఎన్జీవో నగర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, జవహార్‌లాల్ తదితర ప్రతినిధులను పోలీసులు వాహనాల్లోకి ఎక్కించి త్రి టౌను పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కేంద్ర వైఖరికి నిరసనగా ఉద్యమిస్తాం
* లేదంటే సమ్మెకు దిగుతాం
విశాఖపట్నం, జూలై 29: సమైక్యాంధ్రపై స్పష్టమైన హామీని ప్రకటించకపోతే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ ఎన్‌ఎంయు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.శ్రీనివాసరావు హెచ్చరించారు. మద్దిలపాలెం యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోను రాష్ట్ర విభజనను జరగనీయమని, ఇందుకోసం వివిధ రూపాల్లో ఉద్యమిస్తామన్నారు. దశలవారీ ఉద్యోమంలో భాగంగా మంగళవారం జిల్లానందు వాల్తేరు, విశాఖపట్నం, మద్దిలపాలెం, సింహాచలం, గాజువాక, స్టీల్‌సిటీ, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోల్లో మధ్యాహ్నాం భోజన విరామ సమయంలో ధర్నాలు, గేటు మీటింగ్‌ల ద్వారా కార్మికులను ఉద్యమానికి సిద్ధం చేస్తామన్నారు. ఈ నెల 31వ తేదీన జిల్లానందు కార్మికులు డిమాండ్లతో కూడిన బ్యాడ్జిలు ధరించి విధులు నిర్వహించం, జిల్లా ప్రజలందరికీ సమైక్య రాష్ట్రం ఆవశ్యకతను తెలియజెప్పాలని నిర్ణయించినట్టు చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుదాం, రాష్ట్ర విభజనను వ్యతిరేకరిద్దాం, తెలుగుజాతి ఐక్యతకు నడుం బిగిద్దాం అనే నినాదాలతో ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. ప్రధానంగా ఈ నెల 31న సాయంత్రం ఐదు గంటలకు ఆర్టీసీకాంప్లెక్స్ నుండి మద్దిలపాలెం కాంప్లెక్స్ వరకు ఆర్టీసీ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం మానవహారం ఏర్పాటు ద్వారా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అప్పటికీ సమైక్యాంధ్రపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే ఆర్టీసీ నందు అవసరమైతే సమ్మె దిశగా కూడా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమైక్యాంధ్ర యువజన జెఎసి రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టే ఉద్యమంలో ఆర్టీసీలో కీలకమైన ఎన్‌ఎంయు భాగస్వామ్యం కావడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించే ప్రకటనలు చేస్తే తెలంగాణాలో కంటే సీమాంధ్రలో ఉద్యమాలు తీవ్రంగా ఉంటాయన్నారు. మంత్రులు, ఎంపీలు తమ పదవుల కోసం దురుద్దేశ్యంతో సమైక్యాంధ్రపై ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల జిల్లా కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ అంతా కలిస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలమన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు అనుకూలమైన ప్రకటన చేస్తే నిరవధిక సమ్మెకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంయు జోనల్ కార్యదర్శి పివివి మోహన్, జిల్లా కార్యనిర్వాహాక అధ్యక్షుడు సిహెచ్.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కె.నందగోపాల్, అర్బన్ డివిజన్ కార్యదర్శి ఏకె శివాజీ, రూరల్ డివిజన్ అధ్యక్ష.కార్యదర్శులు ఎంవిఆర్ మూర్తి, పిఎన్ రావు, జిల్లా కార్యవర్గసభ్యులు, డిపో కార్యదర్శులు, అధ్యక్షులు హాజరయ్యారు.
* రాజకీయ జీవితం లేకుండా చేస్తాం: ఏపీ ఎన్జీవో * కేంద్ర సహాయమంత్రి పురంధ్రీశ్వరి ఇళ్ళు ముట్టడి * సంఘాల ప్రతినిధులు అరెస్టు
english title:
s
Date:
Tuesday, July 30, 2013