Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు చరిత్ర హీనులుగా మిగులుతారు

$
0
0

గుంటూరు , జూలై 30: గత నాలుగు రోజులుగా ప్రత్యేక తెలంగాణ అంశంపై ఢిల్లీలో మంతనాలు జరుపుతుంటే సీమాంధ్ర ఎంపిలు, మంత్రులు చేతగాని దద్దమ్మల వలె చోద్యం చూస్తున్నారని, వీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని తెలుగుదేశం పార్టీ విప్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారని సీమాంధ్ర ప్రజలు ఎంపిలను ఎన్నుకుంటే వారి స్వార్థ ప్రయోజనాలను కాపాడుకుంటూ, అధిష్ఠాన తొత్తులుగా మారి రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలిచ్చారన్నారు.
సమైక్యాంధ్ర కోసం ఎలాంటి ఉద్యమాలు చేపట్టకుండా ఇక్కడి ప్రాంత ప్రజలను మోసం చేశారని, ఇప్పటికైనా రాజీనామాలు చేసి కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో చిట్టాబత్తిన చిట్టిబాబు, కసుకుర్తి హనుమంతరావు, రూబెన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేయడం దారుణం
* చరిత్రలో చీకటిరోజుగా మిగిలిపోతుంది
* వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ అప్పిరెడ్డి
గుంటూరు, జూలై 30: తెలుగు ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించి ఆత్మబలిదానం చేసిన మహనీయుల త్యాగాలను విస్మరించి యుపిఎ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణమైన విషయమని, ఇది చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని వైఎస్‌ఆర్ సిపి నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక అరండల్‌పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు వారి గుండెల్లో గునపాలు గుచ్చిందన్నారు. తెలుగు వారి కోసం ఆత్మ బలిదానం చేసి పొట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య వాదాన్ని వినిపించే వారికి మంత్రి పదవులు ఇచ్చి కేంద్రం నోరు మూయిచిందని ఆరోపించారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని చెప్పుకునే తెలుగదేశం నాయకులు సైతం నోరు మెదపక పోవడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. చరిత్రలో 2013 జూలై 30 చీకటి రోజుగా నిలిచిపోతుందన్నారు. ఇలాంటి నేతలను ఎన్నుకోవడం తెలుగు ప్రజల దురదృష్టమన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం పార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నట్లు అప్పిరెడ్డి చెప్పారు. విలేఖర్ల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ నాయకులు నసీర్ అహమ్మద్, సూరగాని శ్రీనివాసరావు, విజయకిషోర్, షౌకత్, గులామ్ రసూల్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సెంట్రల్ జోన్ మహిళల క్రికెట్ విజేత కృష్ణాజట్టు
గుంటూరు , జూలై 30: స్థానిక జెకెసి కళాశాల ఆవరణలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఎసిఎ సెంట్రల్ జోన్ మహిళా క్రికెట్ పోటీలలో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది. లీగ్ పోటీల్లో 15 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో గుంటూరు జట్టుపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 12.4 ఓవర్లలో 22 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఝాన్సీలక్ష్మి 10 పరుగులు చేయగా కృష్ణాబౌలర్లు మేఘన, ధనలక్ష్మి చెరి మూడు వికెట్లు పడగొట్టగా, నాగమణి రెండు వికెట్లు తీసుకుంది. అనంతరం బ్యాటింగ్ చేసిన కృష్ణాజట్టు వికెట్ నష్టపోకుండా విజయాన్ని సాధించింది. జట్టులో స్నేహ 8, మన్వీర్‌కౌర్ 4 సాధించారు. బుధవారం జరగనున్న ప్రాపబుల్స్‌లో ఎసిఎ సెంట్రల్ జోన్ మహిళా జట్టును ఎంపిక చేయనున్నారు.
అధికారులతో సమావేశమైన ఎస్పీ
మంగళగిరి, జూలై 30: తెలంగాణాకు అనుకూలంగా దేశ రాజధాని నుంచి ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరుగకుండా తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై మంగళవారం జిల్లా అర్బన్ ఎస్పీ బివి రమణకుమార్ మంగళగిరి ప్రాంతంలోని పోలీసు అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. రూరల్ సిఐ కార్యాలయంలో ఎస్పీ రమణకుమార్ అధికారులతో సమావేశమయ్యారు. సిఐ మురళీకృష్ణ, రూరల్ ఎస్సై నాగకుమారి, పట్టణ ఎస్సై జిలాని భాషా తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ సక్రమంగా నిర్వహించండి
* ఎన్నికల పరిశీలకురాలు ఉదయలక్ష్మి
యడ్లపాడు, జూలై 30: ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌లో అధికారులు శ్రద్ధగా నిర్వహించాలని సోషల్ వెల్ఫేర్ కమిషనర్, జిల్లా ఎన్నికల పరిశీలకురాలు బి ఉదయలక్ష్మి అన్నారు. మంగళవారం ఉద యం యడ్లపాడు ఎంపిడిఒ కార్యాలయానికి వచ్చిన ఉదయలక్ష్మి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పది గంటలైనా పోలింగ్ సామగ్రిని సిబ్బందికి అందజేయలేదని వారు బ్యాలెట్ పత్రాలు, తదితర సామాగ్రి సర్దుకునే వ్యవధి ఉండాలి కదా ఆమె మండల పరిషత్ అధికారులను ప్రశ్నించారు. అందరికీ ఒక్కసారిగా కాకుండా వచ్చిన వారికి వచ్చినట్లుగా పోలింగ్ సామగ్రి అందజేయాలని ఆదేశించారు.
సర్వం సిద్ధం: తుది విడత పంచాయతీ ఎన్నికలకు యడ్లపాడు మండల గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపిడిఒ సువార్త తెలిపారు. పోలింగ్ సామగ్రి ప్రిసైడింగ్ అధికారులకు అందజేశామన్నారు.

ఎయిడెడ్, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలల
సమస్యలు పరిష్కరించాలి
* కలెక్టరేట్ ఎదుట పిడిఎస్‌ఒ ధర్నా
గుంటూరు , జూలై 30: ఎయిడెడ్, మున్సిపల్, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్‌ఒ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి పిడిఎస్‌ఒ జిల్లా నాయకుడు కెవి రమణ మాట్లాడుతూ పాలకులు, ప్రభుత్వ అధికారులు విద్యా సంబరాల పేరిట వందల కోట్ల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చుచేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో విద్యార్థులను చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లదేననడం సరికాదన్నారు. ఎస్ హనుమంత్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, శిథిలావస్థలో ఉన్న పాఠశాల తరగతి గదులకు మరమ్మతులు చేయించాలని, విద్యార్థులకు మంచినీటి, మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించాలన్నారు. విద్యా వ్యాపారమే ధ్యేయంగా నడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను వెంటనే మూయించి వేయాలన్నారు. తొలుత మార్కెట్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఎఒ ఏసురత్నంకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మణి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్ర కొనసాగించాలంటూ విద్యార్థుల ర్యాలీ
పొన్నూరు, జూలై 30: రాష్ట్ర విభజన చర్యకు స్వస్తిచెప్పి, సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పొన్నూరు పట్టణ కూడలిలో విద్యార్థులు ర్యాలీ, ధర్నా జరిపారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా జరిపిన నిడుబ్రోలు పిబిఎన్ కళాశాల డిగ్రీ విద్యార్థులు సమైక్యాంధ్రప్రదేశ్ పర్యవేక్షణ కమిటీ పొన్నూరు శాఖ సభ్యులు సంయుక్తంగా పట్టణంలోని ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్ నుండి ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులతో పాటు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతలు బొద్దులూరి రంగారావు, గురుబాలు, వెంకటస్వామి, ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వీసీని కలిసిన ఎస్పీ
నాగార్జున యూనివర్సిటీ, జూలై 30: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ ఆచార్య కె వియన్నారావును గుంటూరు అర్బన్ ఎస్పీ డివి రమణకుమార్ మంగళవారం కలిశారు. వర్సిటీలోని వీసీ ఛాంబర్‌లో భేటీ అయిన ఎస్పీ, వీసీ రాష్ట్ర విభజన, సమైక్యాంధ్ర ఉద్యమం, వర్సిటీలో శాంతి భద్రతల ఏర్పాట్లపై చర్చింనట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరుగుతుందని పెద్దయెత్తున్న ప్రచారం జరుగుతుండటంతో వర్సిటీ సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుందని, విద్యార్థులు ఆందోళ కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో వీసీని ఎస్పీ కలవటం చర్చనీయాంశమైంది. ఇదిలావుండగా మంగళవారం వర్సిటీలోని వికాసభవన్, స్పోర్ట్ హాస్టల్స్‌కు ప్రత్యేక పోలీసు బృందాలు చేరుకోవటం ఈ చర్చలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వర్సిటీ వీసీ ఎస్పీతో జరిగిన చర్చల వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అడ్డుకుంటాం
నాగార్జున యూనివర్సిటీ, జూలై 30: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానిని పూర్తిగా వ్యతిరేకిస్తామని సమైక్యాంధ్ర జెఎసి గౌరవాధ్యక్షుడు ఆచార్య పి నరసింహారావు అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సీమాంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకస్తూబుధవారం సీమాంధ్రలోని విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని, ఆగస్టు 1వతేది నుండి 6వతేది వరకు దశలవారీ ఆందోళనలకు పూనుకుంటామని తెలిపారు. రాష్ట్ర విభజన దిశగా సాగుతున్న కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బైండర్ సుబ్బారావుకు ఘన సన్మానం
నాగార్జున యూనివర్సిటీ, జూలై 30: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని అంబేద్కర్ లైబ్రరీలో సుమారు మూడు దశాబ్దాలుగా బైండర్‌గా టి సుబ్బారావు సేవలు ఎనలేనివని వర్సిటీ వీసీ ఆచార్య కె వియన్నారావు కొనియాడారు. వర్సిటీలోని లైబ్రరీలో ఏర్పాటు చేసిన బైండర్ సుబ్బారావు పదవీ విరమణ కార్యక్రమంలో వర్సిటీ వీసీ వియన్నారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ దుశ్శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఆర్‌ఆర్‌ఎల్ కాంతం, వర్సిటీ ఒఎస్‌డి ఆచార్య జెడ్ విష్ణువర్థన్, లైబ్రేరియన్ కోడేల వెంకట్రావు, సిబ్బంది శరత్‌చంద్ర, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కొత్త సర్పంచ్‌లకు అభినందన
మంగళగిరి, జూలై 30: మండల పరిధిలోని కాజ, చినవడ్లపూడి, దుగ్గిరాల మండలం మంచికలపూడి సర్పంచ్, ఉపసర్పంచ్‌లుగా ఎన్నికైన వారిని మంగళవారం స్థానిక టిడిపి కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పోతినేని శ్రీనివాసరావు అభినందించారు. కాజ సర్పంచ్ కట్టెపోగు వెంకయ్య, చినవడ్లపూడి సర్పంచ్ చంద్రగుండం యోగేంద్రనాధ్, ఉపసర్పంచ్ సాయిప్రసాద్, మంచికలపూడి సర్పంచ్ యార్లగడ్డ భగత్‌సింగ్‌లను ఆయన అభినందించారు. అనంతరం పోతినేని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని కోరారు. మండల టిడిపి అధ్యక్షుడు ఆరుద్ర అంకవర ప్రసాద్, మంగళగిరి పిఎసిఎస్ అధ్యక్షుడు గాదె పిచ్చిరెడ్డి, నాయకులు నందం అబద్దయ్య, పల్లబోతుల శ్రీనివాసరావు, కుక్కమళ్ల స్వామి, దానబోయిన రామరాజు, వల్లభనేని సాయిప్రసాద్, సంకా బాలాజీగుప్తా, వెలగపాటి విలియం తదితరులు పాల్గొన్నారు.

108 ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
గుంటూరు , జూలై 30: ప్రభుత్వం మొండి వైఖరి వీడి 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ద్వారా నిరవధిక సమ్మెను విరమింపజేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ సంయుక్త కార్యదర్శి వివికె సురేష్ చెప్పారు. కలెక్టరేట్ ఎదుట 108 ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఇన్సూరెన్స్ ఎంప్లారుూస్ యూనియన్ నాయకులు వివికె సురేష్ మాట్లాడుతూ 108 ఉద్యోగులకు తమ యూనియన్ తరఫున సంఘీభావం తెలిపారు. జివికె యాజమాన్యం 108 ఉద్యోగుల పట్ల మొండి వైఖరి అవలంబించడం దారుణమన్నారు. జివికె యాజమాన్యం న్యాయమైన 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టాన్ని అమలుపర్చాలి
గుంటూరు, జూలై 30: వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్ఠంగా అమలు పర్చాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. స్థానిక బ్రాడీపేటలోని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని రూపొందించిన సావనీర్‌ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల ఫలితంగా వ్యవసాయ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పాశం రామారావు, ఉపాధ్యక్షుడు బి వేదయ్య, ఎ కోటిరెడ్డి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కృష్ణమోహన్, రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను నాగేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు, ప్రజానాట్య మండలి నాయకుడు నూతలపాటి కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలను ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు
గుంటూరు , జూలై 30: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యంగ్ ఇండియా ఫెడరేషన్ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐఒ రూఫస్‌కుమార్‌కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ జిఒలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్ కళాశాలలను కట్టడి చేయాల్సిన అధికారులే వారికి ఏజంట్లుగా మారుతున్నారని ఆరోపించారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్‌డి గౌస్, ఎం కోటేశ్వరరెడ్డి, కె ప్రవీణ్, రామబ్రహ్మం, దీపు తదితరులు పాల్గొన్నారు.

* టిడిపి విప్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్
english title: 
narendra kumar

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>