విశాఖపట్నం, జూలై 29: జూనియర్ వైద్యులు మంగళవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించాలన్న నిబంధనలను తప్పనిసరి చేయడాన్ని నిరసిస్టూ జూడాలు నిరవధిక సమ్మెకు దిగాలని నిర్ణయించారు. దీనిలోభాగంగా మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి కేజిహెచ్‌తోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు, సాధారణ సేవలను బహిష్కరిస్తున్నారు. ఈ సమ్మెలో పిజిలు, ఎంబిబిఎస్, హౌస్‌సర్జన్లు కలిపి 600మందికి పైగా పాల్గొంటారు. వైద్య విబాగంలో పర్మినెంట్ పోస్టులు భర్తీ చేస్తే ‘బ్యాండెడ్ లేబర్’ అవసరం ఉండదని జూనియర్ వైద్యుల సంఘ ప్రతినిధి మహమ్మద్ సన్వాజ్ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. వైద్యులకు స్ట్ఫైండ్‌లు ఇవ్వడంలేదని, గత ఏడాది నుంచి వైద్యులకు జీతాల్లేవని ఆందోళన వ్యక్తంచేశారు. ఎంబిబిఎస్ ఐదున్నరేళ్ళు, పిజి మరో మూడేళ్ళు మొత్తం ఎనిమిదిన్నర సంవత్సరాలపాటు ఈ వృత్తిని పూర్తి ఆ తరువాత మళ్ళీ ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించాలనే నిబంధనతో వృధా చేయడమే అవుతుందన్నారు. ఏ ప్రొఫెసనల్ కోర్సుల్లోను ఈ విధానం లేదన్నారు. వేల పోస్టులు ఖాళీ ఉండగా, వీటి భర్తీ ఏళ్ళుగడుస్తున్నా జరగడంలేదని, అటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో బలవంతపు నిబంధనలతో జూడాలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
* సమ్మె సైరన్‌తో రోగుల్లో ఆందోళన
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒడిషా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి ఇక్కడకు చేరుకునే రోగులకు ఇక్కడి కేజిహెచ్‌లో వైద్యం అందే పరిస్థితులు కనిపించడంలేదు. సాధారణ రోజుల్లోనే అంతంత మాత్రంగా అందే వైద్య సేవలు జూడాల సమ్మెతో మంగళవారం ఉదయం నుంచి నిలిచిపోతున్న నేపధ్యంలో సాధారణ, దీర్ఘకాలిక రోగాలతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే రోగుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఆసుపత్రి వర్గాల్లో నెలకొంది.
* ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళనను దృష్టిలోపెట్టుకుని కేజిహెచ్ సాధారణ, అత్యవసర వైద్యులకు అంతరాయం కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్‌బాబు తెలిపారు. రోజువారీ సేవలందించేందుకు 470 మంది వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, వీరు కాకుండా సర్వీసు పిజిలను ప్రత్యామ్నాయ సేవలకు అందుబాటులో ఉంటారన్నారు.
పోలింగ్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
విశాఖపట్నం, జూలై 29: జిల్లాలో గత రెండుదశల్లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో అనుభవాల దృష్ట్యా మూడవ విడత నిర్వహిస్తున్న ఎన్నికలను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వి.శేషాద్రి అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో మండల అధికారులతో ఈనెల 31న నిర్వహించబోయే పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లను వీడియో కానె్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బ్యాలెట్ పేపరులో గుర్తుల విషయమై గత రెండు దశలుగా జరిగిన ఎన్నికల్లో కొన్ని పంచాయితీల్లో సమస్యను తలెత్తాయని అలాంటివి పునరావృతం కాకుండా ఒకటికీ రెండుసార్లు బ్యాలెట్ పేపరు చెక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మేజర్ పంచాయితీలైన చోడవరం, కశింకోట, తుమ్మపాల, మాడుగుల, పూడిమడకల్లో అవసరమైతే ఎక్కువ టేబుల్స్ వేసి ఓట్లను లెక్కించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను ముందుగా లెక్కించాలన్నారు. జిల్లా లెక్కింపు సాయంత్రం ఆరులోపు పూర్తి చేయాలని, అవసరమైతే లైటింగ్ సదుపాయం జనరేటర్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ప్రత్యేక అదికారులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గత రెండు దశల ఎన్నికల్లో మధ్యాహ్నాం రెండు దాటినా ఓట్ల లెక్కింపు ప్రారంభంకాలేదని, ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోను రెండు గంటలకు ఓట్లు లెక్కింపు ప్రారంభంకావాలన్నారు. 2.30 గంటలకు కంట్రోల్‌రూమ్‌కు ఓట్లు లెక్కింపు ప్రారంభమైందని అన్ని మండల కేంద్రాల నుండి సమాచారం అందాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎన్నికల సిబ్బంది ఘర్షణ వాతావరణానికి పాల్పడితే ప్రజా ప్రాతినిధ్య చట్టాల ప్రకారం, నేరంగా పరిగణించి కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ ఖచ్చితమైన ఆదేశాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కావాల్సినన్ని టేబుల్స్ వేసి పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. మంగళవారం 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరాలన్నారు. ఏమైనా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితులుంటే వీడియో తీయించాలన్నారు.